Ramayanam-Forty-One-Story | రామాయణం - 41వ భాగం

Ramayanam forty one story

Ramayana, Ramayana Forty-One, Ramayana Story, Ramayana Epic Story, Ramayana Parts, Ramayanam 41th Part

The Ramayana is an ancient Sanskrit epic about Rama. It is one of the two most important ancient epics of India, the first one being the ancient Ramayana. The epic was originally written by sage (rishi) Valmiki of Ancient India. The book has about 96,000 verses and is divided into seven parts.

రామాయణం-41వ-భాగం

Posted: 08/20/2018 02:22 PM IST
Ramayanam forty one story

తరువాత 14 మంది సైన్యాధిపతులని పిలిచి " మీరు వెంటనే బయలుదేరి వెళ్ళండి, శూర్పణఖ మీకు ఒక ఆశ్రమానికి దారి చూపిస్తుంది. అక్కడ మీరు రామలక్ష్మణులు ఇద్దరినీ సంహరించండి. వాళ్ళని చంపాక ఇక్కడికి తీసుకురండి, మా చెల్లి వాళ్ళ రక్తాన్ని తాగుతుంది " అన్నాడు.

తాపసులైన ఆ రామలక్ష్మణులని చంపడం చాలా తేలికని భావించి ఆ 14 మంది పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు శూర్పణఖ వాళ్ళకి రామ లక్ష్మణులని చూపించింది. వెంటనే ఈ 14 మంది శూలాలు, కత్తులు, పరిఘలు మొదలైన ఆయుధాలని పట్టుకొని రామలక్ష్మణుల మీదకి పరుగుతీసారు. అప్పుడు రాముడు " లక్ష్మణా! నువ్వు సీతమ్మ పక్కన నిలబడు, నేను వీళ్ళ సంగతి చూస్తాను " అన్నాడు.

ఇంద్రుడి చేతినుండి వజ్రాయుధం విడువబడినట్టు, రాముడు బాణములను తన ధనుస్సుకి సంధించి విడిచిపెట్టాడు. రాముడు వదిలిన ఆ బాణాలు వాళ్ళ గుండెలకి ఉన్న కవచాలని పగలగొట్టి, వాళ్ళ గుండెల్ని చీల్చుకుంటూ భూమిలో గుచ్చుకున్నాయి. ఆ 14 మంది పెద్ద పెద్ద కేకలు వేస్తూ, నెత్తురోడుతూ నేల మీద పడి మరణించారు.

ఇదంతా చూసిన శూర్పణఖ మళ్ళి వెళ్ళి ఖరుడి దెగ్గర పడింది. ఇప్పుడే కదా 14 మందిని పంపించాను, మళ్ళి ఏమయ్యిందని ఇలా పడిపోయావు, అని ఖరుడు అడిగాడు. అప్పుడా శూర్పణఖ " పంపించావులేవయ్య 14 మందిని రామలక్ష్మణులని చంపమని, వాళ్ళని రాముడు ఒక్క క్షణంలో చంపేసాడు. రాముడు మహావీరుడు. నిజంగా నీకు రాముడిని ఎదురించే శక్తి ఉంటె నీ దెగ్గరున్న కింకరులని పంపించడం కాదు, నువ్వే స్వయంగా బయలుదేరు. నువ్వు వచ్చి దండకారణ్యంలో రాక్షసులకి కంటకంగా ఉన్న ఆ రాముడిని సంహరించు. నువ్వు రాముడిని చంపడానికి వెళ్ళకపోతే, నీ ఎదురుగుండా నేను నా ప్రాణాలని వదిలేస్తాను. అస్తమానం నా దెగ్గరికి వచ్చి, నేను వాడిని వీడిని చంపాను అంటావేంటి, అవన్నీ ఒట్టిదే, నువ్వు శూరుడివి కాదు. రాముడు మహావీరుడని చెప్పాను కదా, వెంటనే లేచి ఎక్కడికన్నా పారిపో " అనింది.

ఈ మాటలు విన్న ఖరుడికి ఎక్కడలేని ఉక్రోషం వచ్చి " నేను ఇప్పుడే బయలుదేరతాను, నా ఎదుట యుద్ధంలో దేవేంద్రుడే నిలబడ్డా సంహరిస్తాను. మృత్యుదేవతకి మృత్యువుని నేను. నేను కాని యుద్ధానికి వెళితే, నా ముందు నిలబడగలిగే వాడు అంటూ ఎవడూ ఉండడు " అని పలికి, 14,000 మంది రాక్షసులతో కలిసి రామలక్ష్మణుల మీదకి యుద్ధానికి బయలుదేరాడు.

ఆ ఖరుడు బంగారంతో చెయ్యబడ్డ రథం ఎక్కి బయలుదేరాడు. అప్పుడు గాడిద రంగులో ఉన్నటువంటి మేఘాలు ఆకాశంలో వచ్చి ఎర్రటి నీటిని వర్షించాయి, ఆయన రథాన్ని నడుపుతున్న గుర్రాలు చాలా సమతలంగా ఉన్నటువంటి ఆ దారిలో తొట్రుపడి, ముందుకి పడిపోయి, పైకి లేచి నడిచాయి. ఆకాశంలో సూర్యుడి చుట్టూ నలుపు-ఎరుపు రంగుల వలయం ఏర్పడింది. ఒక గ్రద్ద ఎగురుతూ వచ్చి ఆయన ధ్వజం మీద వాలి వెళ్ళిపోయింది. దిక్కులన్నీ అకారణంగా చీకటితో నిండిపోయాయి. నక్కలు నోట్లోనుంచి అగ్నిని కక్కుతూ, ఎదురుగా వచ్చి పెద్దగా ఏడిచాయి. ఇన్ని దుశ్శకునాలు ఎదురొచ్చినా, ఆ ఖరుడు వాటిని లెక్కపెట్టకుండా ముందుకి వెళ్ళాడు.

ఆ ఖరుడి చుట్టూ 12 మంది రాక్షస సేనానులు నిల్చున్నారు. వాడితోపాటు దూషణుడు, త్రిశిరస్కుడు, ప్రమాథి, స్థూలాక్షుడు, మహాకపాలుడు మొదలైన భయంకరమైన రాక్షసులు కూడా బయలుదేరారు.

అటుపక్క రాముని ఆశ్రమంలో, పక్షులు చిత్రవిచిత్రమైన కూతలు కూస్తున్నాయి, భూమి ఒక్కసారి కంపించింది, అలా కంపించడం వలన బంగారు పిడి కలిగిన ధనస్సు ఎగిరి ఎగిరి పడుతోంది, బాణముల చుట్టూ ధూమం ఆవరించింది. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి " లక్ష్మణా! నిష్కారణంగా పర్ణశాలలో ఉన్న ధనుస్సు భూమి కంపించేసరికి ఎగిరి ఎగిరి పడుతోంది, అలాగే బాణముల చుట్టూ ధూమం ఆవహిస్తోంది, అంటె గొప్ప యుద్ధం వస్తోందని ధనుర్బాణములు ఆనందపడుతున్నాయి. దూరంగా పక్షి కూస్తోంది అంటె, ఈ యుద్ధంలో జయాపజయాలు దైవనిర్ణయాలు. నా ఎడమ భుజం అదురుతోంది కనుక, ఖచ్ఛితంగా మనం గెలుస్తామని అనుకుంటున్నాను.

తస్మాత్ గృహీత్వా వైదేహీం శర పాణిః ధనుర్ ధరః |గుహాం ఆశ్రయ శైలస్య దుర్గాం పాదప సంకులాం ||అందుకని లక్ష్మణా నువ్వు వెంటనే ధనుర్బాణములని పట్టుకొని, సీతని తీసుకొని, ఎవరు చూసినా కూడా కనపడనంతగా చెట్లతో కప్పబడిన ఒక పర్వత గుహలోకి వెళ్ళిపో. నేను యుద్ధం చేస్తాను. నువ్వు నాతో 'సీతమ్మని తీసుకొని లోపలికి వెళ్ళిపో' అనే మాటలు చెప్పమాకు. నువ్వు యుద్ధం చెయ్యలేవు అని కాదు, నువ్వు ఒక్కడివే వీళ్ళని చంపగలవు, కాని వీళ్ళతో యుద్ధం చెయ్యాలని నేను కోరుకుంటున్నాను, అంతేకాని నిన్ను తక్కువ చేసి చూడడం లేడు. నేను చెప్పింది విని తొందరగా సీతని తీసుకొని వెళ్ళిపో " అన్నాడు.

అప్పుడు సీతమ్మని తీసుకొని లక్ష్మణుడు ఒక పర్వత గుహలోకి వెళ్ళాడు. క్రోధంతో కోదండాన్ని పట్టుకొని ఉన్న రాముడిని చూస్తే, ఆనాడు పినాకిని అనే ధనుస్సుని పట్టుకొని దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యడానికి నిలబడ్డ రుద్రుడైన శివుడిలా ఉన్నాడని వాల్మీకి మహర్షి చెప్పారు.

ఆశ్రమానికి వచ్చిన ఖరుడు తన సైన్యంతో రాముడిని చుట్టుముట్టాడు. మధ్యలో రాముడు ఒక్కడే ఉన్నాడు, రాముడి చుట్టూ 14,000 మంది రాక్షసులు నిలబడ్డారు. అప్పుడు వాళ్ళు రాముడి మీద బాణాలు, శూలాలు, గదలు మొదలైనవి విసిరారు. వాటి దెబ్బలకి రాముడి ఒళ్ళంతా నెత్తురోడింది. నదీ ప్రవాహం వచ్చి కలిసిపోతునప్పుడు సముద్రం ఎలా సంతోషంగా ఉంటుందో, పెద్ద వర్షం పడుతున్నప్పుడు ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఆబోతు ఎలా నిలబడుతుందో అలా రాముడు నిలబడి, ఆ బాణ ప్రవాహాన్ని స్వీకరిస్తూ నిలబడ్డాడు.

రాముడు ఒక్కసారి తన ధనుస్సుని తీసి మండలాకారంగా తిప్పి ఆ రాక్షసుల మీద బాణ ప్రయోగం చేశాడు. ఎప్పుడు ఆ అక్షయబాణ తూణీరంలొ నుంచి బాణం తీశాడో, ఎప్పుడు ఆ బాణాన్ని తన ధనుస్సుకి సంధించాడో, ఎప్పుడు గురి చూసి ఆ బాణాన్ని విడిచిపెట్టాడో ఎవరూ చూడలేదు, అంత వేగంగా బాణ ప్రయోగం చేశాడు. రాముడు ఒక్కడు నేల మీద నుంచి యుద్ధం చేస్తుంటే, దారుణంగా 14,000 మంది రాక్షసులు రథాలలో ఉండి రాముడితో యుద్ధం చేస్తున్నారని ఆకాశంలో దేవతలు, మునులు నిలబడి రాముడికి విజయం చేకూరాలని ఆశీర్వదించారు. ఆ యుద్ధానికి దిక్కులన్నీ కదిలిపోతున్నాయి, పర్వతాలు ప్రకంపించాయి, వన దేవతలు వనాన్ని విడిచి పారిపోయారు, క్రూరమృగాలు దిక్కులు పట్టి పారిపోయాయి. రాముడి బాణ పరంపరకి ఏనుగుల తొండాలు తెగిపోయాయి, గుర్రాల కాళ్ళు రాలిపోయాయి, రాక్షసుల కంఠాలు నేల మీద పడ్డాయి, కొందరికి భుజాలు, కొందరికి కాళ్ళు తెగిపోయాయి. రాముడు ఏక కాలంలో 13 బాణాలని వింటినారికి తొడిగి విడిచిపెట్టేవాడు. అలా ఆ 14,000 మంది రాక్షసులని రాముడు ఒక్కడే సంహరించాడు.

దూషణుడు ఆగ్రహంతో ఒక పరిఘని పట్టుకొని రాముడి మీదకి వచ్చాడు, అప్పుడు రాముడు వాడి రెండు చేతులు నరికి ఒక దెబ్బ కొట్టాడు. రాముడు కొట్టిన దెబ్బకి ఆ దూషణుడు ఏనుగు పడిపోయినట్టు నేల మీద పడి మరణించాడు. ఇంక ఆ యుద్ధరంగంలో ఖరుడు, త్రిశిరస్కుడు మాత్రమే మిగిలారు. ఖరుడి ఆజ్ఞ మేరకు త్రిశిరస్కుడు యుద్ధానికి వచ్చి రాముడి చేతిలో మరణించాడు.

అప్పుడు ఖరుడు రాముడితో భయంకరమైన యుద్ధం చేశాడు. రాముడు వింటినారిలో బాణం తొడుగుతుంటే, ఆ ఖరుడు అపారమైన వేగంతో తన రథంలో వచ్చి రాముడి పిడికిలి మీద కొట్టాడు. ఆ దెబ్బకి వింటినారి తెగిపోయి ఆ ధనుస్సు విరిగిపోయింది. అప్పుడా ఖరుడు అమితమైన వేగంతో రాముడి గుండెల మీద బాణాలని వేసేసరికి, ఆయన కవచం పిట్లిపోయి కింద పడిపోయింది. అప్పుడాయన రాముడి గుండెల మీద బాణాలతో కొట్టాడు, ఆ దెబ్బలకి పర్వతాల నుంచి సెలయేళ్ళు పారినట్టు, రాముడి గుండెల నుంచి రక్తం కారింది.

అప్పుడు రాముడు పక్కనే ఉన్న అగస్త్య మహర్షి ప్రసాదమైన విష్ణు ధనుస్సుని తీసుకుని ఖరుడితో ఇలా అన్నాడు " వాడు మూడులోకములను పరిపాలించగల సమర్ధుడైనా, పాపకర్మలను చేస్తున్నవాడు మాత్రం బతకడు. లోకానికి విరుద్ధమైన పనులు చేస్తూ బతికేవాడికి కొంతకాలం లోకం తలవంచి ఉండవచ్చు, కాని వాళ్ళకి ఒకసారి అవకాసం వస్తే, పదిమందిలో ఒక్కత్తె వెళ్ళిపోతున్న పాము కనబడితే అందరూ కర్రలతో కొట్టి చంపినట్టు, అందరూ కలిసి అటువంటివాడిని చంపేస్తారు. ఎక్కడో పర్ణశాలల్లో కూర్చుని తపస్సు చేసుకునే ఋషుల మీద నీకు ఎందుకు ఆగ్రహం, వాళ్ళని ఎందుకు బాధ పెట్టావు. వాళ్ళని బాధ పెట్టిన ఫలితాన్ని నువ్వు ఇప్పుడు అనుభవిస్తావు. ఏ ఋతువులో ఏ పువ్వు పుయ్యాలో, ఆ ఋతువులో ఆ పువ్వు పూస్తుంది. అలా పాపము యొక్క ఫలితాన్ని ఎప్పుడు ఇవ్వాలో పరమేశ్వరుడికి తెలుసు, ఆయన ఇవ్వడం సిద్ధం చేసిననాడు ఆ ఫలాన్ని అనుభవించాలి. ఏ భూమిని నువ్వు ఇంతకాలం బాధ పెట్టావో, ఆ భూమి ఈనాడు నీ ఒంట్లోనుంచి కారే వేడి నెత్తురు తాగుతుంది. నువ్వు ఇంతకాలం చేసిన పాపాలకి ఫలితంగా నీ కుత్తుకని తీసేస్తున్నాను " అన్నాడు.

ఆ మాటలకి ఆగ్రహించిన ఖరుడు యమపాశం లాంటి ఒక అద్భుతమైన గదని రాముడి మీదకి వేశాడు. ఆ గద దారిలో అడ్డొచ్చిన చెట్లని కాల్చుకుంటూ రాముడి మీదకి దూసుకువచ్చింది. అప్పుడు రాముడు ఏకకాలంలో కొన్ని బాణములను ప్రయోగించగా, ఆ గద మార్గమధ్యలోనే తుత్తునియలు అయిపోయింది. తరువాత రాముడు వేసిన బాణాలకి ఆ ఖరుడి ధ్వజం, గుర్రాలు, సారధి పడిపోయారు. ఆ బాణాలు ఖరుడి గుండెల్లో దిగేసరికి, ఆయన గుండెల్లో నుంచి నెత్తురు ఏరులై ప్రవహించింది. ఇక తాను చనిపోతానన్న ఆక్రోశంతో, అక్కడ ఉన్న ఒక పెద్ద సాలవృక్షాన్ని పెరికించి, దాన్ని రాముడి మీద వెయ్యబోగా, రాముడు ఆ చెట్టుని నారాచ బాణములతో ముక్కలు చేశాడు. అప్పుడా ఖరుడు రాముడి మీద పడబోగా, ఆయన బాణం పెట్టి కొట్టగానె, ఖరుడు భూమి మీద పడి మరణించాడు.

అర్థ అధిక ముహూర్తేన రామేణ నిశితైః శరైః |చతుర్ దశ సహస్రాణి రక్ష్సాం కామ రూపిణాం |ఖర దూషణ ముఖ్యానాం నిహతాని మహామృధే ||రాముడు ఆ 14,000 మంది రాక్షసులని ఒక గంటా 12 నిమిషాల్లో సంహరించాడు. ఆయన తిరిగి వెనక్కి వస్తుంటే పైనుండి పుష్పవృష్టి కురిసింది. అక్కడున్న ఋషులందరూ ఎంతో సంతోషించారు. అప్పటిదాకా ఏమి జెరుగుతోందో అని కంగారుపడుతూ చూస్తున్న సీతమ్మ ఒక్కసారి పరుగుపరుగున వచ్చి రాముడిని ముందునుంచి గట్టిగా కౌగలించుకుంది. పూర్ణచంద్రుడిలా వెలిగిపోతున్న ముఖంతో సీతమ్మ రాముడిని పక్కన నుంచి, వెనక నుంచి, మళ్ళి మళ్ళి కౌగలించుకుంది.

అన్నయ్య చేసిన శత్రు సంహారానికి లక్ష్మణుడు పొంగిపోయాడు. చంద్రుడివంటి ముఖంతో సీతమ్మ కౌగలించుకునేసరికి రాముడు తన కష్టాన్నంతా మరిచిపోయాడు. అప్పుడు వాళ్ళంతా ఆనందంగా పర్ణశాలలోకి వెళ్ళారు.

Source: fb.com/LordSriRamaOfficalPage

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramayana  Parts  రామాయణం  భాగాలు  

Other Articles

  • Ramayanam forty seven story

    రామాయణం-47వ-భాగం

    Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more

  • Ramayanam forty six story

    రామాయణం-46వ-భాగం

    Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more

  • Ramayanam forty five story

    రామాయణం-45వ-భాగం

    Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more

  • Ramayanam forty four story

    రామాయణం-44వ-భాగం

    Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more

  • Ramayanam forty three story

    రామాయణం-43వ-భాగం

    Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more