Purandeswari willing to join in tdp

daggubati, daggubati purajdeswari, purandeswari daugter, daggubati venkateswar rao, daggubati suresh, latest news, ntr, tdp, telugu desham party, chandrababu naidu, chowdary caste, chaudary leaders, kamma caste, andhrapradesh, bjp, ysr congress

daggubati purandeswari and her husband venkateshwar rao express positve response to join tdp : in a nri meeting political leaders daggubati couple says they may join in tdp if right time comes in future

టీడీపీకి వస్తానంటున్న చిన్నమ్మ !!

Posted: 09/15/2014 10:50 AM IST
Purandeswari willing to join in tdp

దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర రావు.. దంపతులిద్దరూ రాజకీయ నేతలుగా అందరికీ సుపరిచితులు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న పురంధేశ్వరి.., సైకిల్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై స్వయంగా మాజి కేంద్రమంత్రే సంకేతమిచ్చారు. ఓ ప్రవాసాంధ్రుల సభలో ఈ మేరకు ప్రకటన చేశారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వత మిత్రులు లేరు.., ఎవరూ శాశ్వత శత్రువులు కారు అన్నట్లుగా నిత్యం విమర్శించే చంద్రబాబు దండులోచేరేందుకు సంసిద్దత వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ బాబును చూసి కాకపోయినా.. తన తండ్రి స్థాపించిన పార్టీ కాబట్టి పుట్టినింటికి ఎప్పుడైనా వచ్చే హక్కు ఉందని చెప్తోంది చిన్నమ్మ.

చక్రం తిప్పిన చంద్రన్న

దగ్గుబాటి పురంధేశ్వరి భర్త వెంకటేశ్వర రావు వెనకాల కాంగ్రెస్ లో చేరింది. హస్తం పార్టీ బాగానే చూసుకుంది. ఎంపి సీటుతో పాటు కేంద్రమంత్రి పదవిని ఇచ్చి అన్న గారి కూతురిని గౌరవించింది. అయతే విభజన ఉద్యమ సెగకు అందరు నేతల మాదిరిగానే వీరు కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత చిన్నమ్మ కమలదళ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి పదవి నుంచి వచ్చింది కాబట్టి.., బాగానే చూసుకుంటారు అనుకుంటే.. ఈ సారి బాబు రాజకీయాలు దెబ్బకొట్టాయి. బీజేపి-టీడీపీ పొత్తు పెట్టుకోవటంతో., స్థానాల పంపిణి జరిగింది. సిట్టింగ్ సీటు ముందునుంచి బీజేపీలో ఉన్న హరిబాబుకు ఇచ్చి., కడప జిల్లా రాజంపేట ఎంపీ టికెట్ కేటాయించారు.

ఇందులో కూడా చంద్రబాబు చక్రం తిప్పారు. పురంధేశ్వరికి కోస్తాలో ఎక్కడా టికెట్ రాకుండా చేసి.., అంతగా గుర్తింపులేని సీమకు పంపేలా పావులు కదిపారు. అలా రాజంపేటకు వెళ్లి.., అక్కడ వైసీపీ నేత చేతిలో ఓడిపోయి ఇంటికెళ్లిపోయింది. ఆదరిస్తారనుకున్న జనతా నేతలు మొండిచేయి చూపటంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఇటీవల పార్టీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ కు వచ్చినప్పుడు కూడా తమకే సంబంధం లేనట్లుగా వ్యవహరించారు. ఇక కార్యక్రమాలు, సమావేశాలు అంటారా., అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఏదో ఓ కారణం చెప్పి గైర్హాజరవుతూ వస్తున్నారు.

అటు బీజేపి కూడా వీరిని ఇప్పుడు అంతగా పట్టించుకోవటం లేదని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. స్పష్టమైన మెజార్టీ రావటంతో అధికారంలో ఉన్న పార్టీ.., దగ్గుబాటిని ఆదరించాలని భావిస్తే రాజ్యసభ టికెట్ ఇచ్చి కేంద్రమంత్రిని చేయాలి. లేదా మంచి నామినేటెడ్ పోస్ట్ ఒకటి కట్టబెట్టాలి. అయితే మోడిని చూస్తే బీజేపిని నమ్ముకున్న నేతలకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీ కోసం ముందునుంచి పనిచేసినవాళ్ళకే పదవులు ఇస్తున్నారు. ఈ తరణంలో అన్నగారి ఆడపడుచు గురించి ఆలోచిస్తే పార్టీలో అసంతృప్తులు బయటకు వచ్చే అవకాశముంది. దీంతో కమలదళం వీరివైపు కూడా ఆలోచించటం లేదని విన్పిస్తోంది.

అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అటు కేంద్రంలో కూడా టీడీపితో సన్నిహితంగా ఉండే బీజేపి ప్రభుత్వం ఉంది. అయినా సరే చిన్నమ్మకు మాత్రం మంచి రోజులు రాలేదు. దీంతో పార్టీలో ఉంటే ఇక బాగుండదు అనుకుందో లేక.., వెళ్ళిపోతానని నోటిసు ఇచ్చినట్లుగా ప్రకటన చేసిందో తెలియదు కానీ.., అన్నగారు స్థాపించిన పార్టీలోకి వెళ్లే అవకాశం వస్తే వెళ్తానని చెప్పింది. అయితే ఎప్పుడు అనేది పరిస్థితులే నిర్ణయిస్తాయని తత్వం భోధించింది. పురంధేశ్వరి ఈ నిర్ణయం తీసుకోవటం వెనక వ్యూహాన్ని రాజకీయ విశ్లేషకులు ఇలా అంచనా వేస్తున్నారు. తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్తామంటే ఆ పార్టీ ఊసే ఏపీలో లేదు. అలాగని ప్రతిపక్షంలో ఉన్న వైసీపికి వీరిద్దరూ వెళ్ళలేరు. ఇక ఇప్పుడున్న బీజేపి తమకేమి చేయకపోవటంతో పార్టీపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న దంపతులు ప్రత్యామ్నయం కోసం ఆలోచించారు. మిగిలింది తెలుగుదేశం పార్టీయే.., ఇది అధికారంలో ఉండటంతో పాటు.., తన తండ్రి స్థాపించిన పార్టీ కావటంతో అక్కడకు వెళ్తే కాస్త గౌరవం ఉంటుందని పురంధేశ్వరి భావిస్తోంది. అటు తన తోడల్లుడు సహకారం అందిస్తాడని వెంకటేశ్వర రావు ఆశిస్తున్నాడు.

అయితే అన్నగారు పెట్టిన పార్టీ నుంచి ఆయన కుమారుడు హరికృష్ణనే ప్రస్తుతం చంద్రబాబు పక్కన పెట్టేశారు. అటు ఒకప్పుడు టీడీపీలో ఉన్న వెంకటేశ్వరరావు పార్టీ నుంచి వెళ్లిపోయేలా నానాతిప్పలు పెట్టారని రాజకీయ వర్గాలు అనుకుంటాయి. దీనికి ప్రతిగానే బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరిన దగ్గుబాటి.., బాబుకు వ్యతిరేకంగా విమర్శలు చేయటంతో పాటు పుస్తకాలు కూడా విడుదల చేశారు. అలాంటి చంద్రబాబు తిరిగి చిన్నమ్మ కుటుంబానికి అన్నగారింట్లో చోటిస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పురంధేశ్వరికి ఉన్న మంచిపేరు వల్ల ఆమె పార్టీలో చేరితే పెద్ద పదవే ఇవ్వాల్సి ఉంటుంది. అటు పార్టీలోకి వచ్చాక ఏకు మేకయినట్లు చిన్నమ్మకు నేతలంతా చేరువై.., చంద్రదండుకు చెక్ పెట్టే స్థాయికి ఎదిగితే. ఇవన్నీ ఆలోచించటంలో ఆరితేరిన చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటాడొ చూడాలి మరి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : purandeswari  tdp  bjp  latest news  

Other Articles