Pawan Kalyan says Janasena will come to power in 2024 2024లో అధికారంలోకి వస్తాం : జనసేనాని పవన్ కల్యాణ్

Jana sena chief pawan kalyan slams ysrcp govt says party will come to power in 2024

Pawan Kalyan, Jana Sena, Gannavaram Airport, Jana Sena public meeting, Jana Sena Formation Day, 2024 andhra pradesh assembly elections, jana sena, pawan kalyan jana sena, amaravati, andhra pradesh politicsAndhra News, Andhra Pradesh, Politics

Jana Sena chief Pawan Kalyan made interesting remarks at the Jana Sena party's anniversary meeting in the Ippatam village of Mangalagiri in the Guntur district. Addressing the gathering, Pawan Kalyan started his speech by saying Jai Andhra, Jai Telangana and Jai Bharat.

2024లో అధికారంలోకి వస్తాం.. వైసీపీ నిరంకుశ పాలనను అంతం చేస్తాం: పవన్ కల్యాణ్

Posted: 03/14/2022 09:01 PM IST
Jana sena chief pawan kalyan slams ysrcp govt says party will come to power in 2024

రాబోయే 2024 ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ విజయం సాధిస్తుందని, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని పవన్​ ధీమా వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తూ.. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన వైసీపీను గద్దె దించి తీరుతామన్నారు. జనసైనికులపై వైసీపీ చేసే దాడులను వెన్ను చూపేది లేదన్న పవన్.. అధికార బలంతో వైసీపీ మహిషానికి మొలిచిన కొమ్ములు విరగ్గొట్టి.. గద్దె దించుతామని స్పష్టం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదన్న జనసేనాని.. ప్రజా ప్రయోజనాల కోసం పొత్తుల గురించి తర్వాత ఆలోచిస్తామన్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్​ బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు.

జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవ సభావేదికపై.. అధికార వైసీపీ తీరుపై నిప్పులు కురిపించిన ఆయన వైసీపీ నిరంకుశ పాలనను అంతం చేస్తామని అన్నారు. వైసీపీ 151 సీట్లు గెలిచినపుడు బాగా పాలిస్తారనే తానూ ఎదురుచూశానని, కానీ.. ప్రజాకాంక్షకు వ్యతిరేక పాలన ఏపీలో కొనసాగుతోందని విమర్శించారు. ప్రజావేదిక కూల్చివేతతో వైసీపీ పాలన ప్రారంభించిందన్నారు. వైసీపీ తీసుకొచ్చిన ఇసుక విధానంతో 30 లక్షల మంది రోడ్డునపడ్డారని, 32 నిండు ప్రాణాలు బలయ్యాయని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీకు ఇంత విధ్వంస పూరిత ఆలోచనా విధానం ఏంటని ప్రశ్నించారు.

వైసీపీ నేతలు ఏమని ప్రతిజ్ఞ చేసి.. అధికారం చేపట్టారని నిలదీశారు. ఏపీ ప్రజలు తమ బానిసలని ప్రతిజ్ఞ చేశారా? ప్రజల నడ్డి విరగ్గొడతామని ప్రతిజ్ఞ చేశారా? ఒక్క ఛాన్స్‌ ఇస్తే ఆంధ్రను పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారా? అని పవన్ ప్రశ్నించారు. న్యాయవ్యవస్థను లెక్కచేయబోమని ప్రతిజ్ఞ చేశారా? రోడ్లను గుంతలు గుంతలు చేస్తామని ప్రతిజ్ఞ చేశారా? అని నిలదీశారు. వైసీపీ నేతలంటే తనకు వ్యక్తిగత ద్వేషం లేదన్న పవన్‌కల్యాణ్‌.. వైసీపీ విధానాలపైనే తాను విమర్శలు చేస్తున్నానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్​ సుభిక్షంగా ఉంటే తాను మాట్లాడేవాడిని కాదన్నారు.

ఏపీ రాజధాని అమరావతే.. రాజధాని ఎక్కడికీ వెళ్లదు.. అలాగని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు అభివృద్దికి చెందవని కాదు.. వాటి అభివృద్దికి కూడా బృహత్తర ప్రణాళికలు ఉన్నాయని పవన్ స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని, రాజధాని అమరావతికి రైతులు భూములు ఇచ్చారని పవన్‌ అన్నారు. రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాక ఎవడబ్బ సొమ్మని రాజధాని మారుస్తారని పవన్ నిలదీశారు. సీఎం మారినప్పుడల్లా రాజధానులు మారవని తేల్చి చెప్పారు. ఏ ప్రభుత్వం చట్టం చేసినా అది కొనసాగుతుందన్న పవన్.. సీఎంలు మారినప్పుడల్లా విధానాలు మారవన్నారు.

రాజధానులకు భూములివ్వని రైతులకు తాను ఆరోజు మద్దతిచ్చానని పవన్‌ చెప్పారు. మరి, రైతులు ఒప్పందం చేసుకున్నప్పుడు వైసీపీ నేతలు గాడిదలు కాశారా? అని నిలదీశారు. రాజధానికి 32 వేల ఎకరాలు సరిపోవని నాడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్‌ అన్నారన్న పవన్‌.. మరి, ఆనాడే 3 రాజధానులు చేస్తామని వైసీపీ నేతలు ఎందుకు చెప్పలేదని సూటిగా ప్రశ్నించారు. ఏపీలో ఆదాయం భారీగా వస్తున్నప్పటికీ.. దుర్వినియోగమే ఎక్కువగా అవుతోందని జనసేనాని ఆరోపించారు. పార్టీ ప్రకటనల కోసమే రూ.400 కోట్లు వృథా చేశారని వైసీపీపై ధ్వజమెత్తారు.

ప్రభుత్వ కార్యాలయాలకు, పంచాయితీ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసుకునేందుకు రూ.300 కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. ఈ వృథా ఖర్చు బదులు ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ ఇవ్వవచ్చు కదా? అంటూ ప్రశ్నిించారు. దుబారా చేయడానికి డబ్బులు ఉంటాయిగానీ.. ఉద్యోగుల జీతాలకు మాత్రం డబ్బులు ఉండవా? అని నిలదీశారు. రాష్ట్ర ఆదాయం ఎటు పోతుందో అడిగేవారు లేరన్నారు. రూ.7 లక్షల కోట్లు అప్పులున్నయని చెబుతున్నారన్న పవన్‌కల్యాణ్‌.. అప్పులు తీర్చే మార్గాలను వెతకాలని సూచించారు. వడ్డీలు కట్టలేని పరిస్థితి ఉంటే ఎలా? అని నిలదీశారు.

రూ.లక్ష కోట్ల ఆదాయం సద్వినియోగం చేయకపోతే.. ప్రభుత్వంలో లోపమున్నట్లేనని తేల్చి చెప్పారు. ఈ విషయాలు ప్రశ్నిస్తే.. దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. చివరకు పోలీసులు కూడా భయపడే స్థాయికి వెళ్లారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువగా మాట్లాడితే వీఆర్‌కు పంపుతున్నారని, ఇప్పటి వరకు ఎందరు అధికారులను వీఆర్‌లో పెట్టారో లెక్కలేదన్నారు. అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చిన వైసీపీ.. ఆ తర్వాత ఉద్యోగులకు మొండిచేయి చూపిందని మండిపడ్డారు. వైసీపీ పార్టీలో కొనసాగుతున్న కొందరు పెద్దలు.. పార్టీ అధినేతకు ఈ విషయాల గూర్చి చెప్పాలని ఆయన సూచనలు చేశారు.

ఆవిర్భావ సభ వేదికగా.. జనసేన భవిష్యత్ ప్రణాళికలను పవన్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతే ఉండాలని, ఉంటుందని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేస్తామని హామీ ఇచ్చారు. అప్పుల్లో కూరుకున్న ఏపీని సంపన్న రాష్ట్రంగా మార్చాలన్నదే జనసేన లక్ష్యమని చెప్పారు. బలమైన నూతన పారిశ్రామిక విధానాన్ని తెస్తామన్నారు. పెట్టుబడులు తరలివచ్చే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామన్న పవన్‌.. అల్పాదాయ వర్గాలకు ఉచితంగా ఇసుక ఇస్తామని ప్రకటించారు.

జనసేన సౌభాగ్య పథకం కింద యువతకు సాయం చేస్తామని, ఐదేళ్లలో 5 లక్షల మందికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తామని పవన్‌ ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా మారుస్తామని, పంట కాలువలు, మినీ రిజర్వాయర్లను ఆధునీకరిస్తామన్నారు. అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ప్రతి పోస్టునూ భర్తీ చేస్తామని చెప్పారు. నిరుద్యోగుల ప్రయోజనాలు కాపాడడమే జనసేన లక్ష్యమన్నారు. ఉద్యోగులకు వేతన సవరణ చేపడతామన్న పవన్‌కల్యాణ్‌.. అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సీపీఎస్‌ ఖచ్చితంగా రద్దు చేస్తాని స్పష్టంగా చెప్పారు.

ఒక పార్టీని నడపాలంటే సైద్ధాంతిక బలం ఉండాలని, బలమైన సిద్ధాంతాన్ని పట్టుకున్న లక్షల మంది ఉండాలని పవన్‌ అన్నారు. వైసీపీ, టీడీపీకు బలమైన పునాదులున్నాయని పవన్‌కల్యాణ్‌ గుర్తు చేశారు. కానీ.. జనసేనలో సీనియర్‌ నాయకులు ఎవరూ లేరన్నారు. జనసైనికులు, తాను మాత్రమే ఉన్నామని చెప్పారు. అయినా.. అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతున్నామన్నారు. 2019 ఎన్నికల్లో 7 శాతం ఓట్లు సాధించామన్న పవన్‌కల్యాణ్‌.. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో జనసేన తరఫున 1,209 మంది సర్పంచులు గెలిచారని చెప్పారు. తద్వారా.. 7 నుంచి 27 శాతానికి జనసేన ఓట్లు పెరిగాయన్నారు.

తాను ఎవరి నుంచి ఏదీ ఆశించనని, తనతో అయితే ఎంతో కొంత అవసరాల్లో ఉన్నవారికి సాయం చేస్తుంటానని చెప్పారు. తన రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే తాను రాజకీయ అరంగ్రేటం చేశానని చెప్పారు. ఐదేళ్ల పాటు పోటీకి దూరంగా ఉన్నా.. ప్రశ్నించడం మాత్రం అపలేదని అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనే నేతల వ్యక్తిత్వం బయటపడుతుందన్న పవన్‌.. ఇచ్చిన మాటపై నిబద్ధత కలిగి ఉండటం నాయకత్వ లక్షణమన్నారు. ఆ లక్షణంతోనే ముందుకు సాగుతున్నానని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో.. అధికారం సాధించే స్థాయికి జనసేన చేరుతుందని పవన్‌కల్యాణ్​ ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం బీజేపి నాయకులు రోడ్‌మ్యాప్‌ ఇస్తానన్నారని, దానికోసమే ఎదురుచూస్తున్నామని చెప్పారు.

జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ అధినేత పవన్ సుదీర్ఘంగా దాదాపుగా అన్ని రాజకీయ పార్టీల నేతలకు, అన్ని వర్గాల ప్రజలకూ ధన్యవాదాలు తెలియజేశారు. తమ పార్టీ నేతలు శ్రేణులతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీల నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. చివరకు తన సంస్కారం.. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలకూ నమస్కారాలు తెలియజేస్తోందని పవన్​ అన్నారు. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చి, తమ పార్టీపై ప్రేమచూపిన ఇప్పటం ప్రజలకు కృతజ్ఞతగా గ్రామానికి రూ.50 లక్షలు విరాళం ఇస్తున్నట్టు పవన్ ప్రకటించారు. రైతు పెద్దల ద్వారా గ్రామ పెద్దలకు విరాళం అందజేస్తానని పవన్‌ వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles