Bjp and shivasena to part ways to contest elections individually

Narendra Modi, Amit shah, Maharashtra polls, BJP, Shiv Sena, maharashtra assembly elections 2014

bjp, shivasena to part ways, to contest elections individually

తెగదెంపుల దిశగా పాతికేళ్ల మైత్రి..

Posted: 09/22/2014 10:36 AM IST
Bjp and shivasena to part ways to contest elections individually

వచ్చే నెల 15న  జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపి, శివసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం జటిలం అవుతోంది. గత పాతికేళ్లుగా ఈ రెండు పార్టీల మధ్య వున్నస్నేహబంధం ఇప్పడు తెగదెంపులు దిశగా పయనిస్తుంది.  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో శివసేనకు సమానంగా స్థానాలను ఇవ్వాలని బీజేపి బెట్టు చేస్తుండడంతో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి రావడం లేదు. రానున్న ఎన్నికలలో తమ సత్తాను ఒంటరిగానే చాటుతామని ఇరు పార్టీలు తెగేసి చెబుతున్నాయి.  ఈ ఎన్నికల్లో మిత్రపక్షం బీజేపీకి 119 స్థానాలకు మించి ఇచ్చే ప్రసక్తే లేదని శివసేన తేల్చిచెప్పింది. సీట్ల పంపకంపై ఇరుపక్షాల మధ్య గతకొంతకాలంగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు ఈ మేరకు ఫైనల్ ఆఫర్ ఇచ్చింది. ఇంతకంటే దిగొచ్చేది లేదని తెగేసి చెప్పింది.

2002 నాటి గుజరాత్ అల్లర్ల సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీకి దివంగత శివసేన అధ్యక్షుడు బాల్‌ఠాక్రే అండగా నిలిచారని, ఇందుకు మోడీ కృతజ్ఞత చూపాలని ఉద్దవ్ ఠీక్రే అన్నారు. మహాకూటమి విచ్ఛిన్నం కాకుండా ఉండేందుకు తాను చివరి ప్రయత్నం చేశానన్నారు. శివసేన మొదట్లో 160 స్థానాలను కోరిందని.. కానీ ఇప్పుడు తొమ్మిది స్థానాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు. శివసేన 151 స్థానాలు, బీజేపీ 119 స్థానాలు. మిగిలిన 18 సీట్లు మిత్రపక్షాలకు కేటాయిస్తామన్నారు.

దీనిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫాదాన్విస్.. శివసేన 140 స్థానాల్లో, బీజేపీ 130 స్థానాల్లో పోటీ చేయాలని సూచించారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే అల్టిమేటంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. శివసేన నిర్ణయంలో పెద్ద మార్పేమీ లేదని, ఇది తమకు సమ్మతం కాదని స్పష్టం చేశారు. బీజేపీ మొదటినుంచి 135 స్థానాలు కావాలని పట్టుబట్టుతున్న విషయాన్ని ఆయన గుర్త చేశారు. శివసేనతో పొత్తు కొనసాగించడానికి సిద్ధమేనని పేర్కొన్నారు. బీజేపీ పక్ష నేతలు ఏక్‌నాథ్ ఖడ్సే, వినోద్ త్వాడే సీట్ల పంపిణీ విషయాన్ని పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలిగానీ, మీడియా ద్వారా కాదంటూ పరోక్షంగా ఠాక్రేకు చురకలంటించారు. శివసేన-బీజేపీ సీట్ల పంపకం తేలకపోవడంతో ఆ కూటమిలో భాగంగా ఉన్న చిన్న పార్టీ లు తమ దారి తాము చూసుకోవాలని భావిస్తున్నాయి. మహాకూటమి సీట్ల పంపిణీ అంశాన్ని తేల్చకపోతే కూటమి నుంచి తప్పుకొంటామని రాష్ట్రీయ సమాజ్ పార్టీ (ఆర్‌ఎస్పీ) హెచ్చరించింది.

శివసేనను ఎలా ఒప్పిద్దాం!:

సీట్ల పంపకం విషయంలో మిత్రపక్షం శివసేనతో తలెత్తిన ప్రతిష్ఠంభనను తొలగించే విషయమై బీజేపీ అగ్రనాయకత్వం మేధోమథనం ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాతోపాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో సీట్ల పంపకంపై శివసేనను ఎలా ఒప్పించాలనే విషయంపై చర్చించారు. చెరో 135 సీట్లలో పోటీచేసేందుకు శివసేనను ఒప్పించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తున్నది. మొత్తానికి పాతికేళ్ల స్నేహ బంధాన్ని ఇరు పార్టీలు కొనసాగించాలని వున్నా.. సీట్ల సర్థుబాటు వ్యవహారం మొత్తానికే మోసం చేసేట్టుగా వుంది. మరి ఇరువురు మిత్రులు కలిసే ఎన్నికలకు వెళ్లారో..? లేక ఒంటరిపోరుకే మొగ్గు చూపుతారో వేచి చూడాలి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles