Actor kantha rao jayanthi special story

actor kantha rao Jayanthi special story, actor kantha rao Jayanthi special, Kantha Rao jayanthi Special, Kanta Rao Movies,

actor kantha rao Jayanthi special story, actor kantha rao Jayanthi special, Kantha Rao jayanthi Special

కత్తి వీరుడు కాంతారావు.

Posted: 11/16/2013 05:43 PM IST
Actor kantha rao jayanthi special story

గురువును మించిన శిష్యుడు? రాకుమార్తెలకు తోటరాముడు, జానపదాల్లో అజేయుడు గా వెండితెరపై వెలిగిన కత్తి వీరుడు కాంతారావు 88వ జయంతి సందర్భంగా, ఆ మహానటుడు గురించి తెలుసుకుందాం. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రగతికి దోహదం చేసిన ప్రముఖులలో టి.యల్.కాంతారావు అగ్ర భాగాన వుంటారు. నటుడిగా, నిర్మాతగా, పరిశ్రమ శ్రేయోభిలాషిగా, దాతగా, కత్తి కాంతారావుగా, సినీ జానపద కథానాయకుడిగా కాంతారావు పేరు చిరస్మరణీయం.సుమారు 450 సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించిన తాడేపల్లి లక్ష్మీకాంతారావును ప్రేక్షకలోకం జానపద నాయకుడిగానే భావిస్తుంది. నల్గొండ జిల్లాలోని కోదాడ మండలం గుడిబండ గ్రామంలో 1925 నవంబర్ 16వ తేదీన జన్మించారు కాంతారావు.

చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో నాయనమ్మ పెంపకంలో ఆయన పెరిగారు. ధార్మికత, పురాణాల పట్ల ఆసక్తి చిన్నతనంలోనే నాయనమ్మ ద్వారా ఆయనకు ఏర్పడింది. సురభి నాటకాల ద్వారా పొందిన ప్రేరణతో ‘బాలమిత్ర నాట్యమండలి’ అనే సంస్థను స్థాపించి గయోపాఖ్యానం, తెలుగుతల్లి, మధుసేవ, శ్రీకృష్ణలీల, కనకతార వంటి పలు నాటకాలను మిత్రుల అండతో జనరంజకంగా ప్రదర్శించి పలువురి మన్ననలు అందుకున్నారు.1950 సంవత్సరంలో మిత్రుల ప్రోద్భలంతో మద్రాస్‌లోకి అడుగుపెట్టారు కాంతారావు.

ప్రముఖ దర్శకులు హెచ్.ఎం.డ్డి సహాయ దర్శకుడైన టి. కృష్ణమాచారితో కలిసి ఒకే గదిలో వుండేవారాయన. అనంతర కాలంలో ఆ స్నేహం ఆయనకు బాగా కలిసి వచ్చింది. తొలి తెలుగు టాకీ తీసిన హెచ్.ఎం.డ్డి దర్శకత్వంలో 1953 సంవత్సరంలో ‘ప్రతిజ్ఞ’ చిత్రంతో ఆయన హీరోగా వెండితెరకు పరిచయమైనా, ఆయన నటించిన మొదటి చిత్రం ‘నిర్దోషి’ 1951లో విడుదలైంది. ఆ తర్వాత ఎన్టీరామారావు ఎన్..టి. పతాకంపై తీసిన జానపద చిత్రం ‘జయసింహ’లో ఎన్టీఆర్ తమ్ముడిగా నటించారు. ఆ తర్వాత 1958లో జానపద బ్రహ్మగా పేరొందిన శ్రీవి సినిమా ‘జయా విజయ’లో నటించారు.

జయా విజయ’ చిత్రం నుంచి తెలుగు సరికొత్త జానపద కథానాయకుడిగా టి.ఎల్.కాంతారావు విలక్షణ బాణీతో జానపద చిత్ర పరంపర ప్రారంభమైంది. దాదాపు 80కిపైగా జానపద చిత్రాల్లో హీరోగా ఆయన నటించారు. జానపద చిత్రాల్లో ఆయన కత్తియుద్ధం నాడు తెలుగునాట సరికొత్త ప్రభంజనాన్ని సృష్టించింది. రాజనాల, కాంతారావుల కత్తియుద్ధాలు ఆనాడు జానపద చిత్రాలకు హైలైట్‌గా నిలిచాయి. డూప్‌లు లేకుండా స్వయంగా కత్తియుద్ధంలో ప్రత్యేకశిక్షణ తీసుకొని యుద్ధాలు చేయడంతో చిత్రసీమలో కత్తికాంతారావుగా గుర్తించబడ్డారు.

 

పౌరాణిక చిత్రాలలో నారాదుడి పాత్రకు ఆయన పెట్టింది పేరు. కృష్ణుడిగా, శ్రీమహావిష్ణువుగా కూడా ఆయన ఎన్నో చిత్రాల్లో నటించారు. ఎన్టీ రామారావు తర్వాత శ్రీకృష్ణుడి పాత్రలో కాంతారావును ప్రేక్షకులు ఆదరించారు. సుమారు 150చిత్రాల్లో హీరోగా నటించిన కాంతారావు నటించిన మొత్త చిత్రాలు 450.ఆయన పేరు వినగానే గుర్తుకువచ్చే చిత్రాలు ఎన్నో ఎన్నెన్నో. ఇలవేల్పు, శ్రీరామాంజనేయ యుద్ధం, భక్త అంబరీష, జయా విజయ, శభాష్‌రాముడు, సతీ సుకన్య, భక్త రఘునాథ, భట్టి విక్రమార్క, దీపావళి, దేవాంతకుడు, అల్లూరి సీతారామరాజు, తులాభారం లాంటి వైవిధ్యభరితమైన ఎన్నెన్నో చిత్రాల్లో ఆయన అపూర్వ నటన అమోఘం, అజరామరం. కేవలం తెలుగులోనే కాకుండా రెండు తమిళ చిత్రాల్లో సైతం ఆయన నటించారు.

 

సప్తస్వరాలు, గండరగండడు, ప్రేమజీవులు, గుండెలు తీసిన మొనగాడు, స్వాతిచినుకులులాంటి చక్కని చిత్రాలను ఆయన నిర్మించారు. నటనా కౌశలమే తప్ప దురదృష్టవశాత్తు వ్యాపార మెలకువలు కాంతారావులో లేకపోవడం వల్ల చిత్ర నిర్మాణంతో బాగా నష్టపోయారు. కథానాయకుడిగా తాను సంపాదించిన ఆస్తి, పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తిపాస్తులు సమస్తం చిత్ర నిర్మాణంలో హారతికర్పూరంలా హరించుకుపోయాయి. చిత్రసీమపై విరక్తికలిగి 1990 సంవత్సరంలో మద్రాసు నుంచి తన మకాంను హైదరాబాద్‌కు మార్చారు. ఈ దశాబ్దకాలంలో అడపాదడపా కొన్ని చిత్రాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించారు.

ఆ మహానటుడు దాదాపు 40 టీవీ సీరియళ్లలోసైతం నటించారు. 2001 సంవత్సరంలో సినీ నంది అవార్డుల కమిటీ ఛైర్మన్‌గా కాంతారావు వ్యవహరించారు. తన అసమాన నటనా పటిమతో, అద్భుతమైన వాచకంతో, సరికొత్త బాణీలతో తనకంటూ తెలుగు చిత్రసీమలో ప్రత్యేకబాణీని సృష్టించుకున్న ఆ మహానటుడు. హెచ్.ఎం.డ్డి, బి. విఠలాచార్య, సి.ఎస్.రావు, సి.పుల్లయ్య, సమువూదాల రాఘవాచార్య, కె.విశ్వనాథ్, బాపు, దాసరి నారాయణరావు, కె.రాఘవేంవూదరావు లాంటి మేటి దర్శకులు రూపొందించిన ఎన్నో చిత్రాల్లో నటించి శభాష్ అనిపించుకున్న ఘనాపాటి.సహ చలనచిత్ర అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, అక్కినేనిలకు ధీటుగా పలు చిత్రాల్లో ఆయన హీరోగా నటించినా.. తెలుగు చిత్రసీమలో మాత్రం ఆయన ఎందుకనో కొంత వెనకబడిపోయారు. తెలుగు చలన చిత్రసీమకు ఆయన అందించిన అసమాన సేవలకుగాను రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ మహానటుడికి 2000 సంవత్సరంలో రఘపతి అవార్డుకు ఎంపికచేసింది. చిత్రసీమ ఉన్నన్నాళ్లూ జానపద కథానాయకుడు కాంతారావు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా వుంటాడు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles