Telangana jobs kcr latest news

people mainly youth of telangana waiting for jobs as they mainly fights for that during movement : after forming of telangana also no jobs for seperate state people they anger on government

telangana youth waiting for jobs

ఉద్యోగాలెప్పుడొస్తాయి... సారూ..?

Posted: 09/18/2014 06:53 PM IST
Telangana jobs kcr latest news

పది జిల్లాల ప్రజలు కలలు కన్న తెలంగాణ వచ్చింది. స్వరాష్ర్టం, స్వపరిపాలన, ఆత్మగౌరవం వారికి సిద్ధించాయి. ఇక్కడివరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఉద్యోగాల మాటేమిటి. తెలంగాణలో ఉన్నత చదువులు చదువుకున్న ఏ విద్యార్థిని తట్టినా ఇదే ప్రశ్న వస్తోంది. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఇంకా రావేమిటి అని వారంతా ప్రశ్నిస్తున్నారు. కొత్త రాష్ర్టం ఏర్పడ్డా తమ బతుకులు ఇంకా మారవా అని బాధపడుతున్నారు. సగం జీవితమంతా చదువుకే అంకితం చేసిన వారు ఉస్మానియా, కాకతీయ సహా ఇతర విశ్వవిద్యాలయాల్లో కోకోల్లలుగా మనకు కన్పిస్తున్నవారు. వారంతా తమకు తెలంగాణలో కనీసం ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అర్హత అయినా ఉంటుందా అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ పరిస్థితికి కారణం ఏమిటి..?

అనేక ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ర్టం జూన్ 2న అధికారికంగా ఏర్పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి నాలుగు నెలలు అవుతోంది. కేబినెట్ కొలువుదీరింది. మంత్రులకు శాఖలు కేటాయించారు. విభజన ప్రక్రియ అన్ని శాఖల్లో దాదాపు పూర్తియనట్లే. అయితే ఉద్యోగాల మాట ఇప్పుడు తెలంగాణలో ప్రధాన అంశం అయింది. ప్రభుత్వం నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోవటంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. తెలంగాణ కోసం పోరాడిన తమకు ఉద్యోగాలు రాకపోగా.., వందల కేసులు బహుమతులుగా ఉన్నాయని మండిపడుతున్నారు. ఇంకెప్పుడు ఉద్యోగాలు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.

దీనికి తోడు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయటం కూడా విద్యార్థుల ఆగ్రహానికి, అనుమానాలు, ఆవేదనలకు కారణం అయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామి ప్రకారం ఆయా శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం పర్మినెంట్ చేసుకుంటూ పోతుంది. ఇలా చేస్తే ఇంక తమకెప్పుడు ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ స్టూడెంట్స్ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా క్యాంపస్ లలో నిరాహార దీక్షలు చేస్తున్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వచ్చి తమ బతుకులు మారుతాయని పోరాడి జైళ్లకు వెళ్లి వస్తే.., ఇప్పుడు పరిస్థితి మరోలా ఉందని విద్యార్థి లోకం మండిపడుతోంది. రెగ్యులరైజ్ చేసే బదులుగా నోటిఫికేషన్లు విడుదల చేసి పరీక్ష పెడితే సత్తా ఉన్నవారికి ఉద్యోగం వస్తుంది. కాని ప్రభుత్వం అలా చేయకుండా ఏక పక్షంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. ఒకప్పుడు ఎవరితో అయితే కలిసి పోరాడారో ఇప్పుడు వారిపైనే విద్యార్థులు ఉద్యమిస్తున్నారు.

అటు ప్రభుత్వం కూడా విద్యార్థులకు వాస్తవ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేయకుండా మొండికిపోతుంది. కాంట్రాక్టు ఉద్యోగాలు ఇచ్చినా.., ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తోంది. కాని అందుకు సంబంధించిన లెక్కలతో విద్యార్థుల దగ్గరకు వెళ్లి వారికి వాస్తవాలు చూపిస్తే అనుమానాలు తగ్గుతాయి. అటు ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ప్రతిపక్షాలు కూడా మెచ్చుకుంటాయి. కాని ఇదేమి చేయకుండా ఉద్యోగాలొస్తాయి ఆగండి.., మీకేం భయం లేదు అని మీడియా ముందు ప్రకటనలు చేసి చేతులు దులుపుకోవటం వల్ల సమస్య పరష్కారం కాదు. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు రావటంతో పాటు..., విద్యార్థుల్లో కలల రాష్ర్టం పట్ల ఉన్న భావన కూడా మారే ప్రమాదముందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే విద్యార్థులు ప్రభుత్వ పరిస్థితిని అర్ధం చేసుకోవాలని  సర్కారు పెద్దలు అంటున్నారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగునెలలే అవుతున్నందున.., పూర్తిగా పరిపాలనను చేతుల్లోకి తీసుకునేందుకు కాస్త సమయం పడుతుందని.. ఒక్కొక్కటిగా పనులు పూర్తి చేసుకుపోతున్నామని వారు చెప్తున్నారు. పెన్షన్లు, పరిశ్రమలు, విభజన ప్రక్రియ ఇబ్బందులు, కేటాయింపులు ఇలా ఒక్కో అంశాన్ని పరిష్కరించుకుంటు వెళ్తున్నామని చెప్పారు. అన్నీ ఒకేసారి కావాలంటే సాధ్యం కాదంటున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో విభజన ప్రక్రియ ఈ మద్యే పూర్తి అయినందున ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి వాటిని భర్తీ చేసే పని మొదలు పెట్టేందుకు కాస్త సమయం పడుతుందని చెప్తున్నారు. అయితే ఈ విషయం నేరుగా విద్యార్థుల దగ్గరకు వెళ్లి చెప్పేందుకు వారు ఎందుకో అంత శ్రధ్ద చూపటం లేదు. దీనికి తోడు పెద్ద పెద్ద మంత్రులు విద్యార్థలకు ఉద్యోగాలివ్వాలా అని అంటున్నారు. దీనివల్ల ఎటుపోయి ప్రభుత్వానికే ఇబ్బంది. సో.. కేసీఆర్ సారు.., కొంచం తొందరగా ఉద్యోగాలు ఇచ్చేస్తే.., విద్యార్థులు తొందరగా బాగుపడతారు. లేకపోతే తెలంగాణ అంటే ఉద్యోగాలు అనే మాట కాకుండా ఉద్యమాలే అని రేపటి తరం చరిత్ర చెప్పుకుంటుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles