Guna 369 movie review ‘గుణ 369’ రివ్యూ

Teluguwishesh ‘గుణ 369’ ‘గుణ 369’ Director Arjun Jandyala introduces the hero’s family. The hero’s sister complains that she gets unfair treatment in the house. While her brother is allowed to sleep in as late as he wants, she must wake up early and help her mother with the chores. Product #: 90820 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ‘గుణ 369’

  • బ్యానర్  :

    ఎస్.జీ మూవీ మేకర్స్

  • దర్శకుడు  :

    అర్జున్ జంధ్యాల

  • నిర్మాత  :

    తిరుమల్ రెడ్డి - అనిల్ కడియాల

  • సంగీతం  :

    చేతన్ భరద్వాజ్

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    రామ్ రెడ్డి

  • ఎడిటర్  :

    తమ్మిరాజు

  • నటినటులు  :

    కార్తికేయ - అనఘా - రంగస్థలం మహేష్ - ఆదిత్య మీనన్ - మంజుల - శివాజీరాజా - నరేష్ - హేమ తదితరులు

Guna 369 Review Lost In Lacklustre Narration

విడుదల తేది :

2019-08-02

Cinema Story

ఆరెక్స్ 100 అనే చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని సాధించి రెండో ప్రయత్నంలోనే యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ మళ్లీ హిట్ కోసం వేచిచూస్తున్నాడు. అతని ఆశలన్నీ గుణ 369 చిత్రంపైనే వున్నాయి. ఇక చిత్ర కథలోకి ఎంట్రీ ఇస్తే.. గ్రానైట్ ఫ్యాక్టరీలో పని చేసే గుణ(కార్తికేయ)ది మధ్యతరగతి కుటుంబం. అమ్మానాన్న(నరేష్-హేమ)తో హ్యాపీగా ఉంటూ చెల్లి(కౌముది) కోసం సంబంధాలు వెతుకుతూ ఉంటాడు. గుణ ఒకే ఒక్క స్నేహితుడు భట్టు(రంగస్థలం మహేష్). సెల్ ఫోన్ షాపు నడిపే గీత(అనఘా)తో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు గుణ.  ఒంగోలుతో పాటు చుట్టుపక్కన ఊళ్ళు భయపడే గద్దలగుట్ట రాధా(ఆదిత్య మీనన్)తో గుణకు ముందు నుంచి పరిచయం ఉంటుంది.

ఓ స్నేహితుడు అనుకోకుండా రాధాతో పెట్టుకున్న గొడవకు గుణ మధ్యవర్తిత్వం వహించడం వల్ల ఊహించని విధంగా పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటాడు. దాని ఫలితంగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. జాడ తెలియని శత్రువులను వెతికే లక్ష్యంతో బయటికి వచ్చిన గుణ దిక్కుతోచని స్థితిలో పడిపోతాడు. అసలు ఇతని జీవితం ఇంత అల్లకల్లోలంగా మారడానికి కారణం ఎవరు ఇందులో నుంచి బయటికి వచ్చి గుణ గమ్యాన్ని చేరుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఇది ప్రేక్షకులను అలరించిందా.? లేదా.? అన్నది వేచి చూడాల్సిందే..!

cinima-reviews
‘గుణ 369’

విశ్లేషణ

ప్రేమ కథల్లో మాస్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి సినిమా తీయడం కొత్తేమి కాదు. దర్శకుడు అర్జున్ జంధ్యాల తొలి ప్రయత్నంలో చేసిన రిస్కీ సినిమా ఇదని చెప్పకతప్పదు. ఫస్ట్ హాఫ్ మొదలుపెట్టిన లవ్ స్టోరీ చాలా రొటీన్ గానే ఉన్నప్పటికీ సాధ్యమైనంత మేరకు లైట్ ఎంటర్ టైన్మెంట్ టచ్ తో  ఈ ట్రాక్ ని నడిపించాడు. అయితే అది వర్క్ అవుట్ కాకపోగా.. అసలు కథ ఎప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకుడు ఎదురు చూసేలా చేసింది.

చిత్రంలోని పాత్రల ఎస్టాబ్లిష్ మెంట్ కే చాలా టైం తీసుకోవడంతో ప్రథమార్థం వచ్చే దాక ఇదంతా ఏంటి అనే ఫీలింగ్ సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. రాధా గుణలు ట్రాప్ లో పడే సీన్ వచ్చేదాకా అసలు కథ ఎంతకీ ముందు కదలక బోరింగ్ ఇంగ్లీష్ సినిమాను తలపిస్తుంది. దానికి తోడు హీరో హీరొయిన్ మధ్య ఘాడమైన ప్రేమను చూపాలనుకున్న దర్శకుడు దానికి పేలవమైన ట్రాక్ రాసుకోవడంతో ఆ ప్రభావం హీరో కార్తికేయ, హీరొయిన్ అనఘా మీద పడింది.

ఈ చిత్రంలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఒకే ఒక్క ప్లస్ పాయింట్.. చిత్రంలో ట్విస్ట్ ని రివీల్ చేశాకా హీరో ఎలా రివెంజ్ తీర్చుకుంటాడా అనే ఆసక్తిని రేపుతుంది. అయితే ఇదే టెంపో ఫస్ట్ హాఫ్ లోనూ మైంటైన్ చేసుంటే గుణ 369 ఇంకో లెవెల్ లో ఉండేది. తన జీవితాన్ని సర్వనాశనం చేసి ఆఖరికి తన కుటుంబాన్ని చంపేందుకు కూడా సిద్ధపడిన రౌడీలను ధీటుగా ఎదురుకునే హీరో విలన్ తల్లి కర్తవ్యబోధ చేసే దాకా తానేం చేయాలో గుర్తించలేకపోవడం పాత్ర ఔచిత్యాన్ని దెబ్బ తీసింది.

దానికి తోడు ఇంచుమించు ఇలాంటి ప్లాట్ గతంలో కార్తి నా పేరు శివలో చూసిందే. రెండింటిలోనూ థీమ్ పరంగా ఉన్న సిమిలారిటీని ప్రేక్షకుడు ఈజీగానే గుర్తుపడతాడు. కాకపోతే దానికి మాస్ టచ్ ఇచ్చి గొప్ప లవ్ స్టొరీని లింక్ చేద్దామనుకున్న అర్జున్ జంధ్యాల ప్రయత్నం పూర్తి ఫలితాన్ని ఇవ్వలేదనే చెప్పాలి. ఇక నాలుగు సార్లు చొక్కా విప్పి బాడీ బిల్డింగ్ చేసే హీరోను చూస్తే అలా అర్ధనగ్నంగా కనిపించాలి కాబట్టి బలవంతంగా ఆ సీన్లను రాసుకున్నట్టు ఉంది.

ఆఖరికి నిద్రలేచే ఇంట్రో సీన్ ని కూడా తన శరీర ప్రదర్శనకే వాడుకోవడం ఎందుకో వారికే తెలియాలి. అయితే గుణ 369లో కొంతైనా కాపాడే అంశం ఏదైనా ఉంది అంటే అది క్లైమాక్స్ ఒక్కటే. తాను చెప్పాలనుకున్న పాయింట్ ని ఇక్కడ దర్శకుడు స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేశాడు. లైంగిక వేధింపులకు శిక్ష ఎలా ఉండాలనేది ఆమోదయోగ్యంగా లేకపోయినా ఇంతకన్నా వేరే ప్రత్యాన్మాయం లేదనే తరహాలో డిజైన్ చేసిన తీరు బాగుంది. ఇక్కడొక్కటే కాస్త ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే ఛాన్స్ మిగిలింది

నటీనటుల విషాయానికి వస్తే..

కార్తికేయకు ఆరెక్స్ 100 తర్వాత దక్కిన మరోమంచి రోల్ గా దీన్ని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ లో ఓ సగటు యువకుడిగా సెకండ్ హాఫ్ లో ప్రతీకారంతో రగిలిపోతూ ఆవేశం నింపుకున్న ప్రేమికుడిలా రెండు షేడ్స్ ని బాగానే క్యారీ చేశాడు. కొన్ని హెవీ ఎమోషన్స్ ఉన్న సీన్స్ లో అక్కడక్కడా కొంత ఇబ్బంది పడినట్టు అనిపించినప్పటికీ చాలామటుకు కవర్ చేసుకుంటూ వచ్చాడు. అయితే డిక్షన్ పరంగా ఇతను మెరుగుపడాల్సింది చాలా ఉంది. అక్కడక్కడా అవసరం లేకపోయినా కొంత నత్తిగా సాగదీసినట్టుగా మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి. హీరోయిన్ అనఘా లుక్స్ పరంగా పక్కింటి తెలుగమ్మాయిలా బాగుంది. మొహంలో ఎక్స్ ప్రెషన్లు బాగానే పలికాయి. కాకపోతే పాత్ర పరిధి తక్కువగా ఉండటంతో తన గురించి పూర్తిగా జడ్జ్ చేసే అవకాశం ఇవ్వలేదు దర్శకుడు. సీన్ల కంటే పాటలే ఎక్కువ ఇచ్చారు తనకు.

ఆశ్చర్యకరంగా రంగస్థల మహేష్ ఇందులో షాకింగ్ రోల్ చేయడం  అసలు ట్విస్ట్. తన స్థాయికి మించినదే అయినప్పటికీ ఫైనల్ గా మెప్పిస్తాడు కానీ క్రూరత్వం కన్నింగ్ నెస్ తో పాటు ఫిజిక్ పరంగా స్ట్రాంగ్ గా ఉన్న వేరే యాక్టర్ ను తీసుకుంటే బెటర్ ఛాయస్  అనిపిస్తుంది. కానీ ఇతను కూడా పూర్తిగా నిరాశపరచలేదు. ఉన్న ఫస్ట్ హాఫ్ లో గద్దల గుట్ట రాధాగా ఆదిత్య మీనన్ తన భారీ విగ్రహంతో డైలాగ్ డెలివరీతో భయపెట్టాడు. తన సీనియారిటీ ఉపయోగపడింది. అతని తల్లిగా మంజుల కొన్ని సీన్లకే పరిమితం. సీనియర్ నరేష్ - హేమలకు రొటీన్ పాత్రలే. చేసుకుంటూ పోయారు. శివాజీరాజా కనిపించేది కాసేపే అయినా ఉనికిని చాటుకున్నాడు. ఇక అసలు విలన్లుగా నటించిన కుర్రాళ్ళలో ఒకరిద్దరు తప్ప మిగిలినవాళ్లలో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తుంది.

టెక్నికల్ అంశాలకు వస్తే..

‘దర్శకుడు అర్జున్ జంధ్యాల ఎంచుకున్న థీమ్ లో మెసేజ్ ఉంది కానీ అసలు పాయింట్ లో కొత్తదనం లేకపోవడమే గుణ 369లోని ప్రధాన లోపం. రివెంజ్ డ్రామా మీద ఫోకస్ పెట్టుకున్న అర్జున్ జంధ్యాల అసలైన క్రైమ్ థీమ్ చుట్టూ అల్లుకున్న కారణాలు కన్విన్సింగ్ గా లేకపోవడంతో ఇదో మాములు సగటు చిత్రంగా మిగిలిపోయింది. నా పేరు శివలో ఉన్న స్టోరీ ఇంటెన్సిటీ తో పాటు పెర్ఫార్మన్స్ తో ఆర్టిస్టులు  ఇచ్చిన సపోర్ట్ బలంగా ఉండటం వల్ల అది మెప్పించింది.  కానీ ఇందులో అవి మిస్ కావడంతో గుణ 369 అంచనాలు అందుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది. హీరోని సూపర్ మ్యాన్ లా చూపించాలా కామన్ మ్యాన్ లా చూపించాలా అనే కన్ఫ్యూజన్ లో కథనాన్ని పక్కదారి పట్టించడం ఓవరాల్ గా గుణ 369ని దెబ్బ తీసింది. కేవలం ఇరవై నిమిషాల రివెంజ్ డ్రామా కోసం మిగిలిన రెండు గంటల ప్రహసనాన్ని భరించడం ఎంతవరకు ప్రేక్షకులు చేయగలరో అదే బాక్స్ ఆఫీస్ ఫలితాన్ని శాశించబోతోంది

చేతన్ భరద్వాజ్ సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకు పర్వాలేదు అనిపించినా పాటల వరకు పూర్తిగా తేలిపోయింది. దానికి తోడు చిత్రీకరణ అంతంతమాత్రంగానే ఉండటంతో ప్లస్ కాలేకపోయాయి. రామ్ రెడ్డి ఛాయాగ్రహణం బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ తక్కువగా ఉన్నప్పటికీ వాటిని కాపాడే ప్రయత్నం బాగా చేసింది. తమ్మిరాజు ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో మొహమాటపడకపోయి ఉంటే ఇంకొంచెం బెటర్ ఫీల్ కలిగేది. అర్జున్ జంధ్యాల డైలాగ్స్ లో అక్కడక్కడా మెరుపులు తప్ప రైటింగ్ కూడా వీక్ గానే ఉంది. నిర్మాణ విలువలు సబ్జెక్ట్ తగ్గట్టు ఉన్నాయి.

తీర్పు..

గుణ 369 ఓ మోస్తరు అంచనాలని సగం మాత్రమే అందుకునే ఒక మాములు రివెంజ్ డ్రామా.

చివరగా... అర్జున్ జంధ్యాల మరింత వర్క్ అవుట్ చేసింటే బాగుండేది..!

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh