Ramayanam-Forty-Story | రామాయణం - 40వ భాగం

Ramayanam forty story

Ramayana, Ramayana Forty, Ramayana Story, Ramayana Epic Story, Ramayana Parts, Ramayanam 40th Part

The Ramayana is an ancient Sanskrit epic about Rama. It is one of the two most important ancient epics of India, the first one being the ancient Ramayana. The epic was originally written by sage (rishi) Valmiki of Ancient India. The book has about 96,000 verses and is divided into seven parts.

రామాయణం-40వ-భాగం

Posted: 08/16/2018 02:19 PM IST
Ramayanam forty story

కశ్యపుడి మాట వినని భార్యలైన కాళికకి నరకుడు, కాలకుడు అనే ఇద్దరు జన్మించారు. తామ్రకి క్రౌంచి, భాసి, శ్యేని, ధృతరాష్ట్రీ, శుకి అనే 5 కన్యలు జన్మించారు. మళ్ళి క్రౌంచికి గుడ్లగూబలు పుట్టాయి. భాసికి భాస పక్షులు పుట్టాయి. శ్యేనికి డేగలు, గ్రద్దలు పుట్టాయి. ధృతరాష్ట్రీకి హంసలు, చక్రవాకములు పుట్టాయి. శుకికి నత అనే పిల్ల పుట్టింది. నతకి వినత అనే పిల్ల పుట్టింది. ఆ వినతకి గరుడుడు, అరుణుడు అనే ఇద్దరు పుట్టారు. నేను ఆ అరుణుడి కుమారుడిని, నా పేరు జటాయువు, నా అన్నగారి పేరు సంపాతి.

అలాగే క్రోధవశకి మృగీ, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, కద్రువ అనే 10 మంది ఆడపిల్లలు పుట్టారు. మృగికి లేళ్ళు పుట్టాయి, మృగమందకి ఎలుగుబంట్లు పుట్టాయి, హరికి సింహాలు, బలమైన వానరాలు పుట్టాయి, భద్రమదకి ఇరావతి అనే పిల్ల పుట్టింది, ఆ ఇరావతికి ఐరావతం పుట్టింది, మాతంగికి ఏనుగులు పుట్టాయి, శార్దూలికి కొండముచ్చులు, పులులు పుట్టాయి, శ్వేతకి దిగ్గజాలు పుట్టాయి, సురభికి రోహిణి, గోవులు, గంధర్వులు మొదలైనవి పుట్టాయి. సురసకి అనేక పడగలు కలిగిన నాగపాములు పుట్టాయి, కద్రువకి సాధారణమైన సర్పములు పుట్టాయి.

రామా! ఇంతకీ ఇవన్నీ నీకు ఎందుకు చెప్పానో తెలుసా, కనబడేటటువంటి ఈ పక్షులు, మృగాలు, పశువులు అన్ని కశ్యప ప్రజాపతి సంతానం నుంచి వచ్చినవే " అని అన్నాడు ఆ జటాయువు.
ఇదంతా విన్న రామచంద్రమూర్తి జటాయువుని తమతో పాటే ఉండమన్నాడు. అక్కడినుంచి అందరూ పంచవటికి పయనమయ్యారు.

రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, జటాయువు పంచవటిని చేరుకున్నారు. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి " లక్ష్మణా! అగస్త్య మహర్షి చెప్పిన ప్రదేశానికి మనం చేరుకున్నాము. అందుచేత ఇక్కడ సమతలంగా ఉండి, కావలసినంత నీరు దొరికేటటువంటి, దర్భలు, పండ్లు, కందమూలాలు, తేనె మొదలైనవి దొరికేటటువంటి, దేవతారాధన చేసుకోవడానికి కావలసిన పుష్ప సంవృద్ధి కలిగినటువంటి ప్రదేశాన్ని నిర్ణయించి, అక్కడ ఒక పర్ణశాలని నిర్మించు " అన్నాడు.

పరవాన్ అస్మి కాకుత్స్థ త్వయి వర్ష శతం స్థితే |

స్వయం తు రుచిరే దేశే క్రియతాం ఇతి మాం వద ||

అప్పుడు లక్ష్మణుడు " స్వామీ! నన్ను నిర్మించమని చెప్తావేంటి, నిర్మించేవాడిని నేను కాదు. నూరు సంవత్సరములకు కూడా నువ్వు ఆజ్ఞాపించాలి, నేను నీ ఆజ్ఞని పాటించాలి. లక్ష్మణా! ఈ ప్రదేశంలో పర్ణశాలని నిర్మించు అని నువ్వు ఆజ్ఞాపిస్తే, రాముడు ఆజ్ఞాపించాడు కనుక ఇక్కడ పర్ణశాల నిర్మిస్తున్నాను అన్న భావనలో ఉన్న సంతోషం, నేనే ఒక ప్రదేశాన్ని నిర్ణయించి, రాముడు కోరినట్టు ఆశ్రమాన్ని నిర్మించాను అనడంలో లేదు " అన్నాడు.

అప్పుడు రాముడు లక్ష్మణుడి చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి " లక్ష్మణా! ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించినట్టయితే చాలా బావుంటుంది. మనం ఎక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకోవాలని అగస్త్య మహర్షి మనసులో కోరుకున్నారో, ఇది అటువంటి రమ్యమైన ప్రదేశం. ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుంటే గలగలా పారే గోదావరి కనబడుతుంది, దూరంగా పెద్ద పెద్ద పర్వతాలు కనబడతాయి, ఆ పర్వత చెరియల మీద విహరించే అనేక మృగాల గుంపులు కనబడతాయి. హంసలు, కారణ్డవములు మొదలైన జలపక్షులు కనబడుతుంటాయి, ఈ ప్రాంతం చాలా అందంగా, పనస, పున్నాగ, నేరేడు, మామిడి మొదలైన దేవతా వృక్షములతో శోభితమై అలరాడుతోంది. అగస్త్యుడు మనన్ని ఉండమని చెప్పిన ప్రదేశం ఇదేనని నాకు అనిపిస్తోంది, అందుకని లక్ష్మణా, నువ్వు ఇక్కడ పర్ణశాలని నిర్మించు " అన్నాడు.

ఉత్సాహంతో లక్ష్మణుడు భూమిని తవ్వి, మట్టిని తీసి, నీరు పోసి, ముద్దని చేసి పెద్ద పెద్ద రాటలు తెచ్చి పాతాడు, వాటి మధ్య మట్టితో అందమైన గోడలు కట్టాడు, దానిమీద అడ్డుకర్రలు వేశాడు, వాటిమీద జమ్మి మొదలైన కర్రలు, దర్భ గడ్డి వేసి పందిరి నిర్మించి చక్కని పర్ణశాలని నిర్మించాడు. తరువాత గోదావరి తీరానికి వెళ్ళి స్నానం చేసి, కొన్ని నీళ్ళని, పండ్లని, పుష్పాలని తీసుకొని వచ్చి కొత్త ఇంటిలోకి ప్రవేసించేముందు చేసెటటువంటి శాంతికర్మలన్నిటిని నిర్వహించి సీతారాముల దెగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని " అన్నయ్యా! నువ్వు చెప్పినట్టే పర్ణశాల నిర్మాణం చేశాను, వదినతో కలిసి నువ్వు ఒక్కసారి లోపలికి వెళ్ళి, బావుందో లేదో చెప్తే నేను సంతోషిస్తాను " అని అన్నాడు. ( ఆ పర్ణశాల నిర్మాణం తాను ఒక్కడినే చేస్తున్నానని లక్ష్మణుడి ఆనందం. భగవంతుడికి సేవ చెయ్యడంలో తన కష్టాన్ని కూడా మరిచిపోయి చేస్తాడు, అదే ఆయన లక్ష్మి, అందుకనే వశిష్ఠుడు ఆయనకి లక్ష్మణా అని పేరు పెట్టారు)

ప్రీతో అస్మి తే మహత్ కర్మ త్వయా కృతం ఇదం ప్రభో |

ప్రదేయో యన్ నిమిత్తం తే పరిష్వంగో మయా కృతః ||

ఆ పర్ణశాలని చూసిన రాముడు " ఏమి పని చేశావయ్యా, నువ్వు చేసిన ఈ పనికి నేను నీకు ఏమి ఇవ్వగలను. నేను ఇవ్వగలిగిన కానుక ఏంటో తెలుసా " అని లక్ష్మణుడిని రాముడు గట్టిగా కౌగలించుకుని " లక్ష్మణా! నువ్వు నాతో భావము చేత, కృతజ్ఞత చేత, ధర్మము చేత నాకు తమ్ముడివి కాదయ్యా, నువ్వు నాకు తండ్రివి. దశరథ మహారాజు గారు వెళ్ళిపోలేదు, నీ రూపంలో నా దెగ్గరే ఉన్నారు. నేను ఎంత అదృష్టవంతుడిని " అన్నాడు.

అలా వారు ఆ పంచవటిలో రోజూ చెయ్యవలసిన కార్యములను చక్కగా చేసుకుంటూ, వచ్చిన ఋషులతో భగవత్ సంబంధమైన విషయముల మీద చర్చిస్తూ, తెచ్చుకున్న కందమూలాలను తింటూ చాలా సంతోషంగ కాలం గడపసాగారు.

కొంతకాలానికి హేమంత ఋతువు వచ్చింది, అప్పుడు రాముడు ఉదయాన్నే నదిలో స్నానం చెయ్యడానికి బయలుదేరాడు. రాముడి వెనకాల సీతమ్మ, లక్ష్మణుడు వెళ్ళారు. నదిలో స్నానం చేస్తున్న రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! నీకు చాలా ఇష్టమైన కాలం వచ్చింది. ఈ కాలంలొ మంచు బాగా పడుతుంది. ఈ ఋతువులో జనాలందరికీ నీటిని చూస్తే స్నానాదులు చెయ్యడానికి భయమేస్తుంది, సూర్యుడిని చూస్తే ఆనందిస్తారు. అసలు నీటిని చూస్తేనే ఒళ్ళు గడ్డ కట్టేస్తుంది.

నవ ఆగ్రయణ పూజాభిర్ అభ్యర్చ్య పితృ దేవతాః |

ఈ ఋతువులో పంటలు ఇంటికి చేరుతాయి, కనుక అందరూ తమ పితృదేవతలకి నవాగ్రయణ పూజలు చేస్తారు. ఈ సమయంలో పశువులు పాలు బాగా ఇస్తాయి, పాడిపంట చేతికిరావడంతో పల్లెల్లో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడున్నటువంటి జలపక్షులు నీటిలోకి వెళ్ళకుండా, ఒడ్డున కూర్చొని, ముఖాన్ని రెక్కలలో పెట్టుకొని కూర్చున్నాయి. వీటిని చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే, ఉత్తమ క్షత్రియవంశంలో పుట్టి, ప్రగల్భాలు పలికి, యుద్ధంరంగం వైపు చూసి, యుద్ధానికి వెళ్ళకుండా పిరికివాడిలా బయట కూర్చున్నట్టు ఉన్నాయి ఈ పక్షులు. అన్నయ్యా! నాకు ఒక విషయం ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది, అదేంటంటే......సాధారణంగా మనుషులకి తల్లి పోలికలు ఎక్కువగా వస్తాయి, మృగాలకి తండ్రి పోలికలు ఎక్కువగా వస్తాయి. దశరథుడు ధర్మాత్ముడు, భరతుడు చాలా మంచివాడు, భరతుడు కూడా నీలాగే ఇప్పుడు నదిలో స్నానం చేస్తుంటాడు, మరి కైకేయ దుష్టబుద్ధి కలిగినది కదా, ఆవిడ పోలికలు భరతుడికి రాలేదేమిటి " అన్నాడు.

" లక్ష్మణా! నువ్వు ఇప్పటిదాకా భరతుడి గురించి మాట్లాడావు, నా మనస్సు ఎంత సంతోషపడిందో తెలుసా. మధ్యలో కైకమ్మని జ్ఞాపకం తెచ్చుకొని ఎందుకు నిందిస్తుంటావు. అమ్మని అలా నిందించడం తప్పు. ఇంకెప్పుడూ అలా మాట్లాడకు, భరతుడి గురించి మాట్లాడు, నేను పరమ సంతోషిస్తాను. భరతుడిని విడిచిపెట్టి నేను ఉండలేకపోతున్నాను, చిత్రకూట పర్వతం మీద భరతుడు నాతొ మాట్లాడిన మాటలే నాకు గుర్తొస్తున్నాయి. అయోధ్యకి వెళ్ళి భరతుడిని చూసి రావాలని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది " అని రాముడన్నాడు.

కృతాభిషేకః స రరాజ రామః సీతా ద్వితీయః సహ లక్ష్మణేన |

కృత అభిషేకో తు గిరి రాజ పుత్ర్యా రుద్రః స నందిః భగవాన్ ఇవ ఈశః ||

సీతారామలక్ష్మణులు ముగ్గురూ స్నానం చేసి తడి బట్టలతో నిలబడితే, వాళ్ళు అటుగా వెళ్ళే వాళ్ళకి ఇప్పుడే స్నానం చేసి బయటకి వచ్చిన నందికేశ్వర సహిత పార్వతీపరమేశ్వరులులాగ కనబడుతున్నారు అని వాల్మీకి మహర్షి చెప్పారు.

అలా కొంత కాలం గడిచాక, భగవంతుడి నిర్ణయం మేర అక్కడికి ఒక రాక్షసి వచ్చింది. ఆమె పేరు శూర్పణఖ( చాటలంత గోళ్ళు ఉన్నది). అప్పుడామె మదించిన ఏనుగు నడిచినట్టు నడిచేవాడు, విచ్చుకున్న పద్మముల వంటి కన్నులున్నవాడు, అపారమైన తెజస్సున్నవాడు, మన్మధుని సౌందర్యమును గెలవగలిగిన అందమున్నవాడు అయిన రాముడిని చూసింది. అప్పుడామెకి విశేషమైన కామం కలిగింది.

రాముడిని చూస్తే ' అబ్బ ఎంత బావున్నాడో ' అంటారు, ఆమెని చూస్తే ' బాబోయి అలా ఉందేంటి ' అంటారు. రాముడి కడుపు బయటకి కనపడకుండా లోపలికి ఉంటుంది, ఈమె బాన బోర్లించినట్టు పెద్ద పొట్టతో ఉంటుంది. రాముడివి పెద్ద కళ్ళు, ఈమెని వికృతమైన కళ్ళు. అందమైన జుట్టు రాముడిది, ఎర్రటి తీగలలాగ ఉన్న జుట్టు శూర్పణఖది. చూడంగానే మళ్ళి చూడాలనిపించే రూపం రాముడిది, పిల్లలు దడుచుకునే రూపం ఆమెది. రాముడిది మంచి కంఠం, ఈమె మాట్లాడితే కుక్క మొరిగినట్టు ఉంటుంది. రాముడు మంచి యవ్వనంలో ఉన్నాడు, ఈమె ముసలితనంలో ఉంది. రాముడు ఎప్పుడూ న్యాయంగా ప్రవర్తిస్తాడు, ఈమెది ఎప్పుడూ దుష్ట ప్రవర్తన. రాముడు ఎవరినన్నా ఒకసారి చూస్తే, వాళ్ళు సంతోషపడతారు, ఈమె ఎవరినన్నా చూస్తే, వాళ్ళు భయపడతారు.

ఇటువంటి శూర్పణఖ రాముడి వంక చూసి " నువ్వు ఇంత అందంగా ఉన్నావు, జటామండలం కట్టుకున్నావు. నీలాగే ఇంకొక పురుషుడు కూడా కనబడుతున్నాడు. కాని ఇక్కడ ఎవత్తో అందవికారంగా ఒక స్త్రీ కనబడుతోంది. ఇంతకీ మీరు ఎవరు " అని అడిగింది.

అబద్ధం చెప్పడం రాని, తనని కోరి వచ్చింది కదా అని లేనిపోనీ మాటలు స్త్రీల దెగ్గర మాట్లాడడం ఇష్టపడని రాముడు ఇలా అన్నాడు " నేను దశరథ మహారాజు పెద్ద కొడుకుని, నన్ను రాముడు అంటారు. అతను నా తమ్ముడు లక్ష్మణుడు, ఆమె నా భార్య సీత. మేము ముగ్గురమూ తండ్రిగారి మాటకి కట్టుబడి అరణ్యాలకి వచ్చాము. ఇక్కడ తాపసులమై, ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాము. నువ్వు ఎవరు? " అని రాముడు అన్నాడు.

అహం శూర్పణఖా నామ రాక్షసీ కామరూపిణీ |

అరణ్యం విచరామి ఇదం ఏకా సర్వ భయంకరా ||

రావణో నామ మే భ్రాతా యది తే శ్రోత్రం ఆగతః |

వీరో విశ్రవసః పుత్రో యది తే శ్రోత్రం ఆగతః ||

అప్పుడు శూర్పణఖ " నా పేరు శూర్పణఖ. నాకు కామరూపం ఉంది. నేను చాలా భయంకరమైన రీతిలో ఈ అరణ్యం అంతా తిరుగుతూ ఉంటాను. విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారుడైన రావణాసురుడు నాకు అన్నయ్య. నాకు కుంభకర్ణుడు అనే మరో అన్నయ్య ఉన్నాడు, ఆయన ఎక్కువగా నిద్రపోతూ ఉంటాడు. ఒక్క రాక్షస చేష్టితం లేకుండా ఎప్పుడూ ధర్మం అనే తమ్ముడు కూడా ఉన్నాడు, అతని పేరు విభీషణుడు. గొప్పగా యుద్ధం చెయ్యగలిగే ఖర దూషణులు కూడా నా అన్నలు. నేను ప్రపంచంలో ఎవరిని లెక్కపెట్టను, నాకు అపారమైన బలం ఉంది, స్వేచ్ఛావిహారం చేస్తుంటాను, ఇవ్వాళ నిన్ను చూశాక, నిన్ను నా భర్తగా పొందాలన్న కోరిక పుట్టింది. నువ్వు నన్ను భార్యగా పొంది సుఖం అనుభవించు " అని సీతమ్మ వైపు చూసి " ఈవిడెవరు, ఇంత అసహ్యంగా ఉంది. ఈవిడా నీ భార్య, ఈవిడ నీకు తగినది కాదు, నేను నీకు తగినదానిని. నువ్వు నన్ను స్వీకరిస్తే, ముందు ఈమెని, తరువాత నీ తమ్ముడిని తినేస్తాను, అప్పుడు మనం హాయిగా ఈ అరణ్యంలో విహరించచ్చు" అనింది.

విశేషమైన కామమును పురుషునియందు పొందిన స్త్రీ యుక్తాయుక్తములను మరిచి, నోరు తెరిచి అడిగినప్పుడు ఆమెని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తే, ఆమె మనస్సు ఖేదపడుతుంది. ఒక ఆడదాని మనస్సుని బాధపెట్టేటట్టు మాట్లాడకూడదు కనుక, కాసేపు అటూ ఇటూ తిప్పితే ఆమెకి విసుగొచ్చి వెళ్ళిపోతుందని అనుకొని, చిన్న చిరునవ్వుతో రాముడు ఇలా అన్నాడు " నాకు వివాహం అయ్యిపోయిందమ్మ, నా భార్య మీద నాక చాలా ప్రేమ ఉంది. ఆవిడని విడిచిపెట్టి నేను నిన్ను ఎలా స్వీకరిస్తాను. రెండవ భార్యగా ఉండడానికి ఆడవారు ఇష్టపడరు. అందుకని అన్నివిధాల నాలా ఉన్న, తేజస్సు కలిగిన, చాలాకాలంగా స్త్రీ సుఖానికి దూరంగా ఉన్నవాడైన నా తమ్ముడు కోరుకుంటే, ఆయనకి భార్యగా ఉండు " అన్నాడు.

అప్పుడా శూర్పణఖ లక్ష్మణుడి దెగ్గరికి వెళ్ళి " నీకు తగినటువంటి భార్యని నేను, నువ్వు ఎంత కాంతిగా ఉంటావో నేనూ అంతే కాంతిగా ఉంటాను. నువ్వు అందంగా యవ్వనంలో ఉన్నావు, నేనూ అందంగా యవ్వనంలో ఉన్నాను. అందుకని మనిద్దరమూ సంతోషంగా కాలం గడుపుదాము, నన్ను స్వీకరించు " అనింది.

అప్పుడు లక్ష్మణుడు " నేనే ఓ దాసుడిని, మరి నన్ను కట్టుకుంటే నువ్వు దాసివి అవుతావు. కాబట్టి నన్ను కాదు మా అన్నగారినే అడుగు. నీలాంటి అందగత్తెని చూశాక మా అన్నయ్య వృద్ధురాలు అయిన మా వదినతో ఎలా ఉంటాడు. ఆమెని వదిలేసి నీతోనే ఉంటాడు, అందుకని మా అన్నగారినే అడుగు " అని పరిహాసం ఆడాడు.

లక్ష్మణుడు ఆడిన పరిహాసాన్ని నిజమే అనుకొన్న శూర్పణఖ సీతమ్మని చంపేద్దామని ఆమె మీద భయంకరమైన స్వరూపంతో పడింది. శూర్పణఖ అలా మీద పడబోతుంటే భయపడిపోయిన జింకలా సీతమ్మ వెనక్కి వెళ్ళింది. అప్పుడు రాముడు లక్ష్మణుడితో " చూశావ లక్ష్మణా! ఇలాంటి అనార్యురాలితో పరిహాసం ఆడకూడదు. నువ్వు చెప్పింది నిజమే అనుకొని ఆమె సీతని చంపేద్దామని అనుకొంది. తాను అందగత్తెని అన్న భావన కలుగుతోంది కనుక, స్త్రీ కనుక, కాళ్ళు కాని చేతులు కాని తీసేస్తే అంగవైకల్యం వస్తుంది కనుక, అందం అంతా ముఖాన్ని చూసే అనుకుంటోంది కనుక, ఆమె ముక్కు, చెవులు కోసెయ్యి " అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు ఒక ఖడ్గాన్ని తీసుకొని శూర్పణఖ యొక్క ముక్కు, చెవులని కోసేసాడు. కోసేయబడ్డ ముక్కు, చెవులతో శూర్పణఖ గట్టిగా అరుస్తూ ఆ వనంలోనే ఉన్నటువంటి తన అన్నగార్లైన ఖర దూషణులు దెగ్గరికి వెళ్ళి కిందపడింది. అప్పుడు ఖరుడు " ఇదేమిటి ఇలా ముక్కు, చెవులు కోయించుకున్నావు. తన పక్కన నిశబ్దంగా వెళ్ళిపోతున్న త్రాచుని గోళ్ళతో గీరినవాడు ఎవడు, నిన్ను ముట్టుకున్న వాడు ఎవడు. వాడు ఈ పృథ్విలో ఎక్కడున్నా బతకడు. నా బాణముల చేత వాడి రక్తాన్ని బయటకి తీస్తాను. ఇప్పుడే చెప్పు, వాడు ఎక్కడున్నాడు " అని అడిగాడు.

అప్పుడా శూర్పణఖ ఇలా చెప్పింది " ఇక్కడికి దెగ్గరలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, నార చీరలు కట్టుకున్నారు, మంచి యవ్వనంలో ఉన్నారు, కందమూలాలు తింటూ తాపసులుగా ఉంటున్నారు, ధర్మంతో ప్రవర్తిస్తున్నారు, దశరథ మహారాజు కొడుకులమని చెప్పారు, వాళ్ళ పేర్లు రామ లక్ష్మణులు, వాళ్ళని చూస్తుంటే గంధర్వులు అనాలో, రాజకుమారులు అనాలో నాకు తెలియడం లేదు, అంత అందంగా ఉన్నారు, వారు ఒక చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ ఉంటున్నారు. కాని వాళ్ళ మధ్యలో ఒక అందమైన స్త్రీ ఉంది, ఆమె కారణంగానే నా ముక్కు చెవులు కోసేసారు. అన్నయ్యా! నాకు ఒక్కటే కోరిక ఉంది. నువ్వు ఆ రాముడిని సంహరించాలి. ఆయనలో నుంచి నురగతోటి, బుడగలతోటి వేడి నెత్తురు బయటకి వస్తుంటే, ఆ నెత్తురుని నా దోసిళ్ళతో పట్టుకొని తాగాలని ఉంది, కనుక నా కోరిక తీరుస్తావా " అనింది.

" అయ్యయ్యో, నువ్వు కోరిక అడగడం నేను తీర్చకపోవడమా, తప్పకుండా తీరుస్తాను " అని ఖరుడు అన్నాడు

Source: fb.com/LordSriRamaOfficalPage

 
 

 

 
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramayana  Parts  రామాయణం  భాగాలు  

Other Articles

  • Ramayanam forty seven story

    రామాయణం-47వ-భాగం

    Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more

  • Ramayanam forty six story

    రామాయణం-46వ-భాగం

    Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more

  • Ramayanam forty five story

    రామాయణం-45వ-భాగం

    Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more

  • Ramayanam forty four story

    రామాయణం-44వ-భాగం

    Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more

  • Ramayanam forty three story

    రామాయణం-43వ-భాగం

    Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more