Mekapati Goutham Reddy demise: Political fraternity mourns మంత్రి గౌతమ్ రెడ్డి మృతిపట్ల ప్రముఖుల సంతాపం

Mekapati goutham reddy demise political fraternity mourns ys jagan to leave to hyderabad

AP IT minister Cardiac Arrest, AP Industries minister Heart attack, Andhra Pradesh Industries Minister, Mekapati Goutham Reddy, Mekapati Goutham Reddy cardiac arrest, Mekapati Goutham Reddy heart stroke, Mekapati Goutham Reddy heart attack, Mekapati Rajamohan Reddy, YSRCP, CM Jagan Mohan Reddy, Andhra Pradesh Minister Goutham Reddy, Heart Attack, Andhra Pradesh News

The sudden demise of Andhra Pradesh minister Mekapati Goutham Reddy has left the political fraternity across the two Telugu states in despair. The minister complained chest pain and was rushed to Appollo hospital in Hyderabad where he was pronounced dead. The YSRCP cadre, MLAs, MPs and other political party leaders have expressed shock and mourned over the death of the young leader.

మంత్రి గౌతమ్ రెడ్డి మృతిపట్ల ప్రముఖుల సంతాపం

Posted: 02/21/2022 01:13 PM IST
Mekapati goutham reddy demise political fraternity mourns ys jagan to leave to hyderabad

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి(50) హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. సోమ‌వారం ఉద‌యం ఆయ‌న‌కు గుండెపోటు రావ‌డంతో.. హైద‌రాబాద్‌లోని అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్పటికీ వైద్యులు ఆయనను కాపాడేందుకు అత్యవసర చికిత్సను అందించినా ఫలితం లేకపోయింది. వారం రోజుల‌పాటు దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొన్న‌ గౌత‌మ్ రెడ్డి.. రెండు రోజుల క్రిత‌మే హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. ఇటీవ‌లే కొవిడ్ బారిన ప‌డ్డ గౌత‌మ్ రెడ్డి త్వ‌ర‌గానే కోలుకున్నారు. పోస్టు కొవిడ్ ప‌రిణామాలే గుండెపోటుకు కార‌ణ‌మై ఉండొచ్చ‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు అనుమానిస్తున్నారు.

గౌత‌మ్ రెడ్డి మృతితో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు వైసీపీ నేత‌లు తీవ్ర దిగ్ర్భాంతికి గుర‌య్యారు. గౌత‌మ్ రెడ్డి మృతిప‌ట్ల‌ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నివాళుల‌ర్పించారు. గౌత‌మ్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు. చివ‌రిసారిగా దుబాయ్‌లోని ఖ‌లీజ్ టైమ్స్‌కు గౌత‌మ్ రెడ్డి ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గౌత‌మ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గౌత‌మ్ రెడ్డి స్వ‌గ్రామం నెల్లూరు జిల్లాలోని మ‌ర్రిపాడు మండ‌లం బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి.

నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక‌వేత్త‌, రాజ‌కీయ‌వేత్త‌గా ఎదిగిన మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడైన మేకపాటి గౌతమ్ రెడ్డి.. తండ్రి బాటలోనే పయనిస్తూ.. సౌమ్యుడు, మృదుస్వభావిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన పట్ల అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. స్థానికులు, కార్యకర్తలు గౌతమ్‌రెడ్డికి ఘన నివాళులు అర్పించారు. ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. గౌతమ్‌ రెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని నివాసానికి తరలించారు. సోమవారం రాత్రికి స్వగ్రామం బ్రహ్మణపల్లికి తరలించనున్నారు. అమెరికాలోఉన్న కుమారుడు వచ్చాక బుధవారం అధికార లాంఛనాలతో గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

దిగ్భ్రాంతికి గురైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్..

మంత్రి గౌతమ్‌రెడ్డి మరణ వార్త తెలుసుకున్న సీఎం జగన్‌ దిగ్భాంత్రికి గురయ్యారు. రాష్ట్రాభివృద్ది కోసం ఏకంగా గంటల ముందువరకు శ్రమించిన నేత.. అకస్మిక మరణానికి గురికావడంతో విషాదంలో మునిగిపోయారు. గౌతంరెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. చిన్ననాటినుంచే తనకు బాగా పరిచయమంటూ ముఖ్యమంత్రి ఆవేదనలో మునిగిపోయారు. ఒక స్నేహితుడినే కాకుండా సమర్థుడైన మంత్రిని, విద్యాధికుడ్ని కోల్పోయానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తన రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచారంటూ సీఎం గుర్తుచేసుకున్నారు.

రాష్ట్రంలో పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ అభివృద్ధికి విశేష కృషిచేశారని. ప్రభుత్వ పారదర్శక పారిశ్రామిక విధానాలను సమర్థవంతంగా అమలు చేయడంద్వారా రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకు వచ్చారని సీఎం అన్నారు. రెండుసార్లు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రజల ఆదరాభిమానాలతో గెలుపొంది ఉజ్వలభవిష్యత్తు ఉన్న నాయకుడ్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తంచేశారు. గౌతమ్‌రెడ్డి మరణం తనకే కాదు, రాష్ట్రానికే తీరని లోటని అన్నారు.మంత్రి గౌతమ్ రెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హైదరాబాద్ లోని మంత్రి నివాసానికి చేరుకోనున్నారు.

చిన్న వయస్సులోనే దూరం కావడం బాధాకరం.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఏపీ మంత్రి గౌతమ్‌ రెడ్డి మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు తీవ్రవిచారం వ్యక్తంచేశారు. గౌతమ్‌ రెడ్డి ఎంతో సౌమ్యులు, సంస్కార వంతులని, ప్రజా సమస్యల పట్ల అవగాహన, చేసే పనిపట్ల నిబద్ధత కల్గిన వ్యక్తి అని వెంకయ్య నాయుడు కొనియాడారు. ‘గౌతమ్ రెడ్డి తాత గారి సమయం నుంచి వారి కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. గౌతమ్ రెడ్డి నేనంటే ఎంతో అభిమానం చూపేవారు.  అలాంటి వ్యక్తి చిన్న వయసులోనే దూరం కావడం బాధాకరం. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను’ అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

మాజీ పార్లమెంటు సభ్యులు కేవీపీ రామచంద్రరావు దిగ్బ్రాంతి

గౌతమ్ రెడ్డి మృతి పట్ల మాజీ పార్లమెంటు సభ్యులు కేవీపీ రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి తనకు అత్యంత ఆప్తుడని చెప్పారు. రాజకీయాల్లో స్తబ్దుగా ఉండొద్దని, ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా పని చేయాలని తనను కోరేవాడని తెలిపారు. ఎంతో ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు ఉన్న గౌతమ్ చిన్న వయసులోనే ఆకస్మిక మరణానికి గురి కావడం బాధాకరమని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. గౌతమ్ తండ్రి రాజమోహన్ రెడ్డి కుటుంబంతో దివంగత రాజశేఖరరెడ్డికి, తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని తెలిపారు.

మంత్రి మేక‌పాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం ప‌ట్ల ఏపీ నేతల విచారం

మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చివరి నిమిషం వరకు రాష్ట్ర శ్రేయస్సు కోసమే పాటుపడ్డార‌ని అన్నారు. తాను సహచరుడిని కోల్పోవడం అత్యంత బాధాకరంగా ఉందని చెప్పారు. ఆయన కుటుంబస‌భ్యుల‌కు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

'పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖామాత్యులు శ్రీ మేకపాటి గౌతమ్‌రెడ్డి గారి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది. యువ నాయకుడిగా, మంత్రిగా గౌతమ్‌రెడ్డి గారు రాష్ట్రానికి విశేషమైన సేవలందించారు. గౌతమ్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబసభ్యులకు ప్రగాఢ‌ సానుభూతి తెలియజేస్తున్నాను' అని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఆయన మరణం చాలా బాధాకరమన్నారు. ఏపీలో పెట్టుబడుల కోసం పరిశ్రమలు, ఐటీ మంత్రిగా ఎంతో కృషి చేస్తున్నారన్నారు. నిన్నటి వరకు కూడా రాష్ర్టంలో పెట్టుబడుల కోసం దుబాయ్‌లో పర్యటించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇక లేరు అనే వార్త కలచి వేసిందన్నారు.

ఏపీ ఐటి రంగంలో అభివృద్ధి చేసిన మేకపాటి గౌతంరెడ్డి మరణం బాధాకరమని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు.. అభివృద్ధి చెందుతున్న ఏపీకి తీరని లోటు అవంతి పేర్కొన్నారు. సహచర మంత్రిగా స్నేహితునిగా ఆయన మరణం ఊహించుకోలేక  పోతున్నామన్నారు.

'మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యాను. ఫిట్నెస్‌కి అత్య‌ధిక ప్రాధాన్యం ఇచ్చే మంత్రి గుండెపోటు రావ‌డం అత్యంత విచార‌క‌రం. విదేశాల‌లో ఉన్న‌త‌ విద్యాభ్యాసం చేసి వ‌చ్చినా విన‌యం, విధేయ‌త‌లు ఆయ‌న చిరునామా. ఐదుప‌దుల వ‌య‌స్సులోనే హుందా గ‌ల రాజ‌కీయ‌వేత్త‌గా పేరుగాంచిన మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి మ‌న‌కి దూరం కావ‌డం తీర‌ని విషాదం. మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి కుటుంబ‌స‌భ్యుల‌కు నా ప్రగాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను' అని టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

'ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణం బాధాకరం. వారి మృతికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబసభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నాను' అని టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి అన్నారు.

'ఆసుప‌త్రికి ఫోన్ చేశాను. ఆయ‌న మృతి చెందార‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు తెలిపాయి. నిన్న రాత్రి కూడా ఆయ‌న చాలా చురుకుగా ఉన్నారు. ఈ రోజు గౌతం లేరన్న వార్త బాధ క‌లిగిస్తోంది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నాను' అని సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి అన్నారు.

'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, వైసీపీ నేత మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

మేక‌పాటి గౌతమ్‌రెడ్డి చాలా యాక్టివ్‌గా ఉండేవారని, ఏపీ మంత్రి వ‌ర్గంలో మంచి పేరు తెచ్చుకున్నార‌ని సీపీఐ నేత నారాయ‌ణ అన్నారు. మేక‌పాటి గౌతంరెడ్డి హఠాన్మరణం ప‌ట్ల ఆయ‌న కుటుంబస‌భ్యుల‌కు సానుభూతి తెలుపుతున్నాన‌ని పేర్కొన్నారు.

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మృతి పట్ల తెలంగాణ నేత‌ల సంతాపం

గౌత‌మ్ రెడ్డి మృతి చెందార‌న్న వార్త తెలుసుకుని దిగ్భ్రాంతికి గుర‌యిన‌ట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయ‌న‌ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నాన‌ని అన్నారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు కేటీఆర్ సానుభూతి తెలిపారు.

గౌతమ్ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న నేత మరణం కలచివేసిందని ఆయ‌న ట్వీట్ చేశారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాన‌ని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

త‌న ప్రియ మిత్రుడు మేక‌పాటి గౌతం రెడ్డి ఇక లేర‌న్న వార్త‌ దిగ్భ్రాంతికి గురిచేసిందని ష‌ర్మిల అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ష‌ర్మిల‌ ట్వీట్ చేశారు.

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుప‌త్రికి వెళ్లిన తెలంగాణ‌ మంత్రి తలసాని శ్రీ‌నివాస్ యాద‌వ్... గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి హఠాన్మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి  దిగ్భ్రాంతి  వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh