Ayurveda maharshi dr elchuri

Everything you need to know about Andariki Ayurvedam.Elchuri Andariki Ayurvedam Clinic Address Madhapur, Hyd

Everything you need to know about Andariki Ayurvedam. Elchuri Andariki Ayurvedam Clinic Address Madhapur, Hyd

Ayurveda Maharshi Dr. Elchuri.gif

Posted: 03/21/2012 12:58 PM IST
Ayurveda maharshi dr elchuri

Ayurveda_Maharshi_Dr._Elchuri_2

Dr._Elchuri_Venkat_rao‘‘పుట్టినప్పుడు మన అవయవాలు ఎలా ఉన్నాయో, చివరిదాకా అలాగే కాపాడుకోగలిగే మార్గమే ఆయుర్వేదం’’ అంటున్న ఏల్చూరి వెంకట్రావు గారి గురించి.....

ప్రకాశం జిల్లా ఏల్చూరు. మా ఊరిపేరే నా ఇంటిపేరు కూడా. రైతు కుటుంబం. పెద్ద కుటుంబం. ఆరుగురు సంతానంలో మూడోవాణ్ని. జీవితం పట్లా, భావజాలం పట్లా మా ఊళ్లో నేను పెద్దగా ప్రభావితం అయిన సంఘటనలు లేవుగానీ, టెన్తు ముగించుకొని, ‘భాషాప్రవీణ’ కోసం పొన్నూరులో చేరాక కొండవీటి వేంకటకవి (కవి, ‘దాన వీర శూర కర్ణ’ మాటల రచయితగా ప్రసిద్ధులు) దర్శనం కలిగింది. ఆయన మాకు ప్రబంధాలు బోధించేవారు. కాలేజీ ముగిసిం తర్వాత కూడా ఎక్కువ సమయం వాళ్లింట్లోనే గడిపేవాణ్ని. ఆయన నాస్తికుడు. ఆయన దగ్గరకు వచ్చే మహామహులు, వాళ్ల చర్చలు, దేవుడి గురించిన వాదనలు విన్నాక- నేను కూడా ఆస్తికత్వాన్ని చాలించాను.టెన్తు పాసవుతే తిరుపతికి వచ్చి తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నాను. అనుకున్నట్టే పాసయ్యాను. అందుకని దేవుడి కోసం జుట్టు పెంచుతున్నాను. దసరా సెలవుల్లో వెళ్లి ఇచ్చిరావాలి! అయితే వీళ్ల ప్రభావంలో పడి, దేవుడేంటి, మొక్కులు చెల్లించడమేంటి, అనుకొని, నీట్‌గా క్రాఫ్ చేయించేసుకున్నా. అప్పటి మొక్కు అలాగే ఉండిపోయింది.

సమరానికి నాంది :-

నేను కాలేజీ చదువులు ముగించుకొని, ‘పీఓఎల్’ కోసం ఆంధ్ర యూనివర్సిటీలో చేరినప్పుడైతేనేమీ, ఎమ్మే తెలుగు కోసం నాగార్జున యూనివర్సిటీలో చదివిన రోజులైతేనేమీ... కమ్యూనిజం భావజాలపు ఉధృతి కొనసాగుతోంది. సహజంగానే నేనూ దానివైపు ఆకర్షితుణ్నయ్యాను. ఎరుపు రంగును గాఢంగా ప్రేమించాను. ప్రజా నాట్య మండలిలో భాగస్వామినయ్యాను. విజయవాడలో తెలుగు లెక్చరర్‌గా ఉద్యోగం చేసిన పదిహేనేళ్లూ, రకరకాల ఆందోళనల్లో పాల్గొన్నాను. కార్మికోద్యమాల్లో భాగం పంచుకున్నాను.ప్రజా నాట్య మండలి తరఫున ఒక కళాకారుడిగా ప్రజల్లో చైతన్యం తేవడానికి రకరకాల మార్గాల్లో ప్రయత్నించేవాళ్లం. ‘ఇది సమరానికి నాంది’, ‘అంతస్తుల సమాధులే ప్రగతికి పునాదులు’ లాంటి నాటకాలు రాశాను, ప్రదర్శింపజేశాను, దర్శకత్వం వహించాను. బస్సు చార్జీలు పెంచితే ఒకటి రాయాలి, ఉద్యమం తలెత్తిందంటే రాయాలి. ఇదీ అదీ అని కాదు, హరికథలు, బుర్రకథలు, బ్యాలేలు, గేయాలు... అన్నింట్లోనూ చేయివేశాను. అయితే కాలి అడుగులు మాత్రం మద్రాసు వైపు పడుతున్నాయి.సినిమా కళ కూడా నన్ను తీవ్రంగా ఆకర్షించడం మొదలుపెట్టింది.

సినిమా ‘ఉద్యమం’ :Dr._Elchuri_Venkat_rao2

అప్పటికే రమాదేవితో పెళ్లయ్యింది. బాబు కూడా పుట్టాడు. లెక్చరర్‌గా పనిచేస్తూనే, శుక్రవారం రాత్రి బయల్దేరడం, శని ఆదివారాలు మద్రాసులో ఉండి అవకాశాల కోసం ప్రయత్నించడం... అలా జి.హనుమంతరావు (నటుడు కృష్ణ సోదరుడు) పరిచయం వల్ల పద్మాలయా స్టూడియోస్ తరఫున పనిచేసే అవకాశం వచ్చింది. విజయనిర్మల దర్శకత్వం వహించిన ‘ప్రజల మనిషి’ చిత్రానికి తొలిసారిగా కథ, మాటలు అందించాను. సినిమా డైలాగులకూ, నాటక సంభాషణలకూ ఉండే మౌలికమైన తేడాను పసిగట్టగలిగాను కాబట్టి, చురుగ్గా రాస్తానన్న పేరొచ్చింది. అవకాశాలూ వచ్చాయి.

నట నిర్మాత ప్రభాకర్‌రెడ్డి నన్ను బాగా ఆదరించారు. వారి ‘ఇంటింటా దీపావళి’ సినిమాకు మాటలు రాశాను. తర్వాత ‘విధాత’, ‘ఉద్యమం’, ‘ఎర్ర సూర్యుడు’, ‘సరసాల సోగ్గాడు’, ‘మావూరి మారాజు’ చిత్రాలకు రచయితగా పనిచేశాను. ఎర్ర సూర్యుడు, సరసాల సోగ్గాడు లాంటి చిత్రాల్లో చిన్న పాత్రలు కూడా ధరించాను. జీవితం జోరుగా సాగిపోతోందనుకుంటున్నాను. కాని కాలం నాకు వేరే పరీక్ష పెట్టబోతోందని తెలియదు.

అవగాహన మీద ‘రాళ్లు’ :

సినీ పరిశ్రమలో కొనసాగుతున్నప్పుడే 1991 ప్రాంతంలో నాకు తీవ్రమైన జబ్బు చేసింది. డాక్టర్‌ని కలిశాను. చాలా పెద్ద డాక్టర్. పెద్ద ఆసుపత్రి. పరీక్షించారు. పిత్తాశయంలో రాళ్లు అని తేల్చారు. మందులిచ్చారు. కాని ఎంతకీ నయం కాదు. ఇక లాభంలేదు, దాన్ని తొలగించాల్సిందే అనే పరిస్థితి వచ్చింది.అలాంటి దశలో, ఒకానొక రోజున, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఒక బోర్డు కనిపించింది. ‘ఆయుర్వేద మందులు ఉచితంగా ఇవ్వబడును’. ఈ ఉచితం అని ఇచ్చేవాటిల్లో ఏమీ ఉండదని ఒక మూల కొంత అనుమానం లేకపోలేదు. కానీ పోయేదేముంది? ఉచితమేగా! లోనికి వెళ్లాను. చిన్న కుటీరం. లోపల బాల్‌రాజ్ మహర్షి ఉన్నారు. సమస్య చెప్పాను. ఇంతేనా అన్నట్టుగా ధైర్యం చెప్పారు. చాలా చిన్న వైద్యం సూచించారు. ‘సీమ గోరింట గింజలు పొడి చేసుకుని, నెయ్యితో కలిపి, అరవై రోజులు తిన’మన్నారు. ఆ సమయానికి ఆయన దగ్గర ఆ గింజలు లేనందువల్ల ఉచితంగా ఇవ్వలేకపోయారు. అవి కొనుక్కున్నందుకు నాకైన ఖర్చు ఐదు రూపాయలు. కేవలం ఐదంటే ఐదు రూపాయలు. గురువు చెప్పినట్టే, వాటిని రెండు నెలలపాటు తీసుకున్నాను. తర్వాత ఎక్స్ రే తీయిస్తే, రాళ్ల ఆనవాళ్లే లేవని తేలింది. ఆశ్చర్యం! షాక్! చెంపమీద చాచి కొట్టినట్టయింది. నేను ఇన్నేళ్లుగా నేర్చుకున్నదీ, విన్నదీ అంతా అబద్ధమని తేలింది. ఇంతకాలం, ఇన్ని సంవత్సరాలు కమ్యూనిజం సాహిత్యం చదివి మనదేశంలో ఏమీ లేదనుకుంటున్నానే!

విజ్ఞానమంతా ఎక్కడో ఏ పాశ్చాత్య దేశాల్లోనో, రష్యాలోనో చైనాలోనో ఉందనుకుంటున్నానే! ఎక్కడో పొరపాటుపడ్డానే! రెండు చేతుల్లో రెండు పరిష్కారాలు స్పష్టంగా కనబడుతున్నాయే! ఆయుర్వేదంలో ఏదో మహత్తు ఉంది, ఇది సామాన్యమైంది కాదు. అంటే ఒక చిన్న సత్యం తెలుసుకోవడానికి నాకు నలభై ఏళ్ల వయసొచ్చింది. ఛత్, ఈ చెత్త సినిమాలు... ఇదీ కాదు మార్గం... నేను చేయాల్సింది ఇంకేదో ఉంది!‘అందరికీ ఆయుర్వేదం’ లభించాలిఇక అప్పట్నుంచీ ఆయుర్వేదం గురించిన పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. ఎక్కడ ఏ విషయమున్నా సేకరించడం ప్రారంభించాను. నేను ఆయుర్వేదాన్ని ఒక విద్యగా అభ్యసించిందీ లేదు, ఒక గురువు దగ్గర నేర్చుకున్నదీ లేదు, కాని ఎన్ని రకాల పుస్తకాలున్నాయో అన్ని రకాలూ చదవసాగాను. ఏ దారినో నడుస్తుంటే ఈ చెట్టేమిటి, ఇది దేనికి పనికొస్తుంది అని ఆలోచించడం... ఏ ఊరైనా పోతే అక్కడ ప్రత్యేకమైన చెట్లు ఏమున్నాయి అని వెతకడం... ఒక రకంగా నాకు ప్రతీ ఆకూ, మొక్కా, చెట్టూ, గింజా... అన్నీ ఔషధాల్లాగా కనపడటం మొదలైంది.నేను కూడా కనపడిన ప్రతివాళ్లకూ ‘అల్లంరసంలో తేనె కలుపుకొని తాగు, జలుబు పోతుం’దనో, ‘జామ ఆకులు రాత్రి నానబెట్టి, తెల్లారి ఆ నీళ్లు తాగు, షుగర్ కంట్రోల్ అవుతుం’దనో, ‘దేశవాళీ గోమూత్రం పావుకప్పులో తేనె కలుపుకొని తీసుకోవడం ద్వారా మన ఒంట్లో చేరిన విషాలన్నీ హరిస్తా’యనో, ‘మూడు తులసి ఆకుల్ని రాత్రి రాగిచెంబులో వేసి తెల్లారి పొద్దున లేవగానే 40 రోజులపాటు తాగితే రక్తశుద్ధి జరుగుతుం’దనో చెప్పడం ప్రారంభించాను. తెలిసినవాళ్లని లేదు, తెలియనివాళ్లని లేదు... చెప్పడం చెప్పడం! ‘బాదంపప్పు పొడి, పటికబెల్లం పొడి, సోంపుగింజల పొడి సమానంగా కలిపి పాలల్లో చంచాడు కలిపి పిల్లాడికి తాగించు, బలంగా పెరుగుతాడు’. ‘మెంతులు, మినుములు, ఉసిరికాయలు కలిపి వాడు, జట్టు గట్టిపడుతుంది’. ఇక ఇదే పని. వెంటబడి వెంటబడి చెప్పేవాణ్ని. కొందరు వినేవాళ్లు, కొందరు విసుక్కునేవాళ్లు. కాని ఇది చాలదు. దీన్ని ఇంకా వ్యాప్తిచెయ్యాలి.

భారతీయాత్మపై దాడి :

Dr._Elchuri_Venkat_rao1ఇప్పుడు నాకు అవగాహన కొచ్చింది ఏమిటంటే, మన దేశంలో 120 కోట్ల మంది ఉంటే, 120 కోట్ల మందీ రోగగ్రస్థులే. పుట్టబోయే శిశువు కూడా రోగంతోనే పుడుతున్నాడు. ‘నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను’ అని ధైర్యంగా ప్రకటించుకోగలిగేవారు లేరు. దీనికి దారితీసిన కారణాలేమిటి?స్వాతంత్య్రం వచ్చాక మన జాతి గమనం... మనం తరతరాలుగా వేటి మీద కొనసాగుతున్నామో అలా సాగలేదు. అభివృద్ధి పేరిట కళ్లు పొడుచుకుంటున్నాం, కాళ్లు నరుక్కుంటున్నాం.పాలకులు పాశ్చాత్య సంస్కృతిని కౌగిలించుకున్నారు. పారిశ్రామికీకరణవైపు పోయారుతప్ప మనది వ్యవసాయిక దేశమన్న స్పృహ లేకుండా పోయింది. దేశభక్తులుగా ఉన్న వామపక్షీయులు కూడా ఆచారాలు, మతాలు ఏమిటని భారతీయతను నిరసిస్తూ వచ్చారు. ఇక ఇక్కడి కులవ్యవస్థ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నవాళ్లు సహజంగానే సంప్రదాయాలను కాదన్నారు. ఇన్ని కారణాల వల్ల మన సంప్రదాయ విజ్ఞానాన్ని బ్రాహ్మణీక విజ్ఞానం అన్న ముద్రవేసి దూరం చేసుకున్నాం. వేదకాలంలో ఉన్నది జ్ఞాన బ్రాహ్మణీకమే తప్ప, కుల బ్రాహ్మణీకం కానేకాదు.

అలా మన అవ్వలు, ముత్తవ్వలు గడించి పెట్టిన విజ్ఞానమంతా మనకు వాడుకలో లేకుండాపోయింది. 33 కోట్ల మంది దేవతలు దిగివచ్చినా బాగుచేయలేనంతగా కూరుకుపోయాం. విద్య, వైద్యం, వ్యవసాయం మూడు రంగాలూ కలుషితమైపోయినై. దీని పునాది నుంచి పునఃనిర్మాణం జరగాలి. మన పునాది ఏమిటి? సంస్కృతే మన పునాది. సంస్కృతి అంటే సంస్కరించబడిన జీవన విధానం. దీన్ని జనంలోకి మళ్లీ తీసుకెళ్లాలి. మన సంప్రదాయాల పునఃప్రతిష్ట జరగాలి. సేంద్రీయ వ్యవసాయం సాగాలి. గోశాలలు పెరగాలి. మన పూర్వీకులు పొందుపరిచిన భాండాగారంలోనే ఎంతో ఆరోగ్య నిధి ఉంది. దాన్ని అందుకోగలగాలి. ఇవన్నీ జరిగితే జాతి పునరుజ్జీవనం జరుగుతుంది. అదే ధ్యేయంగా 1997 ఉగాది రోజున అందరికీ ఆయుర్వేదం పత్రిక ప్రారంభించాను. సమాచారం రాసుకోవడం, డీటీపీ చేయించడం, అచ్చుకు ఇవ్వడం, కత్తిరించడం అన్నీ ఒంటిచేత్తో చేసుకున్నాను. స్కూటర్ మీద రోడ్లవెంబడి తిరుగుతూ అమ్మేవాణ్ని. నెమ్మదిగా జనంలోకి వెళ్లింది. చందాదారులు పెరిగారు. అలాగే సినిమా, నాటకాలతో సంబంధం ఉన్నవాడిగా ప్రసార మాధ్యమాల్లో చెప్పడంలో కూడా నాకు ప్రత్యేక గుర్తింపువచ్చింది. అందరినీ నా కోడళ్లు, కూతుళ్లుగా భావించి చెబుతాను కాబట్టి, నన్నూ వాళ్ల ఇంటి పెద్దమనిషిగా ఆదరించడం మొదలైంది.ఇప్పటికీ నాకు దేవుడు, మతం వీటిమీద ఆసక్తి లేదు. దేశమే దేవత.

నేను పీహెచ్‌డీ డాక్టర్‌నే తప్ప ఆయుర్వేద డాక్టర్‌ను కాదు. నాకు ఫలానా జబ్బుందని నయం చెయ్యమని జనం నా దగ్గరికి రావడం కూడా నాకు నచ్చదు. నేను కేవలం ఆయుర్వేద విజ్ఞాన ప్రచారకర్తను మాత్రమే. ఆహారమే మందు. అది కూడా మీ ఇంట్లోనే ఉంది. దాన్ని గుర్తించమని మాత్రమే నేను చెబుతున్నాను. ప్రతి ఇంట్లో తమను తాము బాగుచేసుకునే శక్తి ఉన్నప్పుడే మనది నిజమైన అభివృద్ధి అవుతుంది. జై ఆయుర్వేదం!

‘‘లక్ష్మీపార్వతి నా క్లాస్‌మేట్. ఆమె వల్లే రవీంద్రభారతి సెక్రటరీ అయ్యాను. ఆమె ద్వారానే ఎన్టీఆర్ పరిచయం కలిగింది. ఆయనకు ఎన్నో ప్రసంగాలు రాసిచ్చాను’’.

ప్రొఫైల్ :Dr._Elchuri_Venkat_rao3

పూర్తిపేరు      : ఏల్చూరి వెంకట్రావు
తల్లిదండ్రులు   : అన్నపూర్ణమ్మ, ముక్కంటి
స్వగ్రామం      : {పకాశం జిల్లా ఏల్చూరు
జన్మదినం     : 1955 భోగి
భార్య          : రమాదేవి
పిల్లలు        : కొడుకు, కూతురు; డా.రాజా రంజిత్(ఆయుర్వేద వైద్యుడు; ఆయుర్వేద వైద్యురాలు జ్ఞానేశ్వరిని పెళ్లి చేసుకున్నారు),    వైదేహి(ఆయుర్వేద విద్యార్థిని)
చదువు        : పది వరకు ఏల్చూరులో
భాషాప్రవీణ    - ఐదేళ్ల కోర్సు- గుంటూరు జిల్లా పొన్నూరులో.
పీఓఎల్       - {పొఫీషియెన్సీ ఇన్ ఓరియెంటల్ లాంగ్వేజెస్- ఆంధ్రా యూనివర్సిటీలో.
ఎంఏ(తెలుగు)- నాగార్జున యూనివర్సిటీలో.
పీహెచ్‌డీ      : తెలుగు సాహిత్యంలో ఆయుర్వేదం-పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో.
ఉద్యోగం       : తెలుగు లెక్చరర్‌గా పనిచేశారు.
ఆత్మీయుడు : కెవి రమణాచారి
క్లాస్‌మేట్స్    : లక్ష్మీపార్వతి, కత్తి పద్మారావు
ఇతరాలు      : రవీంద్రభారతి సెక్రటరీగా పనిచేశారు, ట్విన్సి యాక్టింగ్ స్కూల్లో బోధించారు. రంగారెడ్డిజిల్లా మునిదేవునిపల్లెలో 30 ఎకరాల సిద్ధ నాగార్జునాశ్రమం ట్రస్టు ఉంది. ఇక్కడే గోశాల నిర్వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ss thamanit is the latest sensation music director
Mulayam singakhilesh yadav  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles