ప్రొఫెసర్ జయశంకర్.. తెలంగాణలో ఈ పేరు తెలియని వారు ఉండరు. ప్రస్తుతం కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి తెలంగాణ కోరుకునే ఎంతో మంది కళ్లలో వెలుగులు నింపిన ధన్య జీవి ప్రొఫెసర్ జయశంకర్. ఎంతో మంది పుడతారు గిడతారు... కొంత మంది మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. కానీ ఆ కొంత మందిలో మరికొందరు మాత్రమే చరిత్రను మార్చేస్తారు అలా చరిత్రను తిరగరాసిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్. ఒక మనిషి తను నమ్మిన సిద్దాంతానికి ఎలా పూర్తి నిబద్దతతో.. పూర్తిగా అదే లోకంగా భావిస్తే ..జీవిస్తే ఎలా ఉంటుంది అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం ప్రొఫెసర్ జయశంకర్.
మిస్టర్ జయశంకర్ ఇది హైదరాబాద్ స్టేట్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మీ జీతభత్యాలు అంతే.. ఉద్యోగ నియామకపత్రంలో అంతకు ముందు చెప్పిన స్కేలు లేకపోవడంపై నిలదీసిన నూతన ఉద్యోగిపై ఆంధ్ర అధికారి చేసిన అవహేళన అది. ఎప్పుడో వరంగల్ మర్కజీ పాఠశాలలో విజయవాడనుంచి వచ్చిన ఓ పంతులు తెలంగాణ భాష మీద, జీవన విధానం మీద వేసిన కుళ్లు జోకులకు వ్యతిరేకంగా గొంతెత్తిన విద్యార్థి యోధుడు, ఫజల్ కమిషన్ ముందు బిచ్చమెత్తి బతుకుతాం తప్ప వాళ్లతో కలవం అని కుండబద్దలు కొట్టిన నునూగు మీసాల వీర కిషోరం. ఉద్యోగ పాత్రలో జీవనపథంలో అడుగు పెడుతూనే ఎదుర్కున్న సన్నివేశమది. జీవితమంతా ప్రతి మలుపులోనూ ఆంధ్ర దురహంకారాన్ని చవిచూసి ఎదురించి తిరగబడ్డ ఆ యోధుడు తెలంగాణ సిద్ధాంత మహా మహోపాధ్యాయుడు ప్రొఫెసర్ జయశంకర్.
వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో లక్ష్మీకాంతరావు, మహాలక్ష్మి దంపతులకు 1934 ఆగస్ట్ 6న ఆయన జన్మించారు. ఆయనకు ముగ్గురు సోదరీమణులు, ఇద్దరు సోదరులు. వరంగల్ మర్కజీ పాఠశాలలో ప్రాథమిక విద్య, న్యూ హైస్కూల్‌లో మాధ్యమిక విద్య, ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో హెచ్‌ఎస్‌సీ వరకు విద్యనభ్యసించారు.ఉస్మానియాలో బీఏ చేశారు. ఆర్ట్స్‌తో పాటు సైన్స్, సైన్స్‌తో పాటు ఆర్ట్స్ తప్పనిసరిగా చదవాలన్న నిబంధనలకనుగుణంగా ఆయా సబ్జెక్టుల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. బెనారస్ హిందూ వర్సిటీ, అలీగఢ్ వర్సిటీల నుంచి అర్థశాస్త్రంలో పీజీ పూర్తి చేసిన జయశంకర్ తన అధ్యయన అనుక్రమణికను, ప్రణాళికలను ఆ చిన్న వయసులోనే రూపుదిద్దుకున్నారు. హన్మకొండలో బీఈడీ చేసి 1960లో ఉపాధ్యాయ వత్తిలోకి అడుగుపెట్టారు. ఎమర్జెన్సీ కాలంలో ఆయన సీకేఎం కళాశాలకు ప్రిన్సిపల్‌గా పని చేశారు.
1952 నాన్ ముల్కీ ఉద్యమంనుంచే ఆయన పోరాటం ప్రారంభమైంది. పోలీస్‌యాక్షన్ తర్వాత ఆంధ్రనుంచి ఉద్యోగులు భారీగా దిగుమతి అయ్యారు. వీళ్లంతా విశాలాంధ్రకావాలి అంటూ ప్రచారాలు ప్రారంభించారు. వరంగల్‌లో విశాలాంధ్రకు మద్దతుగా బహిరంగ సభ నిర్వహించారు. ఆనాటి సభకు విజయవాడనుంచి అయ్యదేవర కాళేశ్వరరావు హాజరయ్యారు. ఆయన తన ప్రసంగంలో మీరు ఇలాగే ఉంటే అభివృద్ధి సాధించలేరు. విశాలాంధ్ర వస్తే మేము వచ్చి మీ అభివృద్ధి చేస్తాం అంటూ ప్రారంభించి తెలంగాణ భాష, వేషభాషలు అన్నింటినీ కించపరిచే రీతిలో ప్రసంగిచండం ప్రారంభించారు. ఆనాడు విద్యార్థిగా ఉన్న జయశంకర్ సహా అనేక మంది విద్యార్థులు తిరగబడి విశాలాంధ్ర గోబ్యాక్ నినాదాలు చేశారు. సభ రసాభాస కావడంతో పోలీసులు లాఠీచార్జీ జరిపారు. ఆ దెబ్బలు తిన్న వారిలో జయశంకర్ ఒకరు. ఈ సంఘటన స్ఫూర్తిగా హైదరాబాద్ సిటీ కాలేజీలో నాన్ ముల్కీ గోబ్యాక్, ఇడ్లీ సాంబార్‌గోబ్యాక్ ఉద్యమం ప్రారంభమైంది. పోలీసు కాల్పుల్లో నలుగురు విద్యార్థులు మరణించారు. దీనికి నిరసనగా మరో ఆందోళనకు పిలుపునిచ్చారు విద్యార్థి నాయకులు. వరంగల్ విద్యార్థులంతా ఆనాడు బొగ్గుతో నడిచే ఓ బస్సు తీసుకుని హైదరాబాద్ వస్తుండగా భువనగిరిలో ఆది చెడిపోయింది.
దీనితో వారు హైదరాబాద్ చేరలేకపోయారు. ఆ రోజు మళ్లీ పోలీసుకాల్పులు జరిగి ఏడుగురు విద్యార్థులు కన్నుమూశారు. ఈ సంఘటనపై జయశంకర్ అనేకసార్లు ఆ రోజు నేను వెళ్లి ఉంటే కాల్పుల్లో చనిపోయేవాడిని తెలంగాణ దుర్గతి చూసే బాధ తప్పేది అని చెప్పేవారు. 1954లోనే విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్సార్సీ కమిషన్ ముందు విద్యార్థి నాయకుడిగా ఆయన హాజరయ్యారు. ఫజల్ అలీ మేం చెప్పేదంత జాగ్రత్తగా విన్నడు. అన్నీ విన్నంక నవ్వుకుంట అడిగిండు. మీకు ప్రత్యేక రాష్ట్రం ఇస్తే బతకగలుగుతరా? అని అడిగిండు. మంచిగ బతకగలుగుతం. బతకలేకపోతే బిచ్చమెత్తుకుంటం. కాని వాళ్ల దగ్గరికి మాత్రం పోం అన్నం అంటూ నాటి ఘటనను జయశంకర్ చెప్పేవారు. ఫజల్ నివేదికకు వ్యతిరేకంగా తెలంగాణను ఆంధ్రలో కలిపేశారు. అయినా ఆయన పోరాటాన్ని ఆపలేదు. 1969 ఉద్యమంలోనూ ఉపాధ్యాయ హోదాలో భాగం పంచుకున్నారు.
1968-69 లో జరిగిన జై తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుడిగా జయశంకర్ పోరాటం చేశారు. ఐదు దశాబ్దాల కాలంలో పదవులు, ప్రలోభాలు ముంగిట్లో వాలినా విసిరిపారేసి తెలంగాణ జెండాను ముద్దాడిన నిరుపమాన తెలంగాణ ఉక్కుమనిషాయన. అన్ని రంగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాలను సోదాహరణంగా లెక్కలతో సహా వివరిస్తున్నప్పుడు అర్థశాస్త్ర మహోపాధ్యాయులందరూ ఆయన ముందు చేతులు కట్టుకొని వినాల్సిందే. డిసిమల్ తేడాతో ఆయన చెప్పే గణాంకాలు ఢిల్లీ పాలకులను గడగడలాడించాయి. తెలంగాణ ఉద్యమానికి ఇంధనమయ్యాయి. ఫజల్ అలీ కమిషన్‌కు నివేదికను రూపొందించిన నాటి నుండి శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ తయారు చేసే వరకు ఆయన కలం తెలంగాణ కలంగా పని చేస్తూనే ఉన్నది. 1996 మలిదశ ఉద్యమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పాటులో, ఆ తర్వాతి కాలంలో 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావంలో ఆయన ముఖ్య భూమిక వహించారు. టీఆర్‌ఎస్‌కు సిద్ధాంతకర్తగా నిలిచారు. ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా, ఒక ఉద్యమ పార్టీగా టీఆర్‌ఎస్‌ను మలచడంలో విరామమెరుగక పరిశ్రమించారు.
ఎంతో కాలం జరిపిన పోరాటం... ఉద్యమ స్థాయి నుండి మహా ఉద్యమ స్థాయికి చేరింది. ఉద్యమాన్ని ఉరకలెత్తించిన వారిలో మొదటి పేరు ప్రొఫెసర్ జయశంకర్ దే. ఉద్యమానానికి ఊపిరిపోసిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్పూర్తిని రగిల్చి చివరకు తెలంగాణ కల నెరవేరిన క్షణాన కళ్లార చూడకుండా మధ్యలోనే నిష్క్రమించిన మహానుభావుడు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ గుర్తించుకోవాల్సిన పేరు ప్రొఫెసర్ జయశంకర్. చచ్చిపడిన శవాల్లో ఉద్యమ స్పూర్తిని రగిల్చి.. తెలంగాణ తల్లికి జవసత్వాలు తీసుకువచ్చిన మహా మనిషికి బాధాతప్త హృదయంతో జోహార్లు చెబుదాం. ఒక్క ప్రొఫెసర్ జయశంకర్ అస్తమించి ఉండవచ్చు కానీ తెలంగాణ బిడ్డల గుండెలోతుల్లో మాత్రం నిత్యం జయశంకర్ ఉదయిస్తూనే ఉంటాడు.
జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ జోహార్ జోహార్ జై తెలంగాణ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more