Giving away gives immense happiness

Giving away gives immense happiness, donations, helping poor and needy, co existence in the world, sacrificing for others

Giving away gives immense happiness

ఇచ్చే గుణం అబ్బినప్పుడే మనిషి పెద్దయినట్లు భావించాలి

Posted: 01/27/2014 05:34 PM IST
Giving away gives immense happiness

మనిషి తనకు కావలసింది ఆశించటం, తీసుకోవటం అనేవి నేను అనే ప్రకృతి సిద్ధమైన లక్షణం.  తనను తాను పోషించుకోవటానికి రక్షించుకోవటానికి అది అవసరమే.  అయితే సంఘజీవైన మానవుడు ఇతరులతో కలిసి సహజీవనాన్ని సాగించటానికి ఇతరులకు ఇవ్వటం అనే లక్షణాన్ని కూడా పుణికిపుచ్చుకోవాలి. 

చిన్న పిల్లలు ఇది కావాలి, అది కావాలి, నాకు ఇంకా కావాలి, అన్న కంటే ఎక్కువ కావాలి, తమ్ముడి కంటే మేలైనది కావాలి అని అడుగుతుంటారు.  అది ఎదగని పిల్లల లక్షణం.  పెద్దల దగ్గర్నుంచి వాళ్ళు డిమాండ్ చేస్తుంటారు.  వాళ్ళు పొడుగ్గా ఎదగటం కానీ, తమ కాళ్ళ మీద తాము నిలబడటం కానీ గడ్డాలు మీసాలు లాంటి యుక్త వయసు లక్షణాలు రావటం కానీ వాళ్ళు పెద్దయినందుకు సంకేతాలు కావు.

ఎందుకంటే బాధ్యతగల పెద్దలు పిల్లలను ఇంకా ఏం కావాలి, మరికొంచెం పెడతా తీసుకో నాయనా అని వాళ్ళకి ఇచ్చే లక్షణాలు కలిగివుంటారు.  అదే పెద్దరికం అంటే.  అంటే, నాకు కావాలి అనే దాన్నుంచి నీకు ఇస్తాను అనే స్థాయికి వచ్చినప్పుడే నిజమైన ఎదుగుదల అనిపించుకుంటుంది మానవతా దృష్టిలో చూస్తే. 

ఈ లక్షణాన్ని పెంచటం కోసం త్యాగం అంటే ఏమిటి అన్నది రకరకాల కథల రూపంలో మనకు తెలియజేసారు మన పెద్దలు, అతిధి దేవో భవ అని, దేవుడు ఏ రూపంలోనైనా నీ ముందుకు రావొచ్చు అని, ఇతరులకు సాయం చేస్తే అది నీ ఖాతాలో పుణ్యం రూపంలో పడుతుంది, దాని ప్రయోజనం నీకు మరో రూపంలో నీ అవసరానికి అందుతుంది అని చెప్పేవారు. 

ఇది ఒక్క హిందూ మతంలోనే కాదు ఇస్లాం మత కథల్లోనూ, క్రిస్టియన్ కథల్లోనూ, బుద్ధ చరిత్రలోనూ ఇంకా ఎన్నో గ్రంథాలలోను మనకు కనిపిస్తాయి.  అనుకోకుండా వచ్చిన అతిథిని సంతృప్తిగా భోజనం పెట్టి పంపించిన కథలు కోకొల్లలుగా దొరుకుతాయి. 

మన దగ్గరున్నది పక్కవాళ్ళ అవసరంలో వాళ్ళకి అందుబాటులోకి తెచ్చినపుడు వాళ్ళకి కలిగిన సంతృప్తిని చూడటం మొదలుబెడితే అందులోంచి మనకు కలిగే ఆనందం అనిర్వచనీయమైనది.  అందులో వాళ్ళ మెప్పు పొందటానికి కాని, వాళ్ళు తిరిగి తమకు సాయం చెయ్యటానికి కాని, లేదా పుణ్యం లభించి ఎప్పుడో ఒకప్పుడు దేవుడు మనకు అంతకు ఎన్నో రెట్ల రూపంలో అందిస్తాడు అనే నమ్మకాలతో మొదలుపెట్టినా సరే అది కొన్నాళ్ళకి ఒక మంచి లక్షణంగా అలవడుతుంది. 

ఒక స్కూల్లో పేద విద్యార్థులకోసం స్కాలర్ షిప్ ఫండ్ ని తయారు చేసిన ఒక దాత మొదటిసారిగా అందులో కొందరు విద్యార్థులకు అందజేస్తున్నప్పుడు మాట్లాడమని కోరినప్పుడు ఆయన ఇలా అన్నారు-

తల్లిదండ్రులకు ఆ హోదా ఇచ్చేది పిల్లలే.  పిల్లలే లేకపోతే తల్లిదండ్రులే లేరు.  అదేవిధంగా గురువుకి ఆ హోదా ఇచ్చేది ఆయన శిష్యులే.  శిష్యులే లేకపోతే ఆ గురువు ఎవరికి గురువు.  అలాగే దానం చెయ్యటం గొప్ప కాదు.  అతన్ని దాతగా చేసి ఆయన దగ్గర స్వీకరించినవాళ్ళది గొప్ప.  వాళ్ళే ఆదరించకపోతే దాత దాత ఎలా అవుతాడు.  నాకు ఈ అవకాశం ఇచ్చి, నేను అందించే ఈ చిన్న బహుమానాన్ని పెద్ద హృదయంతో అందుకుంటున్న చిన్నారులకు నేను సదా కృతజ్ఞుడను.

ఇది ఆచరించి చూడండి.  నిజంగా ఎంతో ఆత్మ సంతృప్తినిస్తుంది.  కథల్లో చెప్పినట్టుగా తనను మించిన త్యాగం చెయ్యటం కానీ, తనవాళ్ళకు లేకుండా ఇతరులకు పెట్టమని కాదు చెప్పేది.  చెయ్యగలిగిన సాయం, అవసరానికి, ఆ సమయంలో చేసినదానికి విలువ ఎక్కువుంటుంది. 

ఒకాయన దానం విషయంలో ఇలా చెప్పారు-

ఇప్పటి వరకూ ఈ వస్తువు నాది.  దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవటం, శుభ్రంగా ఉంచటం నా పని.  ఇప్పుడు ఇది మీ వస్తువుగా చేసుకుని ఆ పనుల నుంచి నన్ను తప్పించినందుకు మీకు నేను ఎంతో ఋణపడివుంటాను.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles