Congress party winning chances

Congress winning chances in AP, Elections 2014 assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014

Congress party winning chances in AP state

రాష్ట్రంలో కాంగ్రెస్ విజయావకాశం ఎంత?

Posted: 05/06/2014 09:12 AM IST
Congress party winning chances

పరీక్షలైపోయాయి, ఎంత రాసామో రాసాము.  ఆ పైన ఇక మన చేతిలో ఏమీ లేదు.  పరీక్షా ఫలితాలకోసం ఎదురు చూడటం తప్ప చెయ్యగలిగింది మరేమీ లేదు.  ఎన్నికలు అయిపోయిన సందర్భంగా పరిస్థితి ఇదే అయినా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల మీద కాంగ్రెస్ పార్టీ మధనంలో పడ్డట్టుగా తెలుస్తోంది.  

నిన్న సీమాంధ్రలో కూడా ప్రచారాలు సమాప్తమవటంతో ఇక కాంగ్రెస్ పార్టీయే కానీ మరే పార్టీయైనా సరే వోటు వేసి మార్కులు వేసిన వోటర్లు, ఆపై వోట్ల లెక్కింపులో బయటకు వచ్చే గణాంకాలు, సాధించిన గ్రేడ్లు అన్నీ మే 16 కల్లా వెల్లడవుతాయి.  కానీ ఒకవేళ పాసవకపోతే అన్న దిగులు కాంగ్రెస్ పార్టీని పట్టుకుంది.  సీమాంధ్ర మీద ఆశ ఎలాగూ లేదు కానీ తెలంగాణా ఇచ్చిన కీర్తితో అత్తెసరు మార్కులైనా వచ్చేనా అన్నది కాంగ్రెస్ పార్టీ ముందున్న సమస్య.  ఒకవేళ రాకపోతే అన్నది కూడా ఆలోచిస్తే అందుకు సిద్ధంగా ఉండవచ్చని కాంగ్రెస్ పార్టీ ఆలోచన.  

తెలంగాణా కాంగ్రెస్ నాయకులు మాత్రం కాంగ్రెస్ తప్పక అధికారంలోకి వస్తుందనే ధీమాను అధిష్టానం ముందు వ్యక్తం చేస్తున్నారు.  అయితే తెలంగాణాలో బలమైన నాయకుడు విస్తృతంగా పర్యటిస్తే పరిస్థితి మరోలా ఉండేదని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.  జానారెడ్డి లాంటి నాయకులు పరిస్థితినంతా సమీకరిస్తూ సుడిగాలి పర్యటనలతో తెలంగాణాను చుట్టచుట్టినట్లయితే చాపచుట్టే పరిస్థితి రాకుండా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.  

కాంగ్రెస్ పార్టీ వలనే తెలంగాణా వచ్చినందువలన  ఆ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగే నాయకుడుంటే ఫలితాలు కచ్చితంగా ఏకపక్షంగా కాంగ్రెస్ పక్షాన ఉండివుండేదని కొందరు నాయకులు అసంతృప్తిని వెలిబుచ్చుతున్నారు.  అలా నాయకులు పర్యటించిన తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీల ర్యాలీలకు మరింత ఫలితం కనిపించేదంటున్నారు.  

తెలంగాణా రాష్ట్ర సమితిలో ప్రధాన నాయకుడు ఒక్కడే.  ఆయన చెప్పిందే వేదం.  అందువలన ఆ పార్టీ సులభంగా ప్రజల మనసుని దోచుకోగలిగిందని, అటువంటి నాయకత్వం కాని, సమిష్టి తత్వం కాని లేకపోవటంతో కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రశ్నార్థకంగానే ఉందని కొందరు నాయకులంటున్నారు.  

తెరాస కలుస్తానంటే కాంగ్రెస్ ద్వారాలు తెరిచే వున్నాయంటూ దిగ్విజయ్ సింగ్ పదే పదే చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ కి చెడు చేసాయని కొందరు భావిస్తున్నారు.  దానివలన కాంగ్రెస్ వేరు తెరాస వేరు అనే భావం పోయి ఎవరికేసినా ఒకటేనేమో అనే అభిప్రాయం కలగటానికి అవకాశం ఎక్కువగా ఉందని వారు ఆరోపిస్తున్నారు.  

కానీ అధిష్టానంతో మాట్లాడుతున్న పెద్దలు మాత్రం, ఫలితాలు రావటానికి ఇంకా సమయం ఉంది కదా ఇప్పటి నుంచే బాధ పడటమెందుకని అనుకుంటున్నారేమో తెలంగాణాలో కాంగ్రెస్ గెలుపును గురించి సప్తవర్ణ చిత్రాలలో విశదీకరిస్తున్నారు.  

ఏది ఏమైనా కచ్చితంగా కనిపించే లోపం నాయకత్వ లోపమే అని అనుభవజ్ఞులైన నాయకులు అంటున్నారు.  తెరాసలో ఒకే నాయకుడు కెసిఆర్.  తెదేపాకి ఒకే నాయకుడు చంద్రబాబు నాయుడు.  వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకే నాయకుడు వైయస్ జగన్.  కానీ కాంగ్రెస్ పరిస్థితి చూస్తే రాష్ట్రంలో ఏ నాయకుడూ సరైనవాడు లేకపోవటంతో కేంద్ర నాయకులే పర్యటిస్తూ రకరకాలుగా ప్రచారం చెయ్యటంతో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు బాగా తగ్గిపోయాయని తెలంగాణా కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles