సీమాంధ్రలో కుంటి గుర్రంగా మారిన కాంగ్రెస్ పార్టీ విషయం కాసేపు పక్కన పెడితే, నిన్నటి వరకు తెలుగు దేశం పార్టీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య సమానంగా సాగుతూ కనిపిస్తూ వచ్చిన గట్టి పోటీ కాస్తా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సులభంగా చేజిక్కించుకునే విజయంగా మారిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
నాలుగు రోడ్ల కూడళ్ళలో మాట్లాడుకునే విషయాలు ఎలా ఉన్నా, టివిలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, ఆమె తనయ షర్మిల ప్రసంగాలు వింటుంటే ఆకట్టుకునే విధంగా ఉన్నాయి, జనాకర్షణ కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తెదేపాతో గట్టి పోటీ ఉండటంతో పాటు తెదేపా వైపు ఎక్కువ మొగ్గు కనిపిస్తున్న ఎన్నికల ముఖచిత్రంలో ఈ మార్పు ఎలా సంభవించిందని తరచి చూస్తే అర్థమైనవి ఇవి-
1. తెదేపాలో చంద్రబాబు ఒంటరి పోరాటం కనిపిస్తోంది. వైకాపాలో ముగ్గురు నాయకులతో ప్రచారం జోరుగా సాగుతోంది. తెదేపాకి మద్దతుగా పవన్ కళ్యాణ్ తిరుగుతున్నా, ఇంతవరకు తెలంగాణా ప్రాంతంలో జరిగిన సభల్లో ప్రసంగించిన జనసేన పార్టీ అధ్యక్షుడు, జాతీయ స్థాయిలో ఐదవ స్థానంలో నిలిచిన తెలుగు సినీ హీరో పవన్ కళ్యాణ్ తెదేపాకు భాజపా వలన పరోక్షంగా మద్దతునిస్తున్నారే కానీ తెదేపా పట్ల ప్రేమాభిమానాలున్నట్లుగా ఏమీ కనిపించలేదు. అనుభవమున్న సినీ హీరోగా పవన్ కళ్యాణ్ ప్రజలకు ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమయ్యేట్టుగానే ప్రవర్తిస్తున్నారు. నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒకే వేదిక మీద ప్రసంగించిన సభలో పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో ఎడ ముఖంగా ఉండటం స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు మాట్లాడదామని చూసినా పవన్ కళ్యాణ్ ఆయన వైపన్నా చూడకపోవటాన్ని టివి ఛానెల్స్ ప్రత్యేకంగా చూపించాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రచారంలో భాగం వహించటం వలన ఒకవేళ ఆయన అభిమానుల వోట్లేమైనా రాలతాయేమో అనుకుంటే, వాళ్ళకి కూడా తన మనోభీష్టమేమిటో బాగా అర్థమయ్యేట్టుగానే ఉంది పవన్ కళ్యాణ్ ప్రవర్తన. అయితే అసలు ప్రభావమే ఉండదని కాదు కానీ, పవన్ కళ్యాణ్ అర్ధాంగీకారంతోనే మద్దతునిస్తున్నారన్న సంగతి తేటతెల్లంగా ఉంది.
2. వైయస్ ఆర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడే దానికి సరిగ్గా అతికేట్టుగా ప్రతిఘటన తెదేపా నుంచి రావటం లేదు. ఉదాహరణకు తెదేపా తరఫున పోటీ చేస్తున్న నందమూరి బాలకృష్ణను 'మెంటల్ బాలకృష్ణ' అని అన్నదానికి తెదేపా దగ్గర అందుకు తగ్గ సమాధానం లేదు. సైకో సమస్యతో బాధపడుతున్న వ్యక్తి ఎన్నికల్లో పోటీ చెయ్యటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదంటూ వైకాపా నేత గట్టు రామచంద్రరావు అన్నారు. బాలకృష్ణ తన ఇంట్లో కాల్పులు జరిపి, తానూ ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యబోవటం, సాధారణ డిప్రెషన్ కి గురైన వ్యక్తికి ఇచ్చే మోతాదుకు పది రెట్లు ఎక్కువగా మందులు ఇవ్వవలసి వస్తోందని హెల్త్ బులెటన్ వివరించటానికి ప్రతివాదన లేకుండాపోయింది. ఎర్రగడ్డ మానిసిక వైద్యశాల నుంచి వైద్యులు నిమ్స్ లో ఉన్న బాలకృష్ణకు చికిత్స చెయ్యవలసిందిగా హాస్పిటల్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు అప్పట్లో సూచించారు. దీనికి తెదేపా ఎటువంటి ప్రతివిమర్శా చెయ్యలేదు. "లేదూ మా బాలయ్య మంచి బాలుడు, ఎటువంటి పిచ్చీ లేదాయనకు, ఎన్నికలలో పోటీకి అర్హుడు" అని తెదేపా చెప్పలేకపోతోంది. వైకాపా నాయకురాలి గొంతు ఎలా ఉన్నదన్నది కాదు వాళ్ళు మాట్లాడే మాటలు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయా లేదా అన్నదే ముఖ్యం.
3. సామాజిక న్యాయం చేసినట్లుగా పైకి చూపిస్తూ, ఇతర సామాజిక వర్గం వారికి కూడా ఎన్నికలలో అవకాశం ఇచ్చినట్లుగా ఇచ్చి చంద్రబాబు నాయుడు దాన్ని కూడా తన చాణక్యంతో కంటితుడుపు చర్యగా చేసారు. కచ్చితంగా గెలిచే చోట అస్మదీయులకు, గెలవటానికి అవకాశం లేని చోట తస్మదీయులకు టికెట్ ఇచ్చారు. కానీ వైకాపా మాత్రం సీట్ల కేటాయింపుల్లో సామాజిక న్యాయాన్ని కనబరచింది. తెదేపా మైనారిటీలకు ఇవ్వవలసిన స్థానాలను తన సామాజిక వర్గం వారికి ఇవ్వటం, వ్యాపారవేత్తలను రాజకీయాల్లోకి తీసుకురావటం, గెలిచే అవకాశం లేనిచోట ఇతర వర్గాల నాయకులకు సీటివ్వటం లాంటివి చెయ్యటం వలన ఒకపక్క అధిక సంఖ్యాకులైన సామాజిక వర్గం నుంచి మద్దతునూ కూడగట్టుకోలేకపోతోంది, మరోపక్క సామాజిక న్యాయం చేసిన పేరూ లేకుండా చేసుకుంది. పవన్ కళ్యాణ్ సినీ అభిమానులు, ఆయన సామాజిక వర్గంవారు ఒకవేళ తెదేపాకి వోటేస్తే అది కేవలం పవన్ కళ్యాణ్ వలనే కానీ తెదేపా నాయకుల వలన కాదని అర్థమౌతూనేవుంది. అయితే దాని వలన మరీ ఘోరంగా వెనకబడిపోకుండా ఉంటుందేమో కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే తెదేపాకి మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించటం లేదు.
4. వైయస్ ఆర్ కాంగ్రెస్ నాయకుల రోడ్ షోలకు వచ్చే ప్రజాదరణను చూస్తే, ఎక్కడబడితే అక్కడ గోడల మీద చెట్ల మీదకు ఎక్కి మరీ ప్రసంగాలను వింటున్నవారిని గమనిస్తే, వాళ్ళంతా బిరియానీ పొట్లాల కోసం వచ్చినవారిలా కనిపించటం లేదు. జనసమీకరణ కంటే స్వచ్ఛందంగా వస్తున్న ప్రజానీకమే కనిపిస్తోంది. నిజంగా అలా వచ్చినవారంతా అనుకూలంగా వోటేసినట్లయితే వైకాపా గెలుపు ఖాయమే! ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా అలాగే జనం విపరీతంగా వచ్చారు. కానీ చిరంజీవి ఛరిష్మా అంత వరకే పనిచేసింది- జనాన్ని రప్పించేంత వరకే! ఎందుకంటే వచ్చిన జనంలో చాలామంది ఆయనలోని సినిమా నాయకుడి అభిమానులు. కానీ వైకాపా సభలకు వచ్చేవారు సినిమా తారలను కాకుండా రాజకీయ రంగంలో నాయకులను చూడటానికి వస్తున్నారు. అదీ తేడా!
5. అవినీతి గురించి మాట వినిపిస్తున్నా, వైయస్ ఆర్ హయాం నుంచి లబ్ధి పొందినవారు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు వ్యక్తిగతంగా లభించిన ప్రయోజనమే కనిపిస్తుంది కానీ అందులో అధిక శాతం ప్రజానీకానికి పెద్ద పెద్ద ఛార్టర్డ్ ఎకౌంటెంట్లు చేసారని సిబిఐ చెప్తున్న ఆర్థిక కుంభకోణం అర్థం కాదు. దేశ విదేశాలనుంచి లిమిటెడ్ కంపెనీలలో పెట్టుబడుల రూపంలో బదలాయించిన సొమ్ము సామాన్య మానవులకు అవగతం కాని విషయం. వాళ్ళల్లో చాలామందికి తెలిసింది ఒకటే! రాజకీయంలో అందరూ డబ్బు చేసుకుంటారు, వీళ్ళు కూడా చేసుకుని ఉండొచ్చు. అయితే ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు గ్రామీణ ప్రాంతంలో. విద్యావంతలు వాళ్ళతో, "చూడండి అన్ని రకాల అవినీతి కార్యకలాపాలను ఒకేలా చూడొద్దు, రోగాలు చాలా రకాలుంటాయి. జ్వరమొచ్చినా అది వ్యాధే, క్యాన్సర్ సోకినా అది వ్యాధే. కానీ రెండిటిలో చాలా తేడా వుంది. జ్వరం నయమయ్యే జబ్బైతే, క్యాన్సర్ రోగిని హరించే వ్యాధి" అని చెప్తున్నా ఎక్కువ మందికి ఈ విషయం అర్థం కావటం లేదు.
6. రాయలసీమ నుంచి దుర్గి వరకు వైకాపాకు మద్దతు స్పష్టంగా కనిపిస్తోంది. మళ్ళీ విజయనగరం శ్రీకాకుళం ప్రాంతాల్లో వైకాపా వేవ్ కనిపిస్తోంది. అందుకే వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు.
అందువలన రానున్న ఎన్నికలలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తెలుగు దేశం మరీ తక్కువ స్థాయికి పడిపోకుండా పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు సహకరిస్తాయమో కానీ మరీ అధికారం చేపట్టంత పూర్తి మెజారిటీ రాకపోవచ్చని- కనిపిస్తున్న విషయాలతో చేసిన విశ్లేషణలోను, ఇతర సహోద్యోగులతో చేసిన చర్చలలోనూ తేలిన విషయం.
మే 16 కల్లా ఏ విషయం తెలిసిపోతుందనుకోండి! కానీ ప్రస్తుతం కనిపిస్తున్న రాజకీయ ధోరణి ఇది. రోజురోజుకీ మారిపోతున్న రాజకీయ ముఖచిత్రం ఎప్పుడు ఎలాంటి మార్పులను సంతరించుకుంటుందో చెప్పటం కష్టమే నిజానికి! అయితే హేతుబద్ధమైన అంచనాలు ఎప్పుడూ అబద్ధం చెప్పవు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more