Happy birthday to super star krishna

super star krishna,happy birthday to superstar krishna , happy birthday to superstar krishna, superstar krishna birthday celebrations, krishna birthday gift to indian celeb krishnaa news, krishnaa latest news, krishnaa latest news

Happy Birthday to Super Star Krishna

సూపర్ స్టార్ డేరింగ్... డాషింగ్

Posted: 05/31/2013 06:41 PM IST
Happy birthday to super star krishna

ఈ కుర్రాడు మరీ పీలగా ఉన్నాడు. హీరో మరీ ఇంత సన్నగా ఉంటే ఎలా?’’... ఈ మాటలు విని ఆదుర్తి సుబ్బారావు ఏం మాట్లాడలేదు. అంతా కొత్తవాళ్లతో సినిమా చేద్దామని రాష్ట్రవ్యాప్తంగా ప్రకటనలిచ్చారు. మొత్తం జల్లెడ పడితే ఇద్దరు కుర్రాళ్లు ఆదుర్తికి బాగా నచ్చారు. ఓ కుర్రాడు రామ్మోహన్ అచ్చం హిందీ హీరో దేవానంద్‌లా ఉన్నాడన్నారు. ఆదుర్తి సెలెక్షన్ భేష్ అన్నారు. రెండో హీరో దగ్గరకొచ్చేసరికి నెగటివ్ కామెంట్లు. ఆదుర్తి ఏమీ చిన్నా చితకా మనిషి కాదు. మంచిమనసులు, మూగమనసులు, ఇద్దరు మిత్రులు, డాక్టర్ చక్రవర్తి లాంటి బ్లాక్‌బస్టర్లు తీసిన దర్శకుడు. ఆయన జడ్జ్‌మెంట్‌కెప్పుడూ తిరుగుండదు. అందుకే ఎవరేమన్నా మరో హీరోగా కృష్ణను ఎంపిక చేశారు.

‘తేనెమనసులు’ను రెడీ చేసి దేశం మీదికి వదిలారు. స్ప్రింగ్‌లా తిరుగుతూ చలాకీగా కనిపించిన కృష్ణకు బాగానే మార్కులు పడ్డాయి. కానీ లాంగ్న్‌ల్రో నిలబడగలడా? చాలామందిలో ఇదే సందేహం. కానీ కృష్ణకు మాత్రం ఇలాంటి సందేహమే లేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నాడు. సినిమా తర్వాత సినిమా. సినిమా సినిమాకో డెమైన్షన్. లవ్ సినిమాలు చేస్తున్నాడు. ఫ్యామిలీ సినిమాలు చేస్తున్నాడు. యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు. ఏం చేసినా చలాకీగా చేస్తున్నాడు. ముఖ్యంగా హాలీవుడ్ తరహా ఏజెంట్ పాత్రలకు పర్‌ఫెక్ట్‌గా ఫిట్ అయ్యాడు. 24/7 పరిగెడుతూనే ఉన్నాడు. నో రెస్ట్. ఫుల్ డోస్ ఆఫ్ ఎనర్జీ. నిద్ర పోవడానిక్కూడా ఖాళీ లేనంత బిజీ. అయినా నీరసపడలేదు. ఒకటే ఉత్తేజం. ఒకే ఏడాది 18 సినిమాలు. నిజంగా ఓ రికార్డ్. ఏ లాంగ్వేజ్‌లోనూ ఇప్పటివరకూ ఈ రికార్డు బద్దలు కాలేదు. కాదు కూడా.

సాహసమే ఊపిరి

సాహసమే ఊపిరిగా సాగిన చరిత్ర ఆయనది. సూపర్ హిట్ చిత్రాలతో సావాసం చేసిన ఘనత ఆ.. కథానాయకుడిది. కాల దోషం పట్టని అందం ఆ నటుడిది. తరతరాలు నిలిచే ఇమేజ్ ఆ స్టార్ ది. తెలుగు తెరకు సాంకేతికతను అద్దిన స్థైర్యం ఆ హీరోది. విజయాల పరంపరతో బాక్స్ ఆఫీసులో చక్రం తిప్పిన నట శేఖరుడు ఘట్టమనేని శివరామకృష్ణది అలియాస్ సూపర్ స్టార్ కృష్ణది. ఘట్టమనేని కృష్ణ ఈ పేరుతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఆరు దశాబ్దాల అనుబంధం. 350 పైచీలుకు చిత్రాలతో టాలీవుడ్ పై చెరగని ముద్రవేసిన ఘనత ఆయన సొంతం. తొలి సినిమా తేనెమనసులు నుంచి 300వ సినిమా తెలుగువీర లేవరా వరకు అప్రతిహతంగా కొనసాగింది ఈ నటుడి ప్రస్థానం. 'తేనెమనసులు' చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేసినా కేఎస్ ఆర్ దాస్ తీసిన 'గూఢచారి నెం :116' సినిమా కృష్ణకు సోలో హీరోగా హిట్ ను అందించింది. ఆ..తరువాత సాక్షి, అవేకళ్లు, అసాధ్యుడు సినిమాలు కృష్ణ కెరియర్ లో మైలురాయిగా నిలిచి, ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.

ఓ వైపు సోలో హీరోగా నటిస్తూనే అప్పటి స్టార్లు ఏఎన్నార్, ఎన్టీఆర్ లతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేశారు. హీరో గా కెరియర్ దూసుకుపోతున్న తరుణంలో నిర్మాణ సంస్థ ప్రారంభించవద్దని సన్నిహితులు వారించారు. చిత్ర నిర్మాణం సమస్యలతో కూడుకున్నదని, దీనివల్ల నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం సాధ్యం కాదని హితవు పలికారు. కానీ మంచి చిత్రాలు చేయాలన్న సంకల్పం ఉంటే చిత్ర నిర్మాణం కష్టం కాదని ఆయన నిరూపించారు. 'పద్మాలయ ఫిలిం స్టూడియో' బ్యానర్ పై ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించి, ప్రయోగాలకు నాంది పలికి ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. సినిమా మీద కృష్ణ కు ఉన్న అపారమైన ప్రేమ 'పద్మాలయ స్టూడియో ' విజయానికి బాటలు వేసింది. ఈ సంస్థ మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామ రాజు వంటి ఆణిముత్యాల్లాంటి చిత్రాలను ఆయన నిర్మించారు.

నటుడిగా కృష్ణలోని అభినయ పఠిమను పూర్తిగా ఆవిష్కరించిన చిత్రాలివి. సక్సెస్ ఫుల్ చిత్రాలతో అటు చిత్ర నిర్మాణంలో.. ఇటు నటనలో తనదైన ప్రతిభతో రాణించి భేష్ అనిపించుకున్నారు. తెలుగు తెరపై కృష్ణ చేసిన సాహసాలకు అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. ఈ క్రమంలో అగ్రనటుడు ఎన్టీఆర్ తో కృష్ణకు విబేధాలు వచ్చాయని సినీ వర్గాల వారు చెబుతారు. అటు ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు చిత్రం రూపొందించే ప్రయత్నంలో ఉండగానే కృష్ణ ఓ అడుగు ముందుకు వేసి మన్యం వీరుని కథను తెరకెక్కించారు. ఇందుకు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చారు. మహాభారతంలోని ఘట్టాలతో ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తే, ఆయనకు పోటీగా కృష్ణ 'కురుక్షేత్రం' చిత్రాన్ని రూపొందించారు. 1950లలో ఏఎన్నార్ నటించిన దృశ్యకావ్యం దేవదాసును అదే పేరుతో విజయనిర్మల దర్శకత్వంలో1970లలో మళ్లీ తెరకెక్కించారు.

90వ దశకంలోనూ కృష్ణ జోరు తగ్గలేదు. పచ్చని సంసారం, అమ్మదొంగ, నెంబర్ వన్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, తన ఇమేజ్ కు తిరుగులేదని నిరూపించుకున్నారు.ఇదే సమయంలోనే వారసుడు వంటి కొన్ని చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు చేశారు కృష్ణ. మహేష్ బాబు హీరోగా తెరంగేట్రం చేశాక సినిమాలు తగ్గించేశారు. 'వారసులు వచ్చాక కూడా డ్యూయెట్లు పాడతామంటే కుదరదు' అని ఆయన ఓ సందర్భంలో చెప్పారు. డైనమిక్‌గా ఆలోచిస్తూ... డేరింగ్‌గా కార్యక్షేత్రంలో దిగి... డాషింగ్‌గా పని చేయడమే కృష్ణ విజయ రహస్యం. అందుకే కృష్ణ ఇంటిపేరు ‘సూపర్‌స్టార్’ అయిపోయింది. 70 వసంతాలు పూర్తి చేసుకున్న కృష్ణ ఇప్పటికీ అవిశ్రాంత యోధుడే. మంచి పాత్ర దొరికితే సెల్యులాయిడ్‌పై కదం తొక్కడానికి ఆయన ఎప్పుడూ రెడీనే అంటున్నారు.

పదవులు.. బిరుదులు

- తొమ్మిదవ లోక్ సభకు ఏలూరు నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు.

- సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ బిరుదుతో సత్కరించింది.

- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ అవార్టుతో ఆయనను సత్కరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles