Tagubothu ramesh special interview

Tagubothu ramesh special interview.png

Posted: 09/03/2012 01:48 PM IST
Tagubothu ramesh special interview

Tagubothu_ramesh_special_interview1

కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖనిలో ‘బొగ్గు ’ కార్మికుడి ఇంట్లో పుట్టినా  నటన పై ఆసక్తితో వెండితెర  అరంగ్రేటం చేసి, మంచి నటుడిగా, తాగుబోతు నటుడిగా, తనకంటూ ఓప్రత్యేక గుర్తింపును తెచ్చకొని, బాలీవుడ్ నటుడు ‘కేస్టో ముఖర్జీ ’తో పోల్చబడి ఇప్పటికే అనేక చిత్రాలలో నటించినా 'మహాత్మ', 'భీమ్లీ కబడ్డీ జట్టు', 'అలా మొదలైంది', 'రచ్చ', 'ఈగ' లాంటి చిత్రాలలో తాగుబోతుగా నటించి తన ఇంటి పేరునే ‘తాగుబోతు ’గా మార్చుకొని, నిజజీవితంలో తాగుడుకి దూరంగా ఉన్న ‘తాగుబోతు రమేష్ ’ జీవితంలోని కొన్ని సంఘటనలు మీకోసం... కేవలం తాగుబోతుగానే నటిస్తూ, ఎప్పుడు తాగి తూలినట్లు కనిపించే రమేష్ చెప్పేది జెర ఇనండి ... షార్!

ఎలాంటి శిక్ష కావాలో తేల్చుకోమనేది...

నల్లబంగారం పండే సీమ నుండి వచ్చినోన్ని. నాన్న గోదావరిఖని సింగరేణి బొగ్గు గనిలో కార్మికుడిగా పనిచేసేవాడు. నాకు పదేళ్ల వయసు వచ్చేవరకు బడి ముఖం చూడనేలేదు. అలాగని చదువుకోలేదని కాదండోయ్! మా కాలరీస్ క్వార్టర్స్‌లోనే ప్రైవేట్‌గా వహీదా ఆజ్మీ టీచరమ్మ (ప్రస్తుత లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ మరియు డిస్ట్రిక్ కాంగ్రెస్ మహిళా స్పీకర్) దగ్గర ఐదు వరకు చదివాను. చెప్పడం కాదుగానీ, ఆమె యమ స్ట్రిక్ట్. తప్పు చేస్తే కోదండం లేదా గోడకుర్చీ! ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఛాన్స్ మాకే ఇచ్చేది. ఆమె దగ్గర చదివిన నాతోటి వాళ్లలో కొందరు ఐఏఎస్, ఐపిఎస్‌లు అయ్యారంటే ఆమె ఎంత గొప్ప టీచరో అర్థం చేసుకోండి.

టీచర్ లో అమ్మని చూశాను....

ఆ తర్వాత జిల్లాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో చేరాను. దొడ్లో నుండి మందలో పడ్డట్టు ఎక్కడ చూసినా పిల్లకాయలే. అదొక కొత్త లోకం. అదేందోగానీ చదువులతల్లి 'సరస్వతమ్మ' నన్ను చూడగానే దౌడు తీసేది. ఆమెను అందుకోలేక నాకు ఆయాసం వచ్చేది. ఇక నా వశం కాదని ఆమెని వదిలేసి, మెల్లగా ఆటలవైపు మళ్లాను. ఎప్పుడు చూసినా గేమ్స్. క్లాసులో కూర్చునేది తక్కువ మనం. తరచూ బడి ఎగ్గొట్టేవాణ్ణి. మార్తమ్మ టీచరు నా 'షఖల్' చూసి 'ఒరేయ్ నీలో గొప్పోని లక్షణాలున్నయిరా. ఎప్పటికైనా పైకొస్తవు. డుమ్మా కొట్టకుండా బడికి రారా' అని అడుక్కునేది. నేను వినకపోతే, ఒకోసారి ఏడ్చేది. టీచర్లలో కూడా 'అమ్మ'లు ఉంటారని అప్పుడే తెలిసింది నాకు.సెలబ్రిటీ లెవల్ మెయింటన్స్...
అదృష్టం అందలమెక్కిస్తే బుద్ధి బురదలకు గుంజిద్దని, మార్తమ్మ టీచర్ ఎంత మొత్తుకుంటే ఏం లాభం? ఏడో తరగతి పూర్తి చేసి, అదేదో డబల్ ఎం.ఏ. పట్టాలాగ భ్రమచెంది బయటికి వచ్చేసి మోహన్ మేస్త్రీ మెకానిక్ షాపులో చేరిపోయా. చేతినిండా పైసలు. ఇంట్లో ఖర్చులకు డబ్బులిచ్చినప్పుడల్లా అమ్మ నావైపు గర్వంగా చూసేది. చాలా కుషీ కుషీ అయ్యేది. ఇక ఊర్లో విద్యార్థుల మధ్య ఏ రకం గొడవలైనా సరే సలహా కోసం నా దగ్గరకు వచ్చేవారు. దాంతో కాస్త పెద్దరికపు హోదా కూడా వచ్చేసింది. ఎక్కడ కనిపించినా 'నమస్తే పెట్టుడు'. పిల్లల ముందు సెలబ్రిటీ లెవల్ మెయింటెయిన్ చేసేవాణ్ణి. బట్టల్ని ఉతికినట్లు ఉతికారు...
మెకానిక్ పని చేయడంతో చేతినిండా డబ్బులే డబ్బులు కదా. మనసు సినిమాలపైకి మళ్లేది. ఇంట్లో తెలియకుండా సినిమాలకు చెక్కేసేవాణ్ణి. ఒకసారి రాజేష్ టాకీసులో 'సింధూరపువ్వు' సినిమా చూస్తున్నాను. అదే హాల్లో మా అన్న ఉన్న సంగతి నాకు తెలీదు. నాకు కన్పించకుండా తప్పించుకుని, ఇంటికి వెళ్లి అమ్మకి చెప్పేశాడు. నన్ను పట్టుకోడానికి వల పన్నారంతా, పావురాలను పట్టుకోడానికి బోయవాడు గింజలు చల్లినట్టు. సినిమా చూసి ఇంటికి రాగానే నా కోసం ప్రత్యేకంగా కోడిగుడ్లతో కూర చేసి ప్రేమగా తినమని ముందుంచారు. తిండిని ఆస్వాదిస్తున్న టైంలో అందరూ కలిసి 'దొరికాడురా దొంగ' అని నా పెడరెక్కలు విరిచి నా వెనకున్న నులక మంచానికి కట్టేసి సినిమా పిచ్చి తగ్గించుకుంటావా లేదా? అని ఉతుకుడే ఉతుకుడు. సాకిరేవులో కూడా బట్టల్ని అంత గట్టిగా బండకేసి బాదరేమో!

తాగి తూలడం అలా మొదలయ్యింది....

అమ్మ నన్ను కొట్టినా తట్టుకునే వాణ్ణి కాని, ఆమె బాధపడితే తట్టుకోలేకపోయేవాణ్ణి. నాన్న బొగ్గు కార్మికుడు కాబట్టి తీవ్రమైన పని వత్తిడి వల్ల రోజు వారీగా తాగి ఇంటికి వచ్చేవాడు. తాగిన మత్తులో అమ్మపై వీరంగం ఆడి, నెమ్మదిగా బయటికి వెళ్లేవాడు. అమ్మ దిగులుగా ఉండడం చూసి భరించలేక నాన్న అటు వెళ్లగానే అచ్చం అప్పటివరకు నాన్న తూలినట్టే తూలుతూ ఆయన్ని అనుకరించి అమ్మను నవ్వించే ప్రయత్నం చేసేవాణ్ణి. దాంతో అమ్మ బాధ మరిచి, నవ్వేసి, నన్ను దగ్గరకు తీసుకుని ముద్దాడేది. అమ్మను నవ్వించగలిగినందుకు చాలా గర్వంగా ఉండేది. అమ్మ నవ్వుతూనే 'అరేయ్, తాగుబోతు యాక్షన్ బాగ చేస్తున్నవ్ గని, పెద్దగయినంక నీవు గిట్ల తాగేవు కొడుకా' అనేది. తాగడం వల్ల జీవితాలు ఎలా ఛిద్రమైపోతాయో కళ్లతో చూసినవాణ్ణి కాబట్టి తాగుబోతుతనానికి ఎప్పుడూ దూరంగానే ఉన్నాను.

అమ్మ లేని తనం ఎంత శూన్యమో!

ఏ సినిమాకైతే నన్ను వెళ్లొద్దని వీర బాదుడు బాదిందో, అదే సినిమా హాల్లో 'రిక్షావాడు' సినిమా చూస్తుండగా అమ్మ చనిపోయిందని కబురొచ్చింది. అహర్నిశలు మా బాగు కోసం పరితపిస్తూ ఉండే అమ్మని టి.బి. జబ్బు వెన్నాడుతోందని తెలిసినా ఏం చేయలేకపోయాము. అమ్మ పోవడంతో జీవితమే శూన్యం అనిపించింది. కొన్నాళ్ల వరకు మనిషినే కాలేదు. అమ్మ పోయిన ఐదేళ్లకే నాన్న కూడా చనిపోవడంతో అన్నదమ్ములందరం కలిసి చెల్లెలి పెళ్లి చేశాం. అప్పట్నించి ఇంటి బాధ్యతలంటూ నాకేమీ లేకపోవడంతో మనసు మళ్లీ చదువు వైపు మళ్లింది. చదువు అనేకంటే నాలో ఉన్న కళని మెరుగుపెట్టుకోవాలంటే ఏదైనా నటనాలయంలో చేరాలనిపించింది. అప్పటి వరకు ఆధారం చూపించిన కాశిపేట లింగయ్యగారి వద్ద సెలవు తీసుకుని, ఆయన వద్ద చేస్తున్న పనికి స్వస్తి పలికి దీక్షితులుగారి అధ్యక్షతన నడిచే 'అక్కినేని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్'లో చేరాను. ఫిలిమ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పూర్తయ్యాక, అవకాశాల కోసం ఎదురుచూసే క్రమంలో వేణు, ధనరాజ్, 'చిత్రం' శీను, ఉత్తేజ్‌లాంటి మిత్రుల పరిచయం ... 'జగడం'లో నటించే అవకాశం రావడం ... తర్వాత కృష్ణవంశీగారి 'మహాత్మ'లో ... రచయిత 'లక్ష్మీభూపాల్'గారి ద్వారా నందిని రెడ్డిగారి పరిచయం ... చిత్రసీమలో నా అరోహణ క్రమం 'అలా మొదలైంది'.

నాన్నను ఏడిపించేశాను..

ఒకసారి రామకృష్ణాపూర్‌లో ఉండే మా చిన్నాన్న ఇంట్లో ఏదో ఫంక్షన్. దానికి అమ్మ, నాన్న ఇద్దరూ విధిగా హాజరు కావల్సి ఉంది. వచ్చే జీతమే తక్కువ కాబట్టి ఫంక్షన్‌కు వెళ్తే మస్తర్ పోతుందని నాన్న ఉదయం మామూలుగానే డ్యూటీకి వెళ్లాడు. పదకొండు గంటల టైంలో అమ్మ నన్ను పిలిచి "ఒరే, అమ్మకు ఒంట్లో అస్సలు బాగలేదని చెప్పి నాన్నని పిలుచుకుని రా'' అని పంపించింది. అక్కడ ఎలా చెబితే బాగుంటుందో దారిలోనే బాగా రిహార్సల్ చేసుకుంటూ వెళ్లాను. నాన్న కనిపించగానే 'అమ్మకు సీరియస్‌గా ఉంది. వెంటనే రమ్మని' ఏడుపు నటిస్తూ చెప్పేసరికి నాన్న నిజంగానే ఏడ్చేశాడు. చుట్టూ ఉన్న నాన్న కొలీగ్స్ 'రాములు, వెళ్లు వెళ్లు ... ఏడ్వకు' అని గుండె ధైర్యం చెప్పారు. అప్పుడనిపించింది, నాలో మామూలు నటుడు లేడని (నాలో నటున్ని నేను మాత్రమే గుర్తిస్తే సరిపోదు కదా. మీరంతా గుర్తించినప్పుడే కదా సెలబ్రిటీని అయ్యేది అంటూ తన గురించి పై విధంగా చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Teachers day special article
Telugu language day  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles