పని నచ్చని పక్షంలో రాజీనామా చేసే హక్కు ఎవరికైనా ఉంది. ప్రజాప్రతినిధులకు కూడా అది వర్తిస్తుంది. కానీ మీకు మేమే నికార్సైన సేవలందిస్తాం కాబట్టి మాకు ఓటు వెయ్యండి అని ఓటర్లకు హామీలిచ్చి పదవిలోకి వచ్చిన తర్వాత, ఏకారణం చేతనైనా తాము తీసుకున్న బాధ్యతను నెరవేర్చలేని పరిస్థితిలో లేదు, మేమింక ఆ పదవిలో పనిచెయ్యలేము అని అదే ప్రజలకు తిరిగి చెప్ప వలసిన బాధ్యత వారి మీద ఉందని, దానికి తోడు, రాజీనామా చేసినందు వలన ఉప ఎన్నికలు జరిగితే మళ్ళీ అందులో పోటీ చెయ్యటం ప్రజాస్వామ్య విధానాన్ని వెక్కిరించటమే అవుతుందని కూడా పలువురు రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
మూకుమ్మడి రాజీనామాల పర్వం తెరమీదికి తెచ్చిన తెరాస ఖాతాలో, తెలంగాణా ప్రాంతానికి చెందిన ఇతర పార్టీ నాయకులు కూడా రాజీనామాలు చెయ్యటం కూడా జమ అవుతుంది. రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టిస్తే కంద్రం దిగి వస్తుందని నమ్మబలకటమే కాకుండా అలా చెయ్యని వారంతా తెలంగాణా ద్రోహులని, వారిని ప్రజలు తరిమికొడతారని, ఊళ్ళల్లోకి రానివ్వరని వారందరి మీదా పరోక్షంగా ఒత్తిడి తేవటంతో రాజకీయ ప్రాబల్యం కోసం మిగిలిన పార్టీల ప్రజాప్రతినిదులు కూడా మూకుమ్మడి రాజీనామాలలో పాలుపంచుకున్నారు.
కానీ ఆ తర్వాత కెసిఆర్ పన్నిన రాజీనామాలనే వలలో ఇరుక్కుపోయామని బాధపడటం మొదలుపెట్టారు. రాజీనామాలిస్తే చాలదు వాటిని ఆమోదింపజేసుకోవాలంటూ మరోసారి వచ్చిన ఒత్తిడిక నాగం జనార్దనరెడ్డిలాంటి వారు కొందరు ఆ బాట పట్టారు. తప్పు జరిగిపోయిందని లెంపలేసుకున్నవారు విడివిడిగా సభాపతిని కలిసి విషయం మెత్తబడేట్టు చేసుకోవటమో లేదా కలవటానికి సమయం లేదని, ఏవేవో పనులున్నాయని తప్పించుకోవటమో చేసారు. రాజీనామా చెయ్యటం వలన తెరాస బలాన్ని పెంచినవారమవుతున్నామని కొందరు పశ్ఛాత్తాప పడుతున్నారు.
ఈ నేపథ్యంలో అసలు తెరాస నాయకుల రాజీనామాలే తన దగ్గరకు రాలేదని, అందువలన పెండింగ్ లో ఉండే ప్రశ్నే లేదని సభాపతి నాదెండ్ల మనోహర్ ప్రకటించటం, తెరాస అధ్యక్షుడు కెసిఆర్ సమర్పించిన రాజీనామా ఆమోదయోగ్యంగా లేదని పార్లమెంటు స్పీకర్ మీరా కుమార్ ప్రకటించటంతో ఇతర పార్టీలకు తెరాస చిత్తశుద్ధి మీద అనుమానాలు, తాము వంచించబడ్డామనే ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి.
రాజీనామాల విషయంలో మాట్లాడే నైతిక హక్కు లేదంటూ తెరాస నాయకుడు ఈటెల రాజేందర్ తెదేపా తెలంగాణా ఫోరం మీద ధ్వజమెత్తారు. తాము ఫాక్స్ చేసిన రాజీనామా పత్రాల ప్రతులను చూపించారు. మరి అవి ఏమైనట్టు. తెలంగాణా భవనం నుంచి శాసన సభకు మధ్యలో ఉన్నాయా అంటూ తెదేపా ప్రశ్నస్తోంది. అంతేకాకుండా, రాజకీయాల్లో 30 సంవత్సరాల అనుభవమున్న కెసిఆర్ కి రాజీనామా పత్రమెలా సమర్పించాలో తెలియదా. అది అనర్హమయ్యే విధంగా తయారుచేసి రాజీనామా చేసానని మోసం చేస్తారా అంటూ తెదేపా నాయకులు మండిపడుతున్నారు. దానికి ప్రతిగా, మా చిత్త శుద్ధిని శంకించే అర్హత తెదేపాకు లేదని, మేము చర్చలకు ఎక్కడికైనా రావటానికి సిద్ధమేనని అంటూ ఈటెల సవాలు విసిరారు.
కానీ అసలు ప్రజాప్రతినిధులు అలా రాజీనామాలు చెయ్యటం సబబేనా అంటే కాదనే అంటున్నారు చాలా మంది విమర్శకులు. ఒక ఉద్యోగి రాజీనామా చెయ్యటానికే నోటీసు ఇవ్వవలసి ఉంటుందే, మరి సేవా దృక్పథంతో చెయ్యవలసిన బాధ్యతాయుతమైన పదవులనలంకరించిన నాయకులు ఉన్నట్టుండి నేను ఆ పని చెయ్యను అని అంటే సరిపోతుందా?
ఒక పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీకి మారిపోవటమో లేక మద్దతునివ్వటమో చేసిన సందర్భంలో వారి సభ్యత్వానికి అనర్హతను ఆపాదించినట్టుగానే, రాజీనామాల విషయంలో కూడా కొన్ని నిబంధనలు అవసరమని చాలామంది విమర్శకులు భావిస్తున్నారు. ఉదాహరణకు రాజీనామా చేసిన ప్రజాప్రతినిధి మరో ఐదారు సంవత్సరాల వరకూ పోటీ చెయ్యటానికి అనర్హులనో ఇలాంటిదేమైనా నియమాలను విధించకపోతే ఇదో ఆటలా అయిపోతుందని, రాజకీయ సంక్షోభమేమోగానీ ఉప ఎన్నికలకు ప్రజల సొమ్ము విపరీతంగా ఖర్చవుతుందని అంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ముందు బహిరంగ సభలో మాట్లాడి ఓటు అడిగినట్టే, బహిరంగ సభలో తాను పదవి నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించే అవసరాన్ని కలిగించాలేమో!
విడాకుల విధానాన్ని సులభతరం చేసిన ముస్లిం వైవాహిక నియమాల్లో కూడా, కొన్ని నిబంధనలున్నాయి. భార్యను సంబోధిస్తూ "తలాక్ తలాక్ తలాక్" అని మూడు సార్లు ఉచ్చరిస్తే చాలు వారికి విడాకులు దొరికి వేరు కుంపట్లు పెట్టుకోవటానికి వెసులుబాటిచ్చిన ఆ మతమే, దీన్ని తేలిగ్గా ఒక ఆటలా తీసుకోకుండా ఉండటం కోసం పెట్టిన నిబంధనేమిటంటే, అలా ఆవేశంలో "తలాక్" అని మూడుసార్లు అన్నా కాదని చెరిపేయటానికి లేదు. ఆమెతో కలిసివుండటానికి లేదు. ఆమే కావాలనుకుంటే ఆమె మరొకరిని వివాహమాడి వారితో విడాకులు తీసుకున్న తర్వాతనే తిరిగి ఆమెను చేపట్టటానికి అవకాశం ఉంది.
ప్రజలందరి బాగోగులు చూస్తూ, వారికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రభుత్వ కార్యకలాపాల్లో భాగం వహించే ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారు రాజకీయ లబ్ధికోసం రాజీనామాల బాట పట్టకుండా తగిన నియమావళిని రూపొందించాలని విఙుల మనోభిలాష.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more