Yugadi is the new year s day for the people of the deccan region of india

ugadi, yugadi, telugu fesitivel, Chaitra, hinduism, new year, pachadi

Yugadi is the New Year's Day for the people of the Deccan region of India. The name Yugadi or Ugadi is derived from the Sanskrit words yuga (age) and ādi (beginning): the beginning of a new age". It falls on a different day every year because the Hindu calendar is a lunisolar calendar. The Saka calendar begins with the month of Chaitra (March–April) and Ugadi marks the first day of the new year.

ప్రకృతి పరవశించే పండగ 'ఉగాది'

Posted: 03/20/2015 05:29 PM IST
Yugadi is the new year s day for the people of the deccan region of india

సాధారణంగా పండుగలు అనేవి కేవలం మనం జరుపుకునేవే కానీ ఒకేఒక్క పండగను మాత్రం ప్రకృతి కూడా జరుపుకుంటుంది అదే ఉగాది. తెలుగు వారి తొలి పండగ, ఉగాది. ఒక్క తెలుగు వారు అనే కాదు దేశంలో చాలా ప్రాంతాల్లో జరిగే అద్భత పండగ ఉగాది.

చిగురాకుల చిరు తోరణాలు, చిరుమావిళ్ళ నిండు కావడులు
చీనాంబారాల అలంకరణల శోభిల్లుతున్న సిరుల ప్రసాదించు సురులు

చిలకపచ్చ పావడాల పడచులు, చిందులతొ హోరెత్తించు చిన్నారులు
చిగురులు తొడిగి పచ్చదనాన పరవసించి మురిపించు ప్రకృతి సొగసులు...ఇదంతా ఉగాది నాడు జరిగే ప్రకృతి పులకింతలను ఓ కవితలో జోడించిన ఓ కవి భావాలు. నిజంగా ఉగాది పండుగ గురించి ఎంత చెప్పుకున్నా తక్కవే ప్రకృతి పరవశించి జరుపుకునే అసలైన పండగ. మానిషి కూడా ప్రకృతిలో బాగమే కాబట్టి మనం కూడా ఉగాది పండుగను ఎంతో ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అంతకు ముందు ఉగాది గురించి కాసింత తెలుసుకుందాం.

ఉగస్య: ఆది ఉగాది: -"ఉగ" అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి 'ఆది' 'ఉగాది' అంటే సృష్టి ఆరంభమైన దినమే "ఉగాది".
తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ: - చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది'గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.

వేదాలను హరించిన సోమకుని వధించి మత్య్సావతారంలోని  విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పప్పగించిన సందర్భాన్ని విష్ణువు ఎంతో ప్రీతిపాత్రంగా చేసుకున్న సంబరాన్నే'ఉగాది' అని వ్యవహరిస్తున్నారు.  చైత్రశుక్లపాడ్యమినాడు ఈ విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడని, కనుక సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది జరుపబడుచున్నదని కూడా చెబుతుంటారు.
ఉగాది రోజు తైలాభ్యంగనం (నువ్వు నూనెతో స్నానం)  నూతన సంవత్సరాది స్తోత్రం ( సూర్యుడికి, దేవుళ్ళను పూజించడం), నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి తాగడం), కలశ స్థాపన, పంచాంగ శ్రవణం అని మొత్తం ఐదు రకాల కార్యక్రమాలు చెయ్యాలని శాస్ర్తం చెబుతోంది.

కొత్త ఏడాదికి స్వాగతం చెప్పాలంటే శుచి, శుభ్రత, చిత్తశుద్ధి, భక్తి అవసరం. బ్రాహ్మీ ముహుర్తంలో అంటే తెల్లవారుజామున 4.30 నుంచి 5.30 గంటల మధ్య నువ్వులనూనె శరీరానికి మర్దనం చేసుకుని కుంకుడురసంతో తలంటి పోసుకోవాలి. కొత్తబట్టలు కట్టుకోవాలి. అంతకుముందే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ముగ్గులు పెట్టుకోవాలి. మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి. ఇష్టదేవతారాధన చేయాలి. ఈ పండుగకు అదే విశేషం. ఫలానా దేవుడ్ని పూజించాలన్న నిబంధనలేం లేవు. ఎవరికి నమ్మకం ఉన్న దేవుడ్ని ఇవాళ ఆరాధించవచ్చు. కాలగమనానికి సంబంధించిన పండుగ కనుక, మనం చాంద్రమానాన్ని అనుసరిస్తున్నాం కనుక ఉగాది సాయంత్రం చంద్రుడికి నమస్కరించడం సత్సంప్రదాయం. ఇష్టమైన స్తోత్రాలను చదవాలి.

విజయానికి సూచికగా తెల్లనివస్త్రంపై ఓంకారం రాసి ఇంటిపై జెండా ఎగురవేయాలి. కొన్నిదశాబ్దాలక్రితం వరకూ తెలుగునాట ఈ సంప్రదాయం ఉండేది. కాలక్రమేణా ఇది తగ్గిపోయింది. జెండా ఎగురవేయడం విజయానికి సూచికగా భావిస్తారు. ఆ తరువాత ఉగాది పచ్చడి చేసుకుని ఇష్టదైవానికి ఆరగింపు పెట్టి పరగడపున తినాలి. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రతిఒక్కరు ఉగాది పచ్చడిని తయారుచేసుకుంటారు. ఇది షడ్రుచులైన తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు వంటి పదార్థాల సమ్మేళనంతో తయారుచేస్తారు. ఈ ఉగాది పచ్చడిని ప్రత్యేకంగా ఉగాది పండుగరోజే తయారచేసుకుంటారు.

ఉగాదిరోజు నుండి సంవత్సరం మొత్తం జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను, మంచిచెడులను స్వీకరించాలనే సందేశంతోనే పచ్చడిని తయారుచేస్తారు. అరటిపళ్లు, మామిడికాయలు, వేప పువ్వు, చెరకు, చింతపండు, జామకాయలు, బెల్లం వంటి పదార్థాలతో ఈ పచ్చడిని తయారుచేస్తారు. హిందూ శాస్త్రాలప్రకారం ఈ ఉగాది పచ్చడిని ‘‘నింబ కుసుమ భక్షణం’’, ‘‘అశోక కళికా ప్రాశనం’’ అనే పేర్లతో వ్యవహరిస్తారు. ఋతువుల మధ్య మార్పిడుల వల్ల వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను నివారించే ఔషదంగా ఉగాది పచ్చని ప్రాచీనకాలం నుండే ఆరంభమైన ఆచారమని అంటారు.

శాస్త్రీయపరంగా చెప్పుకోవాలంటే.. ఉగాది పర్వదినం మొదలయ్యే రోజు నుండి అంటే చైత్రమాసంలో భూమి, సూర్యుడికి చాలా దగ్గరగా వెళతాడు. ఆ సమయంలో సూర్యుని నుండి వెలువడే వేడితాపం వల్ల మన శరీరానికి, ఆరోగ్యానికి హాని కలిగించేవిగా వుంటాయి. ఈ వేడిని నివారించడానికి పచ్చడిలో వుండే బెల్లం, వేపపూత ఎంతో తోడ్పడుతాయని అంటారు.
ఉగాది పచ్చడిలో వుండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావాన్ని చూపుతుంది. అదెలా అంటే..
బెల్లం (తీపి)... ఆనందానికి సంకేతంగా వుంటుంది.
ఉప్పు... జీవితంలో ఉత్సాహం పెంచడానికి, రుచికి సంకేతంగా వుంటుంది.
వేప పువ్వు (చేదు)... బాధకలిగించే అనుభవాలు కలిగి వుంటాయి.
పచ్చిమామిడి ముక్కలు, చింతపండు (పులుపు)... జీవితంలో నేర్పుగా, సహనంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు, కొత్త సవాళ్లను ఎదుర్కునే అనుభవాలు ఇందులో వుంటాయి.
మిరపపొడి (కారం)... సహనం కోల్పోయేలా చేసే పరిస్థితులు.
ఈ విధంగా ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావాన్ని చూపుతాయి.

నిత్య వ్యవహారాల కోసం ఈనాడు అందరూ ఇంగ్లీషు క్యాలెండర్ అయిన "గ్రిగేరియన్‌ క్యాలెండరు"ను ఉపయోగిస్తూ వున్నా...శుభకార్యాలు, పూజా పునస్కారాలు, పితృదేవతారాధన, వంటి విషయాలకు వచ్చేటప్పటికి "పంచాంగము" ను ఉపయోగించడం మన పంచాంగ విశిష్టతకు నిదర్శనం. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా 'పంచాంగ శ్రవణం' ఉగాధి విధుల్లో ఒకటి. ఈనాడు గ్రామాలు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాము. కాగా ప్రస్తుతం పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇలా పూర్వం లభించేవికాదు. తాటాకుల మీద వ్రాయబడేవి కనుక పండితులవద్ద మాత్రమే ఉండేవి. కనుక వారు ఉగాదినాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేస్తారు. ఇలా తెలుగు వారు ఉగాదిని ఎంతో వైభవోపేతంగా జరుపుకుంటారు. అయితే ఒక్క తెలుగు వారు మాత్రమే కాదు చాలా రాష్ట్రాల్లో ఉగాదిని వివిధ పేర్లతో జరుపుకుంటారు.
గుడి పడ్వా - మరాఠీ, పుత్తాండు - తమిళులు, విషు - మళయాళీల, వైశాఖీ - సిక్కులు, పొయ్‌లా బైశాఖ్ - బెంగాలీయులు , కర్ణాటకలో ఉగాదిని తమతమ సంప్రదాయాలకు తగ్గట్టుగా చేసుకుంటారు.

షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి నవరసాల మిశ్రమం ఈ తెలుగు సంవత్సరాది షడ్రుచులలోని తీపి, పవ రసాలలోని సంతోషం మీకు కలగాలని, ఈ తెలుగు సంవత్సరం మీ జీవితాల్లో సంతోష, సిరి సంపదలను తీసుకురావాలని మనసారా కోరుకుంటూ.. శ్రీ మన్మధనామ సంవత్సర శుభాకాంక్షలు..


- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ugadi  yugadi  telugu fesitivel  Chaitra  hinduism  new year  pachadi  

Other Articles