జయపూర్ లో జరిగే సాహితీ వేడుకలకు తనని రావద్దని చెప్పటంలో రాజస్తాన్ ప్రభుత్వం కుట్ర దాగివుందని ప్రఖ్యాత రచయిత సల్మాన్ రష్డీ తన ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. తన ప్రాణాలకు అపాయముందని నమ్మబలుకుతూ తనని సాహితీ వేడుకలకు దూరం చేసారని ఆయన ఆవేదన కూడా చెందారు. బహిష్కరించిన రష్డీ పుస్తకం సెటానిక్ వెర్సెస్ అనే పుస్తకంలోంచి ఆ సాహిత్య కార్యక్రమాల్లో ఎవరైనా చదివినా సరే ఖబర్దార్ అంటూ పోలీసులు హెచ్చరికలు జారీచేసారు. ముంబైలోని కిరాయి హంతకులు అతని కోసం ఎదురుచూస్తున్నారని తెలిసిన రష్డీ తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారని అంటూ సాహితీ వేడుకలను నిర్వహిస్తున్న కమిటీ ప్రకటించింది. సల్మాన్ రష్డీని హత్య చెయ్యటానికి చూస్తున్నారన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సత్యమేనని, అదేమీ మేము కల్పించిన కథనం కాదని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు.
అయితే రష్డీని హత్య చెయ్యటానికి కాచుకుని కూర్చున్నారని వారు చెప్పిన వారు ముంబై పోలీసుల రికార్డ్స్ లో లేనివారే. అంతేకాదు, రాజస్తాన్ చెప్తున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ విషయంలో మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ సుబ్రహ్మణ్యం, రష్డీని అండర్ వళ్డ్ ముఠా వాళ్ళు చంపటానికి చూస్తున్నారన్న సమాచారాన్ని ఆ ప్రభుత్వానికి మేమైతే అందజేయలేదు. మాకే తెలియని ఆ సమాచారాన్ని మేమెలా ఇస్తామెవరికైనా అని అన్నారు.
నలుగురు రచయితలు ఇప్పటికే సల్మాన్ రష్డీ పుస్తకంలోంచి కొన్ని అంశాలు తీసి ఆ వేడుకల్లో చదవటం కూడా వివాదాలకు దారితీస్తోంది. ఆ నలుగురి మీద కేసయితే నమోదు చెయ్యలేదు కానీ వారిని విచారణకు పిలుస్తామని రాజస్తాన్ పోలీసు శాఖ చెప్తోంది. కొన్ని ముస్లిం వర్గాలు మాత్రం రష్డీ పుస్తకంలోంచి బయటకు చదవనివ్వటాన్ని అనుమతించిన సాహితీ వేడుకల నిర్వాహకుల మీద చర్య తీసుకుంటామంటున్నారు.
సర్ అహ్మద్ సల్మాన్ రష్డీ 1947లో జన్మించారు. ఈయన రెండవ పుస్తకం మిడ్ నైట్స్ చిల్డ్రన్ 1981 లో బుకర్ పురస్కారాన్ని గ్రహించింది. ఆయన రచనలలో చాలా వరకు భరతఖండంలోని విషయాలమీదనే ఉంటాయి. ఆ కాల్పిక రచనలలో ఆయన చరిత్రలోని కొన్ని ఘట్టాలను జొప్పించి వాటికి నిజంగా జరిగాయేమో అనే భావనను కలుగజేస్తారు. 2007 లో రష్డీ ఎలిజబెత్ మహారాణి నుండి నైట్ బాచిలర్ పదవిని స్వీకరించారు. ఆయన చేసిన సాహిత్య కృషికి ఫ్రెంచ్ వారు ఆయనకి కమాండర్ హోదాని కలుగజేసారు. ఎమ్రాయ్ విశ్వవిద్యాలయంలో విశిష్ట స్థానిక రచయితగా నాలుగు సంవత్సరాల కాలపరిమితికి ఎంపికయ్యారు. అగ్ర శ్రేణిలోని 50 మంది బ్రిటిష్ రచయితలలో టైమ్స్, రష్డీని 13 వ స్థానాన్నిచ్చి గౌరవించింది. తాజాగా 2010 లో వచ్చిన రష్డీ పుస్తకం లూకా అండ్ ది ఫైర్ ఆఫ్ లైఫ్.
ఇక వివాదాన్ని రేపిన ఆయన నాల్గవ పుస్తకం సెటానిక్ వెర్సెస్ కి యుకె లో అనుకూలంగా స్పందించారు కానీ, ముస్లిం సంఘాలన్నీ బహిష్కరించి తీవ్రంగా ఖండించటంతో ఇరాన్ అధినేత అయాతుల్లా రుహోల్లా ఖొమేని 1989లో సల్మాన్ రష్డీ మీద మరణశిక్ష ఆదేశాన్ని (ఫత్వా) జారీచేసారు. 1988 లో ఈ పుస్తకం బుకర్ పురస్కారానికి ఫైనల్ కి వచ్చినా, పీటర్ కారీ రచించిన ఆస్కార్ అండ్ లుసిండాకి ఆ బహుమతి దక్కింది. కానీ అదే సంవత్సరం విట్ బ్రెడ్ పురస్కారాన్ని గ్రహించింది. ముస్లిం సంఘాలన్నీ వారి మతనమ్మకాలను వెక్కిరిస్తున్నట్టుగా ఉందంటూ సెటానిక్ వెర్సెస్ పుస్తకాన్ని తీవ్రస్థాయిలో ఖండించారు.
సెటానిక్ వెర్సెస్ లో ఏముంది?
రష్డీ రచనల్లో చోటుచేసుకునే ఇంగ్లాండ్ దేశం నుంచి పంపించేసిన భారతీయుల పాత్రలు ఇందులోనూ ఉన్నాయి. వాళ్ళిద్దరూ గిబ్రీల్ ఫరిస్తా, సలాదీన్ చమ్చాలు. రెండు పాత్రలూ ముస్లిం మతం వారే. అందులో ఫరిస్తా ముంబై సినిమా నటుడు. అతను హిందూ దేవతల పాత్రలను వేసేవాడు. ఈ పాత్రలో కొంత అమితాభ్ బచ్చన్, కొంత మన దివంగత ఎన్టీఆర్ లక్షణాలు కనిపిస్తాయి. చంచా తన మాతృదేశ బంధాలను వదులుకుని ఇంగ్లాండ్ లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేస్తుంటాడు. భారతదేశం నుంచి ఇంగ్లాండ్ కి పోయే విమానంలో వీరిద్దరూ ప్రయాణం చేస్తుంటారు. ఆ విమానం హైజాక్ అవుతుంది. మధ్యలో పేలిపోయి విమానం ఇంగ్లీష్ ఛానెల్ లో పడుతుంది. వీళ్ళిద్దరు మాత్రం విచిత్రంగా బతికి పోతారు.
ఫరిస్తా దేవతా స్వరూపంగానూ, చమ్చా రాక్షస స్వరూపంగానూ, ఇద్దరూ వారి వారి లక్షణాలలో పరివర్తన పొందుతారు. చట్ట విరుద్ధంగా వలస వచ్చిన నేరం మీద చెమ్చా పోలీసుల బారిన పడతాడు. ఇద్దరూ తమ తమ బతుకు యుద్దంలో బయటపడటానికి పోరాడుతుంటారు. ఫరిస్తా తన పాత ప్రేమికురాలు బ్రిటిష్ పర్వతారోహకురాలు అల్లీ కోన్ ను వెతికి పట్టుకుంటాడు. కానీ ఫరిస్తాకున్న మానసిక వ్యాధి (దేవతగా పరివర్తన) వలన ప్రేమికుల మధ్యలో అడ్డుగోడపడుతుంది.
ఈ లోపులో చమ్చా తన అసలు రూపం (లక్షణం) లోకి మార్పు చెందుతాడు. కానీ ఫరిస్తా మీద పగపడతాడు. ఇద్దరూ ఒకేసారి హైజాకైన విమానంలోంచి కలిసే కిందపడతారు కదా, అయినా తన మానాన్న తనని వదిలేసినందుకు ఫరిస్తా మీద కసి పెంచుకుంటాడు. దానితో ఫరిస్తాలో అనుమానం, అసూయలను పెంచేసి ప్రేమికుల మధ్య అగాధాన్ని కల్పిస్తాడు. కాలాంతరంలో ఫరిస్తాకు చెమ్చా చేసిన పని అర్థమౌతుంది. కానీ క్షమించి వదిలేయటమే కాక, అతని ప్రాణాలను కూడా కాపాడుతాడు. అందరూ భారతదేశానికి తిరిగివచ్చేస్తారు. కానీ ఫరిస్తాలో తగ్గని మానసిక దౌర్బల్యం వలన మరో సంఘటనలో అల్లీ మీద అసూయ పెంచుకుని ఆమెను హత్య చేసి ఆ తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. ఫరిస్తా వలన క్షమాగుణాన్ని అలవరచుకున్న చెమ్చా తన తల్లిదండ్రులను కలుసుకుని తన భారతీయ పౌరసత్వం గురించి తెలుసుకుంటాడు. దానితో భారతదేశంలోనే ఉండిపోదలచుకుంటాడు.
అసలు గొడవ ఈ కథలో లేదు. ఈ కథలో మధ్యలో చేర్చిన స్వప్నావస్తలోని సంఘటనలలో ఉంది. గిబ్రీల్ ఫరిస్తా మానసిక సంతులనాన్ని పోగొట్టుకున్న సందర్భంలో అతనికి వచ్చిన కలల సామ్రాజ్యంలో మాట్లాడినవి, చేసినవి కూడా మత నమ్మకాల మీద దురాచారాల మీద మతంలోని అపనమ్మకాల మీద ఆధారపడి ఉన్నాయి. మక్కాలో ముహమ్మద్ ప్రవచనాలను కథ పాత్రకు తగ్గట్టుగా మార్చి చెప్పాడు రష్డీ. ఆ మధ్యలో వస్తాయి సెటానిక్ వర్సెస్- అంటే దానవ వచనాలు. అందులో బహురూపాలతో దేవుడిని కొలిచే వారిని సమర్థిస్తాడు. కానీ ఆ తర్వాత అదంతా సైతాన్ ప్రభావం వలన చెప్పానని ఒప్పుకుంటాడు.
ఇలా దైవ వాక్యాలను పలికే అతనికి వ్యతిరేకులు కూడా ఉంటారు. అందులో హింద్ అనబడే ఒక దానవ (మహిళా) మత గురువు, బాల్ అనే ఒక వికటకవి కూడా ఉంటారు. బాల్ బయటకు తెలియని ఒక వ్యభిచార గృహంలో తలదాచుకుంటుంటాడు. అక్కడ వ్యభిచార వృత్తిలో ఉన్న స్త్రీలంతా ప్రవక్త భార్యలుగా తమను తాము ఊహించుకుని ఆ పాత్రలను ఆపాదించుకుంటారు. అంతేకాదు ప్రవక్త శిష్యులలో ఒకడు ప్రవక్త చెప్పే దైవ సందేశాలనే శంకించి, వాటి రూపాలను మార్చి వారికి చెప్పగా ఆ స్త్రీలు వాటినే వల్లెవేస్తుంటారు.
మరో సన్నివేశంలో అయేషా అనే ఒక పల్లె కన్య తనకి ఆర్చాంజెల్ గిబ్రీల్ నుంచి దైవ సంకేతాలు వచ్చాయని చెప్తూ పల్లె ప్రజలను కూడగట్టుకుని మక్కా వరకూ పాదయాత్ర చేస్తుంది. వారంతా అరేబియా మహా సముద్రం మీద నడిచి వెళ్ళగలరని నమ్మబలుకుతుంది. వారంతా ఆ నమ్మకంతో సముద్రంలో కాలుపెడతారు. ఫలితంగా కనిపించకుండా పోతారు. అయితే అదంతా చూసినవారిలో కొందరేమో వాళ్ళంతా మునిగిపోయారని, మరికొందరేమో దైవ మాయా ప్రభావం వలన ఆవలి ఒడ్డుకి చేరుకున్నారని చెప్తారు.
ఇక మూడవ స్వప్న సన్నివేశంలో ఒక మత ఛాందసుడుంటాడు. అతని లక్షణాలు పర్షియాలో అఙాతంలో ఉన్న అయాతుల్లా ఖోమేనిని పోలివుంటాయి.
సల్మాన్ రష్డీ రచించిన ఈ పుస్తకానికి సాహితీ కారుల నుంచి విశ్లేషకుల నుంచీ చక్కటి పొగడ్తలు లభించినా ముస్లిం వర్గాల నుంచి పూర్తి వ్యతిరేకత వచ్చింది. దానివలనే విమర్శలు, దానివలనే మరణశిక్ష విధిస్తూ జారీ అయిన ఫత్వా.
సెటానిక్ వెర్సెస్ పుస్తకంలోని రచనా శైలి, మూలార్థాలు తెలియాలంటే ఆ పుస్తకాన్ని చదవాల్సిందే. దాన్ని ఖండించాలన్నా అంతే. పైన చెప్పిన కథ కేవలం ఒక మోటు వివరణ (rough presentation) మాత్రమే సుమా!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more