TSRTC | AP | ap students | travel | passes, RTC

Telangana state road transport corporation didnt allow the ap students

TSRTC, AP, ap students, travel, passes, RTC

Telangana state road transport corporation didnt allow the ap students. In Khammam TSRTC employees didnt allow the ap students to travel free.

ఏపి విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ నో ఎంట్రీ

Posted: 06/25/2015 11:00 AM IST
Telangana state road transport corporation didnt allow the ap students

తెలుగు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి దాపురించింది. రెండు రాష్ట్రాలు వీలు దొరికితే చాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. అసలే సెక్షన్ 8 సెగలు రెండు రాష్ట్రాల్లో మంటలు రేపుతుంటే తాజాగా మరో వివాదం రెండు రాష్ట్రాలకు హీట్ పెంచుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల సరిహద్దుల్లో మరో కొత్త వివాదం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా మధిర నుంచి వచ్చే బస్సుల్లో కొందరు ఆర్టీసీ సిబ్బంది ఏపీ విద్యార్థులను ఎక్కించుకునేందుకు నిరాకరించారు. దీంతో కృష్ణా జిల్లా నందిగామ రామిరెడ్డిపల్లె వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగి తెలంగాణ బస్సులను అడ్డుకున్నారు. ఖమ్మం జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులు కృష్ణా జిల్లా నందిగామ, జగ్గయ్యపేట మీదుగా అలాగే నందిగామ, జగ్గయ్యపేట నుంచి ఖమ్మం జిల్లా మధిర, వైరాకు ఆర్టీసీ సర్వీసులు వెళ్తుంటాయి. ఖమ్మం జిల్లా మధిర నుంచి వచ్చే బస్సుల్లో కృష్ణా జిల్లా రామిరెడ్డిపల్లెలో 5 బస్సుల్లో దాదాపు 500 మంది విద్యార్థులు ఎక్కి అక్కడి ఇంజనీరింగ్‌ కాలేజీలకు వెళ్తుంటారు.
 
గతంలో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ రెండుగా విడిపోయిన నేపథ్యంలో నేటి నుంచి ఖమ్మం జిల్లాకు చెందిన బస్సుల్లో ఆంధ్రా విద్యార్థులను ఎక్కించేది లేదని, బస్‌పాసులు చెల్లవంటూ ఆర్టీసీ అధికారులు తిరస్కరించారు. దీంతో విద్యార్థిని, విద్యార్థులు రామిరెడ్డిపల్లితో పాటు, నందిగామ మండలానికి వచ్చే గ్రామాల్లో ఆర్టీసీ బస్సులను అడ్డుకుని నిలదీశారు. ఏపీ నుంచి తెలంగాణ వైపు వెళ్లే బస్సుల్లో విద్యార్థులను ఎక్కించుకున్నప్పుడు, తెలంగాణ నుంచి ఏపీ వైపు వెళ్లే బస్సుల్లో ఎక్కించుకోవాల్సిందే అంటూ విద్యార్థులు డిమాండ్‌ చేశారు. రెండు వైపులా పాసులు నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని వారు పట్టుబట్టారు. విద్యార్థులతో పాటు వారివారి తల్లిదండ్రులు రోడ్లపైకి చేరుకోవడంతో వివాదం పతాకస్థాయికి చేరుకుంది. దీంతో ఏపీఆర్టీసీ అధికారులు టిఎస్‌ఆర్టీసీ అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSRTC  AP  ap students  travel  passes  RTC  

Other Articles