Bhavani bitter experiences in behrain

east godavari dist, vanapalli village, naga durga bhavani, bahrain, embassy of india, passport, national domestic workers movement

bhavani bitter experiences in behrain

భవానీ బహ్రైన్ చేదు అనుభవాలు

Posted: 04/13/2013 04:21 PM IST
Bhavani bitter experiences in behrain

తూర్పు గోదావరి జిల్లా వానపల్లి గ్రామానికి చెందిన నాగ దుర్గా భవానీ గుండె కు ఆపరేషన్ జరిగిన తన నాలుగు సంవత్సరాల కూతురుని, ఐదు నెలల వయసుగల రెండవ కూతురిని వదిలిపెట్టి డబ్బు సంపాదించటం కోసం బహ్రైన్ వెళ్లి అక్కడ పడరాని పాట్లు పడి డబ్బులు లేవు సరికదా ఖాళీ చేతుల్తో, చేదు అనుభవాలతో తిరిగి వచ్చింది. 

బహ్రైన్ లో నెలకు 8000 రూపాయల జీతం ఇస్తారని అదే గ్రామానికి చెందిన రాంబాబు, పొరుగు గ్రామం అల్లవరానికి చెందిన సుదర్శన్ లు నమ్మబలికితే ప్రపంచపటంలో బహ్రైన్ అనేది ఎక్కడుందో కూడా తెలియని 22 సంవత్సరాల భవానీ పోయిన సంవత్సరం ఏప్రిల్ నెలలో మరో పది మంది తెలుగు మహిళలతో కలిసి బహ్రైన్ కి ప్రయాణం కట్టింది.  అందుకు కావలసిన పాస్ పోర్ట్ కోసం 15000 రూపాయలను కూడా వెచ్చించింది. 

అంతా బాగా జరుగుతుందని, డబ్బులు సంపాదించి ఇంటికి తెచ్చుకోవచ్చని ఆశపడిందామె.  భోజనం, బస ఉచితం, ఎనిమిది వేలు నెలకి జీతం అనేటప్పటికి కనీసం ఒక లక్షరూపాయలు పోగు చేసుకుని తెచ్చుకోవచ్చని అనుకున్న భవానీకి నిరాశే మిగిలింది.  అక్కడి చేరుకోగానే అప్పటికే అక్కడ ఉన్న రాంబాబు, లిల్లీ కుమారి కలిసి భవానీ దగ్గర్నుంచి పాస్ పోర్టే కాకుండా ఇతర ఆధారాలేమీ లేకుండా అన్ని పేపర్లనూ తీసేసుకుని 12 గదులు, ఎనిమిది బాత్ రూం లు, రెండు వంటగదులున్న ఇంట్లో పనికి పెట్టారు. 

అక్కడ ఒక్కపూటే భోజనం పెట్టి పొద్దున 5 గంటల నుంచి చాలా రాత్రి వరకు పనిచేయించేవారు.  అంత పని చెయ్యలేనని కుమారి దగ్గర మొరపెట్టుకుంటే వాళ్ళు భవానీ ని కొట్టి వేళ్ళు విరగ్గొట్టి, డబ్బు ముందే తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు పోవటానికి వీల్లేదని అనేటప్పటికి గత్యంతరం లేక మరో ఇంట్లో పనికి ఒప్పుకుని పనిచెయ్యటం మొదలు పెట్టిన భవానీకి అక్కడే అదే కష్టం ఎదురైంది.  ఇంటి యజమాని అరవటం కొట్టటం కూడా చేసేవాడట.  ఎలాగో ధైర్యం చేసి ఆ ఇంట్లోంచి పారిపోగా ఒక తెలుగు వ్యక్తి తటస్తపడి భవానీని భారత దౌత్య కార్యాలయానికి తీసుకెళ్ళారట.  కానీ పాస్ పోర్ట్ కానీ ఇతర ఆధారాలు లేకపోవటంతో ఆమె కష్టాలు అక్కడా గట్టెక్కలేదు.  చివరకు ఇళ్ళల్లో పనిచేసే పనివాళ్ళకోసం ఏర్పడ్డ సేవా సంఘం భవానీకి సాయం చేసింది.  ఆ సంఘం కో ఆర్డినేటర్ సుదర్శన్ దగ్గరకుపోయి భవానీ పాస్ పోర్ట్ అడగ్గా రెండు నెలల తర్వాత ఫొటో కాపీ ఇచ్చాడట.  దాని సాయంతో భవానీ ఎలాగో తిరిగి పుట్టిన గడ్డమీద కాలు పెట్టింది. 

దూరపు కొండలు నునుపు అన్నట్లు ఎక్కడో ఏదో లభిస్తుందని ఆశపడటం, దానికోసం తెలియని వాళ్ళని నమ్మి, దేశాల మధ్య ఉన్న ఒప్పందాలు, నియమాల గురించి పెద్దగా తెలియకపోయినా ధైర్యం చెయ్యటం, చివరకు మోసపోయామని తెలుసుకుని కూడా ఏమీ చెయ్యలేక తన దురదృష్టాన్ని తిట్టుకోవటం, ఇలాంటి గాధలెన్నో.  వీళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని, వాళ్ళని ప్రలోభాలలో ముంచెత్తి, వాళ్ళమీద సంపాదించటం కోసం అమానుషంగా ప్రవర్తించటానికి అటువంటి వాళ్ళకి మనసు ఎలా ఒప్పుతుందన్నది సామాన్య జీవనం సాగించేవారికి తెలియదు కానీ, ఇటువంటి అమాయకులను ఆదుకోవటానికి దేశం విడిచి పోయేముందే వాళ్ళని పూర్తిగా విచారించి కట్టుదిట్టాలతో పంపించే విధానం ఉంటే బావుంటుంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles