India | Emergency | Indira Gandhi | Democracy | Freedom

Indian democracy finally won againist the emergency in 1975

India, Emergency, Indira Gandhi, Democracy, Freedom

Indian democracy finally won againist the Emergency in 1975. When Indiara Gandhi in the rule, she open for emergency in india for two years.

ITEMVIDEOS: ప్రత్యేకం: ఎమర్జెన్సీ పై గెలిచిన మన భారత ప్రజాస్వామ్యం

Posted: 06/25/2015 03:14 PM IST
Indian democracy finally won againist the emergency in 1975

భారత స్వాతంత్రం తర్వాత భారత ప్రజాస్వామ్యాన్ని చీకటి తెరలు కమ్ముకున్నాయి. భారత యవనికపై మునుపెన్నడూ లేని, భవిష్యత్ కూడా ఊహించని చీకటి చరిత్రకు పునాదులు వేసింది నాటి ప్రధాని ఇందిరా గాంధీ. భారతదేశంలోని ప్రజలు ఇక్కడి వ్యవస్థతో విసిగిపోయారని, తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్నారని చెబుతూ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అనే అప్రజాస్వామ్య చరిత్రకు తలుపులు తెరిచింది. 1975లో రాజకీయ సంక్షోభం కాస్త ఎమర్జెన్సీకి వీలుక ల్పించింది. నేటికీ సరిగ్గా నలభై సంవత్సరాల నాడు, అంటే 26జూన్‌ 1975 ప్రభాతసమయాన రేడియో ప్రసారాల్లో అత్యవసర పరిస్థితి పై వార్తలు...... అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ జూన్‌ 25 అర్ధరాత్రి భారత రాజ్యాంగం లోని 352(1)వ అధికరణం అనుసరించి భారతదేశంలో అత్యవసర పరిస్థితి విధించారు.దేశస్వాతంత్రం అనంతరం ఎమర్జెన్సీ విధించడం అప్పటికి మూడోసారి అయినప్పటికి దేశంలో ఆంతరంగిక కల్లోలం పేరుతో ఎమర్జెన్సీ విధించడం ఇదే మొదటిసారి.విదేశీ దురాక్రమణ కారణంగా 1962 లో, బంగ్లాదేశ్‌ సంక్షోభం కారణంగా 1971డిసెంబరు లో ఎమర్జెన్సీ విధించారు.ఇందిరా గాంధీ సలహా పై అప్పటి రాష్టప్రతి ఫక్రుద్దీన్‌ ఆలీ అహ్మద్‌ దేశంలో ఎమర్జెన్సీ విధించారు.

 

 

దేశ సమగ్రతకు, సమైక్యతకు సుస్థిరతకు ప్రజాస్వామ్య ప్రాతిపదికగా రూపొందించుకున్న మన రాజ్యాంగాన్ని భగ్నం చేసేందుకు దేశంలో ఉన్న కొందరు వ్యక్తులు, పార్టీ లు భాథ్యతారహితంగా వ్యవహరించడం వలన ప్రజలు పూర్తిగా విసిగివేసారి ఉన్నారు కాబట్టి దేశంలో అత్యవసర పరిస్థితి విధించడం జరిగిందని నాటి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు దేవ్‌ కాంత్‌ బారువా చెప్పారు. ఇందిరా ఈజ్‌ ఇండియా, ఇండియా ఈజ్‌ ఇందిరా అంటూ ఇందిరా గాంధీ భజనలో ఆరితేరిన వాడు ఈ డికె.బారువా.నిజానికి దేశ ప్రజలకు ఆనాడు వచ్చిన ముప్పు ఏమీ లేదు. ఆంతరంగిక కల్లలోం అంతకన్నా లేదు. ఇక్కడ ముప్పు వచ్చింది ఇందిరాగాంధీ కి ఆమె పదవికి, ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాదు హైకోర్టు ఇచ్చిన తీర్పును పాటించినట్లయతే ఇందిరా గాంధీ పార్లమెంటు సభ్యురాలుగాగాని ప్రధానమంత్రి పదవిలోగానీ కొనసాగలేరు. పదవి నుండి తప్పుకోవడం ఇందిరమ్మకు ఇష్టం లేదు,అందుకే ఎమర్జెన్సీ పేరుతో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారు. పార్టీ లో నైనా ప్రభుత్వం లో నైనా తనదే పై చెయ్యి కావాలని ఇందిరా గాంధీ పట్టుదల అందుకోసం పార్టీ ని చీల్చిన ఘనత ఇందిరా గాంధీ కి దక్కుతుంది. 1969 వ సంవత్సరంలో జరిగిన రాష్టప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నీలం.సంజీవరెడ్డి కాదని పార్టీ లో తన ఆధిపత్యం నిలుపుకోవడం కోసం ఇందిరా గాంధీ కమ్యూనిస్ట్ ల సహయంతో, స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన వి.వి గిరిని గెలిపించారు.

దేశంలో ఆంతరంగిక కల్లోలం పేరుతో అత్యవసర పరిస్థితి విధించారు.ఎమర్జెన్సీ పేరుతో వేలాది మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ సందర్భం లోనే జయ ప్రకాష్‌ నారాయణ ఈ చర్యను వినాశకాలే విపరీత బుద్ధి గా అభివర్ణించారు. మదర్‌ ఇండియా పత్రికా సంపాదకుడు బాబూరావు పటేల్‌, నాయ కులు చిన్న జైళ్లలో ఉన్నారు, దేశ ప్రజలు పెద్ద జైలులో ఉన్నారు అని ఎమర్జెన్సీ గురించి వ్యాఖ్యానించారు. ఈ ఏమర్జెన్సీ పై ప్రతిపక్ష పార్టీ నేతలు అందరూ ఏకమయ్యారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం ఇందిరా గాంధీ కి మద్దతు పలికింది. బీహార్‌ లో జయ ప్రకాష్‌ నారాయణ ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం క్రమంగా ఇతర రాష్ట్రాలకు వ్యాపించింది. ఇంతలో కాంగ్రెస్‌ అసమ్మతి రాజకీయాల ఫలితంగా గుజరాత్‌ లో చిమన్‌ భాయ్‌ పటేల్‌ ప్రభుత్వం కూలిపోయింది. 1971 లో రాయబరేలీ నియోజకవర్గం నుండి ఇందిరా గాంధీ లోక్‌ సభకు ఎన్నిక కావడం చెల్లదని అలహాబాద్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. ఇందిరా గాంధీ పై కేసు వేసిన వారు ఆమె ప్రత్యర్ధి రాజ్‌ నారాయణ. ఈ తీర్పు ను ఇందిరా గాంధీ గౌరవిస్తే దేశ చరిత్రలో అత్యున్నత స్థానంలో నిలిచేవారు. నిస్సందేహంగా చెప్పా లంటే ఇందిరాగాంధీ గొప్ప నాయకురాలు, కానీ ఎమర్జెన్సీ విధించడంతో ఆమె ప్రతిష్ట మరింత దారుణంగా దిగజారింది.

ఎమర్జెన్సీ విధించమని ఆమెకు సలహా ఇచ్చింది అప్పటి పశ్చిమ బెంగాల్‌ ముఖ్య మంత్రి సిద్ధార్థ శంకర్‌ రే,ఇందిరా గాంధీకి ఎమర్జెన్సీ సమయంలో అనేక సలహాలు ఇచ్చింది మోహన్‌ కుమార మంగళం. కమ్యూ నిస్ట్ పార్టీ సలహా మేరకు ఆయన కమ్యూనిస్ట్ పార్టీని వీడి కాంగ్రెస్‌ పార్టీ లోకి చేరి ఇందిరా గాంధీకి సలహాదారుగా మారారు. ఆయన రష్యాలో మాదిరిగా ప్రభుత్వ బలాన్ని ఉపయోగించి ప్రతిపక్ష, వ్యతిరేక నేతలను ఎలా దారికి తెచ్చుకోవచ్చునో ఇందిరా గాంధీ కి చెప్పారు. అయితే ఎమర్జెన్సీ ని రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలి అనే నిర్ణయం ఇందిరా గాంధీ సొంత నిర్ణయం. తనకు ఎదురు లేదు తిరుగు లేదని తన గెలుపు తథ్యమని ఇందిరా గాంధీ భావించిన తరువాతనే 1977 లో అత్యవసర పరిస్థితి తొలగించి ఎన్నికలు ప్రకటించారు. పేదల కోసం 20 సూత్రాల పథకం ప్రవేశ పెట్టారు. వామపక్ష నేతలు ను మెప్పించడానికి సోషలిజం సెక్యూలరిజం వంటి పదాలను రాజ్యాంగం లో చేర్చారు. ఇన్ని కార్యక్రమాలు చేపట్టినా ప్రజా ప్రభంజనానికి ఇందిర తలవంచక తప్పలేదు. విడిగా ఉంటే ఇందిరా గాంధీని ఓడించలేమని గ్రహించిన ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఒక్కటిగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో ఉత్తరాదిలో జనతా ప్రభంజనం వీచింది. ఆంధ్ర ప్రదేశ్‌ కర్ణా టక రాష్ట్రాలలో మాత్రం ఇందిరాగాంధీ హవా కొనసాగింది. ఆంధ్రప్రదేశ్‌లో చెన్నారెడ్డి కర్ణాటకలో దేవరాజ్‌ ఇందిరా కాంగ్రెస్‌ పార్టీని విజయ ఫధంలో నడిపిం చారు.

భారత ప్రజలు అత్యధికులు నిరక్షరాస్యులు కావచ్చు, కానీ ఏది మంచి ఏది చెడో స్పష్టంగా తెలిసినవారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజలే నడుం బిగించారు,అందుకే ఎమర్జెన్సీ విధించిన ఇందిరా గాంధీని ఓడించి జనతా పార్టీ కి పట్టం కట్టారు, ప్రజలు ఇచ్చిన తీర్పును అర్థం చేసుకోవడంలో జనతా నేతలు విఫలం అయ్యారు.పదవులు కోసం పోటీపడి ప్రజా సంక్షేమాన్ని మరిచి పోయినప్పుడు వారిని ఓడించి తిరిగి ఇందిరా గాంధీకి పట్టం కట్టింది ఈ ప్రజలే. ఎమర్జెన్సీ అనే చీకటి చరిత్రను భారతదేశ పుటల్లోంచి ఎవరూ చెరిపివెయ్యలేరు. అయితే చీకటి కూడా వెలుతురుకు దారి చూపిస్తుందంటే నిజమే. ఎందుకంటే భారత ప్రజానీకం ఎమర్జెన్సీ అనే చీకటిని జయించడానికి ప్రజాస్వామ్యానికి మరోసారి పురుడుపోశారు. ఇందిరా గాంధీ రాసిన చీకటికాండను భారత ప్రజలు ఎన్నడూ మరిచిపోరు. కానీ భవిష్యత్తులో ఎన్నడూ రాజకీయ కారణాల వల్ల ఎమర్జెన్సీ రాకూడదని తెలుగు విశేష్ మనసారా కోరుకుంటోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Emergency  Indira Gandhi  Democracy  Freedom  

Other Articles