మాతృభాష మీద మమకారం ఉండటం లో తప్పులేదు. కానీ నేనొక పార్టీకో, మీటింగ్ కో, నలుగురిలోకి పోయినప్పుడు నా మాతృభాషలోనే మాట్లాడుతాను అని గట్టిగా తీర్మానించుకుని తెలుగు భాషకే పరిమితమై మాట్లాడితే అది అన్నివేళలా మంచి చేస్తుందా? అక్కడున్న వాళ్ళకి తెలుగు రాకపోతే నష్టపోయేది నేనే కదా! నేను చెప్పదలచుకున్నది అందరికీ చేరాలంటే అందరికీ అర్థమయ్యే భాషలోనే మాట్లాడాలి. ప్రస్తుత కాలంలో రాష్ట్రాలే కాదు దేశాల ఎల్లలు కూడా చెరిపేస్తూ సోషల్ మీడియాలో భావప్రకటన చేస్తున్న సమయంలో నేను తెలుగులోనే రాస్తాను అంటే దాన్ని తెలుగువాళ్ళు మాత్రమే చదవగలుగుతారు.
హిందీ, ఇంగ్లీష్ వస్తే దేశమంతా తిరగొచ్చన్న మాటను మనదేశంలో అందరూ నమ్ముతారు. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో హిందీ, దక్షిణ భారతదేశంలో ఇంగ్లీష్ భాషలు భావ వ్యక్తీకరణకు బాగా పనికివస్తాయి కాబట్టి. అలాగే విదేశాలలో వ్యాపారాభివృద్ధి చెయ్యాలన్నా, విదేశాలలో చదువుకోవాలన్నా, విదేశాలలో మంచి ఉద్యోగం చెయ్యాలన్నాఇంగ్లీష్ తప్పనిసరని మనందరికీ తెలుసు.
ఈ మధ్య హిందీని దేశమంతటా అధికారభాషగా చెయ్యాలన్న భారతీయ జనతా పార్టీ నాయకుల తపన దక్షిణ ప్రాంతంలోనే కాదు యావద్భారతదేశంలో మానసిక ఆందోళనకు దారితీసింది. చిన్నప్పటి నుంచి హిందీ చదువుకున్నవాళ్ళకు అది కాస్త బాగానే అనిపిస్తుంది కానీ ఇతర ప్రాంతీయ దేశభాషలు మాతృభాషగా ఉన్నవాళ్ళకి అది కంఠం దిగదు. అందువలన దానికి వ్యతిరేకంగా మాట్లాడటమనేది జరుగుతుంది.
రాజకీయనాయకులు చేసేది ఒకటి చెప్పేది మరొకటి అని అందరికీ తెలిసిన విషయమే కానీ మోదీ ప్రభుత్వంలో పారదర్శకత ఎక్కువగా ఉంటుంది, ఆధునిక భావాలతో ముందుకు వెళ్తామన్న ఆశ దేశంలో అందరిలోనూ కలిగింది. అందువలన హిందీని అధికార భాషగా చెయ్యటానికి ఆ భాషను ఎక్కువగా ఉపయోగించమని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కార్యాలయం నుంచి సూచనలు అందినప్పుడు చాలా చోట్ల నిరాశకలిగింది, నిరసనలకు దారితీసింది. తెలంగాణా రాష్ట్రం కోసం తెలంగాణా బంద్ జరిగిన సమయంలో కూడా ఇతర విద్యార్థుల చదువులు పాడయ్యాయి కానీ నాయకుల పిల్లల చదువులు పోలేదు.
ఈ తప్పే చైనా కూడా చేసింది. ఇంగ్లీషులో కాకుండా 'మన చైనా భాషలోనే అన్ని వ్యవహారాలు చక్క దిద్దుకుందాం' అని అనుకుంది. దానితో వాళ్ళకి విదేశాలలో చుక్కెదురైంది. ఆ దేశీయులకు తక్కువ స్థాయి ఉద్యోగాలు లభించాయి. మనదేశస్తులకు విదేశాలలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు వచ్చాయంటే ఇంగ్లీషులో చదువుకోవటం వలనే!
పార్లమెంట్ లో చేసిన మొదటి ప్రసంగంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకి మహాత్మా గాంధీ, రామ్ మనోహర్ లోహియా, దీన్ దయాల్ ఉపాధ్యాయలను ఆదర్శమని, వాళ్ళ స్పూర్తితో పనిచేస్తానని అన్నారు. వాళ్ళంతా విదేశాలలో చదువుకున్నవారే. అంతేకాదు ఇప్పుడు హిందీ ఉపయోగం గురించి గట్టిగా వాదించేవారి పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం చదువులు చదివేవారే. అంటే నష్టపోయేది వాళ్ళపిల్లలు మాత్రం కాదు!
అధికారికంగా హిందీని రుద్దినా ఎక్కువగా నష్టపోయేవారు పేద విద్యార్థులే! ఎందుకంటే ప్రభుత్వ విద్యాలయాల్లోనే ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తారు, ప్రభుత్వ విద్యాలయాల్లోనే పేద విద్యార్థులు చదువుకుంటారు!
నిరసనలు రాగానే వెంటనే మోదీ ప్రభుత్వం అందుకు సంజాయిషీ కూడా ఇచ్చుకుంది. హిందీని బలవంతంగా ఏమీ రుద్దటం లేదని కేవలం సోషల్ మీడియా అలాంటివాటిలో హిందీని ఉపయోగించటం ప్రారంభించమని చెప్పామని చెప్పటం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి వెలువడే అటువంటి సూచనల ప్రభావం ఎలా ఉంటుందో ఊహించుకోవటం కష్టం కాదు.
మనదేశం, మనభాష అనే ప్రేమాభిమానాలు ఉండదగ్గవే. కానీ పరభాషలను నిందించటం, ఏవగించటం, ద్వేషించటం సరైనది కాదు. అలాంటిది ప్రపంచంలోని అగ్రదేశాలలో చెలామణీ అయ్యే ఇంగ్లీషుని ద్వేషించటం వలన నష్టం కలిగేది మనకేనని తెలుసుకోవాలి. కేవలం మాతృభాష మీద ప్రేమ కడుపునింపదని అర్థం చేసుకోవాలి.
అయితే ఇదంతా అర్థం కాకకూడా కాదన్నది మరీ వేదన కలిగిస్తుంది. మనకో నీతి ఇతరులకో నీతి అన్నది రాజనీతైతే ఇలాగే ఉంటుంది. అధికార భాషగా హిందీని ప్రవేశపెట్టమని చెప్పి తమ కుటుంబాలలోని విద్యార్థులను మాత్రం ఇంగ్లీష్ మీడియం విద్యాలయాల్లోను, విదేశాలలో చదువులకు పంపటం జరుగుతుంది.
స్వాతంత్ర యోధులంతా ఇంగ్లీషు బాగా నేర్చుకున్నవారే. విదేశాలలో చదువుకున్నవారు కొందరైతే జైళ్ళల్లో ఉన్నప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇంగ్లీషు మీద పట్టు సాధించినవారు మరికొందరు. వాళ్ళంతా ఇంగ్లీషు ఎందుకు నేర్చుకున్నట్లు? ఇంగ్లీషువాళ్ళతో మాట్లాడటానికి, వాదించటానికి, మా దేశాన్ని మాకివ్వండని నచ్చచెప్పటానికి, అవసరమైతే బెదిరించటానికి! అంతేకాదు, ఇంగ్లీషు వస్తేనే దేశం తరఫున విదేశ వ్యవహారాలను బాగా చక్కదిద్దవచ్చన్నది కూడా వాళ్ళు బాగా గ్రహించారాసమయంలోనే. అంతేకానీ, మాతృదేశాన్ని దాస్య శృంఖలాలలోంచి విడిపించటానికి కేవలం మాతృభాషలోనే మాట్లాడుతాను అంటే అప్పుడు అది ఫలితాలనిచ్చుండేది కాదు!
హిందీనీ కాపాడుకోవాలి, వ్యవహార శైలికి ఉపయోగపడేట్టుగా ఇంగ్లీషు లోనూ ప్రావీణ్యం సంపాదించుకోవాలి. అంతేకానీ 1999 లో ఎల్ కె అద్వానీ ఉప ప్రధానమంత్రిగానూ కేంద్ర మంత్రిగాను పనిచేస్తున్న సమయాల్లో చేసినట్లుగా ఇంగ్లీష్ భాష మీద, ఇంగ్లీషు ఉపయోగించేవాళ్ళు, బోధించేవాళ్ళ మీద ద్వేషాన్ని పెంచి ఫలితంగా మిషనరీ స్కూల్స్ మీద దాడులకు పురికొల్పినట్లుగా కాదు.
అంతర్జాతీయ వ్యవహారాలు, వ్యాపారాల విషయంలోనే కాక కంప్యూటర్ యుగంలో ఇంగ్లీషు లేకుండా జీవనం సాగించదలచుకుంటే అది అటూ ఇటూ కాకుండా పోతుంది. తెలుగులో మాట్లాడినా కంప్యూటర్ ని ఉపయోగించేటప్పుడు, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ డెవలప్ చేసేటప్పుడు ఇంగ్లీషే పనికివస్తుంది.
హిందీ మాట్లాడినా, తెలుగు మాట్లాడినా, మరే ఇతర దేశ భాషలు మాట్లాడినా ఎక్కువ మంది ఎక్కువగా ఇంగ్లీషు పదాలను ఉపయోగించటమే జరుగుతోంది. కొన్నిటికి దేశభాషలో పదాలు లేవు. కొత్తగా కనిపెట్టినా వాటిని వాడటంలో ఇబ్బంది కలుగుతుంది.
అన్నిటికన్నా ముఖ్యంగా 'మన దేశ భాష హిందీ అని, హిందువులు మాట్లాడే భాష హిందీ' అని అనే వాదనలో లోపముంది. అదేమిటంటే స్వాతంత్రం రాకముందు భారతదేశమనేది లేదు, ఒకే భాషా లేదు! చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న భరతఖండంలో ఆ రాజ్యాలు కూడా ఎప్పుడూ నిర్దిష్టమైన సరిహద్దులతో ఉండేవి కావు. యుద్దాల వలన ఎల్లలు మారిపోతుండేవి. పైగా ఒక్కో ప్రదేశంలో ఒక్కో భాష మాట్లాడేవారు. ఉత్తర భారత దేశంలో కూడా గుజరాతీ, మరాఠీ, పంజాబీ, రాజస్తానీ లాంటి భాషలు విడిగానే ఉన్నాయి కదా.
అందువలన, హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చెయ్యటం దేశానికి ఎంతమాత్రం లాభాన్నీ చేకూర్చదు. భాష ఉన్నది భావ ప్రకటనకు. అందులో మన భాష, పర భాష అనుకునేబదులు ఏ భాష ఎక్కువ ప్రచారంలో ఉందో చూస్తే మనదేశంలో కూడా ఇంగ్లీషే ఎక్కువ ప్రచారంలో ఉందన్నది నిర్వివాదం. మనదేశం, మనభాష అన్నది రాజకీయంగా కూడా అందరూ హర్షించేది కాదు, ఎటువంటి ప్రయోజనాన్నీ కలిగించేది కాదు కాబట్టి అటువంటి ప్రయత్నం చేసే బదులు దేశ ప్రయోజనంలో వేరే ఇతర అభివృద్థి కార్యక్రమాలు చేపట్టటం మంచిదేమో!
మన మాతృభాషలను కాపాడుకుందామని అనుకోవటానికి మరో కారణం మనకు ఆ భాష మీద ఎక్కువ పట్టు ఉండటం. మనం చెప్పదలచుకున్న దాన్ని మాతృభాషలో చాలా చక్కగా చెప్పవచ్చు. పైగా ప్రతి భాషకీ దానికుండే అందం దానికుంటుంది కాబట్టి ఏ భాషనూ తీసిపారెయ్యటానికి లేదు. కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చెయ్యాలని పిలుపునిచ్చారు బాగానేవుంది కానీ ఇంగ్లీషు భాషను దేశంలోంచి తరిమికొట్టాలనే ఉద్దేశ్యం మాత్రం పేదవాళ్ళ కడుపు కొడుతుంది.
ప్రపంచ పటంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్ళాలీ అంటే ఇంగ్లీషుకి సముచిత స్థానం ఇవ్వవలసిందే. అంతేకానీ, వినాయక్ దామోదర్ సావర్కర్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీలాంటి , దీన్ దయాల్ ఉపాధ్యాయ లాంటి వాళ్ళను కేవలం తలచుకుంటే చాలదు. వాళ్ళు కూడా ఇంగ్లీషు చదువులు చదువుకున్నవారేనని గమనించాలి!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more