ఫోటోని తెలుగులో ఛాయాచిత్రమంటారు. సినిమాను మూవింగ్ పిక్చర్స్ అనేవారు. అందుకే తెలుగులో చలన చిత్రమంటారు. కదలికలను విడివిడిగా రికార్డ్ చేసిన ఫిల్మ్ లను వడివడిగా చూపించేటప్పటికి మనకి ఆ చిత్రం కదిలినట్టుగా కనిపిస్తుంది. అలాంటి మూవింగ్ పిక్చర్స్ ని కాస్తా పిక్చర్ అని మూవీ అని ఫిల్మ్ అని సినిమా అని అనటం మొదలుపెట్టారు. 1895లో లండన్ లో ప్రదర్శించిన మొట్టమొదటి సినిమా విశేష జనాదరణ పొందటంతో వినోదరంగంలో సినిమా మంచి స్థానాన్ని ఆక్రమించింది. శబ్దం లేకుండా మొదట్లో వచ్చిన సైలెంట్ సినిమాల స్థానంలో శబ్దం, రంగులు రావటమే కాకుండా సాంకేతిక నైపుణ్యమంతా రంగరించుకుని నేటి సినిమాలు ప్రేక్షకుల అభిమానాన్ని పొందటం కోసం విశేష మైన కృషితో, అమితమైన పెట్టుబడితో, వ్యాపార దక్షతతో, విఙాన శాస్త్ర అభివృద్ధిని ఉపయోగించుకుంటూ వస్తున్నాయి. భారత్ లో మొదటి చిత్రం దాదాసాహెబ్ ఫాల్కీ నిర్మించిన రాజా హరిశ్చంద్ర.. ఇది 1913లో తయారైంది. రఘుపతి వెంకయ్యనాయుడు 1909 నుంచీ సినిమా నిర్మాణంలో ఎంతో కృషి చేసి మూకీ (సైలెంట్) సినిమాలను నిర్మించారు. మద్రాసులో సినిమా హాలుని కట్టించింది ఆయనే. వీరిద్దరి పేరు మీదా ఇప్పటికీ వీరి సినిమా కళా సేవలకు గుర్తుగా దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం, రఘుపతి వెంకయ్యనాయుడు పురస్కారాన్ని నంది పురస్కారాలుగా మార్చి కొనసాగిస్తున్నారు.
సినిమాలు రాకముందు భారతదేశంలో రంగస్థల నాటకాలకు ఎక్కువగా ఆదరణ ఉండేది. దానితర్వాతనే తోలుబొమ్మలాటలు కానీ, బుర్రకథల్లాంటి వినోదాలు కానీ. మొదట్లో సినిమాల్లో వేసినవారందరూ రంగస్థల నటులే కాబట్టి రంగస్థల కట్టుబాట్లను సినిమాల్లోనూ పాటించేవారు. ఉదాహరణకు వాచకం. రంగస్థలం మీద చివర్లో కూర్చున్నవారికి సైతం వినిపించేట్టుగా గట్టిగానూ మాట్లాడాలి, స్పష్టంగానూ మాట్లాడాలి కాబట్టి ఆ ఉచ్ఛారణ వేరుగా ఉండేది. ఇప్పటిలా డబ్బింగ్ ఉండేది కాదు కాబట్టి ఆ సమయంలో మాట్లాడిన మాటలే రికార్డ్ అయ్యేవి కాబట్టి షూటింగ్ సమయంలో పూర్తి నిశ్శబ్దాన్ని పాటించేవారు. ఔట్ డోర్ షూటింగ్ లలో కూడా ఎవరూ మాట్లాడకుండా చూసుకునేవారు. నేపథ్యం సంగీతం కూడా అప్పటికప్పడే వాయించేవారు. ఎవరి పాటలు వారు పాడుకునేవారు, అదే సమయంలో సంగీత వాయిద్యకారులు కూడా ఆ పక్కనే కూర్చుని వాయించేవారు. నటీనటులు తిరుగుతూ పాడే పాటలకు సంగీత వాయిద్యాలతో వారితో పాటే తిరుగుతూ వాయించేవారు.
నాటకాల్లో రంగస్థలం మీదున్న వారికి ఉచ్ఛారణతో పాటు మరి కొన్ని నియమాలుండేవి. వెనక భాగం చూపించగూడదనేది. ఇప్పటి సినిమాల్లో వెనక భాగానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ కనిపిస్తున్నారు. ఏ పాత్రధారితో మాట్లాడినా ప్రేక్షకులవైపు తిరిగి మాట్లాడాలి లేకపోతే సరిగ్గా వినపడదు, ముఖంలో హావభావాలు కనపడవు కాబట్టి. సినిమాల్లో కూడా మొదట్లో అదే పాటించేవారు. పక్కనున్న పాత్రధారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎదురుగా ఉన్న కెమేరా వైపు చూసే మాట్లాడేవారు. అన్నిటికన్నా ముఖ్యంగా మొదట్లో వచ్చిన సినిమాల్లో మరీ స్త్రీ పాత్రలను కూడా మగవాళ్ళే ధరించేవారు నాటకాల్లో లాగా. అంతేకాదు మేకప్ లో భాగంగా ముఖానికి వేసుకునే రంగు కూడా చాలా ఎక్కువగా ఉండేది. వేదిక మీద ఉన్న కళాకారుల హావభావాలు చక్కగా కనిపించటం కోసం ముఖానికి దళసరిగా రంగు, కనుబొమలు మీసాలు, జుట్టుకి బాగా రంగు పట్టించటం లాంటివి చేసేవారు. పాత్ర గుణాన్ని, లక్షణాన్ని ప్రేక్షకులకు స్పష్టంగా తెలియజేయటం కోసం వారి పేర్లు, వారి ఆకారం, వేష భాషలు అలా ఉండేవి. దుష్ట పాత్రలైతే భయంకరంగానూ, హాస్య పాత్రలైతే చూడగానే నవ్వు వచ్చేట్టుగా విచిత్ర రూపంతో వేష ధారణతో కనిపించేవారు.
కానీ రాను రాను సహజత్వానికి దగ్గర్లోకి వచ్చాయి సినిమాలు. మామూలుగా బయట వ్యవహరించే విధానంలోనే పాత్రలను తెరకెక్కించటం మొదలుపెట్టారు. అయితే సహజత్వం ప్రేక్షకులను అలరించదు. పురాణ కథలు, నీతి కథలూ, చారిత్రాత్మక కధలు, దేశభక్తి కధలు తలకెక్కటం మానేసాయి. వారికి అసహజమైన వాటిలోనే ఆసక్తి ఎక్కువుంటుంది కాబట్టి, అభూత కల్పనలతో రాసిన కథలతో ముందుకు వచ్చారు. జానపదాలనే పేరుతోనూ, గూఢచారి సినిమాలుగానూ అపరాధ పరిశోధనలు, హత్యలు, హింస, శృంగారం, పోరాటం సాహస కృత్యాలతో వివిధ విధాలుగా కల్పితాలకు పదునుపెట్టారు. ఇప్పటికీ సినిమా ఎలా తీస్తే రక్తికడుతుందన్న సూత్రం ఎవరూ కనిపెట్టలేదు. సినిమా టెకెట్లను మొదటి నుంచీ తక్కువ ధరతో, సామాన్యుడికి అందుబాటులో ఉండేట్టుగా ఉంచారు కాబట్టి, సినిమా బాగోలేకపోయినా కసిగా టికెట్ ని చింపేస్తారే కానీ మరో సినిమా చూడకుండా ఉండరు.
ఒక పౌరాణిక సినిమాను బాగా ఆదరించారు కదా దాని వెనకాలే పడితే నిర్మాతలు చెయి కాల్చుకోక తప్పదు. అలాగే ఇతర సినిమాలు కూడా. కానీ హాస్యం, ప్రేమ కలగలిసిన చిత్రాలకు మూడు దశాబ్దాలుగా ఎక్కువ ఆదరణ కనపడుతోంది. దానికి తోడు పోరాటాలు, ఎక్కువ ఖర్చు పెట్టి చేసే ధ్వంసాలు కూడా సినిమా నిర్మాణ ఖర్చుని పెంచుతున్నా, దాని వలన డబ్బు వసూలవుతుందని భరోసా కలుగుతోంది.
సినిమా పరిశ్రమ ఈనాడు భారీ పరిశ్రమే కాకుండా లాభాల విషయంలో ఎవరూ హామీ ఇవ్వలేని పరిశ్రమైంది. అన్ని పరిశ్రమల్లో లాగానే ఇందులోనూ అన్ని వర్గాల్లో సంఘాలు ఏర్పాటు చేసుకోవటం, తమ వృత్తిలో భద్రత కోసం కొన్ని కట్టుబాట్లను పెట్టుకోవటం మొదలయ్యాయి. ఇంటర్ నెట్ ద్వారా ఫోన్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవటం, దేశ విదేశాల్లో తమ ఉత్పాదన (సినిమా) గురించి ప్రచారం చేస్తూ దానిద్వారా లాభాలను సంపాదించటం కూడా మొదలైంది. కళాకారుల, ఇతర సాంకేతిక నిపుణుల పారితోషికాలు పెరిగిపోయాయి.
సినిమా కథ దగ్గర్నుంచి, స్కిప్ట్ రచన, గీత రచన, సంగీత రచన, దర్శకత్వం, ఛాయాగ్రహణ, ఎడిటింగ్, కళ, పోరాట సన్నివేశాలు, నృత్యాలకు దర్శకత్వం వహించేవారు, వీటన్నిటిలో వారికి సహాయకులు, డబ్బింగ్ కళాకారులు, సహాయ నటులు, డూప్ లు, స్టూడియోలు, ల్యాబ్స్, ప్రదర్శన శాలలు నిర్వహించేవారు, వాటిల్లో పనిచేసేవారు, చిత్ర ప్రచార విభాగంలో పనిచేసేవారు, వీరందరూ కాకుండా పంపిణీదారులు, ముడిసరుకుని సరఫరా చేసేవారు- ఇలా వినోదంతో పాటు కొన్ని కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందీ సినిమా పరిశ్రమ.
కాకపోతే తళుకుబెళుకల సినిమా ప్రపంచంలో మోసపోయినవారు కూడా చాలా మంది ఉన్నారు. నిర్మాణంలో చెయికాల్చుకున్నవారు, అవకాశం దొరుకుంతుందని సీనియర్ల వెనకాలే తిరుగుతూ కాలమంతా వృధా చేసుకున్నవారు, పార్టీల పేరుతో మత్తు పదార్ధాలకు అలవాటు పడ్డవారు ఉన్నారు. అన్నిటికన్నా మించి, తారస్థాయిలో ఉన్నప్పుడు వస్తున్న ఆదాయం అలాగే ఎల్లకాలం వస్తుందనుకుని ఖర్చు పెడుతూ, చివరకు అవకాశాలు లేక చితికిపోయినవారూ ఉన్నారు. సినిమా అవకాశాలు లేనప్పుడు కూడా ఖర్చు పెట్టటం, తమ శరీరాకృతిని, అందాన్ని కాపాడుకోవటం అగ్రతారలకు చాలా అవసరం. అలాగే పోరాటాలు, సాహస కృత్యాలు, విలన్ల దగ్గర పనిచేస్తున్న పాత్రల్లో నటించేవారు శరీర దారుఢ్యాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవటం చాలా అవసరం. అందువలన సినిమా పరిశ్రమలో ఎవరిని కదిలించినా అంతులేని కథలు బయటకు వస్తాయి. ఇంకా ఇందులో హీరో హీరోయిన్లకు డూప్ ల లాగానే కథలు, పాటలు, మాటలు రాసేవారికీ డూప్ లుంటారు. నిజానికి వాళ్ళే ఒరిజినల్, డబ్బు అవసరం పడటంతో పేరుతో కడుపు నిండదు కాబట్టి తమ రచనలను అమ్ముకుంటారు.
టివిల్లో ప్రదర్శించే ఎపిసోడ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు నిజానికి సినిమాలకంటే చాలా తక్కువ. పైగా ఇంట్లోనే చూడవచ్చు. రవాణా ఖర్చులు పెట్టుకుని సినిమా హాలుకి పోయి, అక్కడ పార్కింగ్ చార్జీలు, అక్కడ అధిక ధరలకు లభించే తినుబండారాలకు పెట్టే ఖర్చుతో పోలిస్తే టివి చాలా చౌక పడుతుంది. అందువలన సినిమాలు అంతరించిపోతాయేమో అనుకున్నారంతా. కానీ సినిమా నిర్మాతలు, ప్రముఖులు సినిమా ప్రాచుర్యాన్ని అగ్రస్థానాన్ని పోకుండా ఎంతో కృషి చేసారు, ఇంకా చేస్తున్నారు. దానికోసం సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోవటం, ప్రచారానికి విపరీతంగా ఖర్చు చెయ్యటం చేస్తున్నారు. అంతేకాకుండా సినిమా పరిశ్రమ పన్నుల ద్వారా ప్రభుత్వ ఆదాయంలో కూడా తన వాటాని బాగా పెంచుతోంది.
సినిమాలను ప్రదర్ళించటం, సినిమా మీద ఆధారపడ్డ అంశాలతో ప్రత్యేక షోలు నిర్వహించటం, సినిమాల ప్రదర్శనకే ప్రత్యేకంగా ఛానెల్స్ ని ప్రారంభించటం వలనే తమ ఛానెల్ ని వీక్షించేవారి సంఖ్య పెరుగుతుందనే భావన టివి ఛానెల్స్ లో కలిగింది. అంతేకాకుండా, నిర్మాణానికి అయ్యే ఖర్చుతో నిర్వహణలో ఉండే తలనొప్పులు కూడా టివి వాళ్ళకి తగ్గిపోతాయి కదా.
ఏది ఏమైనా సామాన్య మానవుడికి అందుబాటులో ఉన్న వినోదంగా సినిమా తన స్థానాన్ని సుస్థిరపరచుకుంది. దానికి తగ్గట్టుగానే కళాకారులలో నూ సాంకేతిక నిపుణుల్లోనూ పోటీ బాగా పెరిగిపోయి, ఒకరిని మించిన సినిమాలను మరొకరు నిర్మించాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు. శుభం!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more