Venezuela president hugo chavez biography

Biography of Hugo Chavez, President of Venezuela, 1999-2013

Hugo Chavez bio biography Political LeaderPresident of Venezuela

హ్యూగో చావెజ్ గురించి

Posted: 03/20/2013 03:32 PM IST
Venezuela president hugo chavez biography

Hugo Chavez

బాంబులు పడ్డాయి..తూటాలు దూసుకొచ్చాయి..వెన్నులో కత్తి దించాలని కుట్రలు సాగాయి.. కానీ, వాటన్నింటి నుంచి మృత్యుంజయుడిలా బయటపడ్డాడు. చమురు, సహజ వనరులను విదేశాలకు అమ్ముకోకుండా అగ్రదేశాలు అడ్డుపడ్డాయి. ఆర్థిక ఆంక్షల చక్రబంధంలో బిగించి నిలువునా ఊపిరి తీయాలని చూశాయి.. కానీ, వాటన్నింటి నుంచి వెనెజువెలాను ఆయన బయటపడేశాడు అమెరికా సామ్రాజ్యవాదాన్ని మొక్కవోని సాహసంతో ఎదుర్కొని అగ్రరాజ్యానికి వణుకు పుట్టించిన వెనెజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ . తాను చేసినదాన్ని బొలివర్ విప్లవం అనిఅన్నాడంటే, ఊరికే అనలేదు. ప్రపంచ పెత్తందారు మీద తాను చేసిన తిరుగుబాటులో, ఆయుధసంపత్తి మీద కంటె నైతికశక్తి మీదనే ఆధారపడ్డాడు. తానొక్కడే కాకుండా, మరో ఏడు దేశాలను కలుపుకున్నాడు, వారిలో బలహీనులకు సాయపడ్డాడు. లాటిన్ అమెరికా దేశాల కూటమి బలపడాలని కలలు కన్నాడు. జాతీయవాద విప్లవకారుడైన బొలివర్‌లోని సమానత్వభావనలను, ప్రాదేశిక సహకార మార్గాన్ని తన తరహా సోషలిస్టు అభిప్రాయాలతో మేళవించి-చావెజ్ ఒక కొత్త సిద్ధాంతాన్ని రూపొందించాడు.. అదే 21 వ శతాబ్దపు సోషలిజం అన్నాడు. ప్రపంచీకరణలోని ఆర్థిక, భౌగోళిక, సాంస్కృతిక పెత్తనాన్ని సహించలేకపోతున్న చిన్నా చితకా దేశాలన్నీ చావెజ్ మార్గాన్ని ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి.

తిరగబడ్డ సైనికుడు...

దక్షిణ అమెరికా ఖండం వెనెజులా దేశంలోని ఒక చిన్న గ్రామంలో మిశ్రమ వర్ణానికి చెందిన దిగువ మధ్యతరగతి కుటుంబంలో, ఏడుగురి సంతానంలో ఆరోవాడిగా 1954లో పుట్టిన హ్యూగో రాఫెల్ చావెజ్ ఫ్రియాస్ బాల్య, కౌమార, యవ్వనాల్లో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు, నాయనమ్మ ప్రేమా, పేదరికమూ తప్ప. లోకంలోని కష్టాలన్నీ మా ఇంట్లోనూ ఉండేవి, అయితే ఆ జీవితం హాయిగానూ ఉండేది- అని చెప్పాడు చావెజ్ తరువాత. ఆ బొటాబొటి జీవితం నుంచే అతను 1975లో సైన్యంలో చేరాడు. పెరెజ్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా 1992లో సైనిక తిరుగుబాటుకు విఫలయత్నం చేసి, పట్టుబడ్డాడు. పెరెజ్‌పై జనంలో అసంతృప్తి తీవ్రస్థాయికి చేరుకుని అభిశంసనకు గురి అయినందున, తరువాత వచ్చిన ప్రభుత్వం చావెజ్ ముప్పయ్యేళ్ల శిక్షను రెండేళ్లకు తగ్గించి, విడుదల చేసింది. ఎన్నికల్లో పోటీచేయడానికి అనుమతి కూడా ఇచ్చింది. నాడు అతని శిక్ష తగ్గకపోయి ఉన్నా, పెరెజ్ పాలనే కొనసాగి ఉన్నా- నేటి చావెజ్ అవతరించి ఉండేవాడు కాదు. తాను వామపక్షవాదినీ కాదు, మితవాదినీ కాదు అని చెప్పుకుని మొదట ఎన్నికల్లో పోటీచేసిన చావెజ్, అధికారానికి వచ్చిన వెంటనే తనవి సోషలిస్టు భావాలని, అటువంటి విధానాలనే అనుసరిస్తానని ప్రకటించాడు. ఉగ్రవాదంపై పోరాటం పేరుతో మధ్య ఆసియాలో అమెరికా బిజీగా ఉంటున్న సమయంలో, మరో ఏడు దేశాల భాగస్వామ్యంతో బొలివేరియన్ అలయన్స్ ఫర్ అవర్ అమెరికాస్ (ఎఎల్‌బిఎ)ను ఏర్పాటు చేశాడు. వెనెజులాకు కీలకమయిన బలమూ, విలువైన వనరూ అయిన చమురునిల్వలను, వాటిమీద పెత్తనం చేస్తున్న బహుళజాతి సంస్థలను కొంత మేరకు అదుపుచేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు మిగిల్చి, సంక్షేమ కార్యక్రమాలకు మళ్లించాడు.

చావిస్మో విధానాలు..

మధ్య అమెరికాలో, దక్షిణ అమెరికాలో విప్లవపోరాటాల చరిత్ర సుదీర్ఘమైనది. చిలీలో, పెరూలో, పనామాలో, ఈక్వెడార్‌లో, నికరాగ్వాలో విప్లవకమ్యూనిస్టులు చేసిన పోరాటాలు రకరకాల స్థాయిలలో అపజయం పొంది వెనుకపట్టు పట్టాయి. ఆ తరువాతి దశలో ఎర్రటి ఎరుపు కాస్తా, గులాబి రంగులోకి మారిందని, చావెజ్, లూలా తదితరులు ఆ కోవలోకే వస్తారని విశ్లేషకులు చెబుతారు.  ప్రభుత్వాధినేతగా తాను వెనెజులాలో అనుసరించిన విధానాల పరిమితులు చావెజ్‌కు తెలుసు. ఎంపిక చేసిన రంగాలలో జాతీయీకరణ, ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమలు, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థికసంస్థల పెత్తనాన్ని నియంత్రించే చర్యలు, అమెరికా పెత్తనానికి వ్యతిరేకంగా వివిధ భావసారూప్య దేశాల కూటమి ఏర్పాటు- చావెజ్ అనుసరించిన ఈ విధానాలు చావిస్మో పేరుతో ప్రఖ్యాతి పొందాయి. చమురు అమ్ముకోగా వచ్చిన ఆదాయంలో తొంభైశాతం దాకా కంపెనీలు తమ ఖాతాకు మళ్లించుకునే అవకాశం ఉండగా, దాన్ని చావెజ్ 73 శాతానికి తగ్గించాడు. సాధారణ ప్రజలకు లబ్ది కలిగేటట్టు విద్యకు, వైద్యానికి, సంక్షేమ చర్యలకు ధనం ధారాళంగా ఖర్చుపెట్టాడు.

ఓడిన అమెరికా..

ఇంత చేసినా అమెరికా ఎందుకు ఊరుకుంది? అతన్ని చేయవలసినంతగా ఎందుకు అపఖ్యాతి పాల్చేయలేదు? - ఈ ప్రశ్నలు ఆసక్తికరమైనవే కానీ, అమెరికా ఏమీ చేయకుండా చేతులు కట్టుకుని ఉన్నదనుకోవడం పొరపాటు. 2002లో చావెజ్‌పై జరిగిన తిరుగుబాటు ప్రయత్నంలో బాహ్యశక్తుల ప్రమేయం లేదనుకోలేము. కేన్సర్ వ్యాధి బారిన పడి మరణించినప్పటికీ, చావెజ్ మరణంలో కుట్ర ఉండి ఉంటుందని వెనెజులాలో, మిత్రదేశాలలో ప్రజలు విశ్వసిస్తున్నారు. '
అయితే, సద్దామ్ హుస్సేన్‌ను, గడాఫీని చేసినట్టుగా అమెరికా చావెజ్‌ను క్రూరనియంతగా ముద్రవేయలేకపోయింది. అందుకు ప్రధాన కారణం- అతను ప్రజాస్వామికంగా ఎన్నిక కావడమే. లాటిన్ అమెరికా చరిత్రలో ఏ నాయకుడికీ లేని ప్రజాస్వామిక ఆమోదం చావెజ్‌కు ఉన్నది. 1999లో అధికారానికి వచ్చినప్పటి నుంచి పదిహేను ఎన్నికల్లో చావెజ్ ప్రజామోదాన్ని పొందాడు. అందులో 2012 అక్టోబర్7న జరిగిన ఎన్నిక చివరిది. వెనెజులాలోని ఎన్నికల ప్రక్రియను యూరోపియన్ యూనియన్ దగ్గర నుంచి ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ దాకా అందరూ ప్రశంసించారు. చావెజ్ విధానాలను వ్యతిరేకించే ప్రతిపక్షాలు వెనెజులాలో స్వేచ్ఛగా పనిచేయగలుగుతున్నాయి.

స్వర్గ నరకాలు..

అమెరికాను నిందించడంలో చావెజ్‌కు పట్టపగ్గాలుండవు. 2006లో ఐక్యరాజ్యసమితి వేదికపైనే జార్జి బుష్‌ను పిశాచంగా అభివర్ణించి సంచలనం సృష్టించిన చావెజ్ అంతకు ముందూ తరువాతా కూడా అలాంటి పరుషపదజాలమే ఉపయోగించాడు. జార్జి బుష్ ముందు అడాల్ఫ్‌హిట్లర్ పసిపిల్లవాడిలాగా కనిపిస్తాడని, ప్రమాదకారిగా కనిపించే బుష్ నిజానికి పిరికిపంద అని చావెజ్ అన్నాడు. నరకానికి వెళ్లదలచుకున్న వాళ్లు పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తారని, భూమ్మీద స్వర్గాన్ని నిర్మించాలనుకునేవాళ్లు సోషలిజాన్ని స్వీకరిస్తారని మరోసందర్భంలో అన్నాడు.

ఎన్ని మంచి మార్కులో...

చావెజ్ హయాంలో వెనెజులాలో మొత్తం 30 లక్షల హెక్టార్లను భూమిలేని వారికి పంచిపెట్టారు. అధికారానికి వచ్చిన ఆరేళ్లలోనే దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించారు. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ లెక్కల ప్రకారం లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాల్లో అన్నిటి కంటె అభివృద్ధి చెందిన దేశం వెనెజులాయే. చావెజ్ అధికారానికి వచ్చినప్పటినుంచి, మరణించేలోపు దేశంలో కనీసవేతనాలు 2000 శాతం పెరిగాయి.  ప్రపంచ సంతోషపు సూచిక ప్రకారం తొమ్మిదో స్థానంలో ఉన్న వెనెజులా, లాటిన్ అమెరికాలో రెండో స్థానంలో ఉన్నది. సహాయ దాతృత్వ చర్యలకు అమెరికా ఖండంలో అధికంగా ఖర్చుచేసేది వెనెజులాయే. 2007 సంవత్సరంలో 880 కోట్ల డాలర్ల విలువైన సహాయాలు, రుణాలు, ఇంధనం వెనెజులా అందిస్తే, అదే సంవత్సరానికి గాను బుష్ ప్రభుత్వం కేవలం 300 కోట్ల డాలర్లు మాత్రమే సహాయాలకు ఖర్చు చేసింది. అంతే కాదు, అమెరికా దేశం లోని అణగారిన వర్గాలకు సబ్సిడీ ధరలకు ఇంధనాన్ని అందిస్తున్న ఏకైక దేశం వెనెజులా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles