జీవితంలో ఉన్నతమైన స్థానాలకు ఎదగాలంటే ఎన్నో ఆటుపోటులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటివన్నీ అనుభవించి జీవితంలో పైకి వచ్చి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ‘ఈగ’ సినిమా విలన్ సుదీప్ జీవితం గురించి క్లుప్తంగా వివరించాడు. ఆయన మాటల్లోనే... సినిమాలు, నటన, అంటే నాకు పిచ్చి. సినిమాల్లో అవకాశాల కోసం నేను చేయని ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నాల్లో ఎంత మంది తిట్టినా భరించాను. పట్టించుకోకపోయినా సహించాను. కానీ నా లక్ష్యాన్ని మాత్రం ప్రేమిస్తూనే ఉంటాను. ఉన్నాను అంటూ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి వివరించాడు. ఈ సినిమా ప్రయాణంలో ఎన్నో కష్ట సుఖాలు, ప్రశంసలు, విమర్శలు, సత్కారాలు, ఛీత్కారాలు, పరాజయాలు, ఎన్నో ఉంటాయి. నేను అవన్నీ చూశాను.
మాది కర్ణాటకలోని శివమొగ్గ.. నాన్న కలప వ్యాపారం చేసేవారు. అమ్మ ఇంట్లోనే ఉండేది. నేను అయిదో తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. తరువాత వ్యాపారరీత్యా మేం బెంగుళూరుకు వెళ్లాం. అక్కడ కేంబ్రిడ్జి స్కూల్లో చదివాను. మా నాన్నంటే నాకు భయంతో కూడిన గౌరవం ఉండేది. అమ్మంటే ఎంతిష్టమో చెప్పలేను. తనే దగ్గరుండి చదివించేది. మా హోంవర్కులన్నీ చేయించేది. చదువులోనూ ఆటలోనూ ఎప్పుడూ స్కూల్లో నేను ఫస్ట్. ఇంట్లో నేను చిన్న వాణ్ని కావడంతో ప్రేమకు లోటుండేది. కాదు. అమ్మానాన్నలే కాదు... మా ఇద్దరు అక్కలు కూడా నన్ను ఎంతో ప్రేమగా ముద్దుగా చూసేవాళ్ళు.జీవితంలో కీలక పాత్ర పోషించే డబ్బు విలువ గురించి మా నాన్న చిన్నప్పుడే చెప్పేవారు. నాకు అవసరం అయినప్పుడే డబ్బులిచ్చేవాళ్లు. హై స్కూలు చదువు ముగిసిన రోజు నాన్న నాకో వాచ్ ఇస్తూ ‘‘నీ అవసరాలకు నువ్వు కష్టపడి సంపాదించడం అలవాటు చేసుకో, నేనో మరోకరో ఎన్నాళ్లు నీ బాగుగోలు చూస్తాం. అన్నారు. ఆ మాటలు నాలో బలంగా నాటుకుపోయాయి. ఆయన అంతరంగం నాకు అర్థమైంది. హై స్కూల్ అయిపోయాక ఇంటర్ చదువుతూ ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. పార్టటైంగా మోడలింగ్ ఫోటోగ్రఫీ చేసేవాణ్ని. అలా సంపాదించిన డబ్బుతో ఓసారి నాన్నకు వాచ్ కొనిచ్చి ఇచ్చాను. అప్పుడు ఆయన చూసిన చూపులో కనిపించన గర్వం నాకిప్పటికీ గుర్తే. నాన్న నుంచే నాకు సమయపాలన, ముక్కుసూటి తనం వచ్చాయి. కాలేజీ రోజుల్లో నాన్న మరోమాట చెప్పారు. ‘‘నువ్వు ఏం కావాలనుకుంటున్నావో నిర్ణయించుకో, చేసే పనిమీద తప్ప నీ ద్రుష్టి మరో దాని మీద మళ్లకుండా చూసుకో ’’. నాన్న మాటల వల్లనో ఏమో కానీ నాలో కొత్త కోణం బయటికి వచ్చింది.
నేను చిన్నప్పటి నుండి ఎక్కువగా సినిమాలు చూసేవాణ్ని. చూసీచూసీ నాకు తెలియకుండానే నటన పై ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తి కాలేజీలో బయటపడింది. అప్పట్లో రెండు మూడు నాటకాలు వేశాను. నేను ఇంజనీర్ ని కావాలనేది నాన్న కోరిక. పెద్ద ఉద్యోగం చేయాలనుకునేవారు. వారి కోరిక మేరకు ఇంజనీరింగ్ చేశాను కానీ ఇంజనీర్ ని కాలేక పోయాను. అందుకు కారణం నటన పై నాకున్న ఆసక్తి. సరిగ్గా ఇక్కడునుంచే కష్టాలు మొదలయ్యాయి.
కష్టం
సినిమాల్లోకి రావాలన్న కోరిక ఉందే... అది చాలా చెడ్డది. మనిషిని స్థిరంగా ఉండనివ్వదు. స్టార్ డమ్, క్రేజ్, పేరు ప్రఖ్యాతుల్లాంటి దూరపు కొండలు ఊరిస్తూ ఉంటాయి. నిజానికి ఏ కోరికైనా బలంగా ఉంటే ఇలాగే ఉంటుందేమో. దర్శకుల ఇళ్ళ చుట్టు ప్రదక్షిణలు చేసేవాణ్ని. ఏవో చిన్న పాత్రలు దొరికేవి. షూటింగ్ అయిపోయాక భోజనానికి కూర్చుంటే... యూనిట్ మేనేజర్ వచ్చి, నువ్వు లేవవయ్యా కంచాలు తక్కువగా ఉన్నాయి ’ అని బోజం పళ్లెంనుండి నిర్థాక్షిణ్యంగా లేపేవాడు. అప్పట్లో నాకు బైక్ ఉండేది కాదు. ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సులోనే.అలా చిన్నచిన్న పాత్రలు చేశాక ‘బహ్మ ’ అనే సినిమాలో అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోయింది. తరువాత ‘తాయవ్వ’ సినిమా చేశాను. అది సరిగ్గా ఆడలేదు. దాంతో ఐరెన్ లెగ్ పేరు వచ్చింది. ఏడాది పాటు ఖాళీగా ఉండిపోయాను. ఈ మధ్యలో టీవీ సీరియల్ అవకాశాలు వచ్చాయి. తరువాత మళ్లీ సినిమా అవకాశాలు వచ్చాయి. మూణ్ణాలుగు సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు చేశాను. తరువాత ఓ సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. కాకపోతే అది హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిం. నాకు పెద్దగా పేరు రాలేదు.
ఛీత్కారం
ఆ తరువాత హుచ్చ (పిచ్చివాడు) సినిమాలో హీరో అవకాశం వచ్చింది. ఆ యూనిట్ వాళ్ళు నన్ను ఏమాత్రం లక్ష్యపెట్టేవాళ్ళు కాదు. షూటింగ్ లో ఓసారి షూటింగ్ లో పట్టుతప్పి పైనుండి కింద పడిపోయాను. కాలి ఎముక విరిగింది. అక్కడ నా బాధ అరణ్యంలోనే అయింది. ఎవరూ పట్టించుకోదు. మళ్లీ వేరే స్పాట్ కి రమ్మన్నారు. నిజానికి నాకు ఇంటికి వెళ్లి పోదావమిన అనిపించింది. కానీ, అమ్మానాన్నలు గుర్తుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో నన్ను చూస్తే... సినిమాలు వద్దంటానని వెళ్లలేదు. షూటింగ్ జరిగిన రెండు రోజులు వేన్నీళ్ళు కాపడం చేసేవాణ్ని. ఆ షెడ్యూల్ షూటింగ్ అయిపోయాక ఆసుపత్రిలో చేరాను. రాడ్లు వేసి, నెలరోజులు విశ్రాంతి తీసుకోమన్నారు. ఆ సమయంలో అమ్మానాన్నలు తప్పితే నన్ను చూడటానికి ఎవ్వరూ రాలేదు. వాళ్ల కళ్ళలో బాధ చూస్తే నాకే ఏడుపొచ్చింది. మా సినిమా యూనిట్ వాళ్ళు ‘ఫలానా రోజున షూటింగ్ ఉంది, మళ్లీ వచ్చెయ్ ’ అని ఫోన్ చేశారు. అమ్మానాన్నలు వద్దంటున్నా మళ్లీ వెళ్లాను.
ప్రశంస
ఎలాగోలా సినిమా పూర్తయింది. రేపోమాపో విడుదల అవుతుందని ఎదురు చూడసాగాను. కానీ ఎన్నాళ్లకీ విడుదల కాలేదు. నేను ఎంతో మందిని కలిసి అభ్యర్థించాను. ఎంతో కష్టపడితే సినిమా విడుదల అయింది. మొదటి రోజు ప్రేక్షకుల స్పందన చూద్దామని తొమ్మిది గంటలకే థియేటర్ కి వెళ్లాను. బయట నలుగురైదుగురే కనిపించారు. మేనేజర్ దగ్గరకు వెళ్లి ‘ఏంటి, ఎవరూ వచ్చినట్లు లేదు ’ అని అందోళనగా అన్నాను. ఆయన నన్ను గుర్తుపట్టలేదు. నవ్వుతూ... ‘టిక్కెట్లన్నీ ఎనిమింటికే అమ్ముడైపోయాయి సార్ ’ అన్నాడు. నేను నమ్మలేక పోయాను. నేను కూడా ఒక ప్రేక్షకుడిలా జనాల మధ్యలో కూర్చుని సినిమా చూడాలనుకున్నాను. నన్ను ఎవరు గుర్తుపడతారన్న ధీమాతో సరిగ్గా షో ప్రారంభమయ్యే పావుగంట ముందే థియేటర్ లోకి అందరితో కలిసి వెళుతున్నాను. నా అంచనా తప్పయింది. నన్ను గుర్తుపట్టేశారు. కేకలూ అరుపులతో నన్ను ఎత్తేశారు. నన్ను ఉక్కిరి బిక్కిరి చేసిన ఆ క్షణంలో కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. కోట్లిచ్చినా దాన్ని కొనుక్కోలేం. ఆ సినిమా హిట్టయింది. తరువాత చాలా అవకాశాలు వచ్చాయి. పార్థ, స్వాతిముత్తు, రంగా ఎస్సెస్సెల్సీ, ఓన్లీ విష్ణువర్థన లాంటి 40 కి పైగా సినిమాల్లో నటించాను. డబ్బులూ వచ్చాయి. కళాకారుడు ఏదో ఒక్క అంశానికి పరిమితం కాలేడు. అలాగే నేను కూడా.. నటకే పరిమితం కాకుండా దర్శకత్వం చేపట్టాలనుకున్నాను. మై ఆటోగ్రాఫ్, కెంపే గౌడ, జస్ట్ మతళ్లి, వీర మడకరి, 73 శాంతి నివాస్ సినిమాలు తీశాను అన్నీ హిట్లే.
సత్కారం
ఓసారి సుప్రసిద్ధ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘రక్తచరిత్ర ’ సినిమా తీస్తున్నా, అందులో నటిస్తావా అని అడిగారు. అలాంటి అవకాశాన్ని ఎవరు కాదంటారు ? రక్తచరిత్ర 1, రక్తచరిత్ర 2 రెండూ హిట్టయ్యాయి. అంతకముందు ఆయనే అమితాబ్ గారితే ‘రణ్ ’ సినిమా తీయాలనుకున్నారు. అందులో నాకు ప్రతినాయక ఛాయలుండే కీలక పాత్ర ఇచ్చారు. దాంతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ మూడు సినిమాలతో అటు బాలీవుడ్, ఇటు తెలుగు, తమిళ ప్రజలకు పరిచయం అయ్యాను. ఒక నటుడు కోరుకునేది గుర్తింపే. అంతకంటే గొప్ప సత్కారం ఏముంటుంది ?
‘రణ్ ’ సినిమా చూసిన రాజమౌళి ‘ఈగ’ లో అవకాశం ఇచ్చారు. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. నా నటన చూసిన తెలుగు ప్రేక్షకులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.
ఆశ్రమం నడుపుతున్నా....
ఆ దేవుడు మనకిచ్చిన దాంట్లో నలుగురికి కొంత ఇవ్వాలన్నది నా అభిమతం. అందుకే నాకు తోచినంత చిన్న చిన్న సేవాకార్యక్రమాలు చేస్తుంటాను. సాటివాళ్లు సమస్యల్లో ఉంటే చూడలేని మనస్తత్వం నాది. ముసలివాళ్ల కోసం శివమొగ్గలో ఒక ఆశ్రమం నడుపుతున్నాను. నా సంపాదనలో నాలుగో వంతు ఇందుకు కేటాయిస్తున్నాను. అలాగే బెంగుళూరులో నలుగురు పేద విద్యార్థులను దత్తత తీసుకొని చదివిస్తున్నాను. అందులో ఇద్దరిది ఇంజనీరింగ్ అయిపోయింది. 40 కి పైగా జంటలకు పెళ్ళిళ్లు చేశాను. గుండె సర్జరీలు చేయించుకునే వాళ్ళకు ఆర్థిక సహాయం చేస్తున్నాను. నా శ్రీమతి పేరు ప్రియ. మాకు ఒక పాప. అంటూ తన గురించి ఇలా చెప్పుకొచ్చారు సుదీప్.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more