పువ్వు‌ల న‌వ్వు‌ల బ‌తుక‌మ్మ | Bathukamma The Floral Festival of Telangana

Bathukamma the floral festival of telangana

The Floral Festival of Telangana Bathukamma, Bathukamma Special, The Floral Festival of Telangana, Bathukamma Telangana Official Festival, Bathukamma Special, Bathukamma History, Bathukamma stories, Saddula Bathukamma Festival, Bathukamma Festival 2016

The Floral Festival of Telangana Bathukamma Special.

తెలంగాణ పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ

Posted: 10/08/2016 10:29 AM IST
Bathukamma the floral festival of telangana

ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి సేదతీరేవాడు…. కానీ ఈ బిజీ జీవితాలలో మనుషులతోనే కలువలేకపోతున్న మనిషి ఇక పకృతితో ఎలా కలుస్తాడు? బతుకమ్మ పండగకి మాత్రం కచ్చితంగా తొమ్మిది రోజులు మాత్రం ప్రతి మనిషి పకృతితో మమేకమై పోతారు అదే బతుకమ్మ పండుగ యొక్క గొప్పతనం. బతుకు కోరే నిజమైన జనపదుల పండుగే ఈ బతుకమ్మ. తంగేడు పువ్వు లో ఔషద గుణాలు చెరువుల్లో ఉండే క్రిమికీటకాదులను చంపి నీటిని శుద్ధంగా ఉంచుతుందనే సైంటిఫిక్ వాదన పక్కకు పెడితే అత్యంత భక్తి శ్రద్ధలతో తెలంగాణ ఆడపడుచులు ఆడుకుంటారు. బతుకమ్మ పండగను గౌరి పండుగ, సద్దుల పండుగ అనే పేర్లతో వ్యవహరిస్తారు.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.....
బంగారు బతుకమ్మ ఉయ్యాలో.....
కలవారి కోడలు ఉయ్యాలో.......
కలికి కామాక్షి ఉయ్యాలో.......
కడుగుచున్నది పప్పు ఉయ్యాలో.....
కడువలో పోసి ఉయ్యాలో.....
అప్పుడే వచ్చేను ఉయ్యాలో......
ఆమె పెద్దన్న ఉయ్యాలో
కాళ్లకు నీళ్లిచ్చి ఉయ్యాలో......
కన్నీళ్లు నింపి ఉయ్యాలో..... అంటూ తెలంగాణ బాషలో రాగయుక్తంగా సాగే బతుకమ్మ ఉయ్యాల పాటలు దసరా రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటి వాకిట్లో మధురంగా వినిపిస్తుంటాయి.

పురాణ గాథ:
 దక్షిణ భారతాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానము లేక అనేక పూజలు పునస్కారాలు చేయగా ఈయన భార్య గర్భవతియై లక్ష్మీ దేవి అనుగ్రహముతో ఒక కూతుర్ని కన్నది. పసిబిడ్డైన లక్ష్మి అనేక గండములను గట్టెక్కినది కావున ఈమె తల్లితండ్రులు బతుకమ్మా అని నామకరణము చేసారు. అప్పటినుండి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలవడము ఆన్వాయితీ అయ్యిందని ఈ కథ చెబుతున్నది.

జానపద గాథ:
ఓ ముద్దుల చెల్లి, ఆమెకు ఏడుగురు అన్నదమ్ములు. అంతా వీరాధివీరులే. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. అన్నలకు చెల్లెలంటే పంచప్రాణాలు. కానీ వదినలకు మాత్రం అసూయ! ఆ బంగారుబొమ్మని బాధపెట్టేవారు. ఓరోజు వేటకెళ్లిన అన్నలు, ఎంతకాలమైనా తిరిగిరాలేదు. అదే అదను అనుకుని వదినలు సూటిపోటి మాటలతో వేధించారు. యాతన తట్టుకోలేక ఆ చెల్లి ఇల్లొదిలి వెళ్లిపోయింది. ఆతర్వాత అన్నలొచ్చారు. ముద్దుల చెల్లి ఎక్కడని.భార్యల్ని నిలదీశారు. విషయం అర్థమైంది. తిండీతిప్పల్లేవు, నిద్రాహారాల్లేవు. చెల్లి కోసం వెదకని పల్లెలేదు, ఎక్కని గుట్టలేదు. ఓ వూరి పొలిమేర దగ్గర బావిలో దాహం తీర్చుకుంటూ ఉండగా ... పెద్ద తామరపూవొకటి కనబడింది. వాళ్లను చూడగానే నీళ్లలో తేలుతూ వచ్చేసింది. ఆతర్వాత కొంతసేపటికి ఆ రాజ్యాన్నేలే రాజు వచ్చాడు. ఆ పూవును తీసుకెళ్లి తన తోటలోని కొలనులో వేశాడు. కొలనుచుట్టూ దట్టంగా తంగేడు మొక్కలు మొలిచాయి. కొంతకాలానికి విష్ణుమూర్తి దిగొచ్చి తామరను మనిషిగా చేశాడు. ఆమె శ్రీలక్ష్మి అవతారమని ప్రకటించాడు. పువ్వులకు బతుకుదెర్వు చూపింది కాబట్టి బతుకమ్మ అయ్యింది! ఆత్మత్యాగంతో తెలంగాణలోని ఓ పల్లెను వరద బారినుంచి కాపాడిన త్యాగమూర్తే బతుకమ్మ అనేవారూ ఉన్నారు

మహిషాసురుని చంపిన తర్వాత అలసి సొలసి మూర్ఛపోయిన అమ్మవారికి, మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నమని మరో ఐతిహ్యం.

ఇంకా కొన్ని కథలు:
ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం ‘బతుకమ్మా’ అని దీవించారంట అందుకనే ఈ పండుగ స్త్రీలకు సంబంధించిన, బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ. స్త్రీలందరూ ఈ సందర్భంగా వారు ఎటువంటి ఆపదలు కారాదనీ, కుటుంబం చల్లగా ఉండాలనీ గౌరమ్మను ప్రార్ధిస్తారు.

ఒక రైతు దంపతులకు పిల్లలు పుట్టి చనిపోతున్నారని ఇలా ఏడుగురు పుట్టి చనిపోయారని 8వ బిడ్డకు బతుకమ్మ అని పేరు పెట్టడంతో ఆమె బతికిందనేది మరో కథనం. అయితే బతుకమ్మ పెళ్లయిన తర్వాత ఒక్కసారి అత్తింటి నుంచి తల్లి గారింటికి వచ్చినప్పుడు మరదలితో కలిసి వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లినప్పుడు వారిద్దరి మద్య తగాదా రావడంతో బతుకమ్మను ఆమె మరదలు చంపి తంగేడు పూల చెట్లలో పాతిపెట్టిపోయిందని, దీంతో ఆమె ఆత్మశాంతికి తంగేడు పూలను పేర్చి బతుకమ్మ ఆడుతున్నారని పురాణ కథలు ప్రచారం.

ఈ పండుగను తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాలతో బతుకమ్మను కొలుచుకోవడం ఆనవాయితీ.

తొమ్మిది రూపాల బతుకమ్మల పేర్లు:

1. ఎంగిలిపూల బతుకమ్మ
2. అటుకుల బతుకమ్మ
3. ముద్దపప్పు బతుకమ్మ
4. నాన బియ్యం బతుకమ్మ
5. అట్ల బతుకమ్మ
6.అలిగిన బతుకమ్మ
7. వేపకాయల బతుకమ్మ
8. వెన్నముద్దల బతుకమ్మ
9. సద్దుల బతుకమ్మ (చివరిరోజు)

చివరిరోజు సద్దుల బతుకమ్మ పెద్ద పండగా భావిస్తారు. ఆ రోజు తొమ్మిదిరకాల సద్దులు తయారు చేస్తారు. పులిహోర, దద్దోజనం, సత్తుపిండి, చక్కెర లడ్లు, బెల్లం లడ్లు, నువ్వుల ముద్దలు, శనగ పట్టి, పెసరపప్పు చక్కెర ఇలా సద్దులను తీసుకెళ్లి అందరికీ పంచి ఆనందిస్తారు. గునుగ, తంగేడు పూలతోపాటు మిగతా పూలు ఒక రాగి పళ్ళెంలో వలయాకారంగా పేర్చుకుంటూ వస్తారు. ఒక రంగు పువ్వు తర్వాత మరో రంగు పువ్వును పేరుస్తూ ఆకర్షణీయంగా వుండే విధంగా బతుకమ్మని తయారు చేస్తారు. ఆ తర్వాత తంగేడు పువ్వులను కట్టగా కట్టి వాటి మీద పేర్చుతారు. మధ్యలో రకరకాల పూలను ఉపయోగిస్తారు. ఈ పూల అమరిక ఎంత పెద్దగా వుంటే బతుకమ్మ అంత పెద్దగా, అంత అందంగా రూపొందుతుంది. పూలను చక్కగా పేర్చడం పూర్తయిన తర్వాత బతుకమ్మ మీద పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు.

ఇలా తయారు చేసిన బతుకమ్మను ఇంట్లోని పూజా గదిలో అమర్చి పూజిస్తారు. ఆ తర్వాత బతుకమ్మని బయటకి తీసుకువచ్చి  ఆడపడుచులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ పాటలు పాడుతారు. ఆడపడుచులు కొత్త బట్టలు కట్టుకుని, వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను ధరిస్తారు. ఇలా చాలా సేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. తరువాత ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం, మొక్కజొన్నలు లేదా వేరుసెనగ లేదా పెసర విత్తనాలను దోరగా వేయించి పిండి చేసి బెల్లం లేదా పంచదార కలిపిన సత్తుపిండి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుని ప్రసాదంలా స్వీకరిస్తారు. గౌరమ్మను పూజించి ఆడవారు వారి చెంపలకు రాసుకుంటారు. చక్కెర, రొట్టెతో చేసిన ‘మలీద’ అనే వంటకాన్ని బంధువులకు పంచిపెట్టి తింటారు. ఆ తర్వాత ఖాళీ పళ్లెం (తాంబళం)తో ఇంటికి చేరతారు.


బతకమ్మలను పిల్చుకుంటూ పాడే పాటలు పల్లె స్మృతులను తట్టి లేపుతాయి.

ఒక్కొక్క వువ్వేసి చంద మామ||
ఒక జాము అయే చంద మామ||

రెండేసి పువ్వు తీసి చంద మామ||
రెండు జాము లాయె చంద మామ||


ప్రియుని రాకకై ఎదురు చూసే ప్రేయసి పాడుకునే పాట.........

బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
నానోము పండింది ఉయ్యాలో
నీనోము పండిందా ఉయ్యాలో
మావారు వచ్చిరి ఉయ్యాలో
మీవారు వచ్చిరా ఉయ్యాలో...




ఈ విధంగా ఎన్నో పాటలు పాడుతారు.

బొడ్డెమ్మ బొడ్డెమ్మ.... బిడ్డలెందారే
బవిల పడ్డ వారికి ......వారిద్దరమ్మా
చెర్ల బడ్డవికి ..... .. చేరిద్దరమ్మా
కుంట్ల బడ్డ వారుకి.. కోరుద్దరమ్మ
నిద్రపో బొడ్డేమ .... .. నిద్రబోవమ్మ
నిద్రకు నూరేండ్లు...... నీకి వెయ్యేండ్లు
నిను గన్న తల్లికి....... నిండ నూరేంళ్ళు
అంటూ బొడ్డెమ్మను నీటిలో వదులుతారు.

బొడ్డెమ్మ పండుగలో ఉపయోగించే ఎన్నో పాటలను సాహితివేత్త బి. రామరాజు తన రచనలతో తెలియజెప్పాడు.

కోసలాధీశుండు ఉయ్యాలో – దశరథ నాముండు ఉయ్యాలో -
కొండ కోనలు దాటి ఉయ్యాలో – వేటకే బోయెను ఉయ్యాలో -
అడవిలో దిరిగెను ఉయ్యాలో – అటు ఇటు జూచెను ఉయ్యాలో -
చెట్టు గుబురుల చాటు ఉయ్యాలో – చెరువొకటి కనిపించె ఉయ్యాలో -
శబ్దమేదొ వినెను ఉయ్యాలో – శరమును సంధించె ఉయ్యాలో -
జంతువేదొ జచ్చె ఉయ్యాలో – అనుకొని సాగెను ఉయ్యాలో -
చెంతకు చేరగా ఉయ్యాలో – చిత్తమే కుంగెను ఉయ్యాలో -
కుండలో నీళ్ళను ఉయ్యాలో – కొనిపో వచ్చిన ఉయ్యాలో -
బాలుని గుండెలో ఉయ్యాలో – బాణమే గ్రుచ్చెను ఉయ్యాలో -
ఎవ్వరు నువ్వనె ఉయ్యాలో – ఏడ్పుతో దశరథుడు ఉయ్యాలో -
శ్రవణుడు నేననె ఉయ్యాలో – చచ్చేటి బాలుడు ఉయ్యాలో -
తప్పు జరిగెనంచు ఉయ్యాలో – తపియించెను రాజు ఉయ్యాలో -
చావు బతుకుల బాలుడుయ్యాలో – సాయమే కోరెను ఉయ్యాలో -
నా తల్లిదండ్రులు ఉయ్యాలో – దాహంతో ఉండిరి ఉయ్యాలో -
ఈ నీళ్ళు గొంపోయి ఉయ్యాలో – ఇచ్చి రమ్మనెను ఉయ్యాలో -
ఆ నీళ్ళతో రాజు ఉయ్యాలో – అడవంతా వెదికె ఉయ్యాలో -
ఒకచోట జూచెను ఉయ్యాలో – ఒణికేటి దంపతుల ఉయ్యాలో -
కళ్ళైన లేవాయె ఉయ్యాలో – కాళ్ళైన కదలవు ఉయ్యాలో -
వృద్ధ దంపతుల జేరి ఉయ్యాలో – వేదన చెందుతూ ఉయ్యాలో -
సాష్టాంగ పడె రాజు ఉయ్యాలో – సంగతి జెప్పెను ఉయ్యాలో -
పలుకు విన్నంతనే ఉయ్యాలో – పాపమా వృద్ధులు ఉయ్యాలో -
శాపాలు బెట్టిరి ఉయ్యాలో – చాలించిరి తనువులుయ్యాలో -
శాపమే ఫలియించి ఉయ్యాలో – జరిగె రామాయణం ఊయ్యాలో -
లోక కల్యాణమాయె ఉయ్యాలో – లోకమే మెచ్చెను ఉయ్యాలో....

తెలుగు విశేష్ ప్రేక్షకులకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు....

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Vilambi nama samvasthara ugadi special story

    ఉగాది పండగ విశిష్టత.. కథలు తెలుసా.?

    Mar 17 | భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు... Read more

  • Kanuma festival special

    కనుమ పండుగ విశిష్టత

    Jan 13 | సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి... Read more

  • Bhogi festival special

    భోగభాగ్యాల భోగి పండుగ

    Jan 13 | సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో-... Read more

  • Dasara navarathri special article

    దసరా శరన్నవరాత్రులు

    Oct 01 | దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో... Read more

  • Special article on bakrid festival

    త్యాగానికి ప్రతీక.. బక్రీద్ పర్వదినం

    Sep 13 | ఇస్లాం జరుపుకునే పండుగల్లో ఒకటి బక్రీద్. దీనికి ఈద్ అల్-అజ్ హా, ఈదుల్ అజ్ హా లేదా ఈదుజ్జుహా లేదా బఖర్ ఈద్ అని కూడా పేర్కొంటారు. త్యాగానికి ప్రతీకగా వ్యవహారించబడే ఈ పండగను... Read more