సినిమా : మిస్టర్ పెళ్ళి కొడుకు
నటీనటులు: సునీల్, ఇషా ఛావ్లా , ఆలీ, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రమణ్యం, తదితరులు
సంగీతం: ఎస్.ఎ.రాజకుమార్
నిర్మాతలు: ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్
దర్శకత్వం : దేవీప్రసాద్
సంస్థ : మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ ప్రై. లిమిటెడ్
టాలీవుడ్ కి కమేడియన్ గా ఎంట్రీ ఇచ్చి, హీరోగా ఎదిగి, కేవలం హీరో క్యారెక్టర్స్ కే ఫిక్స్ అయిపోయిన సునీల్ బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘తనూ వెడ్స్ మనూ ’ రీమేక్ లో ‘మిస్టర్ పెళ్లి కొడుకు ’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల్ని అలరించడానికి వచ్చాడు. మరి ఈ పెళ్లి కొడుకు ఏ మేరకు అలరించాడో చూద్దాం.
కథ:
ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిన బుచ్చిబాబు (సునీల్). స్వదేశానికి తిరిగొస్తాడు. ఇండియాకి తిరిగొచ్చిన బుచ్చిబాబు కు ఇంట్లో ఓ పెళ్లి సంబంధం చూస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పెళ్ళి చూపులకు వెళ్లిన బుచ్చిబాబు అక్కడ అంజలి (ఇషా ఛావ్లా ) ని చూడగానే మనసు పడతాడు. అమ్మాయి గురించి ఎంతో గొప్పగా ఊహించుకున్న బుచ్చిబాబుకు అంజలి వేరే అబ్బాయిని ప్రేమిస్తున్న విషయం తెలుస్తుంది. దీంతో మనవాడు తిరిగి మళ్లీ అమెరికాకు వెళ్లి పోదామని అనుకొంటాడు. ఈలోగా తన స్నేహితుడి పెళ్లి కబురు అందుకొని అక్కడికి వెళతాడు. అక్కడ అంజలిని చూసిన బుచ్చిబాబు తన ప్రేమను గెల్చుకున్నాడా ? లేదా అనేది వెండి తెర పై చూడాల్సింది.
కళాకారుల పనితీరు :
కమేడియన్ పాత్రలు పోషించి, తరువాత హీరోగా సెటిల్ కావడానికి ప్రయత్నిస్తున్న సునీల్ సినిమా సినిమాకి వైవిధ్యం కనబరుస్తున్నాడు. మర్యాద రామన్న లో అమాయకంగా కనిపించిన ఈయన, పూలరంగడులో తన బాడీ షేపులను మార్చేసి సిక్స్ ప్యాక్ తో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఇందులో తన డ్రెస్స్ అప్పియరెన్స్, హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ పై శ్రద్ద పెట్టి కాస్త స్టైలిష్ గా కనిపించాడు. ఇక నటన విషయానికి వస్తే పాత తరహాలో అదే అమాయకత్వం, భయం ప్రదర్శించాడు. కానీ డాన్సుల్లో మాత్రం ఇరగదీశాడు. ఎలాగు డ్యాన్స్ వచ్చు కదా అని పాటల్లో తన ఫెర్ఫామెన్స్ ని చూపించడానికి ప్రయత్నించాడు. కానీ డ్యాన్స్ కి తగ్గట్లు పాటలు లేకపోయే సరికి ఆ డాన్స్ లకి అంతగా అందం రాలేదు. ఇక తన మార్క్ కామెడీని పండించడానికి ప్రయత్నించాడు కానీ అది అంతగా ఆకట్టుకోలేక పోయాయి. ఇక సునీల్ తో రెండో సారి జత కట్టిన ఇషా చావ్లా పూల రంగడులో ఫర్యాలేదనిపించినా, ఈ సినిమాలో తనకు ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ని సరిగా పండించలేక తేలిపోయింది. ఇక ఈ సినిమాలో చాలా మంది కమేడియన్లు ఉన్నా వారికి తగ్గట్లు కామెడీ లేక పోయే సరికి ఎంత నవ్వుదామన్న నవ్వురాదు.
సాంకేతిక వర్గం :
సినిమా కథ బలంగా లేకపోయినా సంగీతం ప్రాణం పోస్తుంది. సంగీతం బావుంటే సినిమా బోర్ అనిపించదు. కానీ ఈ సినిమాకి సంగీతం అందించిన ఎస్.ఏ. రాజ్ కూమార్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. గతంలో ఎస్.ఏ. రాజ్ కుమార్ సంగీతం వింటే మనస్సు హాయిగా ఉండేది. ఈయన వాయించి వాయించి తన దగ్గర ఉన్న బాణీలు అయిపోయాయో లేక ఈ ట్రెండ్ కు తగ్గట్లు ఏదో ఒకటి వాయించినా హిట్ అవుతుందని భావించాడో కానీ అది బెడిసి కొట్టింది. మంచి సినిమాటో గ్రాఫర్ గా పేరున్న సమీర్ రెడ్డి కూడా ఫెళ్లి కొడుకును, అందులోని సీన్స్ ని సరిగ్గా తెరకెక్కించలేదు. ఇక దర్శకత్వ విషయానికి వస్తే.... దేవీ ప్రసాద్ బాలీవుడ్ లో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా ఉన్న ఈ సినిమాని తెలుగు ఆడియన్స్ కి తగ్గట్లు మాస్ అండ్ కామెడీగా మలచడానికి ప్రయత్నించి విఫలం అయ్యాడని చెప్పవచ్చు. పోనీ ఈ కథ సునీల్ కి సూట్ అయ్యేదిలా ఉందంటే అదీ లేదు. ఇలాంటి కథలో సునీల్ ఇరికించడంలో విఫలం అయ్యాడు.
విశ్లేషణ :
సాధారణంగా ఓ సినిమాని ఎందుకు రీమేక్ చేస్తారు... ? ఆ కథ యమా కొత్తగా అనిపించినప్పుడో లేదంటే... ఆ తరహా కథను మనం తయారు చేసుకోవడం అస్సలు సాధ్యం కాదు అనిపించినప్పుడో... లేదంటే మన కథానాయకుడి శైలికి ఆ కథ అతికినట్టు సరిపోతుందన్నప్పుడో... ఇలా తప్పనిసరి అనిపించే కొన్ని పరిస్థితుల వల్ల పరభాషా సినిమాల వైపు దృష్టి పెడుతుంటారు. కానీ ఆ కథ ఎంచుకున్న కథానాయకుడికి సరిగ్గా సరిపోతుందా లేదు అన్న విషయం ఏ మాత్రం ఆలోచించకుండా వెళ్లి కోట్లకు కోట్లు పోసి హక్కులు కొనేస్తున్నారు. అయితే ఇలాంటి ప్రయత్నాలు అన్ని వేళలా మంచిది కాదనే విషయం ఈ సినిమా ద్వారా అర్థం అవుతుంది. సినిమా ప్రారంభంలో ఫర్వాలేదు అనేట్లుగా మొదలై, పోను పోను ఎప్పుడు అయిపోతుందా అనే విధంగా తీసుకుకొచ్చాడు దర్శకుడు. హీరో, హీరోయిన్ క్యారెక్టర్ తేలిపోవడంతో ఈ సినిమా అంతగా ఆకర్షించదు. మాస్ ఆడియన్స్ ని ద్రుష్టిలో పెట్టుకొని తీసిన ఈ సినిమాని ఎన్నిరోజులు లాక్కొస్తారో చూడాలి.
చివరగా :
మిస్టర్ ‘సునీల్ ’ ఫర్ఫెక్ట్ పెళ్ళి కొడుకు కాడు.