పుట్టి బుద్ధెరిగిన దగ్గర్నుంచీ మనిషి ఒక పరుగు పందెంలో ఉన్నాడు. వెళ్తున్న దారి సరైనదో కాదో తెలియదు. పరిగెడుతున్న దిశ గురించి తెలియదు కానీ వేగం మాత్రం పెంచుకోవాలని ఎప్పుడూ ఆరాటపడుతుంటాడు.
ఏదో తెలియని ప్రయాణం. ఎక్కిడిదాకో తెలియదు. దేనికోసమో తెలియదు. ఏం సాధిద్దామనో తెలియదు. ఎప్పుడు అంతమవుతుందో అసలే తెలియదు. కానీ తోటి ప్రయాణీకుల గురించి తెలుసుకుందామని, వాళ్ళని తప్పుపడదామని, వాళ్ళకంటే ఎక్కువ సౌకర్యాలు పొందుదామని, వాళ్ళ గుర్తింపు పొందుదామని, వీలయితే వాళ్ళ మీద అధికారం చెలాయిద్దామని చూసే మనిషి అసలు తనగురించి తాను తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యడు.
కావలసినన్ని వనరులు, కావలసినంత స్వేచ్ఛ ఉంది అని అనిపిస్తుంది. ఏది కావాలంటే అది చెయ్యచ్చు, ఎలా కావాలంటే అలా బతకచ్చు అని అంటే మంచివాడిగానూ ఉండవచ్చు, లేదా చెడ్డవాడిగానూ రోజులు గడపవచ్చు. లేదా అప్పుడప్పుడూ మంచిగానూ, అప్పుడప్పుడూ చెడ్డవాడిగానూ బతికేయవచ్చు. కానీ ఆలోచిస్తే స్వేచ్ఛనేదేమీ లేదని తెలుస్తుంది. తల్లిదండ్రుల చాటు పిల్లల జీవితం లాంటిదే మనిషి జీవితం.
తల్లిదండ్రుల వలన జన్మతీసుకోవటం జరిగింది, వాళ్ళకి నచ్చిన పేరు పెట్టారు, వాళ్ళకి నచ్చిన దుస్తులు వేసారు, వాళ్ళకి నచ్చిన స్కూల్లో వేసారు, వాళ్ళకి నచ్చేట్టుగా నడుచుకోమన్నారు, వాళ్ళకి నచ్చినవాళ్ళతోనే చెలిమిచేయమన్నారు, వాళ్ళకి నచ్చిన వృత్తి వ్యాపారాలనే ఎన్నుకోమన్నారు, వాళ్ళకి నచ్చినవారినే పెళ్ళాడమన్నారు. ఎంతకీ ఎదగనీయలేదు. తల్లిదండ్రుల ఛత్రఛాయ నుంచి బయటకు రాగానే సమాజంలో కట్టుబాట్లు, చట్టాలు- ఎప్పటికీ తన బతుకుని తనబతుకుగా బతకనీయలేదు. అదే మనిషి జీవితం. దుకాణంలోకి వెళ్ళి మనకు కావలసింది కొనుక్కునే స్వేచ్ఛ మనకుంది కానీ మనకు కావలసింది, అక్కడ లభ్యం కానిది అడిగి తీసుకునే స్వేచ్ఛ లేదు కదా. అంటే స్వేచ్ఛ ఉంది కానీ దానికో పరిమితి ఉంది.
తల్లిదండ్రులు కూడా పిల్లలను వారి దుస్తులు, మిగతా వస్తువుల విషయంలో వాళ్ళ అభిప్రాయాలను అడిగుతారు. కానీ అక్కడ పిల్లలకు సంపూర్ణమైన స్వేచ్ఛ లేదు. అక్కడ ఉన్న వస్తువులు, తల్లిదండ్రుల ఆర్థిక స్తోమతు, సమాజంలో వారు పెట్టుకున్న కొన్ని ఎల్లలు వీటి దృష్ట్యా ఆ వస్తువులను ఎన్నుకోవలసి వస్తుంది.
పిల్లవాడి జీవితంలో ఎదుగుదల ఉంటుంది. కొన్నాళ్ళకు తన కాళ్ళమీద తాను నిలబడతాడు, తన నిర్ణయాలు తాను తీసుకుంటాడు. కానీ మనిషి జీవితం చూసుకుంటే అందులో ఎదుగుదలేమీ లేదు. ఎవరివలన ఈ జీవితం సాగిస్తున్నాడు, అంతిమ లక్ష్యం ఏమిటి అన్నవేమీ తెలియకపోయినా బ్రతుకుని సాగనివ్వాలన్నది తల్లిదండ్రులు, సమాజంలోని పెద్దలు, రీతి రివాజులు తెలియజేస్తున్నాయి. కొన్ని బాధ్యతలిచ్చి కొన్ని లక్ష్యాలు కలుగజేస్తున్నాయి. అవన్నీ తాత్కాలికమైనవే. వాటిని ఎంతవరకూ నెరవేర్చగలడన్నది ఎవరికీ తెలియదు. రాబోయే క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. అయినా పట్టు విడవకుండా జీవిస్తున్నారు అంటే బలమైన కారణం మన మనసులోనే ఉంది. అది పుట్టగానే సంప్రాప్తిస్తుంది.
మెదడులో ఒక సునిశితమైన భాగముంది. అదే మనిషిని ముందుకు నడిపిస్తుంటుంది. అలా నడవటం కోసం ఒక ఆసరా తీసుకునేట్టుగా చేస్తుంది. అది కుటుంబాన్ని పైకి తీసుకునిరావటమే కావచ్చు, సమాజ సేవే కావచ్చు, దేశభక్తే కావచ్చు, క్రీడల్లో చేసే కృషి కావచ్చు, లేదా ఆధ్యాత్మిక చింతనే కావచ్చు కానీ జీవించటానికి కావలసిన లక్ష్యనిర్దేశం మనసులో జరుగుతుంది. ఏమీ లేకపోతే ఏదో ఒకటి తయారు చేసుకుంటుంది. ఎవరూ లేనివారు కనీసం ఎవరినైనా పెంచుకుందాం, లేదా ఒక కుక్క పిల్లనో, పిల్లి పిల్లనో ఇంట్లో పెట్టుకుందామని అనుకుంటారు. కొందరు ప్రాంగణంలోని మొక్కలను చూసుకుంటారు. కొందరికి వారు స్థాపించిన కర్మాగారం మీద మక్కువుంటుంది. కొంతమంది కళలు సాహిత్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. శారీరక వ్యాయామం కానీ గుర్రపు స్వారీ, ఈత లాంటివి కానీ కొందరు నేర్చుకుంటారు.
చాలా మంది సుఖమయమైన, శాంతియుతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. అయితే తమాషా ఏమిటంటే దానికోసం కొందరు చాలా కష్టపడుతుంటారు. విలువైన మూలికల కోసం సంవత్సరాల తరబడి అడవుల్లో పడి తిరుగుతున్నవారున్నారు. పురాతన వస్తువుల్లాంటివి అమ్మటం కోసం, భూగర్భంలో నిక్షిప్తమైవున్న నిధుల వేటలోనూ జీవితమంతా వెళ్ళదీసినవారున్నారు. మంత్రశక్తులను, యోగశక్తులనూ చేజిక్కించుకోవటం కోసం తపనపడేవారున్నారు. బంగారు చేసే విద్య నేర్చుకుని దానిద్వారా కుటంబాన్ని సమాజంలో ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళాలన్న ఉద్దేశ్యంతో ఆ కుటుంబాన్నే విడిచిపెట్టి తిరుగుతున్నవారున్నారు.
ఈ తెలియని, అంతులేని ప్రయాణంలో ఎన్నో అనుభవాలు ఎదురౌతుంటాయి, ఎందరితోనూ పరిచయాలు ఏర్పడుతుంటాయి కానీ మనిషి కోరుకునేవి ఇవే- అందరికన్నా ముందుండాలి, అందరి గుర్తింపూ లభించాలి.
అయితే ఇలాంటి భావాలన్నీ ఇచ్చి మనలను నడిపిస్తున్న భగవంతుడనే సూపర్ కంప్యూటర్ మనలో చేసిన ప్రోగ్రామ్ ని మెచ్చుకోవాలి. ఏమీ తెలియకపోయినా చచ్చేవరకూ చచ్చినట్టు బతికితీరే విధంగా తయారు చేసి మనలో నిక్షిప్తం చేసిన ప్రణాళికది.
శరీర వ్యవస్థలో మనకింకా తెలియనివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ వాటి పనంతా అవే చేసుకుంటుంటాయి. కానీ రెండు విషయాలను ప్రకృతి మన చేతికిచ్చింది. అందులో ఒకటి- ఆ శరీరమనే యంత్రాన్ని నడిపించటానికి తీసుకునే ఆహార పదార్థాలు, రెండవది- శరీరాలు కాలం తీరి శుష్కించి నశించినా ప్రాణ కోటి హతమవకుండా ఉండటానికి జోవోత్పత్తి ఏర్పాట్లు.
శరీరానికి కావలసిన ఇంధనం కోసం ఆహార పానీయాలను తీసుకోవటంలో ఇష్టం ఏర్పడటం కోసం రుచి అనేది పెట్టాడు దేవుడు (పోనీ సృష్టించిన ప్రకృతి అనుకుందాం). ఆ రుచి అనేదే లేకపోతే ఇంత ఆసక్తి ఉంటుందా. కాస్త ఉప్పు తక్కువౌతేనే తినలేము. అలాంటిది చప్పిడి తిండి తింటూ బ్రతకగలమా. అత్యవసర పరిస్థితిలో చెయ్యవచ్చునేమో కానీ రోజూ కాదు. ఆకలి, రుచి, తిన్న తర్వాత సంతృప్తి అనేవి లేకపోతే- ఒక్కసారి ఆలోచించండి- నోట్లో వేసుకుని నమిలి మింగటం అనేది ఎవరైనా చేస్తారా. మింగుడుపడుతుందా అసలు. వాహనం కాదు ఫ్యుయల్ గేజ్ చూసి పెట్రోలు నింపుకోవటానికి.
మరిక రెండవ ఏర్పాటుకి వస్తే, శృంగారమనేది మనిషికి లేకపోతే స్త్రీ పురుషుల మైథునం ఉంటుందా? చెమట పట్టేట్టుగా శృంగార క్రీడలో పాల్గొంటారా? దానితో పాటే నా అనేది వస్తుంది. తన రక్తం పంచుకుని పుట్టినవారు అనే భావనలో ఎంతో ఆనందం లేకపోతే పిల్లలను పెంచి పెద్ద చేస్తారా? పిల్లలకు పాలు ఇవ్వటంలో ఆనందం లేకపోతే అసలు తల్లి పాలు ఇస్తుందా?
ఈ రెండు పనులు కూడా మనచేతిలో పెట్టాల్సిన అవసరం ప్రకృతికి లేదు. శరీరంలో అన్నీ జరుగుతున్నట్టే, గుండె ఆడటం, రక్త ప్రసరణ జరగటం, శ్వాస ద్రావా ప్రాణవాయువు శరీరంలోని రక్తాన్ని శుభ్రపరచటం, ఇంకా కిడ్నీ, కాలేయం, పాంక్రియాస్ లాంటివి సమర్థవంతంగా పనిచేయటం జరుగుతున్నట్టే, వృక్షాలకు లభించినట్టుగా ప్రకృతి లోంచి ఇంధనం తీసుకోవటం, యాంత్రికంగానే ప్రకృతి ప్రమేయంతోనే పిల్లలు కలగటం కూడా ఏర్పాటు చేసి ఉండవచ్చు. కానీ అలా చేస్తే మనిషికో లక్ష్యం అంటూ ఉండదు. లక్ష్యం లేకపోతే కర్మలకు ఉపక్రమించరు. అందుకే ఈ రెండూ మనకిచ్చి జీవితమనే క్రీడను హాయిగా తృప్తిగా గడపండని ప్రకృతి శాసించింది.
జీవితాన్ని సాగించటానికి కావలసిన శరీర వ్యవస్థ, ప్రకృతి లో వనరులు, అన్నిటికన్నా మించి జీవితేచ్ఛ కలిగించిన ప్రకృతి తనలో ఉన్న పరిమితిలో స్వేచ్ఛగా బతకమంటుంది. మిగతా వన్నీ మీ ఇష్టం. సమాజం, కులం, దేశం, న్యాయం, చట్టం, వినోదం, ఉల్లాసం లాంటివి ఎన్నైనా పెట్టుకోమంది.
అలా జీవితేచ్ఛను మనసులో ప్రవేశపెట్టి ఉంచబట్టే ఏమీ తెలియని అయోమయ స్థితిలో కూడా, తన చేతిలో ఏమీ లేని పరిస్థితిలో కూడా మనిషి తాను జీవిస్తున్నానని అనుకోవటమే కాకుండా, తనవలన ప్రపంచం ముందుకు నడుస్తుందన్న భావనలో పట్టుదల శ్రద్ధలతో ప్రేమ మమకారాలతో జీవనయానాన్ని తెలియని గమ్యం వైపు సాగిస్తున్నాడు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more