కొణిదెల శివ శంకర వర ప్రసాద్ అంటే చాలా మందికి తెలియదు. కానీ చిరంజీవి అన్నా ముద్దుగా చిరు అన్నా తెలుగువారిలో తెలియని వారెవరూ ఉండరు. అంతేకాదు తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంతకాలం తెలుగునాట ఆయన చిరంజీవే. ఆయన సహధర్మచారిణి సురేఖ కూడా తెలుగువారికి పరోక్షంగా పరిచయమే. సుదీర్ఘమైన సినీ జీవితంలో ప్రేక్షకులను అలరించిన అల్లు రామలింగయ్య కూతురామె. వీరిరువురి కళ్యాణం ఫిబ్రవరి 20, 1980 లో జరిగింది.
ఈ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు- సుష్మిత, శ్రీజ, ఒక మగపిల్లవాడుగా పుట్టిన రామ్ చరణ్ తేజ మగధీరుడిగా ప్రఖ్యాతి గాంచారు.
వీరి కుటుంబం తమ జీవితాలను మొత్తం సినిమాకే అంకితం చేసారు. చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా తెలుగు తెరను సుశోభితం చేసారు. ఇక సురేఖ వైపు చూసుకుంటే ఆమె తండ్రి అల్లు రామలింగయ్య తెరమీద వినోదాన్ని పంచితే ఆమె సోదరుడు అల్లు అరవింద్ ఆ వినోదాన్ని ఎప్పటికప్పుడు సాంకేతికాభివృద్ధిని ఉపయోగించుకుంటూ సినీ నిర్మాణం, పంపిణీలను చూసుకుంటున్నారు. అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ కూడా తెరమీదకు వస్తూనే హీరోల జాబితాలో చేరిపోయారు.
ఈరోజు వీరి పెళ్ళి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వీరు సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో, సుఖసంతోషాలతో, దాంపత్యజీవితాన్నిగడపాలని ఆకాంక్షిస్తూ- ఆంధ్రావిశేష్.
ఈ సందర్భంగా చిరంజీవి గురించి నాలుగు ముక్కలు-
ఆగస్ట 22, 1955 లో నర్సపూర్ దగ్గర మొగల్తూర్ గ్రామంలో కొణిదెల వెంకటరావు, కొణిదెల అంజనా దేవి లకు జన్మించి చిరంజీవికి శివ శంకర వర ప్రసాద్ అని నామకరణం చేసారు. ఒంగోల్ లో సిఎస్ఆర్ శర్మ కాలేజ్ నుంచి పట్టభద్రుడైన తర్వాత ఈయన సినిమా రంగానికి ఆకర్షితులై 1976లో చెన్నైలో మద్రాస్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో చేరారు. వీరి కుటుంబంలో ఇలవేల్పు ఆంజనేయస్వామి అవటం వలన, సినిమా రంగ ప్రవేశం చెయ్యటానికి ఉపక్రమించినపుడు చిరంజీవి అనే పేరు పెట్టుకోమని ఈయన తల్లి సూచించగా అప్పటి నుంచి చిరంజీవి గానే ప్రఖ్యాతిగాంచారు. అయితే ఈయన అభిమానులు మాత్రం ప్రేమగా చిరు అని పిలుచుకుంటారు.
ట్రైనింగ్ పూర్తయిన తర్వాత 1978 లో మొదలైన సినీ జీవితంలో చిరంజీవి తీసుకున్న మొదటి సినిమా పునాది రాళ్ళు అయితే విడుదలైన మొదటి సినిమా మాత్రం ప్రాణం ఖరీదు. బాపు దర్శకత్వంలో వచ్చిన మనవూరి పాండవులు సినిమాతో తెలుగు ప్రేక్షకులు చిరంజీవి ప్రతిభను గుర్తించటం మొదలుపెట్టారు. 1979 నుంచి 1981 వరకు చిరంజీవి మొదట్లో చాలా సినిమాల్లో ప్రతినాయకుని పాత్రల్లో చేసి కూడా మెప్పించారు. అందులో ఐ లవ్ యు, ఇది కథకాదు, మోసగాడు, రాణికాసుల రంగమ్మ, 47 రోజులు, న్యాయం కావాలి ఉన్నాయి. రజనీ కాంత్ కి ప్రతినాయకుడిగా రేనువ వీరన్ లో తన హావభావాలు, నటనతో పాటు డాన్స్, ఫైట్ల లో కూడా సులభంగా చేసి చూపించిన కదలికలకు ప్రేక్షకులు, దర్శకులు కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.
1982 నుంచి చిరంజీవి హీరోగా తెరమీద విలయతాండవమాడారు. విశ్వనాధ్ దర్శకత్వంలో శుభలేఖ సినిమా లో నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ని అందుకున్నారు. సిల్వెస్టర్ స్టాలన్ చేసిన ఫస్ట్ బ్లడ్ ఆధారంగా రూపొందించిన ఖైదీ సినిమాలో నటించిన తర్వాత యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. 1983 కే 60 సినిమాలు పూర్తి చేసిన చిరంజీవి ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. విజేత లో నటనకు 1985 లో మరోసారి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్న చిరంజీవి, 1987 లో పసివాడి ప్రాణం సినిమాతో అగ్రహీరోగా స్థాయికి ఎదిగి అక్కడే నిలిచిపోయారు. విశ్వనాథ్ దర్శకత్వంలో స్వయం కృషితో మరోసారి పురస్కారానికి అర్హత సంపాదించుకున్నారు. ఈ సారి నంది పురస్కారం. అప్పటి వరకూ డ్యాన్స్ ఫైట్లు, యాక్షన్ ఆధారిత పాత్రల్లో నటించిన చిరంజీవి తను ఇతర పాత్రలలోనూ మెప్పించగలనని స్వయం కృషి తో నిరూపించుకున్నారు.
ఆ తర్వాత 1988లో రుద్రవీణ సినిమాకి రెండవ నందిని అందుకున్న చిరంజీవి జగదేకవీరుడు అతిలోక సుందరి సోషియో ఫాంటసీ ద్వారా తెలుగు ప్రేక్షకులను స్వప్నలోకాల్లోకి తీసుకునిపోయారు. ఆపద్బాంధవుడు సినిమా నంది తో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ని కూడా తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ముఠా మేస్త్రి కి కూడా మరోసారి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లభించింది. స్నేహం కోసం సినిమా చిరంజీవికి ఐదవ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ని సంపాదించిపెట్టింది.
2002 లో వచ్చిన ఇంద్ర సినిమా ఘనవిజయం సాధించటమే కాక 3 వ నంది, 6 వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లు గెలుచుకునేట్టుగా చేసింది. టాగోర్, శంకర్ దాదా ఎమ్ బి బి యస్ లాంటి సందేశాత్మక చిత్రాల్లో నటించిన చిరంజీవి శంకర్ దాదా గా ఏడవ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. ఆ తర్వాత స్టాలిన్ లో కూడా తన అద్భుతమైన నటనను ప్రదర్శించారు. 2007 లో సినిమారంగానికి చేసిన కళా సేవకు గాను ఫిల్మ్ ఫేర్ హనరరీ పురస్కారాన్ని, 2011 లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డ్ ని అందించింది.
ప్రధాన పాత్రలో చిరంజీవి ఇప్పటి వరకూ నటించిన ఆఖరు సినిమా శంకర్ దాదా జిందాబాద్. ఆ తర్వాత ఆయన రాజకీయరంగంలో ప్రజా సేవ చెయ్యటానికి నడుం కట్టారు. అయితే 149 సినిమాలు పూర్తి చేసిన చిరంజీవి, రాజకీయాల్లోకి పూర్తిగా పోయే ముందు మరో సినిమాలో నటించి 150 పూర్తి చెయ్యాలని సినీ అభిమానుల ఆకాంక్ష. అయితే అదే ఆఖరి చిత్రమైన పక్షంలో కలకాలం గుర్తుండేలా ఉండాలని కూడా వారు కోరుకుంటున్నారు.
కళాకారులను దేవుడితో పోలుస్తుంటారు చాలామంది. అందుకు కారణాలు చాలా ఉన్నాయి. ఎంత చేసినా ఇంకా ఏదైనా చెయ్యాలని భగవంతుడి దగ్గరనుంచీ ఆశిస్తుంటాం, కళాకారుడి దగ్గర నుంచీ ఆశిస్తాం. ఇక చాలు అని ఎవరూ భగవంతుడిని ఎవరూ అనరు. అలాగే అభిమాన హీరో చేసింది చాలు అని ఎవరూ అనరు. పూర్వకాలం పద్యనాటకాల్లో ఒన్స్ మోర్ అన్నట్టు, ఎంత కాలం కళాసేవ చేస్తూ పోయినా మరో సినిమా ప్లీజ్ అంటుంటారు. అభిమానం కూడా అలాగే ఉంటుంది. దేవుడిని పిలిచినట్టే ఇష్టమైన కళాకారుడిని కూడా ఏకవచన ప్రయోగంతో పిలుస్తుంటారు. దేవుడు వస్తాడు, నాకు ఫలానాది ఇస్తాడు, వాడు కాకపోతే మరెవరు చూస్తారు నన్ను అని ప్రేమ గా అన్నట్టుగానే ఇష్టమైన కళాకారుడిని కూడా వాడు వీడు అని అభిమానంతోనే అంటుంటారు, 'డు' ప్రయోగం చేస్తారు కానీ 'రు' ప్రయోగం చెయ్యరు. రాముడు, కృష్ణుడు, శివుడు అన్నట్టు!
నాలుగు ముక్కలనుకుంటూ రాస్తేనే ఇంత పెద్దగా తయారైంది. ఇక చిరంజీవి గురించి పూర్తిగా రాస్తే ఇంకెంత పెద్ద వ్యాసమౌతుందో? 150 వ సినిమా చేసినా సంతోషమే చెయ్యకపోయినా ఇంతవరకూ పంచిన వినోదమేమీ తక్కువ కాదు. లెక్కలదేముంది, దాని లెక్కేమిటి. తినేటప్పడు కొలుచుకుని తింటామా, అలాగే ఇదీనూ.
సినిమారంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ చిరంజీవి ఎక్కడున్నా రాణించాలని, చిరంజీవి దంపతులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని కోరుతూ ఆంధ్రా విశేష్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more