Petition against release of rajiv gandhi assassins

Petition against release of Rajiv Gandhi assassins, TN Govt to release Rajiv Gandhi Assasins, Center pleads stay on release of Rajiv Gandhi assasins, Jaya Lalitha, Tamil Nadu CM Jaya Lalitha

Petition against release of Rajiv Gandhi assassins by TN Government

రాజీవ్ గాంధీ ముద్దాయిల మీద కేంద్రానికెందుకు కసి?

Posted: 03/06/2014 01:48 PM IST
Petition against release of rajiv gandhi assassins

రాజీవ్ గాంధీ మీద జరిగిన హత్యాకాండను ఎవరూ హర్షించరు కానీ అది జరిగి 23 సంవత్సరాలైంది.  ముద్దాయిలుగా నిరూపించబడ్డవారు ఇప్పటికే చాలా సంవత్సరాలుగా జైలులో మగ్గుతున్నారు.  ఇప్పుడు వారిని ఉరితియ్యటంతో కలిగే లాభమేమిటి.  మరణ శిక్షలను ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్న కాలంలో ఇంకా ఉరి శిక్షను వెయ్యమని కేంద్ర ప్రభుత్వం కోరటమేమిటి. 

దేశ ప్రధాన మంత్రిని చంపటం ఆమోదయోగ్యం కాదు.  అలాంటి హింసాకాండలను ఉపేక్షించగూడదు కానీ వాళ్ళకి ఉరిశిక్ష వేస్తేనే న్యాయం చేసినట్లు కాదు కదా!  వాళ్ళు కోరిన క్షమాభిక్షను పరిశీలించటంలో రాష్ట్రపతి కార్యాలయంలో జాప్యం జరగటంతో అటువంటి కేసులలో సుప్రీం కోర్టు తీర్పుని అనుసరించి ముద్దాయిలు తమ శిక్షను తగ్గించమని వేడుకోగా సుప్రీం కోర్టు అందుకు ఒప్పుకోవటం జరిగింది.  దాన్ని వ్యతిరేకించటం కేంద్ర ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసం?  దేశపాలన చూడవలసిన యంత్రాంగం మాజీ ప్రధాని హంతకుల మీద దృష్టి సారించటం, సుప్రీం కోర్టు తీర్పు మీద సవాల్ చెయ్యటం మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఉరిశిక్షవెయ్యమని అడగటం ఎందుకు జరుగుతోంది?

విపక్షాలకు చెందిన నాయకుడి విషయంలో జరిగుంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే పట్టుబట్టేదా?  ఒకవేళ భాజపా అధికారంలోకి వస్తే ఈ కేసులో నేరస్తులకు ఉరిశిక్ష కోసం పోరాడుతుందా?  జరగదు!  అంటే, అధికారం కాంగ్రెస్ దైనా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని నడుపుతున్న గాంధీ కుటుంబ సభ్యులకు స్వాంతన చేకూర్చటం కోసం చేస్తున్న ప్రయత్నంలా కనిపించటం లేదూ?  విషయం అది కాకపోయినా సుప్రీం కోర్టు తీర్పుకే వదిలిపెట్టి ఉంటే బావుండేది కదూ! 

ఇదిలా ఉండగా జయలలిత నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వం రాజకీయ లబ్ధికోసం ఆ దోషులను వదిలిపెట్టటానికి ఆత్రుత చూపించటం మరీ విడ్డూరంగా ఉంది.  తనకి శాసనసభలో కరుణానిధి వలన అవమానం జరిగిందన్న కసిని ముఖ్యమంత్రైన తర్వాత మార్షల్స్ చేత నడిరోడ్డు మీద పంచె వూడేట్టుగా కరుణానిధిని నడిపించుకుంటూ తీసుకెళ్ళిన సంఘటనను ఎవరూ మర్చిపోరు. 

మరి అలాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అలాగే ఉండవచ్చు కదా!  సుప్రీం కోర్టు తీర్పు రాగానే రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చెయ్యటానికి ఉత్సాహాన్ని చూపించటం ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత కాంగ్రెస్ కి చెందిన నాయకురాలు కాకపోవటం వలనే కదా! 

ఇప్పటికైనా రాజకీయనాయకులు కోర్టు పని కోర్టు చేసుకునేట్లుగా వదిలిపెట్టటం, అందులో కలుగజేసుకోకపోవటం ప్రజాప్రయోజనదృష్టిలో శ్రేయస్కరం అవుతుంది. 

తమిళనాడు ప్రభుత్వం నేరస్తులను వదిలిపెట్టటానికి చేసే ప్రయత్నాన్ని అడ్డుకుంటూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ మీద విచారణను సుప్రీం కోర్టు మార్చి 26 కి వాయిదా వేసింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles