Iraq in turmoil

Iraq in turmoil, Sunnis and Shias tussle, ISIS led Sunni militants, Sunnis approaching Baghdad

Iraq in turmoil, Sunnis and shias tussle,

రగలుతున్న ఇరాక్

Posted: 06/13/2014 01:14 PM IST
Iraq in turmoil

షియా సున్నీల మధ్య 1400 ఏళ్ళ నాటి పగ ఇంకా రగులుతూనే ఉంది.

మహమ్మద్ ప్రవక్త తర్వాత ఆ పీఠాన్ని అలంకరించే విషయంలో ముస్లింలలోని షియా సున్నీలు క్రీ.శ. 632 నుంచి దెబ్బలాడుకుంటూనేవున్నారు.  మహమ్మద్ ప్రవక్త దేహం చాలించిన తర్వాత అధిక సంఖ్యాకులైన సున్నీలు ఆయన ప్రవక్త స్థానంలో సున్నీలను కూర్చోబెట్టాలని చూసారు.  సున్నీ అన్న పదం అహల్ అల్ సున్నా- అంటే ఆచారాలను పాటించేవారు అన్న దానిలోంచి తీసుకోబడింది.  

తక్కువ సంఖ్యలో ఉన్న షియాలు మహమ్మద్ ప్రవక్త రక్త సంబంధీకుడిని ఆ స్థానంలో కూర్చోబెడదామని ఆశించారు.  దానితో ఇరు పక్షాల మధ్య కార్చిచ్చులా పగలు రగలుతూ వస్తున్నాయి.  నాల్గవ ఖాలిఫ్ గా మహమ్మద్ ప్రవక్త సోదరుని కుమారుడు, అల్లుడు అయిన అలి రావటంతో ఇరు వర్గాల మధ్య పోరాటం ఇంకా పెరిగిపోయింది.  ఖాలిఫ్ అనేది మతం రాజకీయాల మేలుకలయిక.  షియా అనే పదం షియాత్ అలి- అంటే అలి ని అనుసరించేవారని అర్థం.   

నియంతలు సద్దాం, గడ్డఫిలు అంతరించిపోవటంతో తూర్పు దేశాలలో షియా సున్నీల మధ్య మళ్ళీ రగులుతున్న పగలు సెగలు కక్కుతూ ఆయా దేశాల మధ్య అగాధాలు సృష్టిస్తున్నాయి.  సద్దాం హుస్సేన్, లిబ్యా లోని కల్నల్ గడ్డఫి, అధ్యక్షుడు అస్సద్ లు ఉక్కుపాదంతో సున్నీ షియాల మధ్య వర్గపోరాటాలు లేకుండా అణగదొక్కారు.   

ISIS-1

ఐఎస్ఐఎస్ కి చెందిన ఉగ్రవాదులు సున్నీలు.  కానీ ఇరాక్ లో ఎక్కువగా ఉన్నవారు షియాలు.  షియా సున్నీల మధ్య అంతరాలు బాగా పెరిగిపోయి ఇస్లామిక్ స్టేట్ అయిన ఇరాక్ లో చెలరేగుతున్న సున్నీ ఉగ్రవాదులు బాగ్దాద్ వైపు దాడులకు పూనుకుంటుంటే షియా వర్గానికి చెందిన ఇరాక్ ప్రధానమంత్రి నౌరి అల్ మలికి ఎమర్జెన్సీని ప్రకటించవలసిందిగా పార్లమెంటును కోరుకుంటున్నారు.  ప్రభుత్వాలను, సరిహద్దు రాజ్యాలను కూడా భయభ్రాంతులను చేస్తున్న ఈ సున్నీ షియాల మధ్య పోరాటం వలన కలిగిన పరిణామమేమిటంటే ఉగ్రవాద ఐఎస్ఐఎస్ సంస్థ దేశ సరిహద్దులతో నిమిత్తం లేకుండా ఉత్తర సిరియా ఇరాక్ లలో తనదైన స్వతంత్ర ప్రతిపత్తిని ఏర్పాటు చేసుకుంది.  అయితే అందుకు స్థానికంగా ఉన్న సున్నీల సహకారం వారికి లభించటంతో వారి పని సుగమమయింది.   ఉగ్రవాదులు సున్నీలున్న ప్రాంతాలలో దాడి చెయ్యటంతో షియా ప్రభుత్వాలు అక్కడి నుండి తరలిపోతాయిలే అని ఆనందపడుతున్నారు.  

ఇరాక్ దక్షిణ ప్రాంతంలో షియాలో అధిక సంఖ్యలో ఉన్నా, వాళ్ళు అక్కడ కబ్జా చేసారన్న ఉద్దేశ్యంతో వాళ్ళు వెనుదిరిగిపోతే వాళ్ళ వెన్ను చూడటం కోసం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఉత్సాహం చూపిస్తున్నారు.  నిజానికి అధిక సంఖ్యలో ఉన్నా షియాలు సున్నీల ఉగ్రవాదానికి భయపడుతున్నారు.   ఎందుకంటే సున్నీలు తమ మూఢ విశ్వాసానికి మద్దతు పలకని వారి పట్ల నిర్దాక్షిణ్యంగా నరికివేయటం, శిలువ వెయ్యటం లాంటి శిక్షలు వేస్తారు.  అల్ మాలికి ప్రభుత్వంలో తమని తక్కువజాతివారిగా పరిగణించే షియాల పట్ల సున్నీలకు కోపం ఎక్కువగానే ఉంది.

ఇది ఇలా ఉండగా, లోగడ సద్దాం హుస్సేన్ చేత అవమానింపబడి, నీచంగా చూడబడివున్న ఈశాన్య ఇరాక్ ప్రాంతంలోని కుర్దిష్ ప్రజలు ఉత్తర ఇరాక్ లో స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 2.5 లక్షల సైన్యం కలిగిన కుర్దిష్ లు ఈ మధ్యనే చమురు సంపద ఎక్కువగా కలిగివున్న కిర్కుక్ ని స్వాధీనం చేసుకున్నారు.  వాళ్ళు చాలా సులభంగా సున్నీ ఉగ్రవాదులను ఎదుర్కోగలరు కానీ వాళ్ళు ప్రస్తుతం వ్యాపార సంబంధంగా ఆదాయాల భట్వారాల విషయంలో ఇరాక్ ప్రధాని అల్ మలికి తో సంబంధాలు బాగోలేకుండా ఉన్నారు.  

మధ్యతూర్పు ప్రాంతంలోని ఇతర దేశాలు వీరి మధ్య పెరిగిపోతున్న తగవులతో ఎప్పుడేం అఘాయిత్యం జరుగుతుందో అని వణికిపోతున్నారు.  నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1.6 బిలియన్ ముస్లింలలో సున్నీలే అధిక సంఖ్యలో ఉన్నారు.  షియాలు కేవలం 10 నుంచి 15 శాతం వరకే- 200 మిలియన్ల వరకు ఉన్నారు.  ఈజిప్ట్, టర్కీ, బెహ్రైన్, సౌదీ అరేబియాలలో అధికారంలో ఉన్న సున్నీలు షియాలను తక్కువ స్థాయి నాగరికులుగా చూస్తున్నారు.  

షియాలు ఇరాన్, దక్షిణ ఇరాక్, లెబనాన్ దేశాలలో ఎక్కువగా ఉన్నారు.  సిరియాలో మైనారిటీలో ఉన్నా అక్కడ అధికారం లో ఉన్నారు. అక్కడ అధ్యక్షుడు బషార్ అస్సద్ రాజకీయ పార్టీ షియాకు చెందిన అలావైట్స్ పార్టీ.  టర్కీ నుంచి సౌదీ అరేబియా వరకు చిన్న చిన్న గల్ఫ్ దేశాలతో కలిపి షియాలు అధికారం చెలాయిస్తున్న అస్సద్ సైన్యాన్ని అంతమొందించటానికే చూస్తున్నారు.  

సున్నీ ఉగ్రవాదులు షియాలనే కాదు వీలయితే జూదులు, క్రిస్టియన్లు, జోర్డాన్ రాజు అబ్దుల్లా, సౌదీ అరేబియా రాజు అబ్దుల్లాలను కూడా హతమార్చటానికే చూస్తున్నారు.  అందుకే వాళ్ళంటే ఎక్కువ భయం గల గల్ఫ్ దేశాల రాజులు వాళ్ళకి చాటుగా సాయం చేస్తున్నారు.  దానితో వాళ్ళ నుండి ప్రమాదాన్ని తప్పించుకుని ప్రశాంతంగా జీవించవచ్చు, దానికి గాను వాళ్ళు జిహాదీలను విదేశాలకు పంపించటానికి ప్రోత్సహిస్తున్నారు.  

ఇవేమీ అర్థం కాని పాశ్చాత్య సైన్యాలు వారి పోరాటాలలో కలుగజేసుకుని, ప్రజలకు వాక్స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం నెలకొల్పటానికి చూసారు.  కానీ నియంతలుగా వ్యవహరించినవారే ముస్లింలలోని ఇరు వర్గాల మధ్య వైరం తలెత్తకుండా చూడగలిగారు.

సిరియాలో మూడు సంవత్సరాల సివిల్ వార్ తర్వాత సున్నీలతో సహా అక్కడందరూ ప్రశాంతతను కోరుకుంటున్నారు కానీ ఐఎస్ఐఎస్ నడిపే సున్నీ ఉగ్రావాదులు మాత్రం బాగ్దాద్ వైపు దాడికి వెళ్తున్నారు.  ఐఎస్ఐఎస్ విజయంతో జిహాదీలకు ప్రోత్సాహం లభిస్తుంది.  సిరియాలోని సివిల్ వార్ ఇరాక్ వైపుకి వ్యాపిస్తోంది.  

ISIS-2

ఇలా అన్నిరకాలుగా రగులుతున్న ఇరాక్ భవితవ్యమేమిటో కాలమే చెప్పాలి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles