Comparison between telangana and scotland

telangana, telangana government, telangana latest, kcr, trs, telangana logo, latest news, nayini, telangana movement, seemandhra movement, andhrapradesh, telangana bill, scotland, uk, britain, latest news

telangana state formantion process is a black book in india's history of library whether scotland judgement is totally different : many differneces and comparisons between telangana and scotland

ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన స్కాట్లాండ్.. మరి తెలంగాణ...?

Posted: 09/22/2014 06:09 PM IST
Comparison between telangana and scotland

ప్రపంచ ప్రజాస్వామిక దేశాలకు భారత్ ఆదర్శమని మనమంతా గర్వంగా చెప్పుకుంటాము. కాని లోపల జరిగేది మాత్రం ప్రజాస్వామ్య ఖూనీ అనే చెప్పాలి. ఒక్క తెలంగాణ అంశంమే తీసుకుంటే ప్రజాస్వామ్యం ఎంత కుమిలిపోతుందో అర్ధమవుతుంది. గతవారం జరిగిన స్కాట్లాండ్ స్వాతంత్ర్య - సమైక్య పోరు ప్రపంచానికే ఆదర్శంగా నిలిస్తే.., మన దేశంలో జరిగిన కొత్త రాష్ర్ట ఏర్పాటు ఒక చీకటి అధ్యాయానికి తెరతీసింది. విభజనతో సమస్యలు తొలగుతాయి.., ప్రజల మద్య సత్సంబంధాలు పెరుగుతాయనుకుంటే ఈ అగాధం మరింత పెరిగింది. దీనికి కారణం ఎవరు... ఈ తప్పుకు ఎవరిని నిందించాలి.

విభజన-సమైక్య వాదాల మద్య జరిగిన పోరులో స్కాట్లాండ్ లో సమైక్యవాదం గెలిచింది. కలసి ఉండటానికే అక్కడ స్వల్ప మెజార్టీతో ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ విషయానికి వస్తే.., ప్రస్తుత తెలంగాణ రాష్ర్టంలో నూటికి తొంబై ఐదు శాతానికి పైగా ప్రజలు విడిపోవాలని భావించారు. ఏపీలో మెజార్టీ ప్రజలు కలిసి ఉండాలని కోరుకున్నారు. ఏపీ విభజన ప్రక్రియ తలుపులు తెరిచి చూస్తే అడుగడుగునా మనకు రాజకీయ, స్వార్ధ, స్వప్రయోజనాలే కన్పిస్తున్నాయి. స్కాట్లాండ్ లో జరిగిందేమిటి.., తెలంగాణ విషయంలో కొరవడింది ఏమిటి. విభజన-సమైక్య వాదాల మద్య వివాదం జరగటానికి గల ప్రధాన కారణాలను ఓ సారి పరిశీలిద్దాం.

స్పష్టత లేదు.. అంతా నటనే

తెలంగాణ అంశానికి, స్కాట్లాండ్ స్వాతంత్ర్య పోరాటానికి దగ్గరి పోలికలు కొన్ని ఉన్నాయి. అవే వివక్ష, అణిఛివేత, అసమానతలు, స్వరాజ్యకాంక్ష.. నిరుద్యోగం. ఇవే అంశాలు రెండు చోట్ల ఉద్యమాలకు ఊపిరిలూదాయి. అయితే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో స్పష్టత కొరవడింది. దేశ ప్రజాస్వామ్యంలో కీలకభాగమైన రాజకీయ పార్టీలు స్పష్టమైన అభిప్రాయాలను చెప్పలేదు. పార్టీల నేతలు ప్రాంతాలుగా విడిపోయారు. అటు రాజకీయ పార్టీలు కూడా పబ్బం గడుపుకునేందుకు వీటిని ప్రొత్సహించాయి. విభజించి పాలించు అనే బ్రిటీష్ సిద్దాంతాన్ని తెలంగాణ విషయంలో అమలు చేస్తే.., ఈ సిద్దాంతానికి జన్మనిచ్చిన బ్రిటీష్ దేశంలో విభజనకు వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. తెలంగాణపై టీ.కాంగ్రెస్ నేతలు అనుకూలంగా మాట్లాడితే., సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వ్యతిరేకంగా మాట్లాడేవారు. నాయకత్వం మాత్రం నోరు మెదపలేదు. అటు టీడీపీ కూడా ఇలాగే చేసింది. టీ.టీడీపీ విభజనకు బాబు గారు అనుకూలమని ప్రకటిస్తే..., లేదు,కాదు అని సీమాంధ్ర టీడీపీ ప్రకటించుకుంది. ఇక చంద్రబాబు అయితే సమన్యాయం.. అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చి జాతీయస్థాయి జర్నలిస్టులకే చుక్కలు చూపించారు.

ప్రతి పార్టీ కూడా రాజకీయ ప్రయోజనాలు.., రెండు చోట్ల బలంగా ఉండాలనే విధానంతో వ్యవహరించింది తప్ప..., ప్రజలంతా బాగుండాలని కోరుకోలేదు. ప్రజా ప్రయోజనం కంటే స్వార్ధ ప్రయోజనాలు, వ్యక్తిగత ఆస్తులను కాపాడుకోవటానికే నేతలు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఉద్యమాన్ని దగ్గరినుంచి చూసిన ఏ ఒక్కరిని అడిగినా ఇది నిజమని చెప్తారు. లోపల ఒకటిపెట్టుకుని బయటకు మాత్రం ప్రజల కోసం ప్రాణాలు ఇస్తామన్న రేంజ్ లో గొప్పలకు పోయారు. చివరకు విభజన ప్రక్రియ ముగిసి రాష్ర్టం ఏర్పడ్డాక.. సమైక్యమంటూ అప్పట్లో చించుకుని తిరిగిన ఏ ఒక్క నేత కూడా నోరు తెరవటం లేదు.

అయితే స్కాట్లాండ్ విషయంలో ఇలా జరగలేదు. ప్రతి వివాదం.., విధానంపై వారికి స్పష్టత ఉంది. విభజన కోరుకుంటున్న నేతలు తమ అభిప్రాయం చెప్పారు. స్వాతంత్ర్యం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. అటు సమైక్యం  కోరుకునే నేతలు కలిసి ఉండటం వల్ల కలిగే లాభాలను, విడిపోతే వచ్చే కష్టాలను చెప్పారు. నిర్ణయం మాత్రం ప్రజలకు వదిలి వేశారు. మెజార్టీ ప్రజలు ఏం కోరుకుంటారో అదే జరుగుతుందని చెప్పారు. ఈ విధానాన్ని ప్రపంచమంతా హర్షిస్తోంది. మరి మన విధానం..? వద్దులెండి చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంటుంది.  

సమస్యలపై చర్చ శూన్యం

తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు అంతా రాజకీయాల ఆధారంగా జరిగిందే. యూపీఏ అడుగు ముందుకు వేయాలంటే మనకేం వస్తుంది అని ఆలోచించేంది. ఇలా సాగదీసి.. ఉద్యమకారులు రెచ్చిపోయేలా చేసి.. చివరి నిమిషంలో హడావుడిగా తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు 2009 డిసెంబర్ 9న ప్రక్రియ మొదలైందని ప్రకటన చేసి.., పక్కనపడేశారు. మళ్ళీ 2013 జులై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానంతో బూజు దులిపి బయటకు తీశారు. ఆ వెంటనే సీమాంధ్ర ఉద్యమం ఎగిసిపడింది. అయితే వారిని అంతగా పట్టించుకోకుండా చకచకా పనిచేసుకుపోయారు. తక్కువ సమయం ఉండటంతో బిల్లు ఆమోదం పొందాలంటూ హడావుడి చేశారు. యూపీఏ 2కు చిట్టచివరి సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టారు. లోక్ సభ చరిత్రలో అదో చీకటి అధ్యాయంగా చెప్పవచ్చు. లోక్ సభ టీవీ ప్రసారాలను ప్రభుత్వమే నిలిపివేసి మరి బిల్లుపై చర్చ జరిపి ఆమోదింపచేసుకుంది. సభలో ఏం జరిగిందో కూడా బయటకు తెలియనివ్వకుండా వ్యవహరించి ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేసింది. అయితే అదో టెక్నికల్ సమస్య అని సర్ది చెప్పకుంది. కోట్ల ప్రజల జీవితాలను, భవిశ్యత్ తరాలను ప్రభావితం చేసే అంశంపై కనీసం గంట సేపు కూడా చర్చ జరపకుండా బిల్లు ఆమోదించారు.

తెలంగాణ ఉద్యమం, సమైక్య ఉద్యమంపై చర్చ జరిగింది తప్ప.. ఇక్కడ ఉన్న సమస్యలపై ఏ పార్టీ కూడా ప్రస్తావించలేదు. తెలంగాణ వస్తే కలిగే లాభాలు, నష్టాలను ఎవరూ వివరించటానికి సాహసించలేదు. ఎందుకంటే ఏ మాట చెప్తే.. ఏ ప్రాంతంలో పార్టీకి నష్టం జరుగుతుందో అనే భయం నేతల్లో ఉంది. కాని పరాయి దేశంలో ప్రజ సంక్షేమమే పరమావధిగా నేతలు వ్యవహరించారు. సమస్యలు, లాభాలపై అవగాహన కల్పించారు. మీరే నిర్ణయించుకోండి అని ప్రజలకు అధికారాన్నిచ్చారు. వారు కోరుకున్నది.., ఎన్నిక ద్వారా ప్రభుత్వానికి చెప్పారు.

మీడియా పక్షపాతం

సమాజ హితం కోసం పుట్టిన మీడియా.., స్వార్ధప్రయోజనాలతో ప్రజలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగింది. మీడియాపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని అవకాశంగా చేసుకుని.. ప్రాంతీయ వాదాలను రెచ్చగొట్టింది. మీడియా కూడా ప్రాంతాలుగా విడిపోయింది. ప్రజలకు కలిగే ప్రయోజనాలు, లాభ-నష్టాలపై వివరించకుండా.., రెండు వైపులా ఆందోళనలు పెంచటంలో కీలక భూమిక పోషించింది. ఉద్యమకారులను పోలీసులు లాఠీచార్జ్ చేస్తుంటే లైవ్ కవరేజీలు బ్రేకింగ్ న్యూసులతో బెదరగొట్టింది, తప్ప ఇదెక్కడి న్యాయం అంటూ నినదించలేదు. ప్రజలను చైతన్యం చేయటం కంటే.., వారిని భయపెట్టి టీఆర్ పీ పెంచుకోవటంపైనే దృష్టిపెట్టంది. పార్టీకో పేపరు.. నేతకో చానెల్ అన్నట్లుగా మారి.., వ్యక్తిగత భావాలను ప్రజాభిప్రాయాలుగా చూపింది.

ప్రతి అంశాన్ని భూతద్దంలో చూపించి బెదరగొట్టారు. కానీ మన రాజ్యాంగానికి ప్రధాన మూలం అయిన బ్రిటన్ దేశంలో అలా జరగలేదు. మీడియా అంటే ప్రజా వారధిగా వ్యవహరించింది. కలిసి ఉండేవారి గురించి చెప్పింది.., విడిపోవాలనుకుంటున్న వారి అభిప్రాయాలను విన్పించింది. మరి ప్రజలు ఏం చేస్తారో చూద్దాం అని నిర్ణయాన్ని వారికి ఇచ్చేసింది తప్ప.. మన తెలుగు మీడియా మాదిరిగా రెచ్చగొట్టి.., భయపెట్టి..ప్రలోభపెట్టలేదు. అంతలా చేశారు కాబట్టే.., తెలంగాణలో ఆ మద్య మీడియాపై నిషేధం విధించారు. ఇది దేశంలోనే సంచలనం కల్గించే విషయం.

హింసను అడ్డుకోలేదు

ఆవేశం, భావోద్రేకాలతో ముడిపడిన సున్నితమైన తెలంగాణ అంశంలో హింస చెలరేగింది. ఉద్యమం ఎంత శాంతియుతంగా జరిగిందో.., అంతే హింసాయుతంగా కూడా మారింది. అడుగడుగునా ఉద్యమకారులను అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నారు.. సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళనకారుల దాడులతో నాలుగేళ్లు ఉమ్మడి రాష్ర్టం అట్టుడికింది. నివురుగప్పిన నిప్పులా ఉద్యమం వేడి తగులుతూనే ఉండేది. అటు నేతలు కూడా హింసను ఖండించకుండా.., సర్ది చెప్పుకోవటం బాధాకరం. తామంతా ప్రజల కోసమే.., ప్రజాభిప్రాయం ప్రకారమే నడుచుకుంటున్నామని మన నేతలు చెప్పారు. కాని వారికి దిశానిర్దేశం చేసేవారిలా.., మార్గదర్శకులుగా ఉండకుండా.., రెచ్చగొట్టారు. తెలంగాణ సమైక్యవాదులు కొట్టుకున్న సందర్బాలు కోకొల్లలు. వెయ్యికి పైగా బలిదానాలు జరిగినా., కేంద్రం నోటి నుంచి స్పష్టమైన ప్రకటన చేసిన పాపాన పోలేదు.

విదేశంలో జరిగిన పద్దతి చాలా చక్కగా ఉంది. హింస అనే మాట లేకుండా ఎవరి అభిప్రాయాలను వారు చెప్పుకున్నారు. సమైక్యవాది వచ్చి మాట్లాడుతుంటే విభజనవాది ఆసక్తిగా విన్నాడు. అదే సమయంలో స్వతంత్ర్యం కోరుకుంటన్న వారు తమ కష్టాలు చెప్తుంటే.., సమైక్యవాదులు శ్రద్ధగా గమనించారు. ఇలా ఇద్దరి అభిప్రాయాలను పరస్పరం పంచుకుని ఏం చేయాలో నిర్ణయించుకున్నారు. అందువల్లే చుక్క నెత్తురుబొట్టు రాలకుండా.., ఒక్క లాఠీ దెబ్బ కూడా పడకుండా స్కాట్లాండ్ లో స్వాతంత్ర్య ఉద్యమం జరిగింది.., సమైక్యంగా నిలిచింది.

ప్రజల్లో అభద్రత, భయం

రాజకీయ నేతలు, మీడియా అంతా కలిసి ప్రజల్లో ఉన్న భయాలు, భావాలను మరింత పెంచారు తప్ప.., అభద్రతను పోగొట్టే ప్రయత్నం చేయలేదు. ఎవరి వాదనలను వారు బలంగా విన్పించారు. తెలంగాణ రాకపోతే.., మన బతుకులు పాతాళంలోకి పడిపోతాయి అని వేర్పాటువాద నేతలు భయపెట్టారు. అటు రాష్ర్టం విడిపోతే సీమాంధ్రులు రెండవ తరగతి పౌరులుగా హీనంగా మారతారు అని సమైక్య నేతలు హెచ్చరించారు. ఇలా రెండు వాదాల మద్య ప్రజల్లో అభద్రతా భావం పెరిగింది. కలిసి ఉన్న తెలుగు జాతి.., ప్రాంతాలుగా విడిపోయింది. రాజకీయ నేతలు పెట్టిన చిచ్చు వల్ల ఇవాళ రెండు రాష్ర్టాల ప్రజలు., నువ్వు వేరు, నేను వేరు అనేలా మారిపోయారు.

తెలంగాణ రావటాన్ని సీమాంధ్రులు కూడా స్వాగతించారు. అలాగని అక్కడ సమైక్యవాదం తక్కువ అని చెప్పలేము. విభజన వికాసానికి జరిగితే సరే.., విరోదానికి జరిగితే మాత్రం ఇప్పుడు తెలుగు రాష్ర్టాల మద్య ఉన్న భయంకర పరిస్థితులే ఉత్పన్నం అవుతాయి. భవిష్యత్తులో తెలంగాణ ప్రక్రియ ప్రతి ప్రభుత్వానికి ఒక గుణపాఠంగా ఉంటుంది. పరాయి దేశంలో జరిగిన పద్దతిని చూసి అయినా.., మన నేతలు, పార్టీలు మారితే భిన్నత్వంలో ఏకత్వం సాధించినట్లే.., లేకపోతే, ఇంట్లో కుంపటి పెట్టుకున్నట్లే లెక్క అని సామాజిక విశ్లేషకులు అంటున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : telangana  scotland  latest news  politics  

Other Articles