dont think about suicide think about better morning

Dont think about suicide think about better morning

Suicide, self murder, Suicides, self killing

Many of us, thinking that suicide is the best option than their problems. Many people that suicide is the alternative for every problem.

మరణం కాదు మరో ఉదయం

Posted: 12/29/2015 01:49 PM IST
Dont think about suicide think about better morning

"ఆత్మహత్యా???"  దేవుడు జీవితాన్ని ఇచ్చింది బతకడానికి ... బలవంతంగా ముగించుకోడానికి కాదు" ఈ డైలాగ్ సినిమాల్లో , టీవీ సీరియళ్ళలో, తమ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో , ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనను తోటి వారిలో గమనించినా , ఎన్నో సందర్భాలలో చెప్పిన వారే ఎవ్వరూ ఊహించని రీతిలో బలవంతంగా సెలవు తీసుకుంటే? "జీవితం అంటే ఏంటి?" అన్న భయంకరమైన ప్రశ్న, మరో కొత్త ప్రశ్న మనలో మొదలయ్యేంత వరకూ మనల్ని వేధించడం మొదలెడుతుంది ...

రైతన్న దగ్గరి నుంచీ రాజాలా తిరిగే టీనేజర్ వరకు ... ఎన్నో జయాపజయాల అనుభవాలను మూటగట్టుకుని, జీవితాన్ని క్షుణ్ణంగా చదివిన సీనియర్స్ దగ్గరినుండి ఇప్పుడిప్పుడే రంగుల ప్రపంచంలో పైకి ఒస్తున్న, సంపాదించుకున్న ఇమేజ్ ను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న స్టార్ల వరకు ... "ఎవరో ఒస్తారని ... ఏదో చేస్తారని" ఎదురు చూసే ఓపిక లేక ... స్వశక్తిని నమ్ముకునే ఆత్మ విశ్వాసం లేక, వయస్సుతో సంబంధం లేకుండా, ఆత్మహత్యలకు పాలుపడుతున్న వారు కోకొల్లలు... అసలు రోజు ఈ వార్తలు వినీ - చూసి, ఒక విధంగా "ఆత్మహత్య" అన్న పదం, ఈ పదానికి నిర్వచనం చెప్పే వార్త, మనకు సర్వసాధారణం అయిపోయాయి...

"అసలెందుకు చనిపోవాలి?" ఇది బ్రతాకాలి అనుకునే వాడి ప్రశ్న... "అసలెందుకు బతికుండాలి?" ఇది చనిపోవాలి అనుకునే వాడి తిరుగు ప్రశ్న...

1. ఇతరులకన్నా మెరుగైన జీవితం ... నేర్చుకోడానికి సముద్రమంత జ్ఞ్యానం... పెంచుకుంటూ పోడానికి అంతులేని అనుబంధాలు... ఒక్కో మెట్టూ పైకి ఎక్కడానికి కొలవలేనన్ని అవకాశాలు... మనసుకూ - మనీ పరుసుకూ సంబంధించి వేసిన తప్పటడుగులని (ఇలా అనుకునే వారికి) సరిదిద్దుకోడానికి, మనం తీసేవరకు తలుపు తట్టే అదృష్టాలు... ఇవీ చాలవంటే, లక్ష్మీ దేవి యెంత ఆడితే అంత స్థాయిలో హోటళ్ళ దగ్గరినుండీ సినిమాలు, మల్టీ ప్లక్సుల దగ్గరినుండీ మనసుకు హాయినిచ్చే పార్కులు, విహార యాత్రా స్థలాల దగ్గరినుండీ విసుగు ఒచ్చెంత వరకూ వచ్చే అంతులేని టీవీ ప్రోగ్రాములు... ఇలా మనం "ఒద్దురా భగవంతుడా" అనేంతవరకూ వినోదాన్నిచ్చే వస్తువులూ, స్థలాలూ, నెవర్ ఎండింగ్ కిక్కునిచ్చే అంతులేని ఆల్ టైప్ స్నేహాలూ... కావలసిన వారికి కావలసినంత... బతకడానికి వంద కాదు రెండువంతల ఏళ్ళు ... కాదు కాదు... అంతులేని సంవత్సరాలు ఉంటే బాగుండును...

2. ఇంతోటి జీవితాన్ని గడపడానికి వంద సంవత్సరాలు కావాలా? యాభై అయితే  మహా ఎక్కువ...  ఏముందని జీవితంలో ... లేని వాడు కావాలనుకునే దాని కోసం, ఉన్న వాడు ఇంకా కావాలి అనుకుని, పరుగు... ఒకదాని వెనుక ఇంకోటిగా వచ్చిపడే కోరికల చిట్టాలు, సమస్యలు, ఆశలు... అబ్బ, అసలు అంతే లేదు... హాయిగా నవ్వాలి అంటే, ఏడుపు పలకరిస్తుందేమో అని భయం...  ఎక్కువ ఏడిస్తే, నవ్వడం మర్చిపోతాం ఏమో అని భయం... జీవితంలో ఎత్తుకి ఎదిగితే, అమాంతం కింద పడిపోతాం ఏమో అని భయం... అసలు ఎత్తుకి ఎదగాలి అన్న ఆలోచన ఒస్తేనే, ఈ క్రమంలో ఎదురయ్యే ఒడిదుడుకులు తలుచుకుని భయం... చదువు కోసం కష్టం, ఉద్యోగం కోసం కష్టం, ఎదుగుదల కోసం ప్రయాస, వచ్చిన ఎదుగుదలని కాపాడుకోవడం కోసం పాట్లు, కడుపు కట్టుకుని కూడబెట్టేందుకు నా నా తంటాలు, ఇంతా చేస్తే "మా కోసం ఏం చేసావ్ పెద్ద?" అని దెప్పి పొడిచే మనల్ని అర్ధం చేసుకోని "మన" వారు... భాగస్వామి, పిల్లలు, స్నేహితులు, ఆఫీసు వాళ్ళు, వ్యాపారంలో పార్ట్నర్స్, చివరికి తల్లి - తండ్రులు, అందరికీ మన నుండి ప్రేమ, స్నేహం, డబ్బు, సమయం కావాలి... ఇందులో ఏ ఒక్కటి తగ్గినా మా చెడ్డ గొడవలు ఒచ్చేస్తాయి ఆ రియలిస్టిక్ సినిమాలు తీసే దర్శకుడు ఒక  సినిమాలో హీరో చేత చెప్పించినట్టు... ఇంత తపన ఎవరి కోసం? ఇంత కష్టం ఏం సాధించడం కోసం? యెంత చేసినా చివరి రోజు తప్పదుగా? అదేదో ఇప్పుడే తెప్పించేసుకుంటే పోలే...

పైన ఇచ్చిన రెండు విశ్లేషణలు, మొదటిది "బతకాలి" అనుకునే వారికి, రెండవది "ఎందుకు బతకాలి" అని ప్రశ్నించుకునే వారికీ వర్తిస్తాయని, చదువరులకు అర్ధం అయ్యే ఉంటుంది... అంటే, ఏంటి దీనర్ధం? ఎవరు తప్పు? ఎవరిది ఒప్పు? బతకాలి అనుకోవడం యెంత సహజమో, మరణం కోరుకోవడమూ అంతే సమంజసమా?

ఉన్న ఒక్క జీవితం, యెంత ఆనందంగా బతకాలో ఆలోచించి, ఆ ఆలోచనని ఆచరణలో పెట్టాలి కానీ, ఎలా చనిపోవాలో, యెంత తొందరగా జీవితం ముగించాలో కాదు... ఈ ఒక్క జీవితాన్నీ, చివరి క్షణం వరకు పూర్తిగా అనుభవించి కానీ పోను...

ఉన్న ఒక్క జీవితం, యెంత ప్రయత్నించినా ఆలోచనని ఆచరణలో పెట్టడం కాదు కదా, కనీసం ఒక పట్టాపై కూడా నడిపించలేకపోతున్నాం... ఎక్కడ చూసినా అన్యాయం, ఎప్పుడు చూసినా ఓటమి... జీవితంతోనే ఓడిపోయినప్పుడు, ఇక జీవితం మాత్రం ఎందుకు... అర్ధం లేని పంతాలకు పోక, "ఓడిపోయా" అని ఒప్పుకుని జీవితాన్నే ముగించేస్తే పోలా? ఈ జన్మకి ఇలా, కనీసం ఒచ్చే జన్మ అయినా అర్ధవంతమైనదిగా ఉంటుందేమో???

ఆత్మహత్యా ఆలోచనకు, ఈ ఆలోచనని ఆచరణలో పెట్టాలి అనే పంతానికీ ప్రేరేపించే సంఘటనలు శతకోటి... మరి ఈ శతకోటి దరిద్రాలకు, అనంతకోటి ఉపాయాలు లేవా??? జీవనశైలి, అర్ర్ధిక స్థితిలో తారతమ్యాలు ఉన్నా, ప్రతీ జీవిని, జీవితంపై విరక్తి చెందేలా ప్రేరేపించే సన్నివేశాలు, ముఖ్యంగా మూడు... ప్రేమ, డబ్బు, లక్ష్య సాధనలో విఫలం అవ్వడం... ఈ సన్నివేశాల తుది నిర్ణయానికి మనం కారణం కాకపోయినా, ఇవి మన జీవితంలో ఉద్భవించి, మనల్ని అల్లకల్లోలం చెయ్యడానికి మాత్రం, నిస్సందేహంగా మనమే కారణం...

ప్రేమ - సఫలం అయినా, విఫలం అయినా సమస్యలు ఉంటాయి... ప్రేమ విఫలం తాలూకు వేదన అనుభవిస్తున్న వారు ఈ సత్యాన్ని ఒప్పుకోరు కానీ, ఒక్కసారి ఈ సమస్యను మరో కోణం నుంచి చూస్తె అర్ధం అవుతుంది... ఇది నిజం కాకపొతే, ఇంతమంది ప్రేమ వివాహం చేసుకున్న సదరు ప్రేమికులు, విడాకుల కోసం వెంపర్లాడరు... మీ ఆత్మహత్యా ప్రయత్నానికి, ప్రేమ విఫలమే కారణం అయితే, ఒక్కసారి ఆలోచించండి... మనపై అనంతమైన ప్రేమను నింపుకుని, మనకోసమే బతుకుతున్న మన తల్లి తండ్రులు, వారికి ఇష్టంలేని వ్యక్తిని మనం మనువాడినా, అయిష్టంగా ఒప్పుకుంటారు, లేక కొంతకాలం అలుగుతారే తప్ప, మనం వారికి దక్కలేదు అని ఆత్మహత్య చేసుకోరు (తమ పరువు తీసేశారు అనుకుని, ప్రేమ వివాహం చేసుకున్న తమ పిల్లలని, లేక వారి భాగాస్వామినీ హతమార్చే "విష సర్ప" స్వరూపం ఉన్న ప్రబుద్ధుల గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు... "నాగుల చవితి పూజని వారు చెయ్యలేదు పాపం" అని జాలి పడి వదిలెయ్యడం తప్ప)... అయినా, ప్రేమించిన వారితో జీవించాలి అని, ఈ ఆశను నిజం చేసుకోవడం సమంజసం కానీ, వాళ్ళు దక్కలేదు అని ఉక్రోషానికి పొయ్యి, మనం ఆత్మహత్య చేసుకోవడం లేక వారినే హతమార్చడం, మనం మనుష్య జాతికి కాదు, మృగాలకు ప్రతీక అని అర్ధం... మనమే సంతతికి చెందినవారమో, విచక్షణతో ఆలోచిస్తే, మనకే అర్ధం అవుతుంది... ఊహ తెలిసినప్పటినుంచీ ఎంతో కొంత "మంచి" నేర్చుకున్నాంగా??? ఈ "మంచి" ని, దీనివల్ల మనకు లభించిన విచక్షణని, మనది "ప్రేమా" లేక "పంతమా", అని ఆత్మపరిశీలన చేసుకోడానికి ఉపయోగించుకోవాలి... "ప్రేమ" అయితే, అది దక్కినా, దక్కకపోయినా, ప్రేమించిన వారి శ్రేయస్సు కోరుకుని, మనల్ని ప్రేమించేవారి వైపు హుందాగా అడుగు ముందుకు వేసేందుకు ప్రేరణ అవుతుంది... "పంతం" అయితే, అందరి శ్రేయస్సు కొరకు దీనిని ఇక్కడే వదిలేసి ముందడుగు వెయ్యాలి అన్న ఆలోచనకు పునాది అవుతుంది... మనకు కావలసిందల్లా ఈ "విచక్షణ"... మనం చెయ్యవలసినదల్లా, ఈ "విచక్షణ" ను పెంపొందించుకోవడం...

డబ్బు - తెలిసినా మనం ఒప్పుకోడానికి ఇష్టపడని సత్యం... "డబ్బు" సంపాదించాలి అనే ఆశకు హద్దులేదు... డబ్బుతో పాటు పెరిగే జీవనశైలికి, దీనితో పాటు పెరిగే ఆర్ధిక అవసరాలకు హద్దు లేదు... ప్రస్తుత జీవన శైలిలో, మనం "అవసరం" గా భావిస్తున్న, "డబ్బు" తో ముడిపడిన ప్రతీది, మనం ఎర్పర్చుకున్నదే కానీ, స్వతహాగా మనకు ఏర్పడిన అవసరం కాదు... "అవసరాని"కి మించిన "ఆశ", అనవసర సమస్యలని తెస్తుందే తప్ప, రవ్వంత ప్రశాంతతని కూడా కాదు... సందర్భానికి అతీతంగా, ఈ సత్యం ప్రతీ సంఘటనకీ వర్తిస్తుంది... అయితే, ఏది "అవసరం", మరేది ఎందుకు "అనవసరం" అన్న "విచక్షణ", మనం కలిగి ఉండాలి... స్వతహాగా ఈ "విచక్షణ" మనలో లేకపోయినా, పెంపొందించుకోవాలి అనే సామర్ధ్యం మనలో ఉంటుంది... ఇంతా శక్తిని, మనం గుర్తించడంలేదు... అంతే... అసలు ఈ శక్తిని, గుర్తించడానికి కావలసింది కూడా, "విచక్షణ"... డబ్బు, హోదా, మంచి జీవనశైలి కోసం పాటు పడటం... ఇవన్నీ సమంజసమే... కానీ, ప్రతీసానికీ "గీత" గీసుకోవలసిన "విచక్షణ" మన సొంతంకావాలి... మిగితావన్నిటి కొసం కాదు, ఈ "విచక్షణ" రావడం కోసం, "పంతం" తో కృషి చేద్దాం...

లక్ష్య సాధన - ఆహా ... అనుకోవడానికి యెంత బాగుందీ మాట... నిజమే మరి, ప్రతీ మనిషికి లక్ష్యం ఉండాలి, అది సాధించాలి అన్న తపన ఉండాలి... చిన్నదైనా, పెద్దదైనా సరే... "లక్ష్యం" అనేది ఉండాలి... మరి అనుకున్న "లక్ష్యాన్ని" చేరుకోలేకపోతే??? కక్ష పెంచుకుని, జీవితాన్ని హత్య చెయ్యాలి... ఏ గ్రంధం చెప్పిందీమాట??? ఏ మహానుభావుడు అన్నాడు ఇలా??? ఇదే నిజం అయితే, ఎన్నో లక్ష్యాలు పెట్టుకుని, అవి తీరెంత ఆత్మ స్థైర్యం ఉన్నా, తన వారి కోసమో, తన పిల్లలకోసమో, అన్నీ త్యాగం చేసి, తమ వారు సంతోషంగా ఉండటం చూసి, వారి సంతోషమే, తమ తృప్తిగా బతుకుతున్న, ప్రతీ ఇల్లాలు, ప్రతీ తల్లి - తండ్రి ఆత్మహత్య చేసుకోవాలి...

మనకి "లక్ష్యం" ఉండాలి... పేరు, గౌరవం, జీవితాన్ని ఇతరులకూ - మనవారికీ - మన అంతరాత్మకు కూడా హాని కలిగించని రీతిలో జీవించాలి అన్న "లక్ష్యం"... ఇందుకోసం మనం పెట్టుకునేవి, "ప్రణాలికలు", "లక్ష్యాలు" కావు... "లక్ష్యం", అనేది ఒక్కటే... కోరికలకీ - ఆశలకీ, లక్ష్యానికీ ఉన్న వ్యత్యాసం గమనించక, కోరి మనం తెచ్చుకుంటున్న సమస్యలు కావా ఇవి? నిజమే, అనుకున్నట్టుగా జీవితం లేదు... అనుకున్న "లక్ష్యమూ" నెరవేరలేదు... నిరుత్సాహ పడక, మనం అనుకున్నది ఎంతవరకూ ఆచరణలో సాధ్యం??? ఒకవేళ కాకపొతే, "లక్ష్యం" చేరుకునేందుకు మరొక మార్గం ఏంటి??? అసలు మనం ఎంచుకున్న మార్గం, ఎంతవరకూ, నిజ జీవితంలో సమంజసం??? ఇంత ఆలోచించామా??? మనకున్నది "లక్ష్యమా" లేక "పంతమా"??? ఈ సత్యం మన బుర్రలకి బోధపడాలంటే కూడా, "విచక్షణ" మన సొంతం కావాలి... "విచక్షణ తో జీవితం" మన లక్ష్యం కావాలి...

పరీక్ష తప్పారని, ప్రేమలో ఫెయిల్ అయ్యారని, అమ్మా - నాన్నా చదవమని నస పెడుతున్నారని, ఆర్ధిక పరిస్థితి లేక జీవన స్థితి లక్ష్య సాధనకు ఆటంకం అవుతోందని, అత్తింటి వారు వేధిస్తున్నారని, ప్రాణాలు పెట్టుకున్న ప్రేమించిన వారు మోసం చేసారని, ఒకప్పుడు ఉన్న విజయం ఇప్పుడు లేదని, భాగస్వామి చనిపోయారని, అప్పుల బాధను ఇక తాళలేం, ఎవ్వరు మన బాధను అర్ధం చేసుకోవడం లేదు అని, పిల్లలు కలగటంలేదు అని, కలిగిన సంతానం సవ్యంగా లేదు అని, ఒంటరితనం భరించలేం అని... ఇలా జీవితాన్ని అర్ధ భాగంలోనే ముగించడానికి ఎవరికి వారి కారణాలు... ప్రతీ ఒక్కరి దృష్టిలో చూస్తే, వారికి ఉన్న సమస్య కొండంత... కానీ, సమస్య అనుభవించే మీరే, విచక్షణతో చూస్తె??? కొండంత సమస్యను కూడా గోరంత చేసే సమాధానం మీ ముందే ఉంటుంది...

"మన" అనుకునే ఎవ్వరి నుంచీ ఏదీ ఆశించక, మనం మాత్రం ప్రేమను పంచుతూ, బరువైన ఏ బంధాన్ని మోయక, మన జీవితాన్ని ప్రశాంతంగా జీవించాలి అన్న బాధ్యతను స్మరించుకుంటూ, ప్రతీ రాత్రి తరువాత ఒక వెలుగు ఉంటుందని, ప్రతీ అపజయం వెనుక ఒక విజయం ఉంటుందని, ఈ విజయ సాధనకు అడుగులు ముందుకు వేస్తూ, అవసరం ఉన్న చోట, తగ్గి, అవసరం తీరింది కదా అని ఎగసిపడక, సమతుల్యంగా జీవితం గడుపుతూ, చక్కని వ్యాపకమే కాని మరణం కాదు ఒంటరితనానికి సమాధానం అన్న నిజాన్ని గుర్తిస్తూ, చివరి మనకు మానవ జీవితాన్ని వరంగా ఇచ్చిన సృష్టి కర్తకు, ఆయన వరం ఆయెనే తీసేసుకునేంత వరకూ జీవించి చూబించడం కన్నా గొప్ప ఇంకేం లేదు అన్న సత్యం గుర్తించడం కన్నా గొప్ప ఆత్మ సాక్ష్యాత్కారం ఇంకేం లేదు...

మనిషి మెదడులోనే యుద్దం పుడుతుంది... ఆ మెదడులోనే కొత్త ఆలోచనలకు నాందిపడుతుంది. అయితే రెండింటికి కేంద్ర బిందువు మనిషి మెదడే. అందుకే  ప్రపంచ యుధ్దం అంటూ జరిగితే అది ముందు మనిషి మెదడులోనే మొదలవుతుందని అన్నారు. మనిషి మెదడును జయించి.. ఆలోచనలను జయించిన వాడు విశ్వవిజేత అవుతాడు. మనిషిలో చావు అన్న మాట కన్నా.. బ్రతుకు మీద ఆశ ముందు నడిపించాలి. ప్రతి మనిషిలో ఉన్న వైరాగ్యం... స్మశాన వైరాగ్యం లాగా కాకుండా.. బురదలో తామరలా ఉంటే కష్టాలు కన్నీలు ఏవీ ఉండక బ్రతుకునావ సాఫీగా సాగుతుంది. మనిషి ఎదుర్కోలేని కష్టాలను భగవంతుడు ఎన్నటికీ ఇవ్వడు అని పరమహంస చెప్పిన మాటలు అక్షర సత్యాలు. రామాయణంలోని సుందరకాండలో ఆంజనేయుడు ఒక మాట అంటాడు.""చనిపోవుట అనేక దోషాలకు కారణమవుతుంది. బ్రతికుంటే ఏనాటికైనా శుభం కలుగుతుంది"అని. అది నిజమే.

చివరిగా ఒక్క మాట
"జంతు" జాతికీ "మనకీ" ఆ సృష్టికర్త పెట్టిన చిన్న తేడా, "ఆవేశంగా కాక... విచక్షణ"తో జీవించడం... ఈ "తేడా" ను ప్రతి క్షణం మనం గుర్తుపెట్టుకుంటే, భవిష్యత్తు "బంగారం" కాకపోయినా, అర్ధవంతం అవుతుంది... అర్ధంతరంగా ఆగిపోదు... ప్రతీ రాత్రి "మరణించాలి" అన్న ఆలోచనకు కాదు "మరో ఉదయాన్ని" ఆహ్వానించాలి అన్న సంకల్పానికి పునాది అవుతుంది...

*సునయన*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Suicide  self murder  Suicides  self killing  

Other Articles