హాస్యం పండిస్తే అచ్చమైన కమెడియన్, క్రూరత్వం చూపిస్తే భయంకరమైన విలన్, కరుణను కురిపిస్తే హార్ట్‌ని టచ్ చేసే అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్... ఇంతమందిని తనలో దాచుకున్న విలక్షణ నటుడు కోట శంకర్రావు. నాటకాలతో కెరీర్ ప్రారంభించి టీవీ, సినిమా రంగాల్లో సైతం తనదైన ముద్ర వేసిన శంకర్రావు పంచుకున్న భావాలు...
తొలి నటనానుభవం...?
చిన్నప్పుడు స్కూల్ యానివర్సరీకి టీచర్లంతా నాటకం వేస్తున్నారు. అందులో ఖైదీలుగా ఉన్న ఇద్దరు దొంగల పాత్రలున్నాయి. టీచర్లు జైలులో ఉంటే బాగోదని వాటిని నన్ను, నా స్నేహితుడు ఆనందరావును వేయమన్నారు. అదే నటుడిగా నా తొలి అనుభవం.
అసలు నటుడవ్వాలని ఎందుకనుకున్నారు?
మాది కృష్ణాజిల్లా కంకిపాడు. నాన్న డాక్టర్ కోట సీతారామాంజనేయులు పెద్ద పెద్ద నటుల్ని మా ఊరు తీసుకొచ్చి నాటకాలు వేయించేవారు. ఆ ఆసక్తే మాకూ వచ్చి నట్టుంది. మా పెద్దన్నయ్య కోట నరసింహారావు ‘గౌరీశంకర్ ఆర్ట్ థియేటర్స్’ స్థాపించి నాటకాలు వేస్తుండేవారు. చిన్నన్నయ్య శ్రీనివాసరావు, నేనూ వాటిలో వేషాలు వేసేవాళ్లం.
సినిమాల్లోకి ఎలా వచ్చారు?
అప్పట్లో ‘రసరాజ్యం’ అనే నాటకాన్ని విరివిగా ప్రదర్శించాం. చాలా అద్భుతమైన నాటకమది. దాన్ని మద్రాసులో ప్రదర్శించినప్పుడు చూసిన దర్శకుడు విజయ బాపినీడు ‘నాకూ పెళ్లాం కావాలి’ సినిమాలో అవకాశమిచ్చారు.
ఇంతవరకూ చేసినవాటిలో తృప్తినిచ్చిన పాత్రలేవి?
ఇప్పటి వరకూ దాదాపు వంద వరకూ చిత్రాల్లో నటించాను. కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రకరకాల పాత్రలు వేశాను. అయితే అంకురం, సూత్రధారులు, లాల్‌సలామ్, పల్నాటి పౌరుషం, జూ లకటక చిత్రాల్లో చేసినవి నటుడిగా ఎంతో తృప్తినిచ్చాయి.
సినిమాల్లో మీకు తగిన ప్రోత్సాహం లభించలేదంటే ఒప్పుకుంటారా?
నిజమే. నటుడిగా రంగస్థలం నన్ను ఓ స్థాయికి తీసుకెళ్లింది కానీ సినిమా రంగం ఆశించినంత ప్రోత్సాహం అందించలేదు. అలాగని ఎవరూ నన్ను పక్కన కూడా పెట్టేయలేదు. ఎంతోమంది దర్శకులు అవకాశాలిచ్చారు. కాకపోతే నా ప్రతిభను పూర్తిస్థాయిలో ప్రదర్శించేంత గొప్ప పాత్రలు మాత్రం రాలేదు.
మీ అన్నయ్య (కోట శ్రీనివాసరావు) ఆ స్థాయికి చేరుకోగలిగారు కదా?
నేను ముప్ఫయ్యేళ్లపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మేనేజర్‌గా పని చేశాను. ఉద్యోగం చేసుకుంటూనే నాటకాలు, సినిమాల్లో నటించేవాడిని. అన్నయ్య కూడా బ్యాంకు ఉద్యోగే. కానీ తను హైదరాబాద్‌లో ఉండేవాడు. దానివల్ల బాగా ప్రయత్నాలు చేసేవాడు. పైగా నటన కోసం తన ఉద్యోగాన్ని పక్కన పెట్టగలిగాడు. నేనలా చేయలేకపోయాను. నా ప్రయత్న లోపమే నన్నా స్థాయికి చేర్చలేదని అనుకుంటున్నాను.
రంగస్థలం... వెండితెర... ఏంటి తేడా?
నటన ఎక్కడైనా ఒకటే. చేసే ప్రదేశం, విధానాలే తేడా. నాటకానికి ప్రిపరేషన్ కష్టం. రెండు నెలలు రిహార్సల్స్ చేయాలి. కానీ ఒక్కసారి స్టేజి ఎక్కాక ఆ మూడ్‌లోకి వెళ్లిపోయి తేలికగా చేసేస్తాం. కానీ కెమెరా ముందు నటించడమంటే అష్టావధానం లాంటిది. కెమెరా యాంగిల్ చూసుకోవాలి, లైటింగ్ చూడాలి, మేకప్ చూడాలి... ఇలా పలు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. పైగా అప్పటికప్పుడు షాట్ రెడీ అంటారు. మనమే మూడ్‌లో ఉన్నా వెంటనే వెళ్లి నటించేయాలి. ఇక్కడ ఎవరి పని వాళ్లది. ఎవరి దారి వాళ్లది.
నటుడిగా మీ రోల్‌మోడల్ ఎవరు?
సీఎస్సార్ ఆంజనేయులు. మాలాంటివాళ్లం పది సినిమాల్లో చేసే నటనను ఆయన ఒక్క సినిమాలో చేసేసేవారు. చాలా గొప్ప నటుడు. ఇంకా మనకు ఎంతోమంది గొప్ప నటులున్నారు. గోవిందరాజుల సుబ్బారావు, ఎస్వీ రంగారావు... ఇలా అందరూ స్ఫూర్తిప్రదాతలే.
మీ సీరియల్స్ గురించి చెప్పండి..?
కలిసుందాం రా, శ్రీమతి, గంగోత్రి, గోకులంలో సీత, ఊర్వశి... ఇలా దాదాపు అరవై పైనే సీరియల్స్ చేశాను. ప్రస్తుతం ఆటోభారతి, పసుపు-కుంకుమ సీరియల్స్ చేస్తున్నాను. సినిమారంగం నిరాశపర్చినా టెలివిజన్ రంగం నాలోని నటుడికి సంతృప్తిని ఇచ్చింది.
మీలా నటులవ్వాలనుకునేవారికి మీరిచ్చే సలహా ఏమిటి?
ముందు మీలో ఆ టాలెంట్ ఉందో లేదో తెలుసుకోండి. ఎవరో చేస్తున్నారు కదా అని మీరు చేయాలనుకోవద్దు. మీరు చేయగలరు అనుకుంటేనే ఈ రంగాన్ని ఎంచుకోండి. అలాగే ఇక్కడ ప్రతిభతో పాటు కాస్తంత అదృష్టం కూడా ఉండాలి. అలా అని అదృష్టం కలిసొచ్చినంత మాత్రాన పొంగిపోవద్దు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి శాయశక్తులా శ్రమించండి.
నా భార్య భాగ్యలక్ష్మి గృహిణి. పెద్దమ్మాయి అరుణ ఆంధ్రాబ్యాంక్ మేనేజర్. రెండో అమ్మాయి ఫణి కూడా బ్యాంకు ఆఫీసరే. అబ్బాయి నటరాజ్ డెంటిస్ట్. నటన మీద ఉన్న ప్రేమతో నా కొడుక్కి నటరాజు అని పేరు పెట్టుకున్నాను. కానీ పిల్లలెవరూ ఈ రంగంలోకి రావడానికి ఆసక్తి చూపలేదు. ఇష్టంలేని పనిని బలవంతంగా చేయించడం తప్పు. అందుకే నేను వారికి ఇష్టమైన ఉద్యోగాల్లోకి వెళ్లడానికి ప్రోత్సహించాను.
(And get your daily news straight to your inbox)
Nov 25 | దాదాపు 24 సంవత్సరాల నుండి తెలుగు ప్రేక్షకులను కేరక్టర్ ఆర్టిస్టుగా రంజింపజేస్తున్న రజిత ప్రతి సినిమాలోనూ దాదాపుగా కనిపిస్తుంది. మోములో అమాయకత్వం, నటనలో సహజత్వం ఆమె ప్రత్యేకత. నటిగా 25వ సంవత్సరంలోకి ఎంటరవుతున్న సందర్భంగా... Read more
Oct 18 | మన్మథుడు.. గ్రీకువీరుడు... టైటిల్స్‌కి అక్షరాలా సరిపోతారు అక్కినేని నాగార్జున. ఫిఫ్టీ ప్లస్‌లోనూ యంగ్‌గా కనిపిస్తున్న ఈ హ్యాండ్‌సమ్ హీరో ఈసారి ‘భాయ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన... Read more
Oct 07 | అందాల సుందరి శ్రేయ వెండితెర పై తళుక్కుమని మెరిసి అగ్ర హీరోయిన్ నుండి ఐటెం గాళ్ వరకు అన్ని పాత్రలు వేసి తన అంద చందాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ అమ్మడుకు ప్రస్తుతం సినిమా... Read more
Sep 18 | తెలుగు కళామతల్లికి తన మధురమైన పాటలను అందిస్తూ... తెలుగు ప్రేక్షకులను మదిని దోచుకున్న రచయిత భాస్కరభట్ల. ఆయన గురించి సినీ జనాలకు తెలిసింది తక్కువ. తెలియాల్సింది ఎక్కువ. ఆయనతో చేసిన చిట్ చాట్ లో... Read more
Aug 24 | సృజనతో పాటు సాహిత్యాభిలాష కూడా ఉన్న దర్శకుడు పరిపూర్ణుడవుతాడు అనడానికి నిదర్శనం ఇంద్రగంటి మోహనకృష్ణ. చలం కథతో గ్రహణాన్ని తెరకెక్కించ గలిగాడంటే.. ఆ పరిపూర్ణతే కారణం. ట్రెడిషన్, ట్రెండ్... పొంతనలేని అంశాలివి. ఈ రెండిటినీ... Read more