Delayed monsoon in two new states

delayed monsoon in two new states, farmers trying to save the seeds already sowed, reservoirs dried in ap and telangana, discouraging situation to farmers of paddy and cotton

delayed monsoon in two new states

పంటను కాదు విత్తుని కాపాడుకునేందుకు పాట్లు

Posted: 06/26/2014 10:17 AM IST
Delayed monsoon in two new states

పంట చేతికి వచ్చేంతవరకు ఎన్ని తిప్పలు పడాలో తెలియదు కానీ, ఖరీఫ్ పంటకు ఆరంభంలోనే హంసపాదులా రైతుకి ముఖం చాటేస్తున్న వానలమ్మ అదనులో రాకుండా దోబూచులాడుతోంది.  దానితో విత్తనాలను కాపాడుకోవటానికి రైతులు అంతులేని యాతనలు పడుతున్నారు. మొలకలెత్తనివి ఎలాగూ పోయాయి.  కానీ మొలకలెత్తినవి కూడా నీళ్ళివ్వలేదని ముఖం మాడ్చుకుంటున్నాయి.

రైతులు బిందెలతో నీళ్ళు తెచ్చి పోస్తూ మొలకలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.  ఇరు రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి.  ఇప్పటికీ 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రత నమోదవుతోంది.  కొన్నిచోట్ల 44 డిగ్రీలకు చేరుకుంటున్న ఉష్ణోగ్రతలో, పొలాలలో వేసిన విత్తనాలు విలవిల్లాడుతూ ప్రాణాలు కాపాడుకోవటం కోసం కొట్టుకుంటున్నాయి.  

పశువులకు గ్రాసం కూడా సమకూర్చలేనివారు ఆ పశువులను అమ్ముకుంటున్నారు.  వారానికి నాలుగువేల పశువులు కబేళాలకు పోతున్నాయి.  విత్తనాలు ఎండిపోయిన చోట మరోసారి దున్నుతున్నారు.  తొలకరిని నమ్మి మూడు లక్షల ఎకరాలలో పత్తి విత్తనాలు వేసినవారు పరిస్థితి ఇలాగే ఉంటే 100 కోట్ల వరకు నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది.  

ఏం చెయ్యాలో తోచని రైతన్నలు వర్షాలకోసం పూజలు చేస్తున్నారు.  తెలంగాణాలో సాగు చెయ్యవలసిన వివిధ పంటలలో కేవలం సగమే పంటలకు నోచుకున్నాయి.  ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి మరీ దారుణమైపోయింది.  5 శాతం సాగు కూడా పూర్తికాలేదింకా.  జలాశయాలు ఎండిపోయాయి.  భూగర్భజలాలను వెలికి తీయాలంటే విద్యుత్ లేమి అడ్డుపడుతోంది.  

ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ యూనివర్శిటీ శాస్త్రవేత్త దండి రాజిరెడ్డి వ్యవసాయదారులకు ఈ విధంగా సూచనలిచ్చారు.

జూలై 10 వరకు పంటలు వేసుకునేందుకు సమయం ఉంది కాబట్టి రైతులు వర్షాలు పడలేదని ఆదుర్దా పడవద్దు.  పైపై చినుకులకు కంగారుపడి విత్తనాలను చల్లవద్దు.  భూమి పూర్తిగా తడిచి విత్తనాలు వెయ్యటానికి అనువుగా తయారైనప్పుడే విత్తనాలను వెయ్యాలి.  ఈ లోపులో ప్రత్యామ్నాయ పంటలకోసం కూడూ ఎన్జీరంగా యూనివర్శిటీ ఆలోచన చేస్తోంది.  వచ్చేవారం ఋతుపవనాలు బలపడవచ్చు.  ఎల్ నినో కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని భావించవద్దు.

వర్షాకాలం వచ్చి 20 రోజులైనా ఎండలు కాస్తూ రైతులను కలవరపెడుతున్నాయి.  ప్రస్తుతం ఇది రైతుల కలతే కానీ ఇది మరో కొద్ది రోజులు ఇలాగే సాగితే రాష్ట్రంలో అందరి మీదా దీని ప్రభావం పడుతుంది.  ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ఇప్పటికే వేసిన విత్తనాలను బ్రతికించటం కోసం రైతులు శాయశక్తులా కృషిచేస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles