ఆయనొక అడ్వకేట్. న్యాయం కోసం తపించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. వరుసగా మూడుసార్లు ఎంపీ అయ్యారు. న్యాయాన్యాయాల గురించి ఎంతో అనుభవం గడించారు. ఎన్నో ఉన్నత పదవులు చేపట్టినా మా ఊర్లో దొరికే న్యాయం మరెక్కడా దొరకదంటారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఆర్టీసి చైర్మన్ ఎం. సత్యనారాయణ రావు. ముక్కుసూటిగా గలగలా మాట్లాడే ఆయన 70 ఏళ్ల వెనక్కి వెళ్లి తన ఊరిని గుర్తుచేసుకున్నారు. ఈ పెద్దాయన ఊరి సంగతులే .
"ఒకరోజు సెలవులకి మా ఊరొచ్చాను. రచ్చబండ చుట్టూ జనం చేరారు. నాన్న ఊరి పెద్ద కుర్చీలో కూర్చున్నాడు. కుల పెద్దలంతా సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. ఏదో దొంగతనం గొడవ. దొంగ దొరికాడు. ఎలాంటి తీర్పునిస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాన్న దొంగని దగ్గరికి పిలిచాడు. నాలుగు ప్రశ్నలు అడిగాడు. అతను సమాధానం చెప్పాడు. బాధితుడ్ని కూడా పిలిచాడు. అతను చెప్పిన విషయాల్ని కూడా విన్నాడు. జ్యూరి సభ్యులతో చర్చించి తీర్పు ఇచ్చాడు. బాధితుడికి దొంగ నష్టపరిహారం చెల్లించాలని చెప్పాడు. దాంతో పాటు ఊరివాళ్లందరికీ దావత్(విందు)ఇవ్వాలన్నాడు. అందులో మటన్, చికెన్ తప్పనిసరన్నాడు. ఆ దొంగకు వేసిన శిక్ష ఇదన్నమాట. అందరూ చప్పట్లు కొట్టారు. ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఊళ్లో గొడవలకి రచ్చబండ దగ్గర తీర్పు ఇస్తారని తెలుసు కాని ఒక పంచాయితీని నేరుగా చూడడం అదే మొదటిసారి నేను. 'అదేంటి దొంగని ఒక్క దెబ్బకూడ కొట్టకుండా ఏదో ఘనకార్యం చేసినట్టు భోజనాలు పెట్టమన్నారు. ఇదేం శిక్ష 'అని నాన్నని అడుగుదామనుకున్నాను. నాన్నని అడిగే ధైర్యం లేదు. ఆ తీర్పు నాకు కొత్తగాని నాన్నకి, ఊరి ప్రజలకీ రొటీన్. ఎవర్నో అడిగితే చెప్పారు. నాలుగు దెబ్బలు వేస్తే దులుపుకుని వెళ్లిపోతాడు. అదే ఊరి జనానికి భోజనాలు పెడితే ఆరిపోతాడు. పైగా పగలు, కక్షలు పెంచుకునే అవకాశం ఉండదు. సిగ్గుతో చచ్చిపోతాడు. దానికి మించిన శిక్ష మరొకటి ఉండదని నవ్వుతూ చెప్పాడు. చిన్నపిల్లవాడ్ని కావడంతో నాకు ఆ తీర్పులోని లాజిక్ అర్థం కాలేదు. పెద్దయ్యాక అన్ని అర్థమయ్యాయనుకోండి. ఊరిమీద, నాన్నమీద గౌరవం రెట్టింపు అయింది. నాది రెండూళ్ల జీవితం. నా గురించి చెప్పాలంటే ... పుట్టిన ఊరు, పెరిగిన ఊరు. అలాగే కన్నవారు, పెంచుకున్నవారు... రెండేసి బంధాలు నాకు. కరీంనగర్ జిల్లా రామడుగు తాలూకాలోని వెదిర గ్రామంలో పుట్టి, ఆ పక్కనే ఉన్న నారాయణపూర్ గ్రామంలో పెరిగాను. హనుమంతరావు, యశోద కన్నవారైతే , రంగారావు, మంగమ్మ పెంచినవారు. దత్తత పేరుతో కన్న తండ్రి, పుట్టిన ఊరు నన్ను దూరం చేసుకున్నా...పరిస్థితులు మళ్లీ నన్ను పుట్టిన చోటికే చేర్చాయి. దాంతో వెదిరతోనే నాకు ఎక్కువ అనుబంధం ఏర్పడింది. మొత్తం 1500 జనాభా ఉన్న ఊరు అది. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి బతికే రైతులు. మా నాన్నకి 100 ఎకరాల పొలం ఉండేది. వరి, మామిడి, మొక్కజొన్న, పల్లీలు, నువ్వులు, అన్ని రకాల కూరగాయలు పండించేవాడు. బర్రెలు, ఆవులు కామన్. మూడేళ్లనాడు... నాన్నకు ఏడుగురు సంతానం. నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. మా బంధువుల్లో ఎవరో వచ్చి నన్ను దత్తత తీసుకుంటామంటే అమ్మానాన్న నన్ను వారికిచ్చేసారు. వాళ్లే రంగారావు, మంగమ్మ. అప్పటికే రంగారావుకి ఒంట్లో బాగోలేదు. నన్ను దత్తత తీసుకున్న నాలుగేళ్లకే ఆయన చనిపోయారు. ఆ తరువాత రెండు మూడేళ్లకు మంగమ్మ కూడా చనిపోయింది. దాంతో నాన్న హనుమంతరావు నన్ను మళ్లీ వెనక్కి తీసుకొచ్చేశారు. రంగారావు నాన్న చనిపోయేముందు తన వందెకరాల పొలం నాపేరున రాశారు. నేను వెదిరకు వచ్చాక ఆ పొలాన్ని కూడా మా నాన్నే చూసేవారు. ఊహ తెలిసేటప్పటికి తల్లితండ్రులు రంగారావు, మంగమ్మలే. చాలా ప్రేమగా చూసుకునేవారు. ఎంత గారామంటే నన్ను స్కూలుకి పంపితే ఎక్కడ అలసిపోతానోనని నాకోసం ప్రత్యేకంగా ఇంట్లోనే స్కూల్‌ని ఏర్పాటు చేసి సార్‌ని పెట్టారు. ఆయన పేరు నారాయణ. చాలా మంచి సార్. ఆయన దగ్గర చదువుకోవడానికి ఇద్దరు షావుకారి పిల్లలు కూడా వచ్చేవారు. మళ్లీ వెదిరకు... నారాయణపూర్ అమ్మానాన్న చనిపోయాక వెదిర ప్రభుత్వ పాఠశాలలో చేరాల్సివచ్చింది. ఈ నాన్నకి కూడా చదువంటే చాలా గౌరవం. ఆయన ఆరోజుల్లోనే నాలుగో తరగతి చదువుకున్నారు. బిడ్డలందరూ పెద్ద చదువులు చదువుకోవాలని ఆయనకు చాలా పట్టుదలగా కూడా ఉండేది. అందుకే వంద ఎకరాల పొలం ఉన్నా ఒక్కరినీ పొలం గట్టు ఎక్కనిచ్చేవాడు కాదు. సరదాగా పొలం వెళ్లడమే కాని, సీరియస్‌గా పొలం పనులు చేసిన జ్ఞాపకాలేవీ లేవు మాకు. ఊళ్లో ఐదోతరగతి వరకూ చదువుకున్నాక, పై చదువులకు కరీంనగర్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ బంధువుల ఇంట్లో ఉండి చదువుకున్నాం. సెలవులకి ఊరు వచ్చేవాళ్లం. సెలవులంటే దసరా, దీపావళి సెలవులు కాదు అప్పట్లో పీర్ల పండుగకే ఎక్కువ సెలవులు ఇచ్చేవారు. పదిహేను రోజులకు తక్కువగా ఉండేవి కావు. పీర్ల పండుగ... నిజానికి పీర్ల పండుగ ముస్లింవారిదే అయినా తెలుగువాళ్లే ఘనంగా చేసుకునేవారు. ఇంట్లో సందడి పెద్దగా ఉండకపోయినా ఊళ్లో మాత్రం మంచి హడావిడి ఉండేది. గుండం వేసేవారు. ఇద్దరు ముగ్గురు నిప్పులమీద నడిచేవారు. నాకు చాలా భయం వేసేది. వాళ్ల కాళ్లకు ఏమీ అయ్యేది కాదు కాని గుండం నుంచి బయటికి వచ్చాక వారికి దేవుడు పూనేవాడు. అప్పుడు అందరికీ జాతకాలు చెప్పేవారు. అగ్గిగుండం మొత్తం మూడురోజులుండేది. ఇప్పుడు బాగా తగ్గిపోయింది మొహరం పండుగంటే పెద్ద సంబరం. ప్రతి ఏడాది పండుగ వచ్చే నెల మారుతూ ఉంటుంది. వేసవి సెలవుల్లో పండుగొస్తే మాత్రం మొహరం సెలవులు మిస్అయ్యేవాళ్లం. ఊళ్లో కోర్టు... నలుగురున్న చోట మంచి, చెడు రెండూ ఉంటాయి. పండుగలు, వేడుకలు, సరదాలు, సంబరాలుతో పాటు కొట్లాటలు, గొడవలు, పంచాయితీలు కూడా తప్పనిసరి. ఆరోజుల్లో ఊళ్లోకి పోలీసులొచ్చి ఎవరినైనా స్టేషన్‌కి పట్టికెళితే చాలా పరువుతక్కువ. మా ఊళ్లోకి ఎప్పుడూ పోలీసులు రాలేదు. ఎందుకంటారా..మా ఊళ్లో ప్రజలందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న న్యాయస్థానమే దానికి కారణం. ఊళ్లో ఎవరికి చిన్న కష్టమొచ్చినా రచ్చబండ దగ్గరికి వచ్చేస్తారు. అక్కడ న్యాయమూర్తి స్థానంలో మా నాన్న హనుమంతరావు కూర్చుంటాడు. జ్యూరీ సభ్యులుగా ఊళ్లో కులానికొక పెద్ద ఉంటాడు. అన్ని కులాలవారికి ఒకటే ప్రాధాన్యత ఉండేది. ఏ కులంవాడు తప్పు చేసినా తీర్పు అన్ని కులాల పెద్దలు ఆలోచించి నిర్ణయించేవారు. ఊరి పెద్దగా తాత తర్వాత నాన్న నిలబడ్డాడు. ఇంటి సమస్య, ఊరి సమస్య..ఏదైనా సరే ఊరు దాటనిచ్చేవారు కాదు. ఆ రోజుల్లో ముఖ్యంగా మా ఊళ్లో పెద్దల మాటకు తలొంచడమే కాని ఎదిరించి గొడవచేసే సంఘటనలు చాలా తక్కువ. రచ్చబండకు ఆడవాళ్లు, పిల్లలు వచ్చేవారు కాదు సమస్య ఆడవాళ్లకు సంబంధించినది అయితే తప్ప. మా ఊరి చుట్టుపక్కల ఉన్న ఐదారూళ్లవాళ్లు కూడా సమస్యల పరిష్కారానికి అక్కడికే వచ్చేవారు. కారణం తీర్పు నిష్పక్షపాతంగా ఉంటుందన్న నమ్మకమే. ఎవరు ఎంత పెద్ద తప్పు చేసినా నష్టపరిహారంతో పాటు ఊరిప్రజలకు దావతే ఇవ్వాలి. ఎంత పేదవాడైనా సరే అప్పుచేసి భోజనాలు పెట్టాల్సిందే. భోజనం తిన్న ప్రతి ఒక్కడి దగ్గరికెళ్లి తాను నేరం చేశానని అంగీకరిస్తూ పళ్లెంతో అన్నం వడ్డించాలి. నాకు తెలిసి ఊళ్లో ఒకసారి తప్పుచేసినవాడు మళ్లీ ఎప్పుడూ రిపీట్ చేయలేదు. కరీంనగర్ నుంచి జడ్చెర్లకు వెళ్లే రోడ్డు మా ఊరిమీద నుంచే వెళుతుంది. దాంతో మా ఊరికి జనం రాకపోకలు ఎక్కువగా ఉండేవి. పోలీసులు వచ్చి నాన్నని కలిసి వెళ్లిపోయేవారు. నాన్న బతికున్నంతవరకూ ఊరి గొడవలేవీ పోలీసు స్టేషన్‌వరకూ వెళ్లలేదు. మామిడితోటల్లో... మాకు నాలుగైదు ఎకరాల మామిడి తోట ఉండేది. మామిడి పండ్ల సమయంలో దోస్తులను తీసుకుని తోటలోకి పరిగెత్తేవాడ్ని. చెట్టుకు పండిన పండ్లే తినేవాడ్ని. పొలం చుట్టుపక్కల గుట్టల్లో చీతవల్కపండ్లు(సీతాఫలం)బాగా ఉండేవి. సంచులనిండా కోసుకొచ్చేటోళ్లం. రెండెకరాల్లో దోసకాయలు పండేవి. తియ్యగా ఉన్న కాయలన్నీ తినేవాళ్లం. పల్లీలను తవ్వి కుప్పపోసుకుని పొలంలోనే కాల్చుకుని తినేసేవాళ్లం. ఎన్ని తిన్నా..మళ్లీ ఇంటికొచ్చి అన్నం తినేవాళ్లం. మాకు నాలుగైదు బర్రెలు, ఐదారు ఆవులు ఉండేవి. పొద్దునే పిడకల పొయ్యిమీద పాలకుండ పెట్టేది. మధ్యాహ్నం వరకూ పాలు మరుగుతూనే ఉండేవి. ఎర్రగా అయి అరచేతిమందం మీగడ ఉండేది. మీగడ పెరుగు లేనిదే నాకు అన్నం దిగేది కాదు. అన్నం తిన్నాక అరనిమిషం కూడా ఇంట్లో ఉండేవాళ్లం కాదు. ఎంత ఎండలోనైనా సరే మళ్లా పొలాల దగ్గరికి వెళ్లిపోయేవాళ్లం. మరీ ఎండ ఎక్కువగా ఉంటే మామిడి చెట్లకింద చెర్ర-గోలి ఆడుకునేవాళ్లం. లేదంటే మోటబావుల్లో ఈతకొట్టేటోళ్లం. నాన్న పట్టుదలే... నాన్నలో ఉన్న నాయకత్వపు లక్షణాలే నాకూ వచ్చాయని అందరూ అంటారు. హైదరాబాదులో ఎల్ఎల్‌బి ముగించుకుని అడ్వకేట్‌గా ప్రాక్టీసు పెట్టాను. 1954లో ఎస్. వెంకటరామిరెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చాను. 1976లో కరీంనగర్ ఎంపీ అయ్యాను. ఒకసారి కాదు మూడుసార్లు వరుసగా ఎంపీగా గెలిచాను. మొదటిసారి ఎంపీ అయిన నాలుగేళ్లకు నాన్న చనిపోయాడు. ఊరంతా తల్లడిల్లిపోయింది. నేనే కాదు ఊరు కూడా తండ్రిని కోల్పోయిందన్నారు. మా అన్నయ్య ఒకరు డిఎస్‌పి అయ్యాడు. మిగతావారు కూడా మంచి చదువులే చదువుకున్నారు. ఊళ్లో ఇప్పటికీ నాన్న కట్టిన ఇల్లు అలాగే ఉంది. పొలాలున్నాయి. నా వాటా మాత్రం నా ఇద్దరి కొడుకులకి రాసేశాను. వేంకటేశ్వర కల్యాణానికి... ఊరి కోసం నేను ప్రత్యేకంగా, పర్సనల్‌గా ఏమీ చేయలేదు కాని ఎంపీ అయ్యాక ప్రభుత్వ నిధులతో పాఠశాల అభివృద్ధి, రోడ్ల నిర్మాణం వంటివి చేయించాను. ఇప్పటికీ ఊరి ప్రజలు నా దగ్గరికి వస్తుంటారు. కలెక్టర్‌తో మాట్లాడి, మిగతా అధికారులతో మాట్లాడి నేను చేయగలిగింది నేను చేస్తుంటాను. ఇక రాకపోకల విషయానికొస్తే ప్రతి ఏడాది ఊళ్లో జరిగే వేంకటేశ్వర కల్యాణానికి కుటుంబ సమేతంగా వెళ్తుంటాను. నా తరం వారే కాదు, ఊళ్లో ప్రతిఒక్కరూ అన్నా అంటూ చిన్నాయనా అంటూ పిల్లలు తాత అంటూ, దగ్గరికి వస్తారు. వెదిరలాంటి ఊళ్లో పుట్టడం నా అదృష్టం. ఆ ఊళ్లో నాకున్న ఆస్తిపాస్తులకంటే ఆ ఊరి ప్రత్యేకతనే నా స్థిరాస్తిగా భావిస్తాను.
|