Pawan kalyan gets threatening calls

Pawan Kalyan gets threatening calls, assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014

Pawan Kalyan gets threatening calls

పవన్ కళ్యాణ్ కి బెదిరింపులు

Posted: 05/03/2014 08:16 AM IST
Pawan kalyan gets threatening calls

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాలలో కొందరు నాయకుల మీద చేస్తున్న విమర్శల మూలంగా ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయట.  ఉభయ గోదావరి జిల్లాలలో సుడిగాలి పర్యటన చేసిన పవన్ కళ్యాణ్ నరసాపురం, తణుకు, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడుతూ, తనకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, దాడులు కూడా జరిగే అవకాశం ఉందని, అయినా తను భయపడేది లేదని అన్నారు.  

జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ తనను చంపే ప్రయత్నాలు కూడా జరగవచ్చని, కానీ తను భయపడేవాడిని కానని, అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.  

అయితే తాను ఎదురుదాడులు చెయ్యనని పవన్ కళ్యాణ్ అన్నారు.  తుమ్మితే పోయే ప్రాణాల గురించి తనకు లెక్కలేదని ఉద్వేగభరితంగా ఆయన ప్రసంగించారు.  తనపై దాడిచేసిన వారి మీద దౌర్జన్యం చెయ్యటం కానీ, తుపాకులు ఎక్కుపెట్టటం కానీ ఉండవని, భారత మాతకు జై అంటూ సమూహంగా నడిచివెళ్తానని, ఆ ప్రవాహంలో తనని బెదిరించే వాళ్ళు భస్మమైపోతారని పవన్ కళ్యాణ్ అన్నారు.  

భగవంతుని పేరు చెప్పి దోచుకుంటున్నవారిని చూసి, ప్రజా ధనాన్ని దోపిడీ చేసేవారిని చూసి, భూకబ్జాలు చేస్తున్నవారిని చూసి తట్టుకోలేక రాజకీయాలలోకి వచ్చాను కానీ జగన్ లా లక్షల కోట్లు సంపాదించాలనే అబిలాష లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.  అవినీతిపరుల ఆట కట్టించటం కోసం, రాజకీయాలలో ప్రశ్నించటం కోసమే తాను పార్టీ పెట్టానని ఆయన అన్నారు.  ప్రజా హక్కులను కాలరాసినవాళ్ళ మీద తనకి ఆవేశం పెరుగుతుందని, దేశం, సమాజం శ్రేయస్సు కోసమే తాను రాజకీయాలలోకి వచ్చానని కూడా ఆయన తెలియజేసారు.

జగన్ అంటే భయమూ లేదు, అలాగని శత్రుత్వమూ లేదన్నారు పవన్ కళ్యాణ్.  జగన్ దోపిడీ చేసి జైలుకి వెళ్తే తాను సీమాంధ్ర పరిరక్షణ కోసం జైలుకి వెళ్ళటానికి సిద్ధమేనన్నారాయన.  జగన్ పేపర్ గురించి మాట్లాడుతూ రాష్ట్రాన్ని కూలదీసి, ప్రజలను దోచుకుని కూడబెట్టిన డబ్బుతో పేపరు పెట్టారని, అందులో తన గురించి అవాకులు చెవాకులు రాస్తున్నారని, అటువంటి పేపర్ ఎంత అంటూ పవన్ కళ్యాణ్ జగన్ మీడియా సంస్థల గురించి వ్యాఖ్యానించారు.

2014 ఎన్నికలు  చాలా కీలకమైనవి కాబట్టి వోట్లు చీలగూడదనే ఉద్దేశ్యంతోనే ఎన్నికలలో పోటీ చెయ్యటం లేదని, అయితే 2019 లో మాత్రం జనసేన పార్టీ ఎన్నికలలో పోటీచేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.  

మోదీకి చంద్రబాబుకి వోటేయండి అంటూ పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్, నాకు కొంచెం తిక్కుంది కానీ దానికీ ఓ లెక్కుంది అని సభికులను హర్షాతిశయంతో కేరింతలు కొట్టేట్టు చేసారు.  పవన్ కళ్యాణ్ హాజరైన సభలకు జనం పోటెత్తారు.  సభాస్థలిలో సరిపోక జనం రోడ్ల మీద కూడా నిలబడి పవన్ కళ్యాణ్ ఉపన్యాసాన్ని విన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles