సరిగ్గా వంద సంవత్సరాల క్రితం మే 3, 1913 న మొదటి భారతీయ చలన చిత్రం రాజా హరిశ్చంద్ర విడుదలైంది. ఏ సుముహూర్తాన ఢూండిరాజ్ గోవింద్ ఫాల్కే చలనచిత్ర రంగానికి అంకురార్పణ చేసారో కానీ, అది దిన దిన ప్రవర్ధమానమై ఈనాడు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది.
1902 లో లైప్ ఆఫ్ క్రిస్ట్ అనే ఫ్రెంచ్ సినిమాను చూసిన దాదాసాహెబ్ ఫాల్కే అత్యంత ప్రభావితులై ఎలాగైనా భారతదేశంలో చిత్రాలను నిర్మించాలనే పట్టుదలతో తను చేస్తున్న ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారాన్ని వదిలి యావదాస్తిని పణంగా పెట్టి లండన్ లో చిత్ర నిర్మాణానికి కావలసిన కిటుకులు తెలుసుకుని, ఒక కేమెరా, ప్రింటింగ్ మెషీన్, ఒక పెర్ఫోరేటర్, ముడి ఫిల్మ్ తో చిత్ర నిర్మాణానికి నాంది పలికారు.
సినిమా నిర్మాణమంటే మాటలు కాదు. పైగా అప్పటివరకూ లేని, ఎవరికీ తెలియని రంగం. నటీనటుల దగ్గర్నుంచి ఎన్నో ఏర్పాట్లను చేసుకోవాలంటే ఎంతో శ్రమించాల్సి వచ్చిందాయనకు. 40 సంవత్సరాల వయసులో సినిమా గురించి మాట్లాడుతున్న దాదాసాహెబ్ ఫాల్కే అభిప్రాయాలను అతని మిత్రులే హర్షించలేదు సరిగదా పిచ్చి బాగా ముదిరినట్లుంది, మానసిక వైద్యం చేయించాలన్నారు.
సినీ జీవితాన్ని ఒక వృత్తిగా తీసుకోని ఆ రోజుల్లో వేషం కట్టటానికి ముందుకు వచ్చిన స్త్రీ పాత్ర ధారులు బొంబాయి రెడ్ లైట్ ఏరియాలోని వేశ్యలే. వారెవరూ నచ్చక దాదాసాహెబ్ హరిశ్చంద్ర భార్య తారామతి పాత్రకు ఒక నటుడినే ఎన్నుకున్నారు. అతను ఒక హోటల్లో వంటమనిషి. పేరు అన్నా సాలుంకే. అలా హరిశ్చంద్ర లోని పాత్రలకోసం ఎన్నుకున్న నటీనటులంతా ఏదో ఒక కర్మాగారానికి పోయి పనిచేసి వస్తున్నట్టుగా దాదాసాహెబ్ ఫాక్టరీలో పనిచేస్తున్నామని చెప్పుకునేవారట.
నటీనట వర్గానికి వారితో పనిచేయించటానికి అమితంగా కష్టపడ్డ దాదాసాహెబ్ కి రాజా హరిశ్చంద్ర విజయంతో మిగిలిన చిత్ర నిర్మాణం తేలికైంది. స్త్రీ పాత్రలను ధరించేవారు ఆయనకు సులభంగానే దొరికారు. వెనువెంటనే ఆయన మోహినీ భస్మాసుర తీసారు.
ఇప్పుడున్నట్లుగా స్టూడియోలు లేవు కాబట్టి ఎక్కువగా ఔట్ డోర్ లలో ఎండలో సినిమా నిర్మాణాన్ని చేపట్టవలసివచ్చింది. ముంబై లోని దాదర్ లో మధురా భవన్ సమీపంలోని రోడ్డులో రాజా హరిశ్చంద్ర నిర్మాణాన్ని ఎక్కువ శాతం చేసారు. దాని పేరు దాదాసాహెబ్ ఫాల్కే రోడ్డయింది. పుణె దగ్గర గ్రామంలో ఔట్ డోర్ షూటింగ్ లో కత్తి యుద్ధం సన్నివేశం షూటింగ్ జరుగుతుండగా అక్కడి గ్రామవాసులు అది నిజంగా కత్తి యుద్దమని భ్రమపడి భయపడ్డారట. నిశ్శబ్దపు సినిమా లలో సన్నివేశానికి సన్నివేశానికీ మధ్య టైటిల్స్ ని హిందీ ఇంగ్లీషులో రాసారు.
రాజా హరిశ్చంద్ర కేవలం మూకీ సినిమాల్లో మొదటిదే కాదు, టాకీ సినిమాలకు కూడా మొదటిదే. 1932 లో వి.శాంతారామ్ తీసిన మొదటి టాకీ సినిమా కథ కూడా హరిశ్చంద్ర దే. ఆ సినిమా టైటిల్ అయోధ్యేచ రాజా అనే మరాఠీ సినిమా
సినిమా నిర్మాణం ఒక ఎత్తైతే దాన్ని ప్రదర్శించి అప్పటివరకూ నాటకరంగానికి అలవాటు పడ్డ ప్రేక్షకులను సినిమాకు రప్పించటం మరో పరీక్షే. 57000 ఫోటోలు, రెండు మైళ్ల పొడవైన ఫోటోలు, కేవలం మూడు అణాలకే అంటూ ఆయన తన సినిమా పబ్లిసిటీ చేసుకున్నారు. ఇప్పటి సినిమాల్లోని ఐటమ్ సాంగ్స్ ఆయన బుర్రలోకి కూడా వచ్చిందప్పుడు కానీ అది సినిమాలో కాక బైట ప్రదర్శించారాయన. ఆకర్షణ కోసం కొన్ని రోజుల పాటు సినిమాకు ముందు పాశ్చాత్య యువతులతో వేదిక మీద డ్యాన్స్ లు చేయించారు.
ఇప్పుడు మనం బయటకు పోయి కోకాకోలా ఉందా అని అడుగుతాం. కానీ కోకాకోలా అనే ఉత్పాదన రాకముందు అడగలేదు కదా. దాన్ని తయారుచేసి, మార్కెట్ చేసి, మనకు అలవాటు చేసి, మనం దాన్ని కోరేట్టుగా చేసిన ఘనత ఆ సంస్థకే దక్కుతుంది. అలాగే సినిమా అంటే ఏమిటో తెలియని రోజుల్లో తన దగ్గరున్న నగలు, ఇన్సూరెన్స్ పాలసీలు తెగనమ్మి, సినిమా నిర్మాణం చేసి దాన్ని విజయవంతం చేసిన సినిమా రంగ ఆద్యుడు దాదాసాహెబ్ ఫాల్కే ముందు చూపు, పట్టుదల, దీక్ష, తన కన్న స్వప్నం మీద తనకు నమ్మకం ఎంత ఉన్నాయన్నది ఈ రోజు వరకు ఎదిగిన సినిమా పరిశ్రమ చెప్తోంది.
ఖరీదైన నిర్మాణంతో చౌకైన వినోదాన్ని కలిగించేదే సినిమా. ఈరోజు సినిమా పరిశ్రమ ఎంతో మందికి అన్నం పెడుతోంది. అభివృద్ధి చెందిన సాంకేతికత వన్నె తెచ్చింది. అందులో పనిచేసే నటీనటులు, దర్శకుడు, నిర్మాతలకు సెలబ్రెటీల స్థాయి తెచ్చిపెట్టింది. దేశంలోని ప్రాంతీయ భాషలు అంతరించిపోకుండా చూసింది. వీటన్నిటికీ విత్తనం వేసిన దాదాసాహెబ్ ఫాల్కే మొండిధైర్యం, చివరి వరకూ నీరసపడని ఉత్సాహం వలనే చిగురు తొడిగి ఈ రోజు ఈ విదంగా పెద్ద పరిశ్రమగా అభివృద్ధి చెందింది.
టివి లు, వీడియోలు, సెల్ ఫోన్లు, నెట్ లు విజృంభించినా ఇంకా సినిమా నిలిచి నూరు సంవత్సరాలు చేసుకుంటోంది కానీ నూరేళ్ళు నిండలేదు. అందుకు కారణం అప్పుడు పడ్డ విత్తనమే కాకుండా, దాన్ని పెంచి పెద్ద చేసిన తరువాతి తరం కూడా సినిమా వృక్షాన్ని బాగా ఏపుగా పెంచి పెద్దగా చేసి దాని నీడలో లక్షలాది మంది సేదతీరేట్టుగా వినోదాన్ని, ఉపాధిని కలుగజేసింది.
అలా వందసంవత్సరాలు పూర్తి చేసుకున్న చిత్ర పరిశ్రమకు వందనం!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more